Wednesday, February 26, 2014

ఎస్సీలకు బాసటగా కాంగ్రెస్ - కొప్పుల రాజు, విశ్రాంత ఐఏఎస్ అధికారి; చైర్మన్ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్




1 
 
1 
 
0 

 



చిటికెన వేలు అందిస్తే చాలు, చిటారుకొమ్మనందుకోగల చేవ సామర్థ్యం తెలివితేటలు కలవారు ఎస్.సి.లు. అటువంటి ఎస్సీలు శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, శ్రమ దోపిడీకి గురై ఇప్పటికీ చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం వంటి మహా సంకల్పాలు ఎస్.సి.ల జీవితాల్లో తీసుకువచ్చిన వెలుగు గణనీయమైనదే. అయినా ఇప్పటికీ మెజారిటీ ఎస్.సి.లు దారిద్య్రంలో న్యూనతలో మగ్గుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎస్.సి.ల బతుకులను బాగుచేయటానికి జరిగిన కృషితో ఇతర ఏ పార్టీకి లేనంత ఎక్కువ సంబంధం సహజంగానే ఉన్నది. దీనినెవరూ కాదనలేరు.
'నిమ్నజాతుల కన్నీటి నీరదములు/ పిడుగులై దేశమును గాల్చివేయుననుచు/ రాట్నమును దుడ్డుకర్ర కరాన బూని/ దెసలు దోతెంచె గుజరాతు ముసలి సెట్టి'; 'వెఱపు వలదు నీకు హరిజన సోదరా/ స్వీయరాజ్య రథము వెడలివచ్చె/ లాగిపొమ్ము నీకు లాభము గలదంచు/ బాడుచుండె రత్న భరతమాత'- స్వతంత్ర భారతదేశంలో ఎస్.సి.ల బతుకులు బాగుపడి తీరుతాయనే ప్రగాఢ విశ్వాసంతో మహాకవి జాషువ ఈ విధంగా పద్యగానం చేశారు. ఆ మహత్తర లక్ష్యం చేరుకునే కృషి సాగుతూనే ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అనితరమైన పాత్ర పోషిస్తూనే ఉన్నది. అయినా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎస్.సి. ఓటు బ్యాంకు తగ్గిపోతున్నది. దానిని పునరుద్ధరించటానికి మీరు ఏమి చేయదలచారు అని మిత్రులనేక మంది నన్ను అడుగుతున్నారు. ఇందుకు నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నాను. ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఎస్.సి.లకు ప్రాధాన్యం పెరిగేలా చూడాలి. వారి మాట పార్టీలో కంగుమని వినిపించేలా చేయాలి. వారి కంఠం మార్మోగేలా పార్టీలో తగిన మార్పు తీసుకురావాలి.
ఇందుకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఎస్.సి. కమిటీలను పటిష్ఠం చేయాలి. పునః చైతన్యవంతం గావించాలి. ఎస్.సి.ల నుంచి యువతరాన్ని నవతరాన్ని పార్టీ శ్రేణులలోకి తీసుకురావాలి. వారికి గురుతరమైన బాధ్యతలు అప్పగించాలి. ఎస్.సి.ల బాగు కోసం ఏమిచేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై పార్టీ లోపల, పార్టీకి పౌర సమాజ సంస్థలకు మధ్య విస్తృతమైన లోతైన చర్చ జరిగేలా సంస్థాగతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. ఆ వైపుగా పలురకాల సరికొత్త చొరవలు తీసుకోవాలి. రాజ్యాంగం ఎస్.సి.లకు అనేక రక్షణలు కల్పించింది. వాటి అమలుకు పలు చట్టాలు వచ్చాయి. అవి పకడ్బందీగ రాజీలేని రీతిలో అమలయ్యేలా చూడాలి. అదీ చాలదు. ఎస్సీ లకు పరిపూర్ణమైన సాధికారత సాధించడానికి మరెన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాలు చేపట్టాలి. మరిన్ని చట్టాలు తేవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎస్సీలకు ఉద్దేశించిన ప్రతి ఒక్క రక్షణ -సహాయం, రాజ్యాంగపరమైన, చట్ట సంబంధమైన వెసులుబాటు కచ్చితంగా సకాలంలో సంపూర్ణంగా వారికి అందేలా చూడాలి. అందుకు ఆయా కార్యక్రమాల అమలు వ్యవస్థను సమూల సంస్కరణకు గురిచేయాలి.
ఎస్.సి., ఎస్.టి. ఉపప్రణాళికలకు చట్ట బద్ధత కల్పించటం ద్వారా వాటి నిధులు వారికోసమే ఖర్చు అయ్యేలా చూడాలన్న డిమాండ్ అత్యంత సహజమైనది, సమర్థనీయమైనది. ఎందుకంటే ఎస్.సి.ల కోసం ఇతర అణగారిన వర్గాల కోసం నిధుల కేటాయింపు కాగితాలకే పరిమితమవుతున్నది. ఎస్.సి. అంటే ఇతర వర్గాలకు కన్నుకుట్టే స్థాయిలో ఈ కేటాయింపుల గురించి ప్రచారం విశేషంగా జరుగుతున్నది.

కాని వాస్తవంలో అది మేడిపండు సామెతను గుర్తు చేస్తున్నది. పేరు పెద్ద ఊరు దిబ్బ అనేనానుడిని జ్ఞప్తికి తెస్తున్నది. కాగితాల మీద బడ్జెట్ లెక్కలలో చూపిస్తున్న నిధులు వాస్తవంలో ఎస్.సి., ఎస్.టి.లకు అందడంలేదు. మధ్యలోనే దారిమళ్ళిపోతున్నాయి. ఇతర అమాంబాపతు అవసరాలకు తరలిపోతున్నాయి. వీరికి బడ్జెట్‌లో చేస్తున్న కేటాయింపులు అంకెల గారడీగానే తెల్లారిపోతున్నాయి. గణాంక విన్యాసాలుగానే మిగిలిపోతున్నాయి. ఉపప్రణాళికల నిధుల దారి మళ్ళింపు మీద పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సభ్యుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. సంకల్పానికి ఆచరణకు ఎంతో వ్యత్యాసం ఉన్న మాట వాస్తవం. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. వీటి మధ్య పొంతన సాధించడానికి దూరాన్ని తొలగించడానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఎస్సీ, ఎస్‌టీ ఉపప్రణాళికలకు కేంద్ర స్థాయిలోని చట్ట బద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జైపూర్ డిక్లరేషన్‌లో ఘన సంకల్పం చెప్పుకున్నది. ముసాయిదా చట్టాన్ని రూపొందించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఒక లక్ష్య కమిటీని ఏర్పాటుచేసింది. నేనందులో సభ్యుడిని. రాష్ట్రాలనుంచి, సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి సలహాలు సూచనలు కోరాము. ఈ చట్టాన్ని తీసుకురావడం అది సక్రమంగా సమగ్రంగా అమలయ్యేలా చూసి ఎస్ సి ఎస్ టిలకు ఉద్దేశించిన నిధులన్నీ ప్రతి పైసా వారికే ఖర్చయ్యేలా చూడటం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎస్సీల విషయంలో ముఖ్యంగా జరగవలసిందేమిటంటే రాజ్యాంగం వారికి హామీ ఇచ్చిన హక్కులన్నీ వారికి లభించేలా వారి అనుభవంలోకి వచ్చేలా చేయడం. డాక్టర్ అంబేద్కర్ బడిలో చదువుకున్నప్పుడు స్కూలు ప్యూను తనను అంటకుండా ఎత్తునుంచి పోసిన మంచి నీళ్ళతోనే దాహం తీర్చుకునే వాడట. ఆయన దాహంతో దహించుకుపోయిన అనేక సందర్భాలలో ఆ ప్యూను ఉద్దేశపూర్వకంగానే అందబాటులో లేకుండా పోయే వాడట. అటువంటప్పుడు దాహార్తితో గొంతు ఎండి ఆయన ఎంతో బాధపడేవారు. ఈ రోజున కూడా ఆ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వడ్డించేటప్పుడు పలు చోట్ల దళిత బాల బాలికలను వేరుగా కూర్చో బెడుతున్నారు. 'కింది కులాల' వారు వండే మధ్నాహ్న భోజనాన్ని తినడానికి 'పై కులాల'కు చెందిన పిల్లలు నిరాకరిస్తున్న సందర్భాలున్నాయి. పలు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలలో ఇవి తరచు కన్పిస్తుంటాయి. పాఠశాలల్లో కుల వివక్ష దళితుల పిల్లలను మంచి చదువుకు దూరం చేస్తుంది. అంతటి చిన్న వయసులోనే వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచుతుంది. అందుకే దళితులు తమ హక్కు లకోసం పోరాడే ముందు ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొని బాగాచదువుకోవాలని అంబేద్కర్ చెప్పారు.
దేశంలో పని విభజన ఇప్పటికీ చాలా సందర్భాలలో వారి వారి అర్హతలు, సామర్థ్యాలను బట్టి కాకుండా కులాలను బట్టి సాగుతున్నది. 'ఇండియాలో పారిశుద్ధ్య కార్మికుడు కావడమనేది అందుకు సంబంధించిన పనితనం మీద ఆధారపడి జరగదు. అతడు లేక ఆమె ఆ పని చేయగలరా అనే దాని మీద కాకుండా వారి పుట్టుక (బలం) ఆధారంగా పారిశుద్ధ్యపు పనివారవుతారు' అని అంబేద్కర్ అన్నారు. నీటి సదుపాయం లేని పాయిఖానాలు శుభ్రం చేసి మానవ వ్యర్థాన్ని నెత్తిన మోసుకుపోయే హీనాతిహీనమైన వృత్తి చేస్తున్న దళితులు దేశంలో ఇప్పటికీ లక్షల సంఖ్యలో ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో మూడు లక్షల మందికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. ఇంతకంటే బాధాకరం, సిగ్గుపడవలసిన విషయం ఏముంటుంది? ఇటువంటి పాయిఖానాలను ఈ నీచమైన వృత్తిని చట్టం నిషేధించింది. అయినా సామాజిక వ్యవస్థలోని క్రూరత్వం దానిని కొనసాగనిస్తున్నది. జాతీయ సలహా మండలి సూచన మేరకు యూపీఏ ప్రభుత్వం ఈ రకమైన నీచ వృత్తిని కేవలం పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యగా గాక సామాజిక రుగ్మతగా పరిగణించాలని నిర్ణయించింది. అందుకే దళితులకు రాజ్యాంగం హామీ ఇచ్చిన మానవహక్కులు వారికి పరిపూర్ణంగా లోపరహితంగా సంక్రమించేటట్టు చేయడం వారు వివిధ జీవనరంగాలలో ఎదుర్కొంటున్న దారుణమైన వివక్షను రూపు మాపడం మా ముందున్న అతి ముఖ్యమైన కర్తవ్యం. అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం దీనికే ఇవ్వదలిచాం. అదే సమయంలో దళితులకు ఉన్నత ప్రమాణాల విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.
ఎస్.సి.లకు, సామాజికంగా అభివృద్ధి చెందిన వర్గాలకు మధ్య వివిధ ప్రగతి సూచీల పరంగా ఉన్న తేడాలను సరిగా అంచనా వేసి నిర్ణీత వ్యవధిలో ఈ వ్యత్యాసాలను తొలగించే కృషి జరిగేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం సంకల్పించింది. అందుకోసం నడుం బిగించింది. అభివృద్ధి సాధనలో అన్ని సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడానికి దోహదం చేసే విధానాలు, కార్యక్రమాలు, చట్టాలు రూపొందించడం వైపు దీక్షతో కృషి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం పనిచేస్తున్నది.
తగిన అర్హత నిపుణత ఉన్నప్పటికీ ఎస్.సి.లకు ప్రైవేట్ రంగంలో మిగిలిన వారితో సమానంగా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ఈ విషయం పలు సమగ్ర పరిశోధనలలో సందేహాతీతంగా రుజువయ్యింది. ఒక పనిలో వివిధ వర్గాల వారిని నియమించడం వల్ల కార్యక్షేత్రంలో భిన్నత్వాన్ని వైవిధ్యాన్ని పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఇందువల్ల ప్రైవేట్ రంగంలో ఉత్పాకత కూడా గణనీయంగా పెరుగుతున్నదని అభివృద్ధి చెందిన దేశాలలో రుజువయ్యింది. ఇండియాకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే ప్రైవేట్ రంగంలో ఎస్.సి.లకు రిజర్వేషన్లు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది ఎస్.సి.ల అభ్యున్నతికే కాక దేశ సర్వతోముఖ వికాసానికి విశేషంగా తోడ్పడుతుంది. కుల వివక్ష అంతం కావడానికి ఉపయోగపడుతుంది.
ఎస్.సి.ల ఈ ఆకాంక్షను బలంగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దానినొక విధాన పరమైన ఆజ్ఞాపాలనగా స్వీకిరించి పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. విభాగం అంకితమై ఉన్నది. ఎస్.సి.లకు సంబంధించిన అన్ని అంశాల పైన పార్టీ ఏమి చేయదలచింది, ఎంతటి నిబద్ధతతో కృషి చేయదలచింది వచ్చే ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ సవివరంగా ఎరుక పరుస్తుంది. ఈ విషయమై దేశవ్యాప్తంగా గల ఎస్.సి.ల అభిమతాలను ఆకాంక్షలను తెలుసుకుని ఒక చోట చేర్చే పనిని ఏఐసీసీ ఎస్.సి. విభాగం నిమగ్నమై చేస్తున్నది.
-కొప్పుల రాజు
విశ్రాంత ఐఏఎస్ అధికారి; చైర్మన్ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్
- Andhra Jyothi Telugu News Paper Dated: 25/02/2014 

No comments:

Post a Comment