Sunday, September 8, 2013

సరోజినీ..మఖ్దూం..గద్దర్.. - సామిడి జగన్‌రెడ్డి

September 02, 2013అణగారిన వర్గాల అశ్రుకణాల లిప్త గద్దర్ కవిత. అది పాటగా మారినప్పుడు పాక్ సూఫీ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్‌ను, అదే ధిక్కారంగా మారినప్పుడు అణచివేతపై దట్టించిన అక్షరంగా ఒక ఫైజ్ అహ్మద్ ఫైజ్‌ను తలపిస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టి హంతక ముఠాల తూటాను మోస్తున్న మహా రచయిత గద్దర్. అణచివేత ఎక్కడయితే ఉన్నదో అక్కడ ఆయన పాదం కదం తొక్కుతుంది.. పదముద్రలూ, పాదముద్రలూ కలగలిసిన విప్లవ, తాత్విక కళా వ్యక్తిత్వం గద్దర్‌ది. ఇదే నగరాన మహాకవి మఖ్దూంతో ప్రారంభమైన విప్లవ కవితా సంప్రదాయం చెరబండరాజు, గద్దర్‌తో ఒక విశిష్టమైన చారిత్రికతను సంతరించుకున్నది.

పొడుస్తున్న పొద్దు మీద.. నడుస్తున్న కాలమా.. కోట్లాది ప్రాణమా.. పోరు తెలంగాణమా.. అనే పాట ఎక్కడంటే అక్కడ మారుమ్రోగింది. కొన్నాళ్లపాటు దానికదే ఒక సంచలనం. ఆ పాటను పాడింది గద్దర్, దానిపై ఆడిందీ అతనే. 'తెలంగాణమా.. పరమాత్ముని రూపమా' అనే మరో చరణం కూడా ఆ పాటలోనిదే. ఒక ఆశ్చర్యకరమైన అభివ్యక్తి అది. తెలంగాణను ఒక డివైన్ లాండ్‌గా భావిస్తూ విప్లవ రచయిత రాయడం ఒక అపురూపమైన విషయం. ఎర్రెర్రని తెలంగాణ అని చెరబండరాజు కూడా ఆయన కంటే ముందే వ్యాఖ్యానించడం కూడా ఉన్నది. ఇంతేకాదు, ఇక్కడే పుట్టిన మరో మహాకవి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయనే షాయర్-ఏ-ఇంక్విలాబ్ మఖ్దూం మొహియుద్దీన్ సాబ్. సాయుధ పోరాట కాలంలో తెలంగాణను ప్రపంచానికే పైగంబర్‌గా కొనియాడుతూ భాషించిన కవి ఆయన. హైదరాబాద్ సహా తెలంగాణ ఆయనను కూడా ఫరిస్తా (దైవదూత)గా, పైగంబర్ (ప్రవక్త)గా భావించిన కాలమది.

మానవాళి కష్టకాలంలో ఉంటే పరమాత్ముడైన అల్లామియా వారిని ఆదుకోవడానికి తన దూతను పంపిస్తాడని ముస్లింల విశ్వాసం. పోలీస్ యాక్షన్ దరిమిలా తెలంగాణ సమాజం కోలుకోవడానికి ఎంతో ఇమ్మతి నిచ్చిన మహామానవుడు మఖ్దూం సాబ్. వీరిద్దరితోపాటు దాశరథి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నా 1969లో తిరుగుబాటు దరిమిలా శ్రీశ్రీ, కరుణశ్రీ వంటివారు తెలంగాణ విడిపోతే మరో పాకిస్తాన్ అవుతుందని వ్యాఖ్యలు చేసినప్పుడు నాది వేరు తెలంగాణ కాదు 'వీర తెలంగాణము' అని సినారె అన్నా ఈ మహాకవులు చేసిన ఈ వ్యాఖ్యలకు గొప్ప చారిత్రిక నేపథ్యం ఉన్నదనే చెప్పుకోవాలి. ఏమైనా ఈ వ్యాఖ్యలు విన్నప్పుడు మరో ప్రపంచపు కల కంటూ అమరుడైన తెలంగాణ బిడ్డ ఆత్మ అట్లా పలికించిందేమోనని అనిపిస్తుంది. జాతికే గర్వకారణమైన కవులు వీరు. అయితే మఖ్దూమైనా, గద్దరైనా ఇద్దరు విప్లవ కళా సంప్రదాయానికి చెందినవారే. కనుక వీరి సూత్రీకరణకు మరింత ప్రాముఖ్యమున్నదని భావించాలి. గద్దర్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, విప్లవ కళా తాత్వికుడు చేసిన సూత్రీకరణ కనుక దానికి చాలా ప్రాముఖ్యముందని భావించాలి. మఖ్దూమైనా, గద్దరైనా హైదరాబాద్ నగరపు జనజీవితాన్ని గానం చేసినవాళ్లే. మఖ్దూం, చెరబండరాజు, గద్దర్ -వీరి వ్యాఖ్యలకు నేపథ్యం కూడా ఆయా కాలాలలో రాజుకున్న తెలంగాణ ప్రజాపోరాటాలు. ఇది యాదృచ్ఛికం కానేకాదు.

వారి వ్యక్తిత్వం తెలంగాణకు చెందిన ఉన్నతమైన సాహిత్య, కళా చరిత్ర సంప్రదాయ విలువలతో రూపుదిద్దుకున్నది కనుక ఆ వ్యాఖ్యలు చేయగలిగారు. ఈ నేపథ్యంలో, ప్రధానంగా వర్తమానం తెలంగాణ సాంస్కృతిక పునర్జీవన కాలమైనందున ఈ విప్లవ కవుల వ్యక్తిత్వాలలో గల సారూప్యతను, సామ్యాలను అన్వేషించడం నా రచన లక్ష్యం.

తెలంగాణ సాహిత్య సంప్రదాయమంటే కేవలం తెలుగు సంప్రదాయంగా చూడడం సరైంది కానేకాదు. తెలుగు ఉర్దూ, ఇంగ్లీషు, పర్షియన్, ఆదివాసి, లిఖిత, అలిఖిత భాషా సంప్రదాయాలు కూడా. వీటిలో దేనిని పరిగణనలోకి తీసుకోకున్నా ఆ మేరకు స్థానిక సాంస్కృతిక రంగానికి లోటే. ఈ నేపథ్యం లో మఖ్దూం, గద్దర్ చేసిన ఆ సూత్రీకరణకు చారిత్రిక పునాది ఉన్నది. తమ చుట్టూ గడ్డుకాలం ఆవరించినప్పుడు తెలంగాణ యువతరం దాన్ని మార్చడానికి ఉద్యమించిన సందర్భాలు భిన్న కాలాలలో ఉన్నాయి. ఆ పరంపర బుద్ధుని కాలం నుంచే ఉన్నది. ఇదే తెలంగాణ నుంచి రెండు వేల సంవత్సరాల క్రితమే సత్యాన్ని అన్వేషిస్తూ బౌద్ధులైన బావరి, పింగియ వంటి తెలంగాణ యువకులు 89 మంది బుద్ధుని సమక్షానికి కాలినడకను వెళ్లారు. గయకు చేసిన పయనమది. ఆయనను కలిసి ఆయనిచ్చిన సందేశాన్ని, ఆ మహానీయుని చిత్రాన్ని తీసుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ కొత్త సచ్చిదానందమూర్తి రాశారు. ఉత్తరాది ఆర్యావర్తం నుంచి దక్షిణాపథానికి ఎవరు రావాలన్నా వారు విం« ద్య పర్వతాలను దాటి తెలంగాణలోకి రావల్సిందే. ఈ ప్రాముఖ్యత వల్లే తెలంగాణ ప్రభా వం ఉత్తరాది మీద, అక్కడ ప్రభావం తెలంగాణ మీద పడుతూ వచ్చింది. ఇక్కడి వాళ్లు అక్కడికి అక్కడి వాళ్లు ఇక్కడికి రావడమనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది.

గత శతాబ్ది ఆదిగా ప్రధానంగా రెండు ప్రపంచ యుద్ధాల మధ్య రూపుదిద్దుకున్న తెలంగాణ ప్రగతిశీల కవితా సంప్రదాయంలో అంజద్ హైదరాబాది వంటి సూఫీ కవి, కాళోజీ, దాశరథి, సినారె వంటి ఉదారవాదులను మినహాయిస్తే విప్లవ స్రవంతికి మొదటి పార్శ్వం తెలంగాణ దక్కనీ కవులు, ఉర్దూ ప్రగతిశీల కవులు, మఖ్దూం లయితే, రెండవ పార్శ్వం చెరబండరాజు, గద్దరే. వీరి తాత్విక దృక్పథం మార్క్సిజమే. ఈ ముగ్గు రు ప్రజా పోరాటాలలో పాల్గొని జైలు పాలైన వాళ్లే. ఇప్టా, ప్రగతిశీల లేఖక్ సంఘ్ స్థాపనలో మఖ్దూం పొల్గొంటే గద్దర్ జననాట్యమండలి, అఖిల భారత విప్లవ సాంస్కృతిక మండలి స్థాపనలో పాల్గొన్నారు. ఇద్దరిది ఒకే జిల్లా కూడ. అది మెదక్ జిల్లా. వారు పుట్టి పెరిగిన గ్రామాలకు మధ్యదూరం దాదాపు 40 కి.మీ. కూడ ఉండదు. మఖ్దూం పుట్టిన గ్రామం ఆందోల్ గ్రామానికి సమీప పల్లె. దాని పేరు మఖ్దూం గూడ.

అనాధ బాలుడైన మఖ్దూం చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు పడి స్వయం కృషితో తన జీవితాన్ని రూపుదిద్దుకున్నవారు. గద్దరు కూడ అంతే. రచన, సంగీత, నాటక కళ, విప్లవ తాత్విక కళా రంగంలో ఏది సాధించినా ఆయన సొంత కష్టం వల్లే. ఇద్దరికి సామాజిక అణచివేత పట్ల వ్యతిరేకత అనేది చిన్నప్పటి నుంచే ఉంది. మఖ్దూం మీద జాతీయోద్యమం, టాగూర్, సరోజినీ నాయుడు ప్రభావం ఉంటే, గద్దర్ మీద అంబేద్కర్, దళిత ఉద్యమాల ప్రభావమే కాక, విప్లవ కళా రాజకీయ రంగానికి అధినాయకుడు కొండపల్లి సీతారామయ్య, చెరబండరాజు, శివసాగర్ రచనల ప్రభావం ఉన్నది. మఖ్దూం 1968లో అర్ధాంతరంగా కాలం చేశాడు. దాదాపు అప్పుడే గద్దర్ తెలంగాణ సాంస్కృతిక రంగంలోకి ప్రవేశించాడు.

అది 1970. దిగంబర కవుల తిరుగుబాటు సద్దుమణిగి, విప్లవ కవితా వీచిక తెలుగు దేశాన్ని ముంచెత్తుతున్న కాలమది. గద్దర్ ఈ భావవీచికకు అతీతమేమీ కాదు. నిజానికి అల్వాల్ కేంద్రంగా ఆర్ట్ లవర్స్ మొదలు కాకముందే బి. నర్సింగరావు, గద్దర్, ముత్యాలు, మల్లారెడ్డి ఇంకా కొంతమంది స్థానిక యువకులు ఆనాటి రోజులలో ఇక్కడి స్థానిక గ్రామాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇస్తుండేవారు. బోయిన్‌పల్లి తన అత్తగారిల్లయినందువల్ల చెరబండరాజు అక్కడి కెళ్లడంతో, అక్కడ ఈ యువకులు ఆయన పరిచయంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కొండపల్లి, చెరబండరాజుల ప్రభావంతో బి.నర్సింగరావు పూనికతో ఆర్ట్ లవర్స్ సంస్థ రంగం మీదికి వచ్చింది. ఇందుకు నేపథ్యం నక్సల్బరీ, శ్రీకాకుళం రాజకీయాలు. గద్దర్ రచనకు, కళారూపాలకు భూమిక విప్లవ సంప్రదాయానికి చెందిన నక్సల్బరి రాజకీయాలైతే, మఖ్దూం రచనకు, నాటకాలకు ప్రేరణ తెలంగాణ సాయుధ పోరాటం. ఇద్దరిదీ మార్క్సిస్టు చూపే. అందువల్లే ఇద్దరిలో భావజాల సామీప్యతే గాక రచనా సారూప్యత కూడా ఏర్పడింది.

అయితే ఇది మఖ్దూంను గద్దర్ అనుసరించడం గానీ, ప్రభావం కానీ కానే కాదు. ఉర్దూ రాని పాఠకులకు మఖ్దూం రచనలు చదివే అవకాశం ఇటీవల వరకు లేదు. కనీసం గద్దర్ ఆ పాటలను పూర్తి స్థాయిలో విన్నాడని చెప్పలేం. ఇంతేకాకుండా ఈ ఇద్దరు మహాకవుల రచనకు కేంద్రం హైదరాబాద్ నగర జీవితమే. ఇందుకు తమకు తెలివి వచ్చిన నాటి నుంచి ఈ నగరంలో ఉండవల్సి రావడం కారణం కావచ్చు. అయితే ఇద్దరూ తెలంగాణ గ్రామీణ కష్టజీవుల గురించి, తెలంగాణ మీద గొప్పగా రాసిన వాళ్లే. ఇద్దరి మీద హైదరాబాద్‌లోని దక్కనీ సంస్కృతి ప్రభావం అపారంగా ఉన్నది. మఖ్దూం, గద్దర్ ఎంతటి హైదరాబాద్ ప్రేమికులో అంతగా తెలంగాణ ప్రేమికులు. తెలంగాణను కీర్తిస్తూ ఇద్దరి రచనకు శతాబ్దాలు గా ఈ నగరంలో పరిఢవిల్లిన సెక్యులర్ విలువలే ఆలంబన.

అయితే హైదరాబాద్ నగరంలోని సాధారణ మనుషుల నుంచి ఉన్నత వర్గాల వరకు వారి జీవిత ఔన్నత్యాన్ని చిత్రించిన మొదటి మహాకవి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు మొహరం గురించి రాస్తే, 'ఇదేనండి, ఇదేనండి భిన్న సంస్కృతులకు పూచిన పాదు - మన హైదరాబాదు' వంటి పాట మహాకవి సినారె రాశారు. రెండుపాటలలో మఖ్దూం ఈ నగరపు జీవితపు దైన్యాన్ని చిత్రీకరంచారు. దిగంబరకవి నిఖిలేశ్వర్ మన జంట నగరాల మీద రెండు మహానగరాలు పేరుతో కవిత వెలవరించారు. ఉర్దూ విప్లవ సంప్రదాయానికి చెందిన దకనీ కవులు అవామీ షాయర్ సర్వర్ దండా, గిల్లీ నల్గొండవీ, సులేమాన్ ఆరిబ్, సులేమాన్ ఖాతిబ్, అన్‌పడ్ బోనగిరి, పాగల్ ఆదిలాబాది, నరేంద ర్ రాయ్ వంటి కవులు అనేక మంది ఉన్నారు. కాగా బోనాల పండుగ సందర్భం గా మారు మ్రోగే అమ్మ బయలెల్లినాదే, కోడిబాయె లచ్చమ్మది అనే పాట నిజామాబాదుకు చెంది, బొం బాయి బాలివుడ్‌లో పనిచేసిన 'ఇప్టా' వ్యవస్థాపక సభ్యుడు ఎల్ల య్యవి. ఆయన బాలివుడ్‌లో మోహ న్ సెహగల్‌గా ప్రసిద్ధుడు. ఇతను మఖ్దూం సన్నిహిత మిత్రు డు కూడా. నాగార్జునసాగర్, శ్రీరాం సాగర్‌ల నిర్మాణం నేపథ్యంలో తెలంగాణను, ప్రధానంగా పాలమూర్ లేబర్‌ను దృష్టిలో పెట్టుకుని చెరబండరాజు రాసిన పాట కొండలు పగిలేసినం. ఎకానమీ నేపథ్యంలో కష్టజీవుల జీవితాన్ని విప్లవీకరించిన పాట ఇది.

ఈ పరంపర నేపథ్యంలో ఈ మహాకవులు ప్రవచించిన విప్లవ విలువల పూర్వరంగంలో వీటిని తనలో ఇముడ్చుకుని వారికంటే మరింత మౌలికంగా కేవలం ఈ మహానగరపు కష్ట జీవులకు పట్టం కడుతూ విస్తృతంగా రచన చేసిన మహాకవి గద్దర్. అయితే విప్లవ సాంస్కృతిక విలువల నేపథ్యంలో గద్దర్ లష్కర్ బోనాల పండుగను, హోలి పండుగను విప్లవీకరించిన తీరు విలక్షణమైనది. బోనా ల పాటలోని పాత్ర బాలమణిని శాశ్వతీకరించారు. ప్రజా సంప్రదాయాన్ని విప్లవీకరించడమన్నది గద్దర్‌తోనే మొదలు.

సరోజినీ దేవి, మఖ్దూంలతో ప్రారంభమైన ఈ పరంపరకు అచ్చమైన వారసుడు గద్దర్. అయితే కేవలం ఈ మహాపట్నంలోని మామూలు మనుషుల గురించి వ్యవస్థ చేతిలో బందీలై దారీతెన్నూ లేని వారి బతుకును, జీవితాలను భిన్న, భిన్న కోణాలను చిత్రించింది మాత్రం గద్దరే. ఇంతేకాదు ఈ నగర కష్టజీవుల గురించి విస్తృతంగా రాసిన వ్యక్తి ఆయనే. గద్దర్ రాసిన ప్రసిద్ధపాట 'నాసా కింద మీసా కింద నిను జైల్లో పెట్టినారు', లచ్చుమమ్మో లచ్చుమమ్మో, కల్లుముంతో మాయమ్మో, కంపెనీ కూలోడా, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, సలామున్నలై అనే రచనలు ఈ నగరంలోని సామాన్యుని జీవన ప్రస్థానానికి దాఖలాగా నిలుస్తాయి. తెలంగాణ పేరుతో తెలంగాణ మహిళ ఔన్నత్యాన్ని ఎంతగానో కీర్తించి, గౌరవించిన మహాకవి మఖ్దూం. గద్దర్ కూడా అంతే. ఆయన రాసిన లచ్చుమమ్మో, లచ్చుమమ్మో పాట ఎల్లవేళలా కష్టజీవి అయిన తెలంగాణ మహిళ ఆత్మగౌరవానికి ప్రతీక. ఏ గ్రామంలోనైనా తెలంగాణ మహిళ జీవితం అంతే. ఆమె గద్దర్‌కు అమ్మే కాదు. తెలంగాణకు కూడా అమ్మే. అందుకే గద్దర్ రచన తెలంగాణ సాయుధ పోరాట కవిత కంటే కూడా భిన్నమైంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ విమర్శకుడు కేవీఆర్ బాగా గుర్తించాడు.

మఖ్దూమైనా, గద్దరైనా తమ రాజకీయాల ఆచరణలో భాగంగా కవులుగా రూపుదిద్దుకున్నవారే. ఆ మేరకు వారికి పరిమితులు ఏర్పడ్డవి. గద్దర్ తన రచనకు తీసుకున్న ప్రమాణాలు విశిష్టమైనవి. ఈ కోణంలో గద్దర్ హైదరాబాద్ దక్కనీ రివాజుకు అచ్చమైన ప్రతినిధి. ఉర్దూ బాణీలను తీసుకుని గద్దర్ రాసినా, తెలంగాణ గురించి మఖ్దూం రాసినా స్థానిక జీవనరీతుల గురించే. మఖ్దూం రచనకు మార్క్సిజం, లెనినిజం, సూఫిజం తదితర తాత్విక భావనలు పునాదయితే, గద్దర్‌కు మావో ఆలోచనతోపాటు, అంబేద్కర్ దార్శనికత, తెలంగాణ తత్వ కవితా సంప్రదాయం ఆలంబన. ఇంతేకాదు, తొలిసారి వెలువడిన పాటల పుస్తకంలో ఒక పాట ఉన్నది. అది ఖవ్వాల్ ఫక్కీలో రాసింది. ఖవ్వాల్ బాణీలో పాట రాసిన తొలి తెలుగుకవి గద్దర్. అందుకే ఇద్దరి పాటలు ఒక రిక్షా కార్మికున్ని ఎంత అలరిస్తాయో, అంతగా ఉన్నత వర్గాలను అలరిస్తాయి. తెలుగైనా, ఉర్దూ అయినా సాహిత్య కళా సంప్రదాయాలు ఒకటే కావడం చాలా విశిష్టమైన విషయం.

మఖ్దూం రచనా విధానం క్లాసికల్ సంప్రదాయానికి చెందినదే అయినప్పటికీ వస్తువు మాత్రం సరికొత్తది, సామాన్యునిది. ఉర్దూ సంప్రదాయంలో విప్లవాత్మకమైనది. గద్దర్ రచన కూడా అంతే. బాణి, వాణి భాషలో పూర్తిగా విప్లవాత్మకమైనది. అచ్చమైన తెలంగాణ భాషకు, విలువలకు జీవన విధానానికి కన్నీళ్లకు, సుఖ దు:ఖాలకు ఆయన రచన ప్రాతినిథ్యం వహిస్తుంది. పాల్కుర్కి తరువాత అక్షరాల అట్టడుగు మనిషికి పట్టం కట్టిన మహాకవి గద్దర్. మఖ్దూం వలే గద్దర్‌ది బలమైన కళా వ్యక్తిత్వం, మఖ్దూం ఏక కాలంలో రచయిత, గాయకుడు, నటుడు, విప్లవవాది. తెలంగాణకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చిన ఇద్దరు మహాకవులను అందిచ్చినందుకు మెతుకులేని జిల్లాకు తెలంగాణ రుణపడి ఉండాల్సిందే.

No comments:

Post a Comment