Tuesday, December 3, 2013

హక్కుల అమలే ముఖ్యం ? By చిక్క హరీష్ కుమార్

వికలాంగత్వం అంటే ఏంటి? మానవుని సహజ దేహ నిర్మాణంలో శారీరక లోపం ఉన్నట్లయితే అది వికలాంగత్వంగా చెప్పవచ్చు. నేటి సమాజంలో మానసిక లోపం ఉన్నవారినీ వికలాంగులుగా గుర్తిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వికలాంగుల కంటే సకలాంగులే ఎక్కువగా ఉన్నారు కనుక వికలాంగులను, వారి సమస్యలను సకలాంగుడికి అవసరం అని అనుకుంటే అది సానుభూతితోనే మొదలవుతుంది (మనిషిగా కాదు). కానీ ఆ సానుభూతి రూపం - సహకార రూపం పరిశీలిస్తే నిజంగా అది వికలాంగులకు వారి జీవన స్థాయి మెరుగుపడటానికి ఉపయోగపడుతుందా? లేక ఆ సహకారం భిక్షంగానో దానంగానో మారుతుందా? ఈ సమాజంలో బానిసత్వానికి దాసోహానికి లోబడిన ప్రతి వ్యక్తిపై ఆధిపత్యాన్ని కానీ అధికారాన్ని కానీ చలాయిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇతర కులస్తులు తక్కిన కులాలపై చూస్తున్న చూపు, స్త్రీలపై పురుషుడి చూపు ఆయా స్థాయిని బట్టి సందర్భాన్ని బట్టి అజమాయిషిగానో లేక సానుభూతిగానో వ్యక్తపరుస్తున్న మాట నిజం. అయితే సమాజంలో అందరికంటే చిన్న చూపుగా చూడబడుతున్న వికలాంగులపై మాత్రమే సానుభూతి చూపించడానికి సమాజం సిద్ధపడుతుంది. మనిషిని మనిషిగా కాకుండా కులంగా, మతంగా, వర్గంగా చూడటం మనం చూస్తున్నాం. కానీ ఒక మనిషి కులం, మతం, వర్గం తెలి యక ముందు అతన్ని మనిషిగానే గుర్తిస్తుంది సమాజం. కానీ ఒక్క వికలాంగుడిని మాత్రమే మనిషిగా గుర్తించదు. అవయవాల లోపాల్ని ఎత్తిచూపుతూ పేర్లు పెడుతుంది. ఇది సదరు వికలాంగుడిని ఇంకా కృంగదీస్తుంది తప్పితే సహజమైన స్థితిలో ఉండనివ్వదు. వికలాంగులకు మౌలిక అవసరాలు - హక్కులు - సౌకర్యాలు ఉంటాయా; అసలు ఉన్నా యా... ఒక సాధారణ మనిషి అవసరాల్ని ప్రభుత్వం, సమా జం కానీ తీర్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వికలాంగుల మౌలిక అవసరాల్ని కనీసం గుర్తించడం లేదు.
ప్రాథమిక హక్కుల్ని ప్రజాస్వామిక హక్కుగా వాడుకునే హక్కు వికలాంగులకు ఉందా? స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, సమానత్వపు హక్కు, భావప్రకటనా స్వేచ్ఛా హక్కు వంటివి ఏ పౌరునికి అయితే అందుతాయో ఆ పౌరుడు స్వతంత్రంగా మెలగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం వికలాంగులకు ప్రభుత్వంతోపాటు, సామాజిక సంఘాలు, ప్రైవేటు వ్యవస్థలు గుర్తిస్తున్నాయా? అన్నీ సామాజిక ఉద్యమాలకు సాహిత్యమే ఊపిరైతే నడుస్తున్న వికలాంగ ఉద్యమానికి ప్రజాకవులు, కళాకారులు ఏ మేరకు ఉద్యమానికి ఊపిరిని అందిస్తున్నారు?... ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగ కల్పనలో 3శాతం రిజర్వేషన్ కలిగిన వికలాంగులు ఏమేరకు ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటున్నారు? వికలాంగుల హక్కులను సంరక్షించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను నియమించలేని ప్రభుత్వాలను చూస్తే వారి పట్ల ఎంతటి సానుకూల దక్పథం ఉందో చెప్పవచ్చు.వ్యవస్థలో తప్పు ఎక్కడ ఉందో అక్కడే సరిదిద్దే ప్రయత్నం ప్రభుత్వాలు ఎప్పుడూ చేయవు... దేనికైనా సమాజం నుంచి తిరుగుబాటు వస్తేనే హడావిడి చేస్తారు. వికలాంగుల హక్కుల్ని, అవసరాల్ని తీర్చడం రాజ్యాంగబద్దం చేస్తేనే దానికి విలువ. వికలాంగులు ఓటు వేసేందుకు తప్పితే ఓట్లు వేయించుకోడానికి అర్హతలేనివారిగా రాజ్యాంగం పరిగణిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉన్నట్లే ఎన్నికల్లోనూ ఈ రిజర్వేషన్ పెట్టగలదా? ఏ పార్టీ అయినా వికలాంగులకు సీటు కేటాయించగలదా? వికలాంగులనూ వర్గీకరించాలి.
ధనిక, పేద వికలాంగులను విడివిడిగా గుర్తించాలి? పేద వికలాంగులకే రిజర్వేషన్ వర్తింపజేయాలి. వికలాంగుల కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టాల్ని చేసింది? ఎంతవరకు అవి అమలుకు నోచుకుంటున్నాయి? సానుభూతి సహకారం కంటే కూడా వికలాంగుల హక్కుల అమలు మాత్రమే పరిష్కారం అని గుర్తుపెట్టుకోవాలి. పరిష్కారం లభించకుండా ప్రజా పోరాటాలు ముగిసినట్లు చరిత్రలో దృష్టాంతాలు లేవు. ఫూలే నుంచి మొదలుకొని కృష్ణ మాదిగ వరకు సమన్యాయ పోరాటానికే వారి జీవితాలను ఇచ్చినమాట, ఇస్తున్న మాట వాస్తవం. రానున్న తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలలో వికలాంగుల రాజకీయ వాటాను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.
- చిక్క హరీష్‌కుమార్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

-
Andhra Jyothi Telugu News Paper Dated: 03/12/2013

No comments:

Post a Comment