Friday, September 13, 2013

బహుజనం కదిలింది By -విమల. కె



ఏ యింట్లో ఏ బిడ్డడు ఎందుకొరకు ప్రాణాలు విడిచెనని 
అడగండి ఇక్కడ ప్రతి పల్లెను ప్రతి చెట్టును ప్రతి గట్టును 
ఆత్మకథలు చెప్పునవి దోపిడింకా పట్టి వదులుట లేదని
తెలంగాణ చరిత్ర బుద్ధుని సమకాలీన చరిత్ర. నిజామాబాద్ జిల్లా లోని బోధన్ వాసియైన బావరి శిష్యులు ఆ కాలంలోనే బుద్ధుని సందేశాలను ప్రచారం చేశారు. బుద్ధుని సమకాలంలోనే అతని సందేశాలు వేలమైళ్ళ దూరంలో ఉన్న తెలంగాణ ప్రజలను ప్రభావితం చేశాయన్నప్పుడు, మంచి పట్ల వారి అభిముఖ్యం ఎంత నిశితమైందో మనం అంచనా వేయవచ్చు అంటారు డాక్టర్ తిరుమల రామచంద్ర.దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమం పునాది ఇటువంటి మంచితనపు ఆకాంక్షలో ఉన్నది. అందుకే తెలంగాణ ప్రజలుగానీ, ఉద్యమకారులుగానీ ఇతరుల అస్తిత్వాలను రద్దుచేసే సాంస్కృతిక, రాజకీ య అణచివేత వ్యవస్థలను ధిక్కరించగలిగే వివేచనను సాధించుకోగలిగారు. అంతేకాదు ఆత్మగౌరవం, సమన్యాయం, దోపిడీ నుంచి విముక్తి కోసం అలుపెరగకుండా పోరాడుతూనే ఇతర ప్రాంతాల్లో కూడా సామాజిక న్యాయం సాధించుకొనే చారివూతక అవకాశాల కోసం శ్రమించారు. గుర్తింపు గౌరవం చేయూత అనే తాత్విక అవగాహనతో సాగుతున్న ఇంతటి ప్రజాస్వామిక పోరాటాన్ని తెలంగాణ అందిచ్చింది. ఇటువంటి వారసత్వాన్ని సీమాంధ్ర సామాన్య ప్రజానీకం అందిపుచ్చుకుంటే తమ పెత్తనా లు చెల్లవని భయపడే శక్తులు ఇప్పుడు తెలుగు జాతి, ఐక్యత అంటూ ఉపన్యాసాలు దంచుతున్నాయి. 

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అన్నది తెలంగాణ కంటే కూడా సీమాంధ్ర సామాన్య ప్రజలకే ఎక్కువ అవసరం. ఈ విషయాన్ని మొదట గుర్తించి రెండు రాష్ట్రాల ఏర్పాటును ఆహ్వానించిన వాళ్లు సీమాంధ్ర బహుజన ఆర్గానిక్ మేధావులు ప్రజాస్వామికవాదులైన కవులు రచయితలు. ఎన్నో జీవితాలనుపాణాలను పణంగాపెట్టి చేసిన దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్న స్వపరిపాలన అవకాశం తనకే కాకుండా సీమాంవూధకు కూడా కొత్త నాయకత్వానికి, సామాజిక న్యాయం సాధించుకోడానికి ఒక చారివూతక అవకాశాన్ని కల్పించింది.ఇది ఆదివాసీలు, స్త్రీలు,దళిత బహుజనుల నాయకత్వం లో సామాజిక ఆర్థిక రాజకీయ మార్పుల దిశగా,తమ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం ఇచ్చిందని వాళ్లు చెబు తూనే ఉన్నారు. అయితే విషాదం అంతా వారి గొంతుకలను రద్దు చేసే సినిమా మార్కు ‘సమైక్య’ సభలకు ప్రచార సాధనాలు వత్తాసు పలకడం ఒకెత్తయితే.. తెలంగాణ ఉద్యమ రూపాలను, కళారూపాలను మక్కికి మక్కిగా తీసుకోగలిగిన సీమాంధ్ర ఉద్యోగ మధ్యతరగతి వర్గాలు స్థానికత అనే తాత్విక భూమికను, తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమవడం మరొకెత్తు. సీమాంధ్ర పాలనా యంత్రాంగంలో తరాలుగా స్థిరపడిపోవడం వల్ల ఆ పాలకుల వలస బుద్ధి అలవడటం వల్లనేమో తెలంగాణ ఉద్యమ చైతన్యం అందుకోలేకపోతున్నారు. స్టేడియంలో జరిగిన సభనే ఇందుకు నిదర్శనం. నిజానికి తమ ప్రాంతీయుల బాగు కోరేవారైతే హైదరాబాద్‌ను నాలుగేళ్లలో అభివృద్ధి చేయగలిగినమని చెప్పుకునే తమ నాయకులను యింతకాలం తమ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో నిలదీసి అడిగే సభ పెట్టేవాళ్ళు. నాలుగేండ్లలో హైదరబాద్‌ను ఇంత అభివృద్ధి చేయగలిగినవాళ్లు రెండేళ్లలో తమకు కొత్త రాజధానిని అభివృద్ధి చేయలేరా అని నిలదీసే వాళ్లు. కిరాయి కవులతో అరువు పద్యాలను చెప్పించడం కాకుండా, ఇతిహాస పాత్రల విలువలను భ్రష్టు పట్టించే అభినవ తెలుగు తల్లులతో కాలక్షేప కథలు చెప్పించడం కాకుండా, సాటి ప్రజల ఆకాంక్షలను గౌరవించమని బుద్ధి చెప్పేవాళ్ళు. కలిసుండమని గావుకేకలు పెట్టడం కాదు తల్లితనమంటే సాటి తల్లుల కడుపుకోతను గుర్తించి గౌరవించడం అని ఎలుగెత్తి చాటేవాళ్ళు. కాని అందుకు విరుద్ధంగా అడుగులు వేస్తున్న ప్రస్తుత ’సమైక్య’ వాదనలు ప్రజాస్వామ్య ఉద్యమాలనే అవమానించే పెడధోరణులు. సీమాంధ్ర పౌర సమాజం, విద్యావంతులు ఇప్పటికైన బలంగా ఈ ధోరణులను అడ్డుకోకపోతే చరిత్ర వారిని క్షమించదు చైతన్యవంతమైన సీమాంధ్ర ప్రజానీకం తొందరలోనే తమ మీద పెత్తనం నిలుపుకోవాలనుకునే స్వార్థశక్తులకు బుద్ధిచెబుతారు,బహుజన సీమాం ధ్ర సాకారం చేసుకుంటరు, ఇప్పుడు సాగుతున్న అక్కడి ఆందోళనల రెండో దశ అదే తెలంగాణ ఉద్యమ చలనశీలత ఇరుసుగా బహుజన సీమాంధ్ర ఉద్యమం తోసుకువచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఇంకెన్నాళ్లో లేదు ... వస్తున్నాయి వస్తున్నాయి వలస పాలకులారా.... 


తెలంగాణ మహిళల అధ్యయన వేదిక

Namasete Telangana News Paper Dated : 13/09/2013 

No comments:

Post a Comment