Thursday, November 24, 2011

జీవితమే ఒక పండుగ కావాలమ్మా! - కిషన్ జీ



ప్రియమైన అమ్మా, వందనాలు!
అమ్మా! ఎట్లా ఉన్నావే? చాలా కాలమైంది, నిన్ను పలకరించి. జనవరిలో మేం రాసిన ఉత్తరం 'ఆంధ్రజ్యోతి' పత్రికలో చూసే ఉంటావు. మరోసారి నిన్ను ఉత్తరం ద్వారా నైనా పలకరించాలని నీ ఆలోచనల్లో భాగం కావాలని ఈ సారి మళ్ళా రాస్తున్నా. పండుగ పబ్బాలలో నీ కన్నీళ్ళు తుడవాలని, నీవంటి కోట్లాది మంది తల్లుల కన్నీళ్ళు తుడవాలనీ, పండుగ-పబ్బాలు ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు శాంతియుతంగా జరుపుకోవాలనీ మా ఆకాంక్ష. మా ఆకాంక్ష పాలక వర్గాలు తీరనివ్వనందున ప్రజా ఉద్యమాలే మార్గం అని చెప్పడానికే మా ఈ లేఖ రాస్తున్నామమ్మా! 

అమ్మా! ఈ రోజు ఈద్ పండుగనే!
మన వాడకట్టుకంతా ముస్లింలే కదనే. ఇప్పుడు ఎవరు ఎట్లా ఉన్నారని అడగడానికి ధైర్యం చాలడం లేదు. ఎందుకంటావా? వీధిలో ఉన్నవారిలో ఆనాడే ఒకటి రెండు సంపన్న కుటుంబాలు తప్ప మిగిలిన వారంతా కడు పేదలు. బీడీలు చేసి లేదా రిక్షా తొక్కి ఒక పూట కడుపు నింపుకునే ప్రయత్నం చేసిన వారు. చంద్రుడు, రాజశేఖరుడు ప్రపంచ బ్యాంక్ 'అభివృద్ధి' పథకాలు అమలు జరిపిన చోట పేదల మాట ఎత్తుకోగలమా అమ్మా... 

ఈద్ రోజే పశ్చిమ బెంగాల్‌లో అడవీ ప్రాంత (జంగల్ మహర్) ప్రజలు ఆరంధన్ (అంటే ఉపవాసం ఉండడం. ఆ రోజు ఏ ఇంట్లో పొయిలో పిల్లి లేవదు. వంట- వార్పు ఉండదు. ఆనాదిగా ప్రజలు తమ నిరసనను పాలకులకు తెలిపే ఒక పోరాట రూపం ఇది) జరిపారు. చాలా రోజులుగా ప్రతి రోజు ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఊరేగింపు జరిపి కొన్ని గంటల పాటు పోలీసు క్యాంపులను ఘెరావ్ చేస్తున్నారు. 

ఈ ఊరేగింపులో పాల్గొనే స్త్రీలపై ప్రభుత్వం రాజద్రోహం నేరం మోపి జైళ్ళలోకి పంపుతున్నది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈద్ రోజు ( ఈద్ సందర్భంగా ముస్లిం మహిళలకు ఆందోళనకు పిలుపు ఇవ్వలేదు) ఏ ఇంట్లో వంట చేయలేదు. కనీసం 300పైగా గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అందుకే మేం ప్రజలలో పండుగ పబ్బాలు శాంతియుతంగా జరుపుకోవడానికి పోరాటం తప్పనిసరి అని ప్రచారం చేస్తున్నామమ్మా. అమ్మా! ఈ రోజు మా పార్టీ జన్మదినం. 

దేశమంతా పోరాట ప్రాంతాలలో ప్రజలకు సభలు, సమావేశాలు జరపమని రాబోయే రాజ్య నిర్బంధాన్ని తిప్పికొట్టే అన్ని ప్రయత్నాలు చేయాలని కోరాం. అమెరికా సిద్ధం చేసిన అణచివేత పథకాన్ని చేతబూని చిదంబరం మాపై జరుపబోయే పెద్ద దాడిని ఎదుర్కొమ్మని ప్రజలకు పిలుపు ఇచ్చాం. ఈ రోజటి సంఘటన ఒకటి నీకు చెప్తానే అమ్మా. వామ పక్ష ఫ్రంట్ బెంగాల్‌లో 33 ఏళ్ళుగా అధికారంలో ఉన్నది. నేతిబీర కాయలో నెయ్యి ఎంతో వీళ్ళ అధికారంలో ప్రజాస్వామ్యం అంతే ఉంటుంది. వీరి మార్క్సిజం అంటే సామ్రాజ్యవాద ఊడిగవాదం. పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం పాలన ఎట్లా ఉందో, అక్కడ మాకూ వారికీ పోరాటం ఎందుకు జరుగుతున్నదో తెలుపడానికి కొన్ని ఉదంతాలు వివరిస్తాను. 

మదనపూర్ నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇనాయిత్ పూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో కోటి రూపాయలతో ఆఫీసు కట్టారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్కడ దాదాపు నాలుగు వందల మంది సాయుధ సిపిఎం సేనలు ఉన్నాయి. వీళ్ళంతా ఒక ఏడాది కిందట లాల్‌గఢ్ గ్రామాలలో ఉన్న హర్మర్ (బెంగాల్ సిపిఎం సేనకు ప్రజలు, పత్రికలు పెట్టిన పేరు) నాయకులు. ప్రజా ఆందోళన ఫలితంగా 12 సాయుధ సిపిఎం క్యాంపులలో వీరు ఉంటున్నారు. వీళ్ళంతా సాయుధులే. ఇందులో ఒకటి ఇనాయిత్‌పూర్ క్యాంపు. మధ్యాహ్నం పూజ కోసం సరుకులు కొనడానికి సోమేశ్వరి బిశ్రా, దులాలీ బిశ్రాలు బజారుకు వెళుతున్నారు. 

వీళ్ళు పొలాషిమా గ్రామ గృహిణులు. సిపిఎం సేన వీళ్ళపై కాల్పులు జరిపింది. వీళ్ళిప్పుడు కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త విన్న చుట్టు పక్కల గ్రామాలలోని దాదాపు ఎనిమిది వేల మంది ప్రజలు సిపిఎం వారి ఇనాయిత్‌పూర్ ఆఫీసును ముట్టడించారు. దూరం నుంచే ప్రజల రాక గమనించిన సిపిఎం సాయుధ సేన కాల్పులు ప్రారంభించింది. దగ్గరలోనే ఉన్న మా పిజిఎల్ఎ బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రజలను ముందు సురక్షిత స్థానాలలోకి పంపించాయి. 

అదనపుసేనలు రాకుండా అడ్డుకోవడానికి బారికేడ్లు నిర్మించేందుకు వేయిమందిని తరలించాయి. ప్రజా గెరిల్లా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇటువంటి ఘర్షణలలో సిపిఎం ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, తమ నష్టాన్ని తక్కువ చేసి చూపడం వారికి అలవాటు. ఈ ఘటనకు ముందు ఈ నెల 15వ తేదీన మరో కాల్పుల ఉదంతం కూడా జరిగింది. ఇనాయిత్‌పూర్ క్యాంపునకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో షావుగా అనే గ్రామంలో సిపిఎం వారిది మరో సాయుధ క్యాంపు ఉంది. ఈ క్యాంపు వారికి మా ప్రజా సైనికులకు మధ్య శలబనీ- మిడనపూర్ బ్లాకు సరిహద్దులో మూడు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. 

అమ్మా! ఇక్కడ పిల్లలకు చదువుకోవడమూ కష్టమే!
ఇక్కడ నీకు మరో విషయం చెప్పాలి. బెంగాల్ గ్రామాలలో దాదాపుగా ప్రతి పాఠశాల ముఖ ద్వారం గోడలపై ఇలా రాసి ఉంటుంది. 'శిక్కా అనే చేతన్; చేతన్ అనే బిప్లన్, బిప్లవ్ అనే పరివర్తన్'. అంటే చదువు చైతన్యాన్ని తెస్తుంది. చైతన్యం విప్లవాన్ని తెస్తుంది; విప్లవం పరివర్తనను తెస్తుంది. అమ్మలారా! ఇది వాస్తవం అని ఎవరన్నా భావిస్తే పప్పులో కాలు వేసినట్టే. ఇక్కడ టీచర్లలో అనేకులు సిపిఎం సభ్యులు, నాయకులు. బడి-గుడి -బజారు-పోలీసు ఠాణా ఎక్కడైనా అంతా ఒకటే వారికి. 

ఇలాంటి వారు బడిలో ఏం చేస్తారో ఊహించండి. జూన్ 18వ తేదీన కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త అభియాన్ ప్రారంభానికి ముందే- ఐదవ తేదీ నాటికే, ఖరగ్‌పూర్ నుంచి బిన్‌పూర్ వరకు 30-40 పాఠశాలల హెడ్‌మాస్టర్‌లకు, విద్యా శాఖ అధికారులకు ప్రభుత్వం నోటీసులు పంపింది. పాఠశాలలను 15 రోజుల పాటు పోలీసులకు అప్పగించాలని ఈ నోటీసులలో ఉంది. సుమారు 30 పాఠశాలల్లో జూన్ 19 నుంచి ఇంకా పోలీసులే పాఠశాలల్లో మకాం వేశారు. హోం కార్యదర్శి అర్ధేందూ సేన్ ప్రతి నాలుగైదు రోజులకు ఒక సారి ప్రకటన ఇస్తూ - మరో వారం రోజుల్లో ఖాళీ చేస్తామంటారు. ఇప్పటికీ ఖాళీ చేయలేదు. 

జూలై 10వ తేదీన బిన్‌పూర్ అనే బ్లాక్ హెడ్ క్వార్టర్‌లో ఉన్న హైస్కూల్ పిల్లలంతా క్యాంపు (పాఠశాల)కు తాళం పెట్టాలని ఘోరావ్ చేశారు. మేం చదువు కోవాలి. మా స్కూల్ ఖాళీ చేయండి అని అడిగారు. పాఠశాల ఖాళీ చేయమని అడగడమే పిల్లలు చేసిన పాపం. అదనపు బలగాలు వచ్చాయి. లాఠీలు విరిగాయి. బాష్ప వాయువు గోళాలు పగిలాయి. ఇదీ బుద్ధబాబుల విప్లవ చైతన్యం. 

అమ్మా, ఈ పిల్లల గొంతుల్లో నుంచి వెలువడ్డ నినాదాలతో అడవి అంతా ప్రతి ధ్వనించిందే. మొత్తం జంగన్ మహల్ ఆందోళనే మరో రూపంలోకి మారిందే. ఈ పాఠశాలల్లోని పిల్లలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు... 'బుద్ధ బాబూ- శిక్క అనే చేతనా.. చేతనా అనే బిప్లక్.. బిప్లక్ అనే పవరివర్తన్- అందుకే మేం చదువుకుంటే విప్లవకారులం.. అవుతామని జంగల్ మహల్ స్కూళ్లలో పోలీసులను దింపావా?' అని అడుగుతున్నారు. 'చిదంబరం బాబూ- మా సర్వశిక్కా అభియాన్ అంటే ఇదేనా? మీ పిల్లలకు డూన్ స్కూళ్లు. మేం చెట్టుకింద చదువుతామన్నా మా చేతులు విరగ్గొటించావ్... సంయుక్త సేనల పంపుతావా? ఇదేం నీతి?' అని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఇదమ్మా... ఇక్కడి పరిస్థితి. దినమంతా వీళ్ళ ప్రశ్నలే మనుసులో మెదులుతున్నాయే. 

దసరా దగ్గరకు వచ్చిందే అమ్మా!
మునుపటి వేడుకలు గ్రామాల్లో లేకున్నా, ప్రజలకు వారి విశ్వాసాలు ఉంటాయి కదనే... మేం ఎప్పుడూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తామే. అయితే అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా చైతన్యం తెచ్చే కృషి నిరంతరం అమలు జరుపుతామే. దసరా వేడుకలు దేశమంతా ఉన్నా బెంగాలీల ప్రత్యేకత జగమెరిగినదే. ఆదివాసీ ప్రాంతాల్లోని గైర్ అదివాసులు ఈ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుతారు. ఇప్పుడు పండుగకు ఇంటికి వచ్చే వాళ్లనంతా అరెస్టు చేయడం నిత్యకృత్యంగా మారింది. వామ పక్ష ఫ్రంట్, మమత నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయి సంయుక్త బలగాలను పేద ప్రజలపైకి పంపాయి. 

అమ్మా! మమతమ్మ గురించి ఒక్క మాట!
ఓ మాట మమతమ్మ రైల్వేమంత్రి గురించి చెప్పకుంటే ఈ లేఖ అసంపూర్ణమే అవుతుందే. సింగూర్-నందిగ్రామ్‌ల పోరాటం ఆమెకు సౌభాగ్యాన్ని తెచ్చాయే. కాని ఈ సౌభాగ్యాన్ని ఇచ్చిన ప్రజలు ముఖ్యంగా మహిళల నుదిటి బొట్టు చెరపడం అపుడే ప్రారంభమైపోయిందే అమ్మా... సింగూరు భూమి వెనక్కు రానేలేదు. నందిగ్రామ్‌లో కెమికల్ హబ్ తాత్కాలికంగా నిలిచినా పక్కన నమాచార్‌లో ఈ హబ్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాగితంపై అధికారికంగా చేయాల్సిందంతా చేశాయి. 

ఈ సమయంలో కలకత్తాలో రాజార్‌హట్ అనే ప్రాంతంలో పెద్ద ఉపమహానగ రం నిర్మాణం కోసం భూముల కుంభకోణం నడిచింది. సిపిఎం-తృణమూల్ కాంగ్రెస్-ప్రభుత్వ బ్యాంకులు కలిసికట్టుగా జరిపిన లావాదేవీలు, నిర్ధాక్షిణ్య హత్యలు ఇప్పుడు బెంగాల్ ప్రజలలో నిత్య చర్చగా మారాయి. ఈ వివాదంలో 60మంది రైతులు మరణించారు. 120 మందికి పైగా రైతులు అదృశ్యం అయ్యారు. 

రాజార్‌హట్ రణరంగంగా మారింది. సెజ్‌ల కోసం ఇప్పుడు వంద శాతం భూ స్వాధీన విధానం ముందుకు వచ్చింది. ఈ పాలసీనే రాజార్‌హట్‌లో అమలు జరిగింది. మేకల తినే వాడి చోట ఎనుగుల తినేవాడు వచ్చిన ఉదంతంగా మారింది పరిస్థితి. మమత రోజుకో రైలుకు పచ్చజెండా చూపుతున్నారు. నిన్న-నేడు ఇఫ్తార్ విందులు, రిజ్వాయన్ తల్లితో సమావేశాలు జరుపుతూ ఓట్ల గారడీ నడుపుతున్నారు. ఇప్పు డు కేంద్రంలో కాంగ్రెస్ కుడిచేత్తో మమత పార్టీని-ఎడం చేత్తో 'వామ'పక్షాలను పట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నది. 

అందుకే అమ్మా... పోరాటం ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగులను అందిస్తుంది. పండుగలు పబ్బాలలోనే కాదు నిత్యజీవితంలోనూ తిండి-ఇల్లు-బట్ట-ప్రజాస్వామ్య హక్కులను అందిస్తుంది. ఈ హక్కుల సాధన కోసమే జనం పోరుబాటలో ఉన్నారు. అమ్మా... నీవంటి అమ్మలందరికీ ...కోటి... కోటి వందనాలే 

కోటీ...వేణులే కాదు కోట్లాది పిల్లల ఆకాంక్షలతో... ప్రేమతో...
- కిషన్ జీ 

(మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ తన తల్లి మధురమ్మను ఉద్దేశించి రాసిన ఈ లేఖను ఆంధ్రజ్యోతి (సెప్టెంబర్ 27, 2009) నాడు ప్రచురించింది. గురువారం నాడు కిషన్‌జీ ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంలో పాఠకుల కోసం మళ్ళీ ఒకసారి ఈ లేఖను ముద్రిస్తున్నాం) Andhra Jyothi News Paper Dated 25/11/2011

No comments:

Post a Comment