Tuesday, November 8, 2011

క్షమాభిక్షకు సత్ప్రవర్తనే గీటురాయి - అమర్



ప్రత్యేకించి వరకట్నం లాంటి నేరాలు ఆపాదించబడ్డవాళ్లు తప్పుచేసినా, చేయకున్నా ఇంటిల్లిపాది కటకటాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉంది... ఈ సందర్భంలో స్త్రీలు, ముసలివాళ్లు, అనారోగ్య పీడితుల పట్ల కనికరం చూపాలి. గృహహింస, భ్రూణ హత్యల్లాంటి పితృస్వామిక పీడనలు పోకున్నా వీటిని పూర్తిగా నివారించలేము. కొన్ని ప్రత్యేక సెక్షన్‌ల వారికి శిక్షాకాలాన్ని పెంచి అయినా విడుదలకు అవకాశం కల్పించాలి. లేదంటే పరివర్తనకు ఎవ్వరూ అతీతులు కాదన్న మౌలిక సంస్కరణ స్ఫూర్తిని నిర్వీర్యం చేసినట్లవుతుంది.

"నేరాల్ని ద్వేషించండి - నేరస్థులను కాదు'' అంటూ ప్రతి జైలు ముందు తాటికాయలంత అక్షరాలు దర్శనమిస్తాయి. నేరాలన్నింటికీ పునాది అసమానతలు గల సమాజమే. అయినా తరతరాలుగా రాజ్యం జైళ్లను, ఖైదీలను అసహ్యంగా చూసేలా మానసిక తర్ఫీదునిస్తుంది. అంతేగాదు నేరస్థులను ద్వేషించడంకన్నా ప్రభుత్వమే క్షమాభిక్షకు కొన్ని సెక్షన్ల ఖైదీలు అనర్హులంటూ బందీఖానాలో మరో బందీఖానాను తలపింపజేస్తున్నాయి. ఇలాంటి వారిని మెర్సీ పిటిషన్లపై విడుదల చేసిన దాఖలాలు కూడా లేవు. దేశవ్యాప్తంగా దాదాపు మూడువందలకుపైగా ఉరిశిక్షలు విధించబడ్డ ఖైదీలు మృత్యుముఖంగా భారంగా అడుగులేస్తుంటే, వేలాది జీవిత ఖైదీలు, మరిన్ని వేల మంది ఇతర శిక్షలు పడ్డ ఖైదీలు రోజురోజుకూ చస్తూ బతుకుతున్నారు.

మన రాజ్యాంగం, చట్టాలను అనుసరించి ప్రభుత్వాలు అందించే ప్రత్యేక రెమిషన్‌తో శిక్షలు తగ్గించి, చేసే ముందస్తు విడుదల మాత్రమే జీవిత ఖైదీలకు పునర్జన్మను ఇచ్చినట్లవుతుంది. ఇందుకు వారి సత్ప్రవర్తనను గీటురాయిగా తీసుకోవడం ద్వారా సంస్కరణ స్ఫూర్తి నిరాఘాటంగా సాగగల్గుతుంది. ఆ మేరకు జైలు అధికారుల నుండి కూడా వీరికి రెమిషన్ లభిస్తుంది. అలాగే ప్రతి జీవో సందర్భంగా అర్హులైన ఖైదీలందరికీ ప్రత్యేక రెమిషన్ ఇచ్చే ఆనవాయితీ కూడా ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. కానీ గడిచిన రెండు జీవోల్లో ఈ స్ఫూర్తి కొరవడింది. జీవిత శిక్షలు పడ్డ తర్వాత ఖైదీలు చేసుకునే అప్పీలు, ధర్మాప్పీల్లు హైకోర్టులో సింగిల్ బెంచి కారణంగా, ఇతరేతర సామాజిక ఆర్థిక కారణాల రీత్యా ఆరేళ్ల వరకూ కూడా ఒక కొలిక్కిరాని వారు కూడా ఉన్నారు. ఉన్నత న్యాయస్థానంలో శిక్షలు ధ్రువీకరించబడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సన్మార్గంలో నడిచిన జీవిత ఖైదీలు విడుదలవుతారనే ఆశలు కలిగించాలి.

ఫర్లో, పెరోల్‌ల ద్వారా వారికి సెలవులు దొరికినట్టు, క్షమాభిక్ష కూడా నిరంతర ప్రక్రియగా ఉంటూ నేరాన్ని సమాధి చేసి, నేరస్థులను పరివర్తన చేయించే అంశం నిరంతరం కొనసాగాలి. పార్డన్ (ఞ్చటఛీౌn) అనే ఆంగ్లపదానికి క్షమాదానం అంటూ తెలుగులో అర్థం ఉన్నా, క్షమాభిక్ష పాలకుల దయాభిక్ష కారాదు. అందుకే దీనిని ఒక హక్కుగా గుర్తించాలని సంస్కరణాభిలాషులు చాలాకాలంగా కోరుతున్నారు. 'నిర్భంద జీవితంలో మానసికంగా, ఒంటరిగా ఏ ప్రాణి ఎక్కువ కాలం జీవించ జాలదని' స్వామి వివేకానంద పేర్కొన్నారు.

అందుకేనేమో స్వయంగా జైలు శిక్షలు అనుభవించిన గాంధీజీ కూడా ఎంతటి నేరస్థుడికయినా 5 సంవత్సరాలు శిక్ష చాలునని, అంతకు మంచి నిర్భందిస్తే ద్వేషితులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 1980వ దశకంలో జైళ్లను అధ్యయనం చేసిన అనంత నారాయణ ముల్లా కమిషన్ కూడా 5 సంవత్సరాల గరిష్ఠ శిక్ష చాలునని పేర్కొన్నది. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులను విడుదల చేయాలని సిఫారసు చేసింది. రాచరిక పాలన అయినప్పటికీ ఉరిశిక్షలను రద్దుచేసి, 7 సంవత్సరాల చుక్క శిక్షలు పూర్తయిన జీవిత ఖైదీలను విడుదల చేసే సాంప్రదాయం నైజాం కాలం నుండి కొనసాగుతోంది. ఇందుకు అడ్వయిజరీ బోర్డుల ద్వారా కృషి జరిగేది. ఈ మేరకు భారత రాజ్యాంగం కూడా 161వ అధికరణం ప్రకారం జీవిత ఖైదీలకు క్షమాదానం (్క్చటఛీౌn) అందించి విడుదల చేయడానికి రాష్ట్ర గవర్నర్‌లకు విశేషాధికారాలిచ్చింది. ఈ దిశగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 432, 433 సెక్షన్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి. అలాగే ఉరిశిక్షలు, జీవిత శిక్షలుపడ్డ వారి విషయంలో మాత్రమే కనీసం 433-ఎ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగునేలపై రాజ్యాంగానుసారం నైజాం ప్రభుత్వ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉన్నదనడంలో సందేహం లేదు.

రాష్ట్రంలో రాజకీయ ముఠా కక్షలు, వనరుల విచ్చలవిడి దోపిడీలో మాఫియా సంస్కృతి రంగమెక్కిన తర్వాత పరిస్థితి జఠిలంగా మారుతూ వస్తుంది. బడితె ఉన్నవాడిదే బర్రె అనే పద్ధతిలో క్షమాభిక్ష కూడా కోర్టు వాజ్యాలపాలై సామాన్య ఖైదీలు అయిదేళ్లు నలిగిపోయిన పరిస్థితి తెలిసిందే. భారతదేశంలోని జైళ్లన్నీ బడుగులతో నిండిపోయి అచ్చమైన సామాజిక న్యాయం ఒక్క జైలు శిక్షల విషయంలోనే అమలు జరుగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అది విడుదలకు వర్తించకపోవడం ఏ జైలును పరిశీలించినా తేటతెల్లం అవుతుంది. క్షమాభిక్ష విషయంలో రాష్ట్ర గవర్నర్‌కున్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణా రహితంగా వాడుకుంటున్న విషయం ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటివరకు యూనియన్ చట్టాలకు లోబడి శిక్షలు బడ్డ వారికి, ఇతర రాష్ట్రాల కేసుల్లో ఉన్నవారికి, ఇతరేతర సహేతుక కారణాలకు క్షమాభిక్ష వర్తించేది కాదు. ఇది క్రమంగా 399, 395, 376, 498ఎ, 224, 354 తదితర సెక్షన్లకు వర్తించదని చెప్పింది. ఒక్కోసారి కుట్రపూరిత హత్య, ఆయుధ చట్టాలు తదితర సెక్షన్లపై ఆంక్షలు ఎత్తేసింది. మరొకసారి ఏ సెక్షన్‌లు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగుల హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష వర్తించదని కండిషన్‌లు పెడుతోంది. పరివర్తనకు కొందరు అతీతులుగా చూపే అశాస్త్రీయ పద్ధతే గాకుండా, వ్యక్తులను బట్టి సెక్షన్‌లు మార్చే రాజకీయ వివక్షతను ప్రభుత్వాలు అనుసరించే పద్ధతుల ద్వారా విమర్శించే అవకాశం లభిస్తుంది.

ఉదాహరణకు రాజకీయ ఖైదీ గణేష్ విషయంలో 2004లో వచ్చిన జీవో 190 ప్రకారం క్షమాభిక్షకు అర్హత ఉండి, కొన్ని రోజులు రెమిషన్ తక్కువ ఉండి, ఒక సంవత్సరం చుక్క శిక్ష ఎక్కువ అయినా విడుదల కాలేదు. తిరిగి ఎనిమిది సంవత్సరాల శిక్షా కాలం జరిగిపోయి అతడు సంస్కరించబడ్డట్టు (ఖ్ఛజౌటఝ్ఛఛీ) ప్రకటించి మెర్సీపిటిషన్ పెట్టుకున్న తర్వాత కూడా ప్రభుత్వం పాజిటివ్‌గా స్పందించాల్సి ఉంది. నేను, చుక్కారామయ్య, కామ్రేడ్ కేశవరావు జాదవ్‌లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌ను కలిసి రాజకీయ ఖైదీల విడుదలను కోరాము.

ప్రత్యేక జీవోతో విడుదల చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికయినా అమలు చేయాలి. 1991 నుండి 20 సంవత్సరాలకు పైగా కారాగార వాసంలో వృద్ధాప్యం, షుగర్ వ్యాధితో సతమతమవుతూ ఒక సంత్‌లాగా మారిన ఖదీర్‌లోని సత్ప్రవర్తనను గుర్తించకుండా ప్రభుత్వాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నట్లు!? కోర్టు వ్యాజ్యాల మూలంగా ఐదేళ్లలో (2005-2009) ఒక్క జీవితేతర ఖైదీలకే 2008లో మోక్షం లభించింది. ఆ తర్వాత 2009లో జీవో ఎం.ఎస్.నెం. 338, 415 మరియు జనవరి 26, 2011న విడుదలైన ప్రభుత్వ ఆదేశాల్లో సెక్షన్‌ల చక్రబంధనం ఉన్నది. అలాగే చిన్న శిక్షల ఖైదీలను రెండు జీవోలు విస్మరించాయి. ఆనవాయితీగా అర్హులైన ఖైదీలందరికి ఇస్తున్న 20 నెలల ప్రత్యేక రెమిషన్ ఇవ్వలేదు. ఆ విధంగా ఎనిమిది సంవత్సరాలుగా విడుదలకు, ప్రత్యేక రెమిషన్‌లకు నోచుకోని వందలాది మంది ఖైదీలను మూడవసారయినా కనికరించి సాధారణ జీవో విడుదల చేయాలని ఖైదీలంతా ఎదురుచూస్తున్నారు.

ప్రత్యేకించి వరకట్నం (498(ఎ)) లాంటి నేరాలు ఆపాదించబడ్డవాళ్లు తప్పుచేసినా, చేయకున్నా ఇంటిల్లిపాది కటకటాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. కొందరు శిక్షాకాలం భరించలేక ఓపెన్ జైళ్ల నుండి పారిపోయిన వాళ్లు, ఆత్మహత్య చేసుకొన్న వాళ్లున్నారు. చేయని నేరానికి కొందరు పిల్లలు జైళ్లలో జన్మించిన ఆపవాదును కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో స్త్రీలు, ముసలివాళ్లు, అనారోగ్య పీడితుల పట్ల కనికరం చూపాలి. గృహహింస, భ్రూణ హత్యల్లాంటి పితృస్వామిక పీడనలు పోకున్నా వీటిని పూర్తిగా నివారించలేము. కావున కొన్ని ప్రత్యేక సెక్షన్‌ల వారికి శిక్షాకాలాన్ని పెంచి అయినా విడుదలకు అవకాశం కల్పించాలి. లేదంటే పరివర్తనకు ఎవ్వరూ అతీతులు కాదన్న మౌలిక సంస్కరణ స్ఫూర్తిని, ఎడతెగని కండిషన్‌లు (సెక్షన్స్) నిర్వీర్యం చేసినట్లవుతుంది.

మరొకవైపు ప్రభుత్వమే ప్లీ-బార్లేనింగ్ (ఇటఞఛి 265అ ప్రకారం) ద్వారా 7 సంవత్సరాల గరిష్ఠ శిక్ష కేసుల్లో మొట్టమొదట నేరం చేసిన ముద్దాయిల నేరాంగీకారాన్ని అనుమతించి శిక్షాకాలాన్ని తగ్గిస్తుంది. 7 సంవత్సరాలలోపు శిక్ష విధించే కేసుల్లో ప్రాథమిక ఆధారాలతో చార్జిషీటు ఫైలు చేసేంతవరకు పోలీసులే బెయిల్ ఇచ్చే విధంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 51ను సవరించింది. చిన్న శిక్షలు గలవారిని జైల్లో పెట్టకుండా సామాజిక శిక్షలు అమలు పరచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శాసనం చేసింది. శిక్షా ఖైదీలకు రుణ సౌకర్యం కల్పిస్తూ కడప కేంద్ర కారాగారంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. విద్య, సాంకేతిక శిక్షణ, పారిశ్రామిక-వ్యవసాయిక ఉత్పత్తులు, జైలు పరిపాలనా రంగాల్లో ఖైదీలను భాగస్వాములను చేస్తూ సత్ప్రవర్తనను కాంక్షిస్తున్న ప్రభుత్వం, క్షమాభిక్షలో కొందరిని మినహాయించడం భావ్యం కాదు.

వాస్తవంగా జైళ్లలోనూ కనీస వేతనాల చట్టం అమల్లోనికి తెచ్చి, సంస్కరణ స్ఫూర్తి చిహ్నంగా జైలు సిబ్బందిని ఖాకీ డ్రెస్సునుండి మినహాయించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. జైళ్లను ఆశ్రమాలుగా, ఖైదీలను ఆశ్రమ వాసులుగా పరిగణిస్తున్న జైళ్లశాఖ డిజి గోపీనాథ్‌రెడ్డి, క్షమాభిక్షకు అలాంటి స్ఫూర్తిని అందించేందుకు తనవంతు కృషిచేస్తారని ఆశిద్దాం. ఖైదీ అంటేనే సర్వసాధారణంగా అనుమతి లేకుండా బయటి ప్రపంచంతో పరిమితంగానైనా సంబంధాలు నెరపలేని నిర్భంద జీవి. ఖైదీలంతా స్వేచ్ఛను కోల్పోతే జీవితఖైదీ తనమీద తనకున్న స్వేచ్ఛను కోల్పోయి జైలు అధికారుల బంధనాల్లో ఉంటాడు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా పనిష్మెంట్ తన విడుదల, పెరోల్, ఫర్లోలపై పడుతుందని అణకువగా ఉంటాడు.

ఎప్పటికయినా విడుదలవుతాననే ఆశతో బతుకుతున్న వీరికి సెక్షన్‌ల మూ లంగా పడే చుక్క శిక్ష నాలుగేళ్ల రెమిషన్ పూర్తయినా విడుదలకు నోచుకోకపోవడమనేది ఆశల్ని చంపేస్తుంది. ఎంతోమంది నేరం చేయకుండా శిక్షను అనుభవిస్తున్నవాళ్లు, జీవితంలో మొదటిసారి పోలీస్‌స్టేషన్, జైలును చూసిన వాళ్లున్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పును ఆ మరుక్షణమే గుర్తించి పశ్చాత్తాపడుతున్న వాళ్లున్నారు. కావున ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాతనైనా సాధారణ జీవో ద్వారా జీవిత-జీవితేతర ఖైదీలను విడుదల చేసేందుకు జనవరి 26, 2012 కోసం సరైన మార్గదర్శకత్వాలు జారీ చేయాలని ఖైదీలు కోరుకుంటున్నారు. తమకు తోచిన రీతిలో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఖైదీల సంక్షేమం - ఖైదీల హక్కులను రెండు కళ్లుగా భావిస్తున్న వాళ్లు అక్టోబర్ 2న ఖైదీల సంక్షేమ దినం లాగే, జూలై 13వ తేదీని (జతీంద్రనాథ్ దాస్ జైల్లో అమరుడైన దినం) ఖైదీల హక్కుల దినంగా ప్రకటించాలని కోరుతున్నారు. క్షమాభిక్షను ఖైదీల హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జైళ్లను నిజమైన సత్ప్రవర్తనా ఆశ్రమాలుగా తీర్చిదిద్దే సంకల్పం గలవాళ్లందరూ, 'ప్రసేనుని రాజ్యంలోని కోసల ప్రాంతంలో అంగుళీకుడు (మనుషులను చంపి వారి బొటనవేలును మాలగా మెడలో ధరించేవాడు) అనే దారిదోపిడీదారున్ని శ్రవణుడు (బుద్ధుడు) సద్దర్మవర్తనుడిగా మార్చిన విషయాన్ని'' పరిగణలోనికి తీసుకోవాలి. తప్పుచేయకపోవడం కంటే పశ్చాత్తాపంతో తప్పుల్ని దిద్దుకోవడం గొప్పదని నమ్ముదాం. ఆ మాటకొస్తే ఏదో ఒక తప్పు చేయని వాళ్లెవ్వరూ ఉండరు. పశ్చాత్తాపానికి, పరివర్తనకు ఎల్లవేళలా అవకాశం కల్పించే ప్రభుత్వ క్షమాభిక్ష విధానాలకై గళం విప్పుదాం.

- అమర్
రాజకీయ ఖైదీ (చర్లపల్లి జైలు)                       Andhra Jyothi News Paper , 08/11/2011

No comments:

Post a Comment