Monday, February 24, 2014

చరి్త్ర పుటల్లో చేరుతున్న రుంజ కళారూపాలు By Buddaram Ramesh


తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉన్నది. సంగీతం, నాట్యం, హస్త కళలు, శిల్ప కళలు మొదలగు కళారూపాలు తరతరాలుగా సమాజానికి వినోదాన్ని పంచిపెడుతున్నాయి. జానపద కళా సాహిత్యం ద్వారా జాతి సం„స్కృతి తెలుస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలను జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. జానపద కళలకు తెలుగు నేల పండిన పంట పొలం వంటిది. ఎన్నో రకాల జానపద కళలు తెలుగు నేలను సుసంపన్నం చేశాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి జానపద కళలు. 

ప్రాచీన సమాజంలో ప్రజలకు వినోదం కోసం జానపద కళామాధ్యమం తప్ప మరొక మాధ్యమం లేదు. పరివర్థితులైన శిష్ఠుల కళా రూపాలు ప్రజల దాకా వచ్చేవి కావు. అవి ప్రభువుల కొలువులకు, రాచనగరులకు పరిమితం అయ్యేవి. జన సామాన్యానికి, జానపదులకు అందుబాటులో ఉండి- వారి జీవితాన్నే వస్తువుగా జేసుకొని ఆడిన నాటకాలు జానపద కళలే. మన పురాణాలన్నింటినీ దృశ్య మాధ్యమంలో ప్రజలకు అందించి ప్రజలకు పురాణ పరిజ్ఞానాన్ని కలిగించినవి కూడా ఈ ప్రజా కళలే. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నో జానపద ప్రదర్శన కళారూపాలు, భాగవత మేళా, కురవంజి (ఎరుకల సాని), తోలు బొమ్మలాట,. తప్పెటగుళ్ళు, పులివేషం, కోలాటం, చెక్క భజన, పండరి భజన, ఒగ్గు కథ, పంబ కథ, ఆసాది కథ, బైండ్ల కథ, కొమ్ముల కథ, పాండవ… కథ, రుంజ కథ, గొల్ల సుద్దులు, జడ కోలాటం (కులుకు భజన ), వగ్గు డోళ్ళు బురక్రథ- వంటి కళారూపాలన్నీ కూడా తర తరాలుగా ఆశ్రీత కులాల వారికి వృత్తిగా ఉన్న కళా రూపాలే. ఈ కళా రూపాలు క్రమేణా కాలగర్భంలో కలిసిపోయాయి. మరి కొన్ని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాయి. ఈ కళా రూపాలు అన్నింటిలో రుంజులకు విశిష్ట స్థానం ఉంది. రుంజులు అనగా దాతృకులాల వారిని ఆశ్రయించి, గోత్రా లు పొగడి, వారి వంశచరిత్రలు పాడి జీవనోపాధి పొందేవారు. రుంజులలో ముఖ్యంగా భట్టులు, భట్రాజులు, విప్రవినోదులు, పుచ్చుకుం ట్లు, రుంజలు, పొడా పోతలవారు, మాల మాష్టివారు మొదల గు కులాల వారు న్నారు. వీరు ఆయా దాతృకులాల వారిని ఆశ్రయించి జీవనోపాధి పొందేవారు. ఉదా: బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్య (కోమటి) లకు వీరముష్టి, గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులువారు, మాల కులస్థులకు మాల మాష్టివారు- ఉన్నారు. రంజ వారు ఆది నుంచి వ్యవసాయ దారులు. వ్యవసాయంతో పాటు ఈ రంజు వృత్తిని చేపట్టేవారు. 

తక్కు ధిక్కు... తకధిక్కు ధిక్కు... తకమని... అంబుజా సనుడు తాళంబువేయ- అంటూ మెల్లగా ప్రారంభమైన గానం క్రమంగా ఊపందుకుంటుంది. ఈ గానంలో వేగం, తాళంలో తీవ్రతను పెంచుకుంటూ- రుంజు ధ్వని తీవ్రతను పెంచుతూ కథలు చెపుతారు రుంజవారు. వీరి కథలకు అప్పట్లో మన రాష్ర్టంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరిదగ్గర ఉన్న రుంజలను వాయిస్తూ కథలు చెప్పి తమ కళను ప్రదర్శించి యాచిస్తారు. అయితే వీరు ఎవరినిబడితే వారిని యాచించరు. కేవలం విశ్వబ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. కనుకనే ఆశ్రీత కులాలలో ఇది ఒకటిగా గుర్తింపుకు నోచుకుంది. రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ „సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతివారనీ ఇతి హాసం తెలియచేస్తూ ఉంది. రుంజలు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. రుంజు వాయిద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ. దీని శబ్దం కూడా రెండు , మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. దాదాపు మూడున్నర అడుగుల ఎత్తుండే ఈ వాయిద్యాన్ని నిలబెట్టి వాయించేవారు. రుంజ కారులు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. నా సంసార బరువును ఇది మోస్తున్నప్పుడు దీని బరువును మేము మోయలేమా అని ఆ కళాకారులంటారు. 

పూర్వం రౌంజుకుడనే రాక్షసుని చర్మాన్ని రుంజు వాయిద్యానికి వినియోగించడం వల్ల, రౌంజ అనే పేరు ఏర్పడి, కాలక్రమేణ అది రుంజగా రూపాంతరం చెందిందని నానుడి. రుంజను ఇత్తడితో తయారు చేస్తారు. ఈ వాయిద్యాన్ని బలమైన కర్ర పుల్లలతో వాయిస్తారు. ఏట వాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమి పట్టి, చేతులతో తాడును లాగి, శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజ వారని పిలవటం కూడ వాడుకలో ఉంది. రుంజ వాయిద్యకులు ఒక వేళ వ్వవసాయాన్ని కలిగి ఉన్నా, ప్రధానంగా రుంజ వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిస్తారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసంతో పాటు ఈ విద్యను కూడా కట్టుదిట్టంగా నేర్చుకుంటారు. ప్రతి వారూ ఈ విద్యలో ఉత్తీర్ణు్లలై, గ్రామాలకు యాత్రలు సాగిస్తారు. సంసారాలతో పాటు ఎడ్లబండ్లలో బయలు దేరుతారు. నిత్య జీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలైనవ వాటిని కూడ తమతోనే ఉంచు కుంటారు. ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదని చెబుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పార్వతీ దేవి తన కళ్యాణానికి వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వ కర్మ రౌంజుకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముపై్పరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణం వివరించింది.

రుంజుల విశిష్ట లక్షణం- ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచించడం. విశ్వ బ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి, దన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు తమ వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింప చేస్తారు. సంగీత శాసా్తన్రికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముపై్పరెండు రాగాలనూ తమ ప్రదర్శనల్లో వినిపిస్తారు. మూల స్థంభం, పంచముఖ బ్రహ్మావిర్భా వము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పడమే కాక, మధ్య మధ్య శ్రావ్యమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపా లలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదార విదములకూ- అనే పారంపర్యంగా వచ్చే మం„గళ హారతినే వీరూ అనుకరిస్తారు.

గ్రామంలో ప్రవేశించిన రుంజ వారు ఒక రాత్రి విశ్వ బ్రాహ్మణులకు కథను వివరిస్తారు. పంచ బ్రాహ్మలను గురించి, వారి వంశోత్పత్తిని గురించీ చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం అస్తిత్వాన్ని గూర్చి, పంచ భూతముల విధులనూ వివరిస్తారు. పంచ బ్రహ్మలంటే మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. వారి విధులను గురించి ఈ విధంగా వివరిస్తారు- మనువుకు ఇనుప పనీ, వద్దు కరప్రనీ, త్వ్రష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజ్ఞనికి బంగారు పనీ- ఈ విధంగా వేరు వేరు విధులను మాత్రమే చేపట్టాలని వివరిస్తారు. తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు. వారు చెప్పే కథలు- పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞము, విశ్వగుణా దర్శనము, వీర భద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనము, దేవ బ్రాహ్మణ మాహోత్యము, మూల స్థంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ ప్రకాశ మండలము. వీటిన్నిటికి పద్దెనిమిది అశ్వాసాలు గలిగి సం„స్కృత శ్లోకాల మయమైన, తాళ పత్ర గ్రంథం, మూల స్థంభం అధారమని చెబుతారు. రుంజలు విశ్వకర్మ పుట్టుక, పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం చరిత్ర చెబుతారు. విశ్వబ్రాహ్మణుల లోని సానగ (కమ్మరాచారి), సనాతన (వడ్రపుపని), అభవనస (కంచరపుపని), ప్రత్నన (శిల్పాచారి), సువర్ణస (బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇళ్ళకు వెడతారు.

రుంజ కథకులు గ్రామానికి వెళ్ళినపుడు ఊరిలో పెద్ద ఆచారి- అంటే మను బ్రహ్మ సంతతి వారి ఇంటికి, లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి వెళ్ళి కథ చెబుతారు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే, మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. రుంజ కథకుడు కథ ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి, అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం,బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రీతులైన రుంజలకు- దాతలైన విశ్వబ్రా హ్మ ణులకు మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోం ది. తరతరాలుగా వీరికి జీవనోపాధికి దోకాలేకుండా ఆసరాగ ఉండింది. ఐతే కాలంతో పాటు సామాజిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా, ఈ కళ వీరితోనే అంతరించిపోతున్నది. 

వీరి పిల్లలు ఎవ్వరూ ఈ కళను నేర్వడంలేదు. వీరు ఇంతవరకూ ప్రభుత్వ గుర్తింపునకు కానీ, సహాయానికి కాని నోచుకోలేదు. సినిమాలు, టీవీలు రావడంతో వీరి కళకు ఆదరణ కరవైంది. రాష్ర్టంలో అన్ని జానపద కళా రూపాలతోపాటు రుంజ కళా వాయిద్య రూపం కూడా క్రమంగా మరుగున పడింది. అటు కులవృత్తులు దెబ్బతినడంతో విశ్వబ్రాహ్మణులు కూడా గతంలో వలె వీరిని ఆదరించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లవెంట వెళ్లి యాచించే ప్రయత్నాన్ని కూడా వీరు విరమించుకున్నారు. తెలంగా ణప్రాంతం, ఉభయగోదావరి జిల్లాలో వీరు జీవిస్తున్నారు. ఈ కళాకారులను ఏ ఒక్కరూ గుర్తించ పోవడం గమనార్హం. 
అటు వ్యవసాయాన్ని పట్టిం చుకోక, ఇటు నమ్ముకున్న కులవృత్తి దెబ్బతిని రుంజవారు దయనీయ పరిస్థితిలో కాలం గడుపుతున్నారు. ఇతర దేశాలలో ఇలాంటి కళారూపాలను నవీనం చేస్తున్నారు. ఈ కళారూపాలకు టెక్నాలజీని అందించి నవీనం చేయటమేగాక ఆ కళా సంపదలను కాపాడుతున్నారు. శ్రమ సామాజికీకరణ కావాలంటే శ్రామికుణ్ణి ప్రేమించాలి. అతని కళలను ఆదరించాలి. ఆ చెమట చుక్కల జ్ఞానాన్ని ఏ విధంగా నవీనం చేయాలో ఆ విధంగా సున్నిత విషయాలను కళలకు జోడించి కొత్త పార్శా్వనికి మార్గం వేయాలి. ఈ కళాకారులను ప్రోత్సహించి ఈ కళను గ్రంథస్తం కూడా చేయవలసి యున్నది. అప్పుడే ఆ బడుగు జీవుల శ్రమకు విలువ లభిస్తుంది. ఆ కళాజ్ఞానం సమాజంలో సజీవంగా ఉండగలుగుతుంది.

Surya Telugu News Paper Dated: 24/02/2014 

No comments:

Post a Comment