Tuesday, December 31, 2013

సామాజిక విప్లవ కిరణం ( కాన్షీరాం) By దీకొండ తిరుపతి న్యాతరి శంకరయ్య


భారతదేశంలో బహుజన విముక్తికోసం ఉత్సాహవంతులు సుఖాలను త్యాగం చేయడానికి సిద్దపడాలన్న డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ సూక్తిని అమలు పరచిన వ్యక్తి కాన్షీరాం. తన మాతృమూర్తికి లేఖలో పేర్కొన్నట్లు ‘నేను నా తలపై అంతిమ సంస్కార సామాగ్రితో బయలు దేరుచున్నాను. ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరు కాను, నేను సొంత ఆస్తి సంపాదించుకోను, నేను అంబేడ్కర్‌ ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బయలుదేరుతు న్నాను’ అని సర్వజనీనమే తన మతం అని చాటిన బహుజన ఉద్యమ యోధుడు కాన్షీరాం. ఈయన పంజాబ్‌ రాష్ట్ర రోపర్‌ జిల్లా కవాస్‌పూర్‌ గ్రామ పరిధిలోని మల్లా పూర్‌లో 1934 మార్చి 15న హరిసింగ్‌ తేల్‌సింగ్‌- బిషన్‌సింగ్‌ కౌర్‌ దంపతులకు జన్మించారు. 

1956 డిసెంబర్‌ 6 న బాబాసాహెబ్‌తో పాటే మరణించిందునుకున్న అంబేడ్కరిజాన్ని బతికించి సనాతన మనువాద బ్రాహ్మణ భావజాలానికి ఆలవాల మైన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకునే స్థాయికి తీసుకువచ్చిన పోరాట యోధుడు కాన్షీరాం.1963 క్యాలెండర్‌లో తదుపరి సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సెలవుదినాలలో డా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, బుద్ధ జయంతులు కూడా ఉన్నా యి. అయితే ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిలట్రీ ఎక్స్‌ప్లోసివ్‌’ బుద్ధ జయంతిని, డా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని సెలవులనుండి మినహాయిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. రద్దుచేసిన సెలవు దినాల్లో బాలగంగాధర్‌ తిలక్‌ జయంతి, దీపావళికి అదనంగా ఒక్కొక్క రోజు కలుపుతూ సెలవులు ప్రకటించింది. మనువాద అధికా రుల వివక్షవల్ల షెడ్యూల్డుకులాల ఉద్యోగులు హతాశులయ్యారు. నాల్గవ తరగతి ఉద్యోగి ‘దీనాబానా’ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అతన్ని వర్క్‌‌సనుండి తొల గించారు. తనను తొలగించినందుకు నిరసనగా కోర్టుకు వెళ్ళాడు. అధికారులు అతనిని ఉద్యోగం నుండి బర్తరఫ్‌ చేశారు. 

ఆ రోజుల్లో దీనాబానా పనిచేస్తున్న విభాగానికి కాన్షీ రామ్‌ పరిశోధనాధికారి! కాన్షీరామ్‌ దీనాబానాకు మద్దతుగా ఉద్యోగుల ను సంఘటితం చేసి పోరాటం ప్రారంభించారు. రక్షణ మంత్రిత్వ శాఖ వద్దకు ఈ కేసును తీసుకు వెళ్ళారు. ఈ చట్టబద్ధ పోరాటం వల్ల దీనాబానాకు ఉద్యోగం తిరిగి లభించటమే గాక బుద్ధజయంతి, అంబేడ్కర్‌ జయంతులను సెలవుదినాలుగా ప్రకటించారు.ఈ సందర్భంలో అంబేడ్కర్‌ గురించి తెలసుకోవాలనే జిజ్ఞాస కాన్షీలో కలగటం స్వాభావికమే. డా అంబేడ్కర్‌ రాసిన ‘కాంగ్రెస్‌, గాంధీ అంటరాని వారికి ఏం చేశారు?’, ‘కుల నిర్మూలన’ పుస్తకాలను చదివి బాబాసాహెబ్‌ ఉద్యమ వారస త్వాన్ని స్వీకరించాలనే దృఢ సంకల్పానికి వచ్చారు కాన్షీరామ్‌. అంబేడ్కర్‌ మిషన్‌- జీవితంతోపాటు సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే, బహుజనోద్ధారకుడు సాహుజీ మహారాజ్‌, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి నాకర్‌ల జీవితాలను, వారి పోరాటాలను అధ్యయనం చేయసాగారు.

‘పూణే ప్యాక్ట్‌’ ఒప్పందం వలన ఎస్సీ, ఎస్టీలకు చెందిన కొంతమందికే ప్రయోజనం కలిగింది. వారు తమ ఇంటికి, కుటుంబనికి, పిల్లలకు, విలాసవం తమైన జీవితానికి పరిమితమైనారు. అంబేడ్కర్‌ మిషన్‌ను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనంకోసం వాడుకున్నారు. జాతిలోని మెజారిటీ ప్రజలు ఆజ్ఞానంలో, అంధ కారంలో కొట్టుమిట్టాడటం చూసిన కాన్షీరామ్‌ మనస్తాపానికి గురైనారు. వేల సంవత్సరాలనుండి బ్రాహ్మణవాద వ్యవస్థ వల్ల బాధలకు గురవుతున్న జాతి జనాన్ని విముక్తులను చేయాల్సిన అవసరాల్ని ఆయన గుర్తించారు. అధిపత్యకులాలు వ్యవ స్థలో పదిహేను శాతం. వారే శాసనకర్తలుగా కార్యనిర్వాహకులుగా, నాయకులుగా కుల ప్రాతిపదిక మీద స్థిరపడ్డారు. అధిక సంఖ్యాకులు బానిసత్వం, పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ రోజు ఈ వ్యవస్థ వికృతరూపాన్ని ధరించి అధికసంఖ్యా కు లను పీడిస్తుంటే, పీడనకు వ్యతిరేకంగా పోరాడటం చేయాల్సిన అంబేడ్కర్‌ అనుచ రులు తమ బాణీలో రాగాలాపన చేస్తూ, మనువాద నాయకుల మోచేతినీళ్ళు తాగుతూ చెంచాగిరి చేస్తుండడాన్ని కాన్షీరాం జీర్ణించుకోలేకపో యారు. 

పూణేలో కాన్షీరామ్‌, తన సహచరులతో 1978 డిసెంబర్‌ 6న ‘బాక్వర్డ్‌ అండ్‌ మైనారిటీ కమ్యూనిటీస్‌ ఎంప్లారుూస్‌ ఫెడరేషన్‌’ (బామ్‌సెఫ్‌) స్థాపించి ‘బోధించు, పోరాడు, సమీకరించు’ నినాదంతో సంస్థను బలో పేతం చేయటానికి బయలుదేరారు. ‘నా వద్ద చేయవలసిన పని ఎంత ఉందంటే, జబ్బు పడటానికి కూడ నాకు తీరిక లేనంత. అందుచేత మూడువందల అరవై అయిదు రోజులు కార్యక్రమాలలో నిమ గ్నమై ఉంటా’అని కాన్షీరామ్‌ వ్యాఖ్యానించారు. మన హృదయంలో సదుద్దేశం, లక్ష్యం స్పష్టంగా ఉంటే అది నెరవేర్చుకోవటానికి దారులు అనేకంఉంటాయి. ఉద్దేశం తప్పుడుదైతే అనేక సాకులు వెతుక్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరిం చారు. కాన్షీరామ్‌ ఐదు సంవత్సరాలు కేవలం ఉద్యోగులను సంఘటితం చేయ డంలో కృషిచేశారు. బామ్‌ సెఫ్‌లో పనిచేయటానికి ఆర్థిక, హార్థికంగా త్యాగానికి సిద్ధపడటానికి వేలాది శిక్షణా శిబిరాలు సదస్సులు నిర్వహించారు. ఇందులో 500 మంది పిహెచ్‌డి స్కాలర్లు, 3000 మంది డాక్టర్లు, 15000 మంది సైంటిస్టులు, 70000 మంది గజిటెడ్‌, నాన్‌ గజిటెడ్‌, ఉద్యోగులు చేరారు. సరిగ్గా ఐదు సంవత్స రాల తరువాత 1978 డిసెంబర్‌ 6న ‘బామ్‌సెఫ్‌’ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. సమావేశంలో 2,00,000 పైచిలుకు ఉద్యోగులు పాల్గొన్నారు. 

1978 డిసెంబర్‌ 10వ తేది సాయంకాలం ముగింపు సమావేశంలో ‘పే బ్యాక్‌ టు ది సొసైటి’’గురించి చర్చ జరిగింది. రాజకీయేతర పునాదులను పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. ‘దోపిడీకి గురౌతున్న సమాజానికి, విద్యావంతులైన ఉద్యోగులు బ్రెయిన్‌ బ్యాంక్‌ (మేధస్సు), మనీ బ్యాంక్‌ (డబ్బు), టాలెంట్‌ బ్యాంక్‌ (ప్రతిభ) అందించవలసిన అవసరంఉందని, బామ్‌సెఫ్‌ నిర్మాణానికి ఈ మూడు సూత్రాలే చోదక శక్తిగా పనిచేస్తాయని చెప్పారు. 1979 ఏప్రిల్‌ 14- జూన్‌ 14 వరకు ‘విల్‌ ది అంబేడ్కరిజం రివైవ్‌ ఆర్‌ సర్వైవ్‌’ అనే విషయంమీద దేశంలోని పది ముఖ్యపట్టణాలలో సెమినార్లు నిర్వహించారు. 

kanshi-ram
కాన్షీరామ్‌ 1981 లో డి.యస్‌.-4 (దళిత్‌ సోషిత్‌ సమాజ్‌ సంఘర్షణ సమితి) స్థాపించారు. 1982లో ‘లిమిటెడ్‌ పొలిటికల్‌ యాక్షన్‌’ తో హర్యానా, జమ్మూ కాశ్మీర్‌, పంజాబ్‌ ఎన్నికలలో డి.యస్‌-4 పాల్గొన్నది. ఎన్నికలలో పాల్గొనటానికి గల ముఖ్య ఉద్దేశం- మన ఎన్నికల టికెట్‌ను మనమే తయారుచేసుకోవడం, మన ఓట్లను బ్యాలెట్‌ బాక్సులవైపు మరల్చటమనే ఏకసూత్ర కార్యక్రమం. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ బహుజనుల కోసం జాతీయ స్థాయిలో ఒక రాజకీయపార్టీ అవసరం ఏర్పడింది. అందుకే 1984 ఏప్రిల్‌ 14న బహుజన సమాజ్‌ పార్టీ ఏర్పడింది. బహుజన సమాజ్‌ పార్టీ డిల్లీ పీఠాన్ని ఆధిరోహించినప్పుడే కాన్షీరాం కల సాకారమవుతుంది. 

- దీకొండ తిరుపతి న్యాతరి శంకరయ్య 
మార్చి 15 కాన్షీరామ్‌ జయంతి

Surya Telugu News Paper Dated: 15/03/2013 

No comments:

Post a Comment