Sunday, September 15, 2013

రాజ్యాధికారం మరచి... By Dr కదిరె కృష్ణ,


అగ్రకుల నేతల కవ్వింపులే అభద్రతకు కారణం 
రెండు ప్రాంతాలో బడుగులు బలపడాలి 
బహుజన విముక్తి బాటే శరణ్యం! 
విభజన రాజ్యాధికారానికి బాట కావాలి! 

సెప్టెంబర్‌ 7వ తేదీన ఏపీఎన్జీవోల సభ హైదరాబాద్‌లోని లాల్‌బహ దూర్‌ స్టేడియంలో జరుగుతూ ఉండగానే కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలంగాణ ఏర్పాటు తప్పదనే రీతిలో క్యాబినెట్‌ నోట్‌ గురించి మరోసారి వ్యాఖ్యానించారు. ఇంతకీ తెలంగాణ ఏర్పాటు పట్ల సీమాంధ్ర నాయకుల అభ్యంతరాలేమిటి? కేవలం హైదరాబాదు కోసమా? ఇంత రాద్ధాంతం చేస్తున్నది దేని కోసం? దీని వెనుక దాగి ఉన్న అగ్రవర్ణాల కుట్ర ఏమిటి? తెలుగు భాష పట్ల కొలమానాలు లేని భక్తి భావం అనుకోవాలా? రాష్ర్టంపై ఎనలేని ప్రేమ అనుకోవాలా? విభజన వల్ల కలిగే వేదన వాస్తవంగా సీమాంధ్ర నాయకత్వంలో కనిపించడం లేదు. తెలంగాణ రాదేమో అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో వెలువడ్డ ప్రజాందోళన, విద్యార్థి, యువత కనబర్చిన మనోవేదన సీమాంధ్ర ఉద్యమంలో కనిపించడం లేదు. దీనికి కారణం సమైక్యాంధ్ర భావన వారిలో లేకపోవడమే! సీమాంధ్ర ఉద్యోగులు, నాయకుల అభ్యంతరమల్లా హైదరాబాద్‌ నగరం మాత్రమే. 

తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో ఉద్యోగ, వ్యాపార, జీవనోపాధిరీత్యా స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ అభద్రతా భావానికి కారణాలు లేకపోలేదు. సీమాంధ్ర జేఏసీ ఛైర్మన్‌ పరుచూరి అశోక్‌బాబు భయపడినంత కాకపోయినా, కొంత భయానక వాతావరణం ఉంది. దీనికి కారణం తెలంగాణ ఉద్యమ నాయకత్వ స్థానంలోని భూస్వామ్య, వెలమ, రెడ్డి కులాల కవ్వింపు చర్యలే. వాస్తవానికి అలాంటి పరిస్థితే వస్తే సీమాంధ్ర సెటిలర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రాంతంలోని ఆ కులాల వాళ్లదేనని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొ కంచె ఐలయ్య బాహాటంగానే ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ప్రాంతంలోని భూస్వామ్య వర్గాలైన రెడ్డి, వెలమ కులాల పెత్తందార్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎదురవబోయే చేదు అనుభవాలు తక్కువేమీ కాదు. అందుకే అసలు పేచీ తెలంగాణలో భూస్వామ్య పెత్తందారి వర్గాలకు, బహుజనులకు ఉండబోతోంది. సీమాంధ్ర బహుజన ప్రజానీకానికి కేసీఆర్‌కు ఏ పేచీ లేదు. ఉన్నదంతా ఆ ప్రాంత ఆధిపత్య కమ్మ, రెడ్డి కులస్థులతోనే. అసలు విభజన సమస్య సీమాంధ్ర అణగారిన కులాలది కానేకాదు. అది కేవలం పెట్టుబడిదారి, అగ్రకులాలదే. తెలంగాణ ప్రాంతంలో సెటిలర్స్‌ అయిన బహుజనులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వస్తే రెండు బస్తాల సరుకు సరంజామా తీసుకెళ్లడం పెద్ద కథేం కాదు. 

కానీ, అపరిమిత ఆస్తులున్న పెట్టుబడిదారీ కులాల పరిస్థితి ఏమిటన్నదే వారి ఆందోళనకు కారణం. ఇప్పటికే తెలంగాణ పేటెంట్‌ హక్కుల కోసం వెలమలు, రెడ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రకటన వెలువడిన పరిణామ క్రమంలో ఈ కులాల ప్రవర్తన అనుమానా స్పదంగా మారింది. రాష్ర్ట మంత్రి కుందూరు జానారెడ్డి తెలంగాణ రాష్ర్టంలో తొలి సంతకం విద్యుత్‌పై చేయబోతున్నట్లుగా ప్రకటించి, అప్రకటిత ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిట్లుంటే అటు సీమాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ప్రస్తుతం ఏం చేయాలి అనే దిశగా చర్చ జరగకపోవడం విచారకరం. సీమాంధ్రలోని బహుజనులు సమైకాంధ్ర నినాదంతో తమ శక్తిని, సమయాన్ని వృథా చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటు తథ్యమని సోనియా ప్రకటించడం, యుపిఏ ఏకగ్రీవ తీర్మానం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇవి రాష్ర్ట విభజనకు తిరుగులేని ఆధారాలు. ఈ క్రమంలో తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాల అణగారిన కులాలు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేయవలసి ఉన్నది. 

దేశ చరిత్ర పరిశీలిస్తే ఇలాంటి పరిస్థితులు (విభజన) సంభవించినప్పుడల్లా బ్రాహ్మణీయ, మనువాద అగ్ర కులాలు తమ కుల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జగమెరిగిన సత్యం. ఇండియా, బ్రిటిష్‌ డొమినియన్‌గా ఉన్న కాలంలో స్వాతంత్య్ర సమరయోధుడు, లోకమాన్య బా గంగాధర తిలక్‌ 1916లో చేసిన ప్రకటన ఇక్కడ ఉటంకార్హం. తమ అగ్రకుల ప్రయోజనాలు కాపాడితే బ్రిటిష్‌ పాలన పట్ల తమకు ఏ అభ్యంతరం లేదని బ్రాహ్మణవర్గాలు ఆనాడే బహిర్గతం చేశాయి. ఇలాగే మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ ఇలాంటి ప్రకటనలు 1930వ దశకం వరకు చేస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంతో రాష్ర్ట విభజన అంశాన్ని పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు- అగ్రకులాల నుంచి హక్కులను, అధికారాన్ని కైవసం చేసుకునేదిశగా కృషి చేయవలసి ఉంది. ఈ స్పృహతో- అవసరమైన చైతన్యాన్ని కలిగించి ప్రజానీకాన్ని బహుజన విముక్తి ఉద్యమ బాటలో నడిపించాలి.

తెలంగాణలో కొందరు, సీమాంధ్రలోని చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు వాదిస్తున్నట్లు హైదరాబాద్‌ను యూనియన్‌ టెరిటరీ చేసే అవకాశం ఉందా? అసలు ఈ డిమాండు చేయడం వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉంది? చంఢీఘర్‌ తదితర నగరాలను యూటీ చేయడం వేరు, హైదరాబాద్‌ పరిస్థితి వేరని గ్రహించకపోవడం అత్యంత శోచనీయం. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర- వీటిలోని ఏ రెండింటికీ హైదరాబాద్‌ అనుసంధానంగా లేదు. చంఢీఘర్‌ తీసుకుంటే పంజాబు, హర్యానాల మధ్యలో ఉండి ఆ రెండు రాష్ట్రాలను కలుపుతుంది. అది ఇక్కడ సాధ్యపడదు. పైగా హైదరాబాద్‌ యూటీగా చలామణి అవడంలోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి వృథా డిమాండు పట్ల బహుజన ప్రజలు అప్రమత్తంగా ఉండితీరాలి. తెలంగాణ మేధావి వర్గం భావిస్తున్నట్లు హైదరాబాదు యూటీ అయితే రెడ్డి, వెలమ ప్రాబల్యం లేకుండా పోతుందనో, అసలు ఉండబోదనో గ్యారంటీ లేదు. అది ఒట్టి భ్రమ. ఢిల్లీనే ప్రభావితం చేయగలిగినవాడికి యూటీ పెద్ద లెక్కలోకి రాదేమో?! తెలంగాణలో లేదా హైదరాబాదులో నెలకొన్న పరిశ్రమలు, ఆదాయ వనరులన్నీ ముఖ్యంగా టాప్‌ 10 పరిశ్రమలన్నీ- సీమాంధ్రులవే అనేది నిజం. కానీ సీమాంధ్రలోని ఏ కులాలవి అనేది అసలు ప్రశ్న. వాటి ద్వారా బహుజనులు లబ్ధి పొందుతున్నారా? టాప్‌ 10 పరిశ్రమలు సీమాంధ్ర కమ్మ, రెడ్డి కులస్తులవే కనుక ఆంధ్రప్రదేశ్‌ ఐక్యంగా ఉన్నా సీమాంధ్ర బహుజనుల ప్రయోజనం శూన్యమే. అంచేత సీమాంధ్ర బహుజనులు విభజనాంతరం రాజ్యాన్ని కైవసం చేసుకునే మార్గాల గురించి ఇపుడు ఆలోచించాలి. ఆ దిశగా ఎత్తుగడలు వేయాలి.

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలి అనేది మరో ప్రతిపాదన. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనం ఏమేరకు ఉందో అర్థం కావడం లేదు. పైగా ఇది వట్టి పసలేని వాదన. డాక్టర్‌ బాబాసాహెబ్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని ప్రతిపాదించారని సమర్థన. దానితో పాటు అంబేడ్కర్‌ తెలంగాణకు వరంగల్‌ను రాజధాని చేయాలన్నారు. మరి దాని సంగతేమిటి? హైదరాబాదును తెలంగాణకు రాజధానిగా ఉంచిన ప్పుడు రెండో రాజధానిగా చేయడం సాధ్యం కాదనేది అంబేడ్కర్‌ భావనగా అవగతమవుతుంది. హైదరాబాదు రెండో రాజధాని ప్రస్తావన అవసరం ఇప్పుడేమీ కనిపించదు. ఇలాంటి ఉబుసు పోని డిమాండ్లను చేయడం మాని, జాతి ప్రయోజనాల నిమిత్తం పునరాలోచించాలి. ఒక ఉద్యమానికైనా, డిమాండుకైనా ఒక క్యారెక్టర్‌ ఉండాలి. హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలనే డిమాండు ప్రస్తుతం క్యారెక్టర్‌ లేనిదే కాక, ప్రభుత్వాలు పరిగణనలోకి కూడా తీసుకోలేని నిర్హేతుక వాదన. ఆధిపత్య వర్గాలను ఎదుర్కొవడానికి ఇలాంటి డొంక తిరుగుడు, దొడ్డిదారి మార్గాలు పనిచేయవు. బహుజన పితామహులు చెప్పినట్లు పోరాడి హక్కులు సాధించినప్పుడే ఆత్మగౌరవం సిద్ధిస్తుంది. 

ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఉమ్మడిగా దోచుకున్న అగ్రకులాలు విడిపోయి విచ్చలవిడిగా దోచుకునేందుకు గత దశాబ్దం కిందటే బ్లూప్రింటు సిద్ధం చేసుకున్నాయి. ఎటొచ్చి అమాయకంగా, అగమ్యంగా ఆగమయింది ఈ రెండు ప్రాంతాల బహుజన కులాలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని ప్రజాప్రతినిధులు బ్రాహ్మణీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు. కాన్షీరాం భాషలో చెప్పాలంటే చెంచాలు. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా జాతిని తాకట్టు పెట్టేందుకు వెనుకాడని ద్రోహులు. విద్యార్థి విభాగం ప్రతినిధులకు స్వతంత్ర ఆలోచనాసరళి లోపించి, ఏదైనా పార్టీ టిక్కెట్టు ప్రసాదిస్తే అదే పదివేలు అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బహుజన నాయకత్వ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పుడు సామాజిక కార్యకర్తలు, కులసంఘాలు, మేధావివర్గం కీలకపాత్ర పోషించి జాతి ప్రయోజనాలు కాపాడాలి. తెలంగాణ డిమాండు ప్రజాస్వామ్యమైందే. కానీ, ఉద్యమం అలా లేదు. ఉద్యమ నాయకత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్యులు ప్రకటించినట్లు ‘ఇవి రెండూ ఉద్యమాలు కావు’. కారణం వీటిల్లో శీలం లేదు. దానితో పాటు భూస్వామ్య, సామ్రాజ్యవాద ఆధిపత్య ధోరణులు పుష్కలంగా ఉన్నాయి.

పాలిష్‌డ్‌ లీడర్‌ షిప్‌ కరవయింది. తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉంది. సీమాంధ్ర ఉద్యమంలో కడుపుమంట లేకపోగా ‘ఇగో’ తిష్ఠ వేసింది. ఈ దృక్పథంతో ఆలోచిస్తే ఈ రెండు ఉద్యమాల ద్వారా, వాటి ఫలాల వల్ల సామాన్యులకు ఏ ప్రయోజనమూ ఉండదు. ఉద్యోగాలు రావడం కంటే ఆత్మగౌరవం చాలా ప్రధానమని బహుజనులు గ్రహించాలి.ఇన్నాళ్ల పోరాటంలో అగ్రకుల శక్తులు విమర్శ, ప్రతివిమర్శ చేసుకున్నా చాలా అప్రమత్తంగా వ్యవహరించాయి. తెలంగాణ ఉద్యమం వెలమ కులస్థుల పేటెంట్‌గా మారిందని సీమాంధ్ర కమ్మ, రెడ్డి కులాలకు బాగా తెలుసు. సమైక్యాంధ్ర ఉద్యమం కమ్మ కులాల కనుసన్నల్లో బ్రేక్‌డ్యాన్స్‌ చేస్తోందని తెలంగాణ అగ్రకులాలకూ ఎరుకే. కానీ, ఏనాడూ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామిరెడ్డి ‘ఇది సీమాంధ్ర ఆధిపత్య కులాల కుట్ర’ అని ప్రకటించలేదు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే శక్తి సీమాంధ్ర ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు లేదని కోదండరామిరెడ్డి, కె. చంద్రశేఖర్‌రావులకు తెలియదనుకోవాలా? పోటీ సీమాంధ్ర దోపిడీదారులెవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు సీమాంధ్ర నుండి వచ్చి 100 నుండి 150 గజాల స్థలం పొందగలిగితే స్వర్గ సుఖం అనుభవిస్తున్నారు. 

తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్‌ చుట్టూరా వందల వేల ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? సీమాంధ్ర పెట్టుబడిదారులు అంటున్నారే కానీ, సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారులని ఎందుకనరు? సామ్యవాదిగా, బుద్ధుని సోదరునిగా చెప్పుకునే కోదండరామిరెడ్డి సిద్ధాంతాలు మరచిపోయినట్టా? లేక తెలంగాణ బహుజనులకు తెలివి వచ్చి తిరగబడతారనా? రహస్యంగా భద్రపరచిన కోదండరామిరెడ్డి బ్లూప్రింటు మర్మమేమిటో? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడితే అణగారిన వర్గాల నుండి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని పదిలం చేసుకోవాలి. జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అక్కడి పాలకులు గిరిజనులే కాగలిగారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో ఈ అవకాశం గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించి చాకచక్యంగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. సీమాంధ్రలో ఎస్సీల్లో మాలల జనాభా ఎక్కువ. వీళ్లకు తోడు బీసీలు ముఖ్యంగా కాపు, గౌడ, యాదవ కులాలు ఏకం కావడానికి వ్యూహాలు రూపొందించుకోవాలి. 

తద్వారా కూటమిగా ఏర్పడి మాస్టర్‌కీని అందుకోవాలి. సమైక్యాంధ్ర నినాదాలతో బహుజన కులాలకు ఒరిగేదేమి ఉండబోదు. తెలంగాణలో మాదిగలు, ముస్లిం, యాదవ, గౌడ, ముదిరాజ్‌లు కూటమిగా ఏర్పడేందుకు మార్గాలను సుగమం చేయాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు ఖాయమని ప్రకటించినా, బహుజన కులాలు నిర్వీర్యంగా నోరు తెరచి, కళ్లప్పగించి అమాయకంగా రెడ్డి, కమ్మ, వెలమ ఆధిపత్య కులాల అధికార పోరుకు దిష్టిబొమ్మలుగా మారుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న తంతంతా అంతేనన్నది చేదునిజం. విభజన జరిగితే ఒనగూడే ప్రయోజనాలకోసం ఏ వర్గానికి ఆ వర్గం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ- జగన్‌ను, బిజెపిని దెబ్బతీయడానికి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఆయుధంగా ఎంచుకుంది. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని ఎవరైనా ఊహించగలరు. తెలంగాణ రెడ్లు ముఖ్యమంత్రి, రాజకీయ ప్రాబల్యమే లక్ష్యంగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడితే జగన్‌మోహన్‌రెడ్డి సంగతి వేరే చెప్పనక్కర లేదు. కమ్మలు ఈ పరిస్థితిని గమనించే చంద్రబాబులో పరకాయ ప్రవేశంచేసి యు టర్న్‌ తీసుకొని సమైక్యరాగం తీస్తున్నారు.

ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీమాంధ్ర కమ్మలు దింపుడు కళ్లెం ఆశగా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రే కాదు, ఏ అధికారమూ లేకపోయినా కర్రపెత్తనం కేసీఆర్‌ కుటుంబానిదే. వారి ఆధిపత్యానికి వచ్చిన ఆపదేమీ లేదు. ఇప్పటికే తిరుగులేని నాయకత్వాన్ని, సంపదను ఆర్జించినట్లు ఫోర్త్‌ఎస్టేట్‌ భోగట్టా. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఏ దిక్కూ లేదు. తెలంగాణ పోరాట వెలుగులో నిద్రావస్థలో బహుజనులు సొక్కి సోయి దప్పి ఉన్నారు. ఎస్సీలు కాకపోతే బీసీలు- వాళ్లూ కాకపోతే ఎస్టీలు మొత్తంగా అగ్రకులాలకు గొడుగు చందంగా మారుతున్న దుస్థితి దాపురించింది. బోనాలు, బతుకమ్మలు బెంజికార్ల నుండి కాసేపు ఫోజిచ్చినంత మాత్రాన న్యాయం జరుగుతుం దనుకోవద్దు. సీమాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, తెలంగాణ బహుజనులకు అసలు ఏ గొడవా లేదు. గోచి గొంగడి గాళ్ళ గతి నుండి ఏదో కొంత మెరుగైన జీవితానికైనా ఈ ఉద్యమాలు దోహదపడలేదు, పడబోవన్నది నగ్నసత్యం. సీమాంధ్ర నుండి 12 మంది ముఖ్యమంత్రులైతే 11 మంది రెడ్డి, కమ్మ కులాల వారే. రాయలసీమలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా అగ్ర కులాల జనాభా కంటే ఎన్నోరెట్లు ఎక్కువ. ఆరుగురు రాయలసీమ ముఖ్యమంత్రుల్లో దామోదరం సంజీవయ్య రెండు సంవత్సరాల అత్తెసరు పాలన మినహాయిస్తే, మిగిలినవారంతా రెడ్లే. కోస్తాంధ్ర ప్రాంతం నుండి ఆరుగురు ముఖ్యమంత్రులయితే ఇద్దరు కమ్మలు, ముగ్గురు రెడ్లు. మొత్తంగా పెట్టుబడిదారీ భూస్వామ్య కులాలే పాలకపక్షంగా వ్యవహరించాయి. 

తెలంగాణ ప్రాంతం నుండి నలుగురు ముఖ్యమంత్రులయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు మొండిచెయ్యే మిగిలింది. మొత్తంగా ఐదు శాతం లేని రెడ్లకు ఒక్కసారి ముఖ్యమంత్రి రావాల్సి ఉండగా ఎనమండుగురు ముఖ్యమంత్రులయ్యారు. బిసిలు కనీసం ఆరుగురు ముఖ్యమంత్రులు కావాల్సి ఉండగా ఒక్క అవకాశమూ దక్కలేదు. నలుగురు కమ్మ కులస్థులు ముఖ్యమంత్రులు కాగలిగారు. కానీ వారి జనాభా రీత్యా ఒకటి కూడా వచ్చే వీలులేదు. ఇంతకీ విషయ మేమిటంటే విభజన జరిగినా, జరుగకపోయినా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలిపశువులవుతున్నది అణగారిన కులాలే. లబ్ధిపొందే దగ్గర వీళ్లకు రిక్తహస్తమే దిక్కవుతుంది. విభజన జరిగిపోయింది కాబట్టి కోల్పోయిన వాటాను, రాజ్యాన్ని ఎలా దక్కించుకోవాలో ఆలోచించాల్సింది పోయి అగ్రకులాల టక్కరిపాటలకు వంతపాడుతుండడం బాధాకరం, దౌర్భాగ్యం. ‘పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప’ అంటే పోరాడీ పోగొట్టుకొని (బిడ్డలను) బానిస సంకెళ్లు మరింత బిగించుకుంటే లాభం ఏముంది? తాతలు, తండ్రులు దొరల ఘడీల ముందు దాష్ఠీకం చేస్తే, విద్యావంతులు, చైతన్యవంతులు, పోరాటవీరులై అదే దొరల పాదాలవద్ద వెట్టి చేసి, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం విడ్డూరం కాదా?అంటే తెలంగాణ కోసం పోరాటం వద్దని కాదు, పోరాడి ఆత్మగౌరవంతో అధికారాన్ని సాధించుకోవాలన్నదే భావం.

తెలంగాణ, సీమాంధ్ర ప్రజలది కేవలం ఆంధ్రప్రదేశ్‌ విభజన, సమైక్యసమస్య కాదు. వీళ్లది జాతి, జాతీయ సమస్య, రాజ్యాధికార సమస్య కూడా. ఆత్మగౌరవ వ్యవహారం ఈ దిశగా ఆలోచించక తప్పదు. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో బహుజనుల అస్తిత్వం నామమాత్రం కాకూడదు. జనాభా రీత్యా మెజారిటీ ప్రజలైన బహుజనులకు, రాష్ర్ట విభజన అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు- అధికారాన్ని మరింత దగ్గర చేయాలే కానీ, మరింత బానిసలను చేయకూడదు. అంబేడ్కర్‌ చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమర్థనలో దాగి ఉన్న రహస్యం కూడా ఇదే. కనుక ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాధికారదిశగా కాంక్రీట్‌ భావజాలంతో ముందుకు నడవడమే శ్రేయస్కరం. 

రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనరు

Surya Telugu News Paper Dated: 15/09/2013 

1 comment:

  1. kula gajji thala meedhaku ekkuthe elane rasatharu articles kodanram thana peru lo reddy thisesanu ani cheppaka guda reddy ani sambodisthu

    ReplyDelete