Wednesday, November 16, 2011

దగాపడ్డది బీసీలే! - సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్

తమ స్వీయ ప్రయోజనాల కోసం, 'హిడెన్ ఎజెండా'తో కొంతమంది 'సామాజిక న్యాయం', 'బహుజన తెలంగాణ' పేరు తో అయోమయం సృష్టిస్తున్నారు. అంతిమంగా తెలంగాణ ఉద్యమ ఊపిరి తీయాలని చూస్తున్నారు. ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడు సాధ్యమైనంత మేరకు దానికి బ్రేకులు వెయ్యడం, అలసట తీర్చుకోవడం కోసం ఉద్యమకారులు ఆగిన వెంటనే వాళ్ల వెన్నుమీద పొడవడమే వీళ్ల నిత్యకృత్యం.

ఉద్యోగసంఘాల నాయకత్వ స్థానంలో ఉన్న ది బీసీలు కావడంతో వారిపై నేరుగా దాడికి దిగుతున్నారు. 'మా తోటి కలిసి రాకుంటే శత్రువుతో కుమ్మక్కయినట్లే'అని అమెరికా చేస్తు న్న ప్రచారాన్నే ఆయుధంగా వాడుతున్నారు. ఇటీవలి కాలంలో పత్రికల్లో వ్యాసాలు, టీవీ చర్చల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, పత్రికా సమావేశాల్లో ఈ 'భావ వ్యాప్తి' జోరుగా సాగుతోంది.

'సామాజిక తెలంగాణ' పేరుతో చిరంజీవి తెలంగాణను నిండా ముంచిన తర్వాత ఆ పదం వాడాలంటేనే వెన్నులో బాకు దిగిన భయం కలుగుతోంది. ఇక దేవేందర్‌గౌడ్ 'నవ తెలంగాణ ప్రజాపార్టీ'ని స్థాపించి, తనను నమ్మినోళ్లని మూసీలో ముంచి, చిరంజీవితో కలిసి, చివరికి చంద్రబాబు దగ్గర తేలడంలో 'సామాజిక' పదం చాలా యూజ్, మిస్ యూజ్, అబ్యూజ్‌కు గురయింది. 'సామాజిక తెలంగాణ' తమ పేటెంట్‌గా భావిస్తున్న వాళ్లు ఒక్క రాజకీయ కోణం నుంచి మాత్రమే దాన్ని చూస్తున్నారు. ఆ పరిధి, దాంతో పాటు స్వీయ నిర్మిత పరిమితి నుంచి వాళ్లు బయటపడటం లేదు.

పత్రికల్లో వ్యాసాలై పరుచుకునే మేధావులు రాష్ట్రం విడిపోతే సామాజిక తెలంగాణగానే విడిపోవాలి లేదంటే అసలు విడిపోవాల్సిన అవసరమే లేదంటూ మొండి వాదనలు చేస్తున్నారు. ఈ విడిపోవద్దనే 'మేధావులు' పొరపాటున కూడా 'సామాజిక ఆంధ్రప్రదేశ్' కావాలని డిమాండ్ చేయడం లేదు. అంటే తెలంగాణను అడ్డుకోవడం కోసమే వీళ్లు తమ మేధావిత్వాన్ని ఉపయోగిస్తున్నారు.

రాజకీయరంగంలో 'సామాజిక న్యాయం' అనేది కొత్తగా పుట్టుకొచ్చిన పదం కాదు. గత వందేళ్లుగా తమిళనాట 'సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్' 'జస్టిస్ పార్టీ'ల రూపంలో అమలులో ఉన్నదే!. ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతర వర్గాలకు మధ్య జరిగిన పోరులో 'జస్టిస్ పార్టీ' బ్రాహ్మణేతరుల పక్షాన పోరాడింది. 1944 తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ నేతృత్వంలో 'ఆత్మగౌరవ' ఉద్యమాలు జరిగాయి.

ఈ ఉద్యమాల నుంచే 'ద్రవిడ కజగమ్' లాంటి పార్టీలు ఆవిర్భవించాయి. బీసీలైన ఎం.జి.రామచంద్రన్, కరుణానిధిలు ముఖ్యమంత్రి పదవినదిష్టించారు. సరిగ్గా ఈ రోజు తెలంగాణలో సకలజనులు చేస్తున్నది 'ఆత్మగౌరవ'పోరాటమే. ఈ పోరాటం కొందరు తమ స్వీయ ప్రయో జనాల కోసం వక్రీకరిస్తున్నట్టుగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణ డిమాండ్ 'సామాజిక న్యాయం' అవిభాజ్యమైనవి. అందుకే దామాషా ప్రకారం 'అత్యంత అణచివేతకు గురయి న వారికి అందరికన్నా ముందు అవకాశం' అనే సూత్రంతో ప్రయోజనాలు చేకూర్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాము.

ఇది కేవలం జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో స్థానంతో ఆగిపోకూడదు. 'ప్రభుత్వం, కొంతమంది సంపన్న వర్గాల గుప్పిట్లో కేంద్రీకృతమైన సంపదను, వనరులను జనాభా దామాషా పద్ధతిలో పున:పంపిణీ చేయాలి'. భూమి, విద్య, వైద్యం, ఉపాధి, గౌరవ ప్రదమైన జీవనం అందరికీ హక్కుగా దక్కాలి. ఆ స్పృహతోనే నేడు యావత్ తెలంగాణ ఉద్యమిస్తోంది. నిజానికి రెడ్డి, వెలమ, మిగతా అగ్రవర్ణాలవారందరికన్నా 'బహుజన తెలంగాణ' 'బీసీ'లకే అత్యవసరం. ఎందుకంటే నేడు రాజకీయంగా ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడంతో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాకోసం కూడా 'బీసీ'లు నిత్యం కొట్లాడాల్సి వస్తుం ది.

మరోవైపు మీకు చేతనైత లేదు కాబట్టి మీ తరపున మేమే కొట్లాడుతామని బీసీయేతర లీడర్లు తయారవుతున్నారు. ఇందులో ముం దు వరుసలో ఉన్నది ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ. ఒకవైపు అగ్రవర్ణాల వారిని బహుజనులకు దక్కాల్సిన అవకాశాల్ని కాజేశారని విమర్శిస్తూనే వారి స్థానాన్ని తాను క్రమంగా ఆక్రమిస్తున్నారు. అంటే బీసీలను అగ్రవర్ణ నాయకుల బందీ నుంచి విముక్తి పేరిట 'దళిత దొరల' 'ఖైదీ'లుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

అగ్రవర్ణాల పట్ల భయమో, భక్తో కానీ, ఇప్పటికీ 80 శాతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బీసీలమీదనే ఉన్నాయనే విషయాన్ని మరవొద్దు. మందకృష్ణ 'తెలంగాణ' ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాడనే నమ్మకం లేదు. 'వర్గీకరణ'కోసం 'తెలంగాణ'ను బలిపెట్టబోడనే విశ్వాసమూ లేదు. బీసీల్లో సమర్ధులు లేనందునే తాను వారి తరపున వకాల్తా పుచ్చుకోవాల్సి వచ్చింది అనే వాదన ఆయన అహంభావ వైఖరికి నిదర్శనం. తన రాజకీయ ఎత్తుగడల్లో బీసీలను పావులుగా వాడుకోవాలని చూడడం మాకు సమ్మతం కాదు.

మంద కృష్ణ గతంలో చెప్పినట్లు 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరపున ఇద్దరే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు- బొమ్మగాని ధర్మభిక్షం, పెండెం వాసుదేవరావు. ఇందులో పెండెం గజ్వేల్ నుండి మాడపా టిని ఓడించారంటే అవకాశం వస్తే బీసీలు తమ సత్తాని చూపిస్తార నడానికి ఇదే తార్కాణం. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లా నుంచి బీసీల రిప్రజెంటేషన్ లేదు. మిగతా జిల్లాల్లో ఒకరిద్దరు అతి కష్టంమీద టిక్కెట్లు తెచ్చుకున్నారు. చచ్చీ చెడీ గెలిచారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న బీసీలకు మందకృష్ణలాంటి ఉద్యమకారులు మద్దతిచ్చి అండగా నిలిచినట్లయితే ఒకే వొరలో రెండు కత్తులు కాకుండా, ఒకే కత్తికి రెండు వైపులా పదునుగా మారుతుంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇవ్వకుండా 'మాకు రాజకీయాల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. మేము మీకోసమే కొట్లాడుతున్నాము' అని మెహర్బానీ ప్రదర్శిస్తున్నారు. ఈ మెహర్బానీలో 'మీకు రాదు కాబట్టే మేము నేర్పడానికి వచ్చా ము అనే సీమాంధ్ర అహంకారమే' కనిపిస్తున్నది. అందుకే మామీద స్వారీ చేయకుండా మాతో కలిసిరావాలని వారిని కోరుతున్నాము. తెలంగాణ ఉద్యమం ఊపు మీదున్న ప్రతిసారీ మందకృష్ణ ప్రతికూల శక్తిగా మారుతున్నారే తప్ప మేలు చేయడం లేదు. తనతో కలి సి రాకుంటే కెసిఆర్‌తో ఉన్నట్లే అనే భావనని వ్యాప్తిలో పెట్టారు.

ఆనాడు అంబేద్కర్‌ని కూడా ఇలానే అన్నారని 'అంబేద్కర్ తర్వాత నేనే' అంతటి వాడిని అనే 'సంకేతం' ఇస్తున్నారు. నిజానికి కెసిఆర్ మనవడికో, కోదండరామ్ కొడుక్కో తెలంగాణ వచ్చినా, రాకపోయి నా వాళ్ల బ్రతుకుదెరువుకు ఢోకాలేదు. కానీ తెలంగాణ రాకుంటే కోటి ఆశలతో, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న నాలుగు కోట్ల బహుజన ప్రజానీకం తల్లడమల్లడమవుతారు. మరింత బానిసత్వానికి బలవుతారు. అలాగే తెలంగాణ కోసం కొట్లాడుతున్న వారందరూ టిఆర్ఎస్ సభ్యులు కారు అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఇక కంచ ఐలయ్య తన మేధస్సునంతా నిరుపయోగమైన నిందారోపణలకు వినియోగిస్తున్నారే తప్ప బీసీల ఎదుగుదలకు తోడ్పడడం లేదు. ఐలయ్య ఇంగ్లీషు మాధ్యమం ఉండి తీరాల్సిందే అని గట్టిగా నిలబడినందుకు సంతోషమైంది. అదే నోటి తోటి కేవలం దళితులకు మాత్రమే రిజర్వేషన్లు దక్కుతున్నా 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' మాదిరి బడులు తెలంగాణలోని ప్రతి మండలంలో స్థాపిం చి అందులో బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించాలని అడుగుతారని అనుకున్నాం. కాని అది ఆయన 'టార్గెట్' కాదు. ఉద్యమంలో ఉన్న అగ్రవర్ణ నాయకుల మీది అక్కసునంతా 'సబ్బండ వర్ణాలు' చేస్తున్న ప్రజా ఉద్యమం మీద వెళ్లగక్కారు. అసలు ఇంకో 20 ఏళ్ల దాకా ప్రత్యేక తెలంగాణ వద్దు అనడం ద్వారా ఉద్యమంతో మమేకమైన సమస్త బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించారు.

ఇక కొండా లక్ష్మణ్ చరిత్ర తెలుసుకోకుండా చెముకుల సుధాకర్ తదితరులు అవాకులు, చెవాకులు (అక్టోబర్ 22) రాశారు. 97 ఏళ్ల వయసులో బాపూజీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని 'వయసు'రీత్యా కోరుకోవడం లేదు. బాపూజీని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించేవాళ్లు ఆయన భుజాన్ని ఆసరాగా తీసుకొని తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడికి ఆయన్ని పావుగా వాడుకుంటున్నారు. ఇది ఒక బీసీని కూరలో కరివేపాకులా వాడుకునేందుకు వేసిన ఎత్తుగడగానే భావించాలి. సుధాకర్ ఆయన మిత్ర బృందం సీఎం పదవిని మందకృష్ణ, గద్దర్‌కు ఇవ్వాలని రాశారు.

వాళ్లు ఆ పదవికి అర్హులే కానీ ఆ పదవి ముందుగా బీసీలకు దక్కడమే న్యాయం. ఈ పంచాయితీ తెలంగాణ వచ్చాక తేల్చుకోవచ్చని ఇన్ని రోజులూ తెలంగాణ బీసీలుగా భావించాము. అయితే బీసీలకు నాయకత్వం లేదు, వారికి చేత కాదు అని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి జవాబివ్వక తప్పని పరిస్థితిని కల్పించారు. 97 ఏళ్ల పెద్దమనిషి నిరాహార దీక్షచేస్తానంటే వద్దు నీ బదులు మేం చేస్తాం అని చెప్పాల్సిన ఉద్యమకారులు బాపూజీ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకప్పుడు కెసిఆర్ బదులు తాను నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన మందకృష్ణ ఇవాళ కొండా బదులు తానెందుకు చేయలేదో జవాబివ్వాలి.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పదవి బీసీలకు మాత్రమే దక్కాలి. అది కూడా వరుసగా మూడు టర్మ్‌లకు రిజర్వు (15 ఏళ్లకు) చెయ్యాలి. ఎందుకంటే సామాజిక న్యాయంలో పూర్తిగా అన్యాయానికి గురైంది బీసీలు. చరిత్రలో గాంధీ చరఖా పట్టుకొని బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి బ్రాహ్మణ వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టారు. అలాగే మా ముందు తరాలవారు అంబేద్కర్‌ని అనుసరించకపోవడం వల్ల చాలా నష్టపోయాం.

ఇవాళ ప్రపంచీకరణ వల్ల కూడా అత్యధికంగా నష్టపోయింది బీసీలే. వృత్తులు, ఉపాధి కోల్పోయి, నిత్యం ఆకలిచావులతో అల్లాడుతున్న బీసీలకు ప్రభుత్వం భూమిని పంచివ్వాలి. భూమితోనే బతుకు అని తేలిపోయింది. దోపిడీ, పీడనకు ఇక సెలవు. మేము ఆత్మగౌరవంతో బతుకుతాం అని బీసీలు నినదిస్తున్నారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారిపైనే ఖర్చయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. బీసీలకు రిజర్వుడు నియోజకవర్గాలు లేకపోవడం వల్ల 54 శాతం జనాభా ఉన్నా ఇప్పటి వరకు 10 శాతం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు.

రాష్ట్రంలో మొత్తం 120 బీసీ కులాల్లో ఇంత వరకు 102 కులాల వాళ్లు చట్ట సభల్లో అడుగు పెట్టలేదు. 294 రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు న్యాయంగా 160 సీట్లు దక్కాలి. కానీ 59 మందే బీసీలున్నారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న సమాజానికి ఇంత వరకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అయితే ఇంత వరకూ తెలంగాణ నుంచి ఒక్క బీసీ కూడా కేంద్రంలో క్యాబినెట్ మంత్రి కాలేక పోయారు. ఇప్పటి ఉపముఖ్యమంత్రితో పాటు దళితులు ఇప్పటిదాకా ఎన్ని పదవులు పొందారో బేరీజు వేసుకుంటే పరిస్థితి అర్థమవుతుంది.

కాబట్టి ముందుగా భౌగోళిక తెలంగాణ వచ్చి తీరాల్సిందే. భౌగోళిక తెలంగాణలో 'సామాజిక న్యాయం' కోసం అణచివేతకు, పీడనకు గురైన బీసీ, దళిత, మైనారిటీ వర్గాలు సమిష్టిగా కొట్లాడాల్సిందే. 'బహుజన తెలంగాణ'లో వనరులన్నీ జనాభా దామాషా ప్రకారం అట్టడుగున ఉన్నవారికి మొట్టమొదట పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే.

- సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్
ఫోరమ్ ఫర్ కన్సర్న్‌డ్ బీసీస్   Andhra Jyothi News Paper Dated 17/11/2011

No comments:

Post a Comment