Sunday, November 20, 2011

అవకాశవాదులతో ఐక్యత ఎట్లా? By -పిట్టల రవీందర్


తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ శక్తుల ఐక్యత గురించి, ఐక్య ఉద్యమాల ఆవశ్యకత గురించి ఉద్యమ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ సాగుతున్నది. ఈ క్రమంలో ఉద్యమ నాయకత్వాన్ని, ఉద్యమకారులను తప్పుపట్టడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ చర్చ అంతా వాస్తవ పరిస్థితులను కేంద్రంగా చేసుకుని కాకుండా, ఉద్యమానుభవాల నేపథ్యం నుంచి కాకుండా, ఆదర్శవంతమైన ఆలోచనల నుంచి మాత్రమే కొనసాగుతుండడం వల్ల ఎలాంటి స్పష్టతను సాధించలేకపోతున్నది. రాజకీయ నాయకులకు తెలంగాణ ఏర్పాటు మినహా మరో ప్రయోజనం ఉండకూడదని ఆశించడం ‘ఆదర్శవంతమైన కోరిక’. కానీ పార్టీలు అధికారమే అంతిమ లక్ష్యంగా, రాజకీయాలు వ్యాపార ప్రయోజనాలతో ముడిపడి, ఎన్నికలు పెట్టుబడికి ప్రతిరూపంగా మారిన వర్తమాన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఆచరణ సాధ్యమా? అనే విషయాన్ని ఆలోచించాలి.

ప్రతి రాజకీయపార్టీకి, ప్రతి రాజకీయ సందర్భంలోనూ ఒక ప్రయోజనం ఉంటుంది. ‘తెలంగాణ వస్తే అది సాధించిన క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో పార్టీల మధ్యన పోటీ ఉండవద్దు’ అనే ఆదర్శవంతమైన ఆలోచన మాట్లాడుకోవడానికి బాగానే కనిపిస్తుంది. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర సాధన సులభమవుతుందనే ఆలోచన కూడా బాగానే ఉన్నది. కానీ అందరం కలిసి కూర్చుం డి మాట్లాడుకుంటే తెలంగాణ సులభంగా వస్తుందని, అందరూ ఐక్యమైపోతారనే భావన ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది? రాజకీయ నాయకులు వ్యక్తిగతమైన ప్రయోజ నం లేకుండా, తమకు ఆశ్రయం ఇస్తున్న పార్టీలకు ప్రయోజనం లేకుండా ఉంటారనుకోవ డం (ఉండాలని కోరుకోవడం ఆదర్శవంతమైనదే అయినప్పటికీ) అమాయకత్వం. రాజకీయ ఆచరణకు ఈ ఆలోచన విరుద్ధమైనది. తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు, రాష్ట్ర సాధ న కోసం 12 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంలో ఇది ఆచరణ సాధ్యంకాని అంశమని తేలిపోయింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత నాయకులు ఈ ఉప ఎన్నికల్లో పోటీవద్దని ఎంతమొత్తుకున్నా ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ఆధిపత్య నాయకత్వం ఏకపక్షంగా అభ్యర్థులను పోటీకి దింపి, తెలంగాణ రాజకీయ నాయకత్వం ఐక్యం కాకుండా అడ్డుకోగలిగింది.

కేవలం రాజకీయాలవల్లనే సమస్య పరిష్కారమవుతుందనే వాదన రాజకీయ అమాయకత్వంతో చేస్తున్నదని భావించవలసి వస్తున్నది. ప్రజా ఉద్యమం లేకుండా, తెలంగాణ రాజకీయ నాయకత్వంపై ఒత్తిడి ఎలా సాధ్యం? 2009 ఫిబ్రవరిలో ప్రజల నుంచి ఒత్తిడి, రాజీనామాల డిమాండ్‌కు భయపడి పారిపోయిన తెలంగాణ ప్రజావూపతినిధులు, ఇవాళ రాజీనామాలు చేసే విషయంలో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుని ‘క్యూ’ కట్టడం వెనుక సకల జను ల సమ్మె, సహాయ నిరాకరణలాంటి ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన ఒత్తిడి పనిచేసిందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజల పాత్రకు, ఉద్య మం పాత్రకు ఇది ఒక నిదర్శనం. ఏ రాజకీయాలు ఐక్యతకు అనుకూలంగా ఉన్నాయో, ఏ రాజకీయాలు ఐక్యతకు అవరోధంగా ఉన్నాయో గ్రహించి, ఆ అవగాహనతో ప్రజలను చైతన్యపరచడం మేధావుల బాధ్యత. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ భిన్నత్వాన్ని గ్రహించకుండా ఐక్యతకు సంబంధించిన ప్రాతిపదికలను ఏ రూపంలో ప్రతిపాదించగలుగుతాము? ఏ రాజకీయాలు అనుకూలమో, ఏ రాజకీయాలు వ్యతిరేకమో గ్రహించి అనుకూల రాజకీయాలను ఉద్యమంలోకి సమీకరించుకుని, ప్రతికూల రాజకీయాలను ప్రజా ఉద్యమం ద్వారా వ్యతిరేకించకుండా ఐక్యత ఎట్లా సాధ్యమవుతుందో ఆలోచించాలి.

మెజారిటీ తెలంగాణ రాజకీయ నాయకత్వం సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలలో బానిస భావజాలంతో తమ ఉనికిని తాకట్టు పెట్టుకున్నవి. సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలతో అంటకాగినంత కాలం తెలంగాణ రాజకీయ నాయకత్వం తమ ప్రజల ఆకాంక్షలను ధైర్యంగా ప్రతిబింబించలేవు. ఆంధ్రా ఆధిపత్యాన్ని, ఆ ఆధిపత్య రాజకీయాలకు బానిసలుగా మారిన తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నించిన కారణంగానే తెలంగాణ సమాజం ఉద్యమంలో ఐక్యతను సాధించగలిగింది. పార్టీలు స్థిరంగా ఉంటేనే తమ రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉంటుందని, ఆ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న సీమాంధ్ర నాయకుల ఆధిపత్యా న్ని ఆమోదించినంత కాలం మాత్రమే తమ రాజకీయ ఉనికిని కాపాడుకోగలమనే అభివూపాయంతో తెలంగాణ నాయకులు వ్యవహరిస్తున్నారు.

తమ రాజకీయ భవిష్యత్తు కోసం, అధికారం కోసం రాజకీయ నాయకులు తాపవూతయపడడం సహజం. కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, పోరాటాలను, ఆరాటాలను సీమాంధ్ర నాయకత్వ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టే ప్రయత్నాలను తప్పుపట్టకుండా, వ్యతిరేకించకుండా ఉద్యమ ప్రయోజనాలను కాపాడటం సాధ్యం కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం చేస్తున్నది కూడా ఇదేనని గ్రహించాలి. ఆంధ్ర నాయకత్వ ప్రయోజనాల కోసం కాకుండా, తమకు ఓట్లు వేసిన అధికారం అందించిన ప్రజల కోసం, ప్రజల తరఫున పనిచేయాలనే డిమాండ్‌ను తెలంగాణ ప్రజా ఉద్యమం ముందుకు తీసుకువచ్చింది. అట్లా పనిచేయని తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ఉద్య మం ప్రశ్నించింది. నిలదీసింది. ఈ క్రమంలోనే ‘ములాఖత్’ పేరుతో ప్రజా ప్రతినిధులకు పూలు ఇచ్చి విన్నవించింది. విజ్ఞాపన పత్రాలను అందజేసింది. అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేసింది. ఇళ్లముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.ఈ క్రమంలో ప్రజలు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. గ్రామ బహిష్కరణకు పిలుపునిచ్చారు. శవ యాత్రలు నిర్వహించారు. పిండ ప్రదానాలు చేశారు. చావు డప్పులు మోగించారు.
ఫలితంగా.. తెలంగాణ వ్యతిరేక పార్టీల్లో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఒక బలమైన వర్గం తయారైంది. తెలంగాణ కోసమే పనిచేస్తున్న (తమ రాజకీయ పరిమితులకు, అవసరాలకు లోబడి అయినా సరే...) ఇట్లాంటి శక్తుల మధ్యన ఐక్యత సాధ్యమవుతుంది. అంతే తప్ప ఇంకా సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాల ఒడిలో సేద తీరుతున్న నాయకులను (కలుపు మొక్కలను) తెలంగాణ ఉద్యమంలో కలుపుకుని పోవాలని సూచించడం రాజకీయ అమాయకత్వానికి నిదర్శనం మాత్రమే. తెలంగాణ సమాజం డిమాండ్ చేసినట్లుగా 2009 డిసెంబర్ పరిణామాల సందర్భంలోనే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజావూపతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉంటే, కనీసం తమ పార్టీలను వదిలి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఉండేది. తెలంగాణ ప్రజా ఉద్యమ ప్రయోజనాల కంటే, సీమాంధ్ర ఆధిపత్య రాజకీయ ప్రయోజనాలకే తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజావూపతినిధులు ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్లనే సకల జనుల సమ్మె, సహా య నిరాకరణ లాంటి అద్భుతమైన పోరాట రూపాలు కూడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయనే వాస్తవాలను ప్రతిఒక్కరూ గ్రహించవలసి ఉన్నది.

రాజకీయాల్లో స్వార్థ ప్రయోజనాలను ఒక వాస్తవంగా గుర్తించాలి. దాన్ని విస్మరించి, కేవలం ఉద్యమ ప్రయోజనాలను మాత్రమే చర్చించడం వల్ల ఫలితం ఉండదు. ఉద్యమ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల మధ్యన ఉండే వైరుధ్యాలను విస్మరించి ‘ఐక్యత’ను గురించి మాట్లాడడం నేల విడిచి సాము చేయడం లాంటి దే. ఈ వైరుధ్యాల మధ్యన మేధావులు నిష్పాక్షికంగా, తటస్థంగా ఉండాలని కోరుకోవడం కూడా ఒక భ్రమ మాత్ర మే. ఇది ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన. సీమాంధ్ర నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసమే రాజకీయాలు నడుపుతుంటే, వారి ప్రయోజనాలకు అనుగుణంగా ఇక్కడి రాజకీయ నాయకత్వం మసలుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ సాధన కోసం తమ వంతు పాత్రను పోషిస్తున్న పార్టీలతో, ఉద్యమ సంస్థలతో సమాన ప్రాతిపదికన వీరికి ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించడం సరికాదు. ఈ కారణంగా ఉద్యమ క్రమంలో తలెత్తుతున్న ఘర్షణలో ఇరుపక్షాలతో ‘సమానం’గా వ్యవహరించాలనుకోవడం కూడా న్యాయ సమ్మతం కాబోదు. ఈ ఘర్షణ వాతావరణంలో మనం ఎటో ఒకవైపు మాత్రమే నిలబడాలి. తెలంగాణలో పుట్టి, ఇక్కడ నాయకులైనంత మాత్రాన, కేవలం ఈ ప్రతిపాదికన అందరినీ సమానంగా చూడాలని కోరుకోవడం వల్ల తెలంగాణ ఉద్యమ నాయకత్వం ముందుకుపోవడం సాధ్యం కాదు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం ఎదగడానికి ఈ ఆలోచన అవరోధంగా మారుతుంది.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో కొనసాగుతూనే సీమాంధ్ర నాయకత్వంతో ఘర్షణ పడుతున్న వారిని, ఇదే పార్టీలలో సీమాంధ్ర ఆధిపత్య భావజాలానికి బానిసలుగా పనిచేస్తున్న వారినీ ఒకే గాటన కట్టలేము. అదేవిధంగా తెలంగాణ డిమాండ్ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమొక్షికసీ లాంటి పార్టీలను ఆంధ్రా ఆధిపత్యంలో తెలంగాణ పట్ల ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్యన ఐక్యతను సాధించాలని ప్రతిపాదించడం ఉద్యమ మౌలిక ప్రయోజనాలకే విరుద్ధమైనది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీకి కూడా మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పుట్టి, నాయకులైనందుకు కలుపుకొని పోవాలనడంకంటే తెలంగాణ కోసం పనిచేస్తున్న వారినందరినీ కలుపుకొనిపోవాలని ప్రతిపాదించడంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుం ది. ఇన్నేళ్ల ప్రజా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ సమాజాన్ని ఐక్యం చేయడంలో జరిగిన కృషిని (అది ఎవరు చేసినా) గుర్తిస్తే, ఇట్లాంటి ప్రతిపాదనలు వచ్చి ఉండేవి కావు. నాయకుడు లేకపోయినా, ప్రజలు ఐక్యమైన సందర్భాలలో ఉద్యమం దానికదే కొనసాగుతుంది. దాని నుంచే ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదుగుతుంది. ఇవ్వాళ ఉద్యమం ఈ దిశలోనే ముందుకుపోతున్నదనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. 

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Namasete Telangna  News Paper Dated  21/11/2011

No comments:

Post a Comment