Friday, September 27, 2013

భగత్ సింగ్ అధ్యయనశీలత ఆచరణ యోగ్యం By తోట కృష్ణారావు

   Fri, 27 Sep 2013, IST  

అంధ విశ్వాసం మన మెదళ్ళను మొద్దుపరిచి అభివృద్ధి నిరోధకులుగా తయారు చేస్తుంది' అని అంటూ 'విప్లవమనే ఆయుధం ఆధునిక ఆలోచనలతో పదునెక్కుతుంది' అంటాడు. భగత్‌సింగ్‌ భావాలు ఇంత పరిపక్వంగా ఉండటానికి కారణం ఆయన నిరంతరం అధ్యయనశీలిగా ఉండటమే కారణం. రాజరామశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'భగత్‌సింగ్‌ పుస్తకాలను తినేవాడు'. ఉరికంభం వద్దకు తీసుకొని వెళ్ళటానికి జైలు అధికారులు భగత్‌సింగ్‌ ఉండే సెల్‌ వద్దకు వెళ్ళినప్పుడు చివరి క్షణంలో కూడా ఆయన అధ్యయనంలో నిమగమై ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.
'నన్ను ఉరితీసిన తర్వాత నా విప్లవ భావాలు ఈ సుందరమైన మాతృభూమి అంతటా వ్యాపిస్తాయి. బ్రిటీష్‌ సామ్రాజ్య వాదులకు బ్రతికున్న భగత్‌సింగ్‌ కంటే చనిపోయిన భగత్‌ సింగ్‌ మరింత ప్రమాదకారి. మా భావాలు మన యువతను ఆవహిస్తాయి. స్వాతంత్య్రం కోసం, విప్లవం కోసం పరితపించేట్లు చేస్తాయి' అని దృఢమైన విశ్వాసాన్ని భగత్‌సింగ్‌ ఉరిశిక్ష ప్రకటించిన అనంతరం వ్యక్తం చేశాడు.
భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి.
అయితే భగత్‌సింగ్‌లో అనేక మంది విప్లవకారులందరిలో కెల్లా విశిష్టమైన ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆయనో గొప్ప అధ్యయనశీలి, ఆలోచనాపరుడు. అందుకే విప్లవం, సోషలిజం, దేవుడు, మతం, టెర్రరిజం అనే విషయాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వివరించాడు. సెప్టెంబర్‌ 27న భగత్‌సింగ్‌ 107వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన భావాలను ప్రజల ముందుంచడం అవసరం.
సమాజ సేవ, సామాజిక న్యాయం, దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి. దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్దికి, స్వావలంబనకు తద్వారా జాతి నిర్మాణానికి యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అని 'భారత జాతీయ యువజన విధానం' నొక్కి వక్కాణిస్తున్నది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా నేడు జరుగుతున్నది. జాతి నిర్మాణంలో యువత శక్తిసామర్థ్యాలను ప్రభుత్వాలు సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. యువతలో సామాజిక స్పృహను తుంచి హింస, ద్వేషం, ష్యాషన్‌, ప్రేమోన్మాదం, వ్యష్టివాదం, మారక ద్రవ్యాలు వంటి పెడ ధోరణుల వైపు నెడుతోంది. సామాజిక చింతన, దేశభక్తి, నిస్వార్థ సేవ, రాజకీయ చైతన్యం స్థానంలో స్వార్థం, అస్తిత్వవాదం వంటి వాటికి పెద్ద పీటవేసి యువతను పెడదారి పట్టిస్తోంది. ఇంట్లో పిల్లలకు మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉందో, అలాగే ఈ దేశ యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ బాధ్యతను గుర్తెరగకుండా నేడు పాలకవర్గాలు దేశ యువతలో నరనరాన తమ పెట్టుబడిదారీ ప్రపంచీకరణ విధానాలతో నిరాశ, నిస్పృహలను నింపుతున్నాయి. పైగా 'యువత చెడిపోతోంది' అంటూ మన పాలకులు నెపాన్ని ఇతరులపైకి నెట్టివేయాలని చూస్తున్నారు. నేటి యువత ఎంతో తెలివైనది, సృజనాత్మకత ఉన్నది. ఏదో సాధించాలనే తపన ఉన్నది. వారి శక్తిసామర్థ్యాలను వినియోగించుకుని సరైన మార్గ నిర్దేశం చేయగలిగితే ఎంతటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయవచ్చు.
యువత ఆత్మగౌరవంతో హుందాగా బతికేందుకు అనువైన పరిస్థితులు లేవు. ఫలితంగా నేటి యువత నిరాశానిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నది. యువతను ఆవరించిన ఈ నిరాశానిస్పృహలను తొలగించి మానవత్వం, ప్రేమ, త్యాగం, అంకితభావం, తెగువ, అభ్యుదయ భావాలు వంటి లక్షణాలు వారిలో పెంపొందించాలి. ఇందుకు విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. భగత్‌సింగ్‌ కేవలం ఒక విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీని ఎదిరించటంలో, సామ్రాజ్యవాదాన్ని దును మాడడంలో ఆయనకు ఆయనే సాటి. అటువంటి ఒక మహోన్నత విప్లవకారుని గురించిన సమాచారం చాలా తక్కువ ప్రచారానికి నోచుకుంటున్నది. ఇది చాలా శోచ నీయం. మహాత్మాగాంధీ తన నలభయ్యో ఏట స్వాతంత్య్రో ద్యమంలోకి వచ్చి 79వ యేట ఒక హిందూ మతోన్మాది చేతిలో హత్యగా వింపబడ్డారు. స్వామి వివేకానంద తన 30వ ఏట చికాగో ఉపన్యాసంతో ప్రసిద్ధుడై, హిందూ మత సంస్కరణకు కృషి చేసి 39వ యేట తనువుచాలించాడు. కాగా భగత్‌సింగ్‌ 18 ఏళ్ళకే స్వాతంత్య్రోద్యమంలోకి ఉరికి ఇరవై మూడేళ్ళ చిరు ప్రాయంలోనే ఉరికంబం ఎక్కాడు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల పాలిట సింహ స్వప్నంగా నిలిచిన భగత్‌సింగ్‌ మృత్యువును సైతం చిరునవ్వుతో ఆహ్వానించిన ధీశాలి. యువత సమాజానికి ఆదర్శంగా ఎలా ఉండాలో చేతల్లో చూపించిన కార్యశాలి భగత్‌సింగ్‌. హింస, ప్రేమ, మతం ఇలా అనేక అంశాలపై భగత్‌సింగ్‌ తన విలువైన అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రేమ గురించి ఆయన అన్నమాటలు 'ప్రేమ అంటే మరేమీకాదు. అది ఒక తపన మాత్రమే. అయితే అది జంతు ప్రవృత్తిపై నిలబడలేదు. మానవ ప్రవృత్తిపై మాత్రమే నిలబడుతుంది' అని చాలా సూటిగా చెప్పాడు. ప్రేమ పేరుతో పెడమార్గం పడుతున్న నేటి యువతకు భగత్‌సింగ్‌ ఒక ఆదర్శం. ఆయన భావాలు శిరోధార్యం.
ఈ రోజు దేశంలో మత ఛాందసులు, మతోన్మాదులు, అభివృద్ధి నిరోధక శక్తులు మతం పేరుతో చేస్తున్న విచ్ఛిన్నాలను, దేవుణ్ణి రాజకీయాల్లోకి తెచ్చి భావోద్వేగాలతో ప్రజల ఐక్యతకు చిచ్చు పెట్టడాన్ని చూస్తున్నాం. ఈ సందర్భంగా వాటి పట్ల భగత్‌సింగ్‌ అభి ప్రాయాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. భయం, అజ్ఞానం, ఆత్మ న్యూనత నుంచి మానవుడు సృష్టించుకున్నవే 'మతం, దేవుడు' అంటాడాయన. కార్ల్‌మార్క్స్‌ మతం గురించి చెప్పిన విషయాలతో భగత్‌సింగ్‌ అభిప్రాయాలు పోలి ఉన్నాయి. క్రూరమైన దోపిడీ, సమాజంలో ఒక వైపు సకల భోగాలతో కొద్దిమంది కులుకుతుంటే అత్యధిక ప్రజానీకం అంతులేని దారిద్య్రంతో కుమిలిపోతుంటారు. ఆకలి, అనారోగ్యాలు, ఆర్తనాదాలు సర్వసామాన్యం. ఈ స్థితిలో 'మతం అనేది అణచివేయబడే జీవియొక్క నిట్టూర్పు. అది హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిది. స్ఫూర్తి లేని పరిస్ధితుల్లో స్ఫూర్తిని ఇచ్చేది. కాబట్టి అది ప్రజల పాలిట మత్తుమందు' అని మార్క్స్‌ వ్యాఖ్యానించాడు. దోపిడీ వర్గం తన దోపిడీని శాశ్వతం చేసుకోవటానికి మతాన్ని అన్ని రకాలుగా వాడుకున్నది.
సోవియట్‌ రష్యాలో అప్పటికే సోషలిస్టు విప్లవం జయప్రదమై పదేళ్ళు దాటింది. ఆ ప్రగతిశీల భావాల ప్రభావం ప్రపంచంపై పడింది. భగత్‌సింగ్‌ 'కేవలం నమ్మడం, మరీగుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరమైనది. అలాంటి అంధ విశ్వాసం మన మెదళ్ళను మొద్దుపరిచి అభివృద్ధి నిరోధకులుగా తయారు చేస్తుంది' అని అంటూ 'విప్లవమనే ఆయుధం ఆధునిక ఆలోచనలతో పదునెక్కుతుంది' అంటాడు. 'అభ్యుదయం కోసం నిలబడే ప్రతి వ్యక్తీ పాత విశ్వాసాలకు సంబంధించిన ప్రతి దాన్నీ ప్రశ్నించాలి. ఒక్కొక్క దాన్ని తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ధారణకు రావాల్సి ఉంటుంది' అని భగత్‌సింగ్‌ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా తాను నాస్తికుడనని ఆయన ప్రకటించుకున్నాడు.
భగత్‌సింగ్‌ ఎంతటి తార్కికవాదో తెలుసుకోవటానికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఆయన జైల్లో ఉండగా రాసిన రచనల్లో కనిపించే ఇంగ్లీషు భాష, విషయ పరిజ్ఞానం పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, అసఫ్‌ అలీ లాంటి వారి ప్రజ్ఞకు ఏ మాత్రం తీసిపోవని ప్రముఖ చరిత్రకారుడు విఎన్‌ దత్‌ తన 'గాంధీ-భగత్‌సింగ్‌' పుస్తకంలో కొనియాడారు. 1930 అక్టోబర్‌ 7న భగత్‌సింగ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించగా 1931 మార్చి 23న దాన్ని అమలు చేశారు. ఈ ఆరు నెలల కాలంలో ఆయన ఎన్నడూ నిరాశ, నిస్పృహలను దరి చేరనీయలేదు. ఉరి తీయటానికి ముందు కొద్ది క్షణాల వరకూ కూడా చదువుతూ ఈ దేశానికి సామ్యవాద భావాల అవసరాన్ని తెలియజెప్పిన గొప్ప సోషలిస్టు. క్షమాపణ కోరితే ఉరిశిక్ష నుంచి మినహాయింపు పొందవచ్చన్న తండ్రి ఆవేదనను కూడా తిరస్కరించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదాన్ని చావుతో సవాల్‌ చేసిన ధీరుడాయన. లాలా లజపతిరారు మరణానికి కారకుడైన శాండర్స్‌ అనే బ్రిటీష్‌ సైనికాధికారిని మట్టుపెట్టి ఈ దేశ యువత చేతకానిదని భావించొద్దని బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ధైర్యశాలి. ఎవరికీ ప్రాణ నష్టం కలగని రీతిలో తయారు చేసిన బాంబును అసెంబ్లీ సెంట్రల్‌ హాల్లో వేయటం ద్వారా ప్రాణ నష్టం తన అభిమతం కాదని చాటి చెప్పాడు. భగత్‌సింగ్‌ భావాలు ఇంత పరిపక్వంగా ఉండటానికి కారణం ఆయన నిరంతరం అధ్యయనశీలిగా ఉండటమే కారణం. రాజరామశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'భగత్‌సింగ్‌ పుస్తకాలను తినేవాడు'. ఉరికంభం వద్దకు తీసుకొని వెళ్ళటానికి జైలు అధికారులు భగత్‌సింగ్‌ ఉండే సెల్‌ వద్దకు వెళ్ళినప్పుడు చివరి క్షణంలో కూడా ఆయన అధ్యయనంలో నిమగమై ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు.
భగత్‌సింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కొన్ని పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్నాయి. వాటిని మన దేశానికి తెప్పించటంలో భారత ప్రభుత్వం అంతగా శ్రద్ధ పెట్టలేదు. వాటిని తెప్పించటానికి ప్రముఖ పాత్రికేయుడు 'కులదీప్‌ నయ్యర్‌' కృషి చేస్తున్నారు. తెల్లవాడి చేతి నుంచి నల్లవాడి చేతికి అధికారం వస్తే సరిపోదు. దోపిడీకి తావులేని నిజమైన కార్మిక, కర్షక రాజ్యం ఏర్పడాలని భగత్‌సింగ్‌ కోరుకున్నాడు. ఆ మహానీయుని ఆశయాలు నేటికీ నెరవేరలేదు. భగత్‌సింగ్‌ సామ్యవాద భావాలు, ఆశయ సాధన కోసం నిత్యం పోరాడటం భగత్‌సింగ్‌కు మనం అర్పించే నిజమైన నివాళి. ఆ ఆశయ జ్యోతిని ఆరనివ్వక భగత్‌సింగ్‌ యొక్క నిరంతర అధ్యయనశీలత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వం, త్యాగం, సోషలిజం వంటి భావాలను నేటి యువత పుణికిపుచ్చుకుని భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేడు భగత్‌ సింగ్‌ 107వ జయంతి
-తోట కృష్ణారావు
Prajashakti Telugu News Paper Dated : 27/09/2013 
  

No comments:

Post a Comment