Tuesday, September 24, 2013

రాజకీయాధికార మార్గం బహుజన సమన్వయమే By - కదిరి కృష్ణ


భారత దేశంలో దేవుడు లేని గ్రామాలు ఉండొచ్చేమో కానీ ఎస్సీ, బీసీలు లేని గ్రామాలు దాదాపు శూన్యం. గ్రామ నిర్మాణంలో, నాగరికత కట్టడంలో ఎస్సీ, బీసీ కులాల పాత్ర అనిర్వచనీయం. వ్యవసాయిక దేశమైన భారత్‌లో ఈ కులాలు లేకుండా మనుగడ సాగించడం కష్టం. నీళ్లు తోడే తొండం, బొక్కెనలు సమకూర్చి తోలు సంస్కృతికి మాదిగలు ఆద్యులైతే, కమ్మరుల నాగలి, సాలెల వ్రస్తాలు, కుమ్మరుల కుండలు, వడ్డెరల గృహనిర్మాణ సాధనాలు, గొల్లకుర్మల పాడి దేశాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దినవి. ప్రపంచంలో మరెక్కడా లేని ప్రకృతి పూజ, సంస్కృతి ఎస్సీ, బీసీలదే. జనాభా రీత్యా చూసుకున్నా నూటికి ఎనభైశాతం బిసి, ఎస్సీ కులాలే. ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల్లో గమనిస్తే ఈ కులాలు ఉత్పత్తి శక్తులుగా ఉన్నప్పటికీ, ప్రయోజనాలు కల్పించడంలో వీరిని దూరం చేస్తున్నారు. ఓటు బ్యాంకు దృష్ట్యా ఎనభై శాతం ఉండే బహుజనులు, మైనార్టీలైన బ్రాహ్మణాధిపత్య కులాల ఏలుబడిలో మగ్గుతున్నారు. దేశ రాజకీయాధికారాన్ని నిర్ణయించేది ఖచ్చితంగా బిసిలే (ఎస్సీల కు రాజ్యాధికారం లేకపోయినా కొంతమేరకు వాటా పొందగలుగు తున్నారు) ఐనప్పటికీ నిర్ణాయక శక్తులుగాకాక నిర్వీర్యశక్తులుగా మారుతున్నారు. గతంలో ఎస్సీలను నిర్ణాయక ఓటు బ్యాంకుగా భావించినప్పటికీ, ఇటీవల చీలిపోయి ఉండడంతో అమ్ముడు పోయే వ్యక్తులుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొని ఉన్నది. పైగా బిసిలు- ఎస్సీలు తమలో తాము కుల వైషమ్యా లతో కలహించుకుంటున్న సం ఘటనలు విచ్ఛిన్నతను మరింత పెంచిపోషిస్తున్నా యి. బీసీలను ఎస్సీలు, ఎస్సీలను బీసీలు శత్రువులుగా భావించుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి విపరీత పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాధికారం ఎలా సాధ్యం?

ఏ కులానికి ఆ కులం స్వంత అస్తిత్వాలు కలిగి ఉంటే తప్పు లేదు. మరో బాధిత కులాన్ని ద్వేషిస్తూ, హెచ్చుతగ్గులు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాధికార నినాదం నీటిమీద అలకడం లాంటిదేనా? కొందరు బిసీలు రాజ్యాధికారం సాధించాలనీ, కొందరు ఎస్సీలు సింహాసనం కైవసం చేసుకోవాలని వివిధ రకాల ప్రణాళికలు, సిద్ధాంతాలతో మరింత గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. ఎస్సీలపైకి బీసీలను, బీసీలపైకి ఎస్సీలను రెచ్చగొడుతూ పబ్బంగడుపుతూ అగ్రకులాల తొత్తులుగా, చెంచాలుగా మారిపోతున్న కాలంలో రాజ్యాధికారం పగటి కలేనా? రాజ్యాధికారాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? బహుజన పితామహులు ఫూలే, పెరియార్, డా॥ అంబేడ్కర్‌ల దృష్టిలో రాజ్యాధికారం ఎలా సాధించాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు రాజ్యాధికారానికి మార్గాన్ని సులభ గ్రాహ్యం చేయగలవు? కేవలం మాదిగలు, కేవలం మాలలు అలాగే యాదవ, గౌడ, కాపు, చాకలి, మంగలి కులాలుగా వైయుక్తికంగా రాజ్యాధికారం సాధించగలవా? పోనీ బిసిలు ఎస్సీలు వేర్వేరుగా రాజ్యాన్ని కైవసం చేసుకోగలరా? రాజ్యాధికార సాధనలో ఈ అణగారిన కులాల్లోని విద్యార్థి, మేధావి, ఉద్యోగుల కర్తవ్యం ఎంత? ఇలాంటి ప్రశ్నలెన్నో బహుజన ప్రజల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నాయి. అయితే ఇవేమీ సమాధానం లేని ప్రశ్నలు కావు. పైగా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాల్ని ఇవ్వగలిగినప్పుడే స్పష్టమైన దృక్పథం, తాత్విక నేపథ్యం, సైద్ధాంతిక పట్టుతో బహుజన రాజ్యాధికార సిద్ధాంతాల్లో నెలకొన్న గందరగోళం నశిస్తుంది. స్పష్టమైన సైద్ధాంతిక నేపథ్యం లేని ఉద్యమాలు విఫలమవడం చరిత్రలో చూశాం. ఇండియా లోని కులవ్యవస్థ, దాని వికృత రూపాలు అవగతం చేసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం వర్గ దృక్పథంతో కమ్యూనిస్టు విప్లవ పోరాటాలు వైఫల్యం చెందడం ఇంకా పూర్తిగా గత చరిత్ర కాలేదు. కేవలం హిందుత్వ భావజాలంతో గాయపడిన గొంతుల్లోంచి పెల్లుబికిన ఆర్తనాదాలు కాకి కూతలుగా భావించిన హిందుత్వ జాతీయతా శక్తులు నీరుగారిపోవడం తప్పదు. ఇది వర్తమానం.

ఈ క్రమంలో బహుజనులు విస్పష్టసిద్ధాంతం, పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తే తప్ప రాజ్యాధికారం సాధ్యం కాదు. ఇందుకుగాను మొదట ఎస్సీ, బీసీల్లోని వైరుధ్యాల సమన్వయం సాధించడం అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక్కటే అంటే బీసీలు, ఎస్సీలను, ఎస్టీలు, బీసీలను బీసీలే వ్యతిరేకించడం గమనించగలం. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు బిసి, ఎస్సీ మేధావులు ఐడెంటిటీ క్రైటీరియాను ముందుకు తెచ్చి వికట్టాహాసం చేస్తున్నారు. ఎవరి ఐడెంటిటికీ ఏ ప్రమాదం లేకుండానే బహుజన దృక్పథం కొనసాగించవచ్చు. ఇంకా కావాలంటే 'మూలవాసీ దృక్పథం* దీనికి సరైన విధానం. బ్రాహ్మణ మత గ్రంథాలైన భగవద్గీత, రామాయణ మహాభారత, పురాణ, స్మృతిశృతులు కంచుకంఠంతో శూద్రులు, అతిశూ ద్రులు, నల్లటిప్రజలు, ఇండియన్ స్థానికజాతులని అరుస్తున్నాయి. వేదాలు, శ్రాస్తాలలో శూద్ర, అతిశూ ద్ర కులాలు/ జాతుల మూలాల చరిత్ర ఉంది. ఒరిస్సా ప్రాంతాన్ని గౌడ్‌లు, కర్ణాటక ప్రాంతాన్ని యాద వులు, సముద్ర ప్రాంతంలో ముదిరాజులు అనేక రాజ్యాలను పాలించారనేది చారిత్రక సత్యం. మాదిగ కులానికి చెందిన జాంబవంతుడు మొదట భారత పాలకుడని పురాణాలు, చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. 'శూద్రశ్చ అవివరశ్చ, వృషాలశ్చ, జఘనాంగ జన్యశ్చ' వంటి శ్లోకాలు శూద్ర, అతిశూద్ర జాతుల కూటమిలోని ఏకరూపత, చారిత్రక పునాదిలోని సామ్యతలను నిర్ధారిస్తున్నాయి. ఇటీవల వివిధ యానివర్శిటీలు చేసిన పరిశోధనల్లో ఈ దేశంలోని ఎస్సీ, బీసీలు అత్యంత ప్రాచీన జాతులని, ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రాచీనజాతుల వంటివని నిరూపితమైంది. ఇది ఆధునికకాలంలో ఫూలే ప్రవచించాడు. పెరియార్ ఇదే దృక్పథంలో జీవితాంతం పనిచేశాడు. ఈ సంగతులను ప్రచారం చేయడం వల్ల ఈ జాతులమధ్య వైరుధ్యాలు బ్రాహ్మణవాదుల కుట్రేనని గ్రహించే విధంగా చేసి, సమన్వయం సాధించడం అవసరం. కుల సంఘాలు తమ కర్తవ్యాన్ని మరచి మనువాద పార్టీలవద్ద దళారుల పాత్ర పోషిస్తున్నాయి. ఇది బహుజన ప్రజల వ్యతిరేక విధానమేకాక ద్రోహంకూడా. తమ బతుకుదెరువుకోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడం క్షమించరాని నేరం. ఉద్యమ నాయకత్వ అవగాహనా రాహిత్యం రాజ్యాధికారానికి మరింత దూరంగా నెట్టివేస్తున్న దుస్థితి. పాలిష్‌డ్ నాయకత్వాన్ని ఇటు ఎస్సీల్లో, అటు బీసీ కులాల్లో రూపొందించాల్సి ఉంది. ఇది విద్యావేత్తల ప్రథమ కర్తవ్యం. ఈ దిశగా బామ్‌సెఫ్ వంటి సంస్థలు పనిచేయగలుగుతున్నా ఇది అణగారిన, బాధిత కులస్థులందరి బాధ్యత, అనివార్యం!
ఎస్సీల్లో మాదిగల సమస్య. జనాభాలో గణనీయంగా ఉన్నా మాదిగలు రిజర్వేషన్ల లబ్ధిలో మిక్కిలి వెనుకబడ్డారనే నేపథ్యంతో, మాల మాదిగలు, ఉప కులాలు తమ జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు పొందేందుకు అనుగుణంగా తమను ఎ.బి.సి.డి.లుగా వర్గీకరించాలని పోరాడుతున్నాయి. నిజానికి ఇది న్యాయం. అంతేకాదు చాలా చిన్న సమస్య. ఈ సమస్యను అడ్డుపెట్టుకొని మనువాద పార్టీలు ఎంత లబ్ధిపొందాలో అంతా పొందాయన్నది వాస్తవం. ఈ దరిమిలా మాదిగలు బ్రాహ్మణీయశక్తుల కుట్రలను పసిగట్టి ఎండగట్టడంలో విఫలమయ్యారు. వర్గీకరణవంటి తాత్కాలిక సమస్యతోపాటు రాజ్యాధికారం వంటి శాశ్వత పరిష్కార మార్గాలపైనా దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎ.బి.సి.డీ.లుగా వర్గీకరించినా ఏదో ఒక గ్రూపులోని మరోకులం మళ్లీ అన్యాయానికి గురైనామనే నినాదంతో మరోపోరాటం అవసరమవు తుందేమో?! ఇలాంటి సమస్యనే బిసిలు ఎదుర్కొంటున్న విషయం పరిశీలనార్హం. బిసిల్లో వర్గీకరణ ఉంది. ఐనప్పటికీ కొన్ని అత్యంత వెనుకబడిన కులాలు తమను ఎం.బి.సి. లుగా గుర్తించాలంటూ ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా ఎదురవు తున్న సమస్యలను ఏకరువు పెడుతు న్నారు. ఇలాంటి సమస్యలే ఎస్సీ ల్లోనూ, బీసీల్లోనూ, అనైక్యతకు దారి తీస్తున్నాయి.

వీటన్నింటికీ మాస్టర్‌కీనే శాశ్వత పరిష్కారమైనప్పటికీ తాత్కాలిక ఉప శమనం/ మార్గమూ ఉన్నది. విద్య, ఉద్యోగ రంగాల్లో అత్యంత వెనుక బడిన ఎస్సీ, బీసీ కులాలకు ప్రత్యేక పథకాల ద్వారా (కార్పొరేషన్ ఏర్పాటు, ప్రత్యేక ఉద్యోగ సదుపాయాలు, విద్యావకాశాలు) అభివృద్ధి సాధించేందుకు అభివృద్ధి చెందిన కులాలు, మేధావి వర్గం ప్రయత్నించాలి. ఇది ఇట్లుంటే, రాజకీయరంగంలో బీసిలకు ప్రాతినిధ్యం లేనేలేదు. ఎస్సీల్లో ఉన్నా చట్టసభల్లో కాలుమోపని ఎస్సీ కులాల జాబితానే ఎక్కువ. వీటి పరిష్కారాల కోసం వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. దానినే దామాషా 'ప్రాతినిధ్య విధానం' అంటారు. కొన్ని దేశాల్లో అత్యంత తక్కువ జనాభా ఉన్న తెగలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ విధానం ఉపకరించింది. అంటే ప్రతి లక్ష మంది జనాభా ఉన్న కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వంటి విధానమే అన్ని కులాల సమస్యలకు పరిష్కారం. ఇది ఐక్యత, ఓర్పు, అంకితభావం ఉన్నప్పుడే సాధ్యం. సోదర కులాల పట్ల అభిమానం, గౌరవం మరింత ప్రయోజనకరం.

ఇక ప్రధాన సమస్య- ఎస్సీలు నాయకత్వం వహించాలా, బిసిలా? రాజ్యాధికారంలో పరస్పర అవసరం ఎంత? ఆంధ్రప్రదేశ్ ఐనా, తెలంగాణ రాష్ట్రమైనా ఎస్సీల జనాభా 18 నుండి 22 శాతం వరకు ఉంటుంది. ఇందులో వివిధ పార్టీల్లో ఇప్పటికే పీకల వరకు ఇరుక్కుపోయిన వారి శాతం 10 నుండి 12 వరకు ఉంటుంది. ఇక మిగిలింది 6 శాతం. ఈ ఆరు శాతానికి తొంభై సిద్ధాంతాలు, మూడు కొట్లాటలు, ఆరు విభజనలు. ఇలా కాకపోయినా 18 శాతం ఒక్కటిగా ఉన్నా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటుకు 30 శాతానికి పైగా ఓటు బ్యాంకు కావాలి. బీసీల జనాభా 50 శాతానికి తక్కువ ఎక్కడా లేదు. బిసి ఓటర్ల పరిస్థితీ అంతే. ఒకవేళ బిసిలు ఒక్కటిగా ఉండగలిగితే 30 శాతం ఓట్లసాధన సులభమే. అలాంటప్పుడు స్వతంత్రంగా రాజ్యాధికారం సాధ్యమే. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుచేత ఎస్సీల్లోని కనీసం 10 శాతాన్ని సమీకరించుకోగలిగితే తిరుగులేదు. కేరళ, తమిళనాడులలో గౌడ్‌లు ఎస్సీలుగా, రజకులు 18 ర్రాష్టాల్లో ఎస్సీలుగా, వడ్డెరలు కర్ణాటకలో ఎస్టీలుగా, ముదిరాజ్‌లు, బెస్తలు కొన్ని ర్రాష్టాల్లో ఎస్సీ, ఎస్టీలుగా చెలామణిలో ఉన్నారనే విషయం- బహుజనుల మూలాలు ఒక్కటేనని ప్రకటిస్తుంది. ఇక బిసిల్లో బిసిలు, ఎంబిసిలు విడిపోతే అగ్రకులాలు మరింత ఆయువు పట్టు పొందినట్టే. కాబట్టి ఎస్సీలకు బీసీల అసవరం, అలాగే బీసీలకు ఎస్సీ, ఎస్టీల అవసరం చాలా ఉన్నది. 1935లో భారత ప్రభుత్వ చట్ట రూపకల్పన సందర్భంలో, 1950లో భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విషయంలో బిసిల అనైక్యత వల్లే రాజకీయ బానిసలుగా మారిపోయారు. 66 సంవత్సరాలు గడిచినా చట్టసభల్లో బిసి ప్రాతినిధ్యం అందని ద్రాక్ష చందంగా మారింది. రాజ్యాంగ పరిషత్‌లో ఒక్క బిసి సభ్యుడుకూడా లేకపోవడం దేన్ని సూచిస్తుంది?
ఇటీవల జరిగిన లక్ష్మింపేట వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. బిసీలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల సంఖ్య గణనీయంగానే ఉంది. పరస్పర విద్వేషాలకు కారణాలు అవగాహనా రాహిత్యమే. బ్రాహ్మణవాదాన్ని భుజాలపై ఊరేగించడమే. ఇలాంటి విషాదకరమైన ఘటనలు పునరావృతం కాకూడదంటే, ఏ కులంలోని మేధావి వర్గం ఆ కులంలో సామాజిక అవగాహన, రాజ్యాధికారం పట్ల కాంక్షపై బహుళ ప్రచారం చేయాలి. చైతన్యవంతులైన ప్రజలు కలహించుకోజాలరు. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు, రెండు జాతుల మధ్య సంఘర్షణ ఒక జాతికి విజయాన్ని ఇస్తుంది. ఒకే జాతిలో సంఘర్షణ ఆ జాతిని తుదముట్టిస్తుంది. ఒక జాతి కుల అస్తిత్వాన్ని ఇంకో కులం గౌరవించి అమోదించగలిగితే అసలు సమస్యే ఉండదు. దీనికి సైద్ధాంతిక స్పష్టత లోతు చాలా అవసరం. కులాల వారీగా విద్వేషాలు సృష్టించుకోవడం, విడిపోవడం ఉద్యోగులు, విద్యావేత్తల్లోనే ఎక్కువగా ఉన్నది. విపరీతంగా పెరిగిపోయి అగ్రకులాలకు మద్దతుగా నిలవడానికి పోటీపడుతున్నారు. ఇది దురదృష్టకర పరిణామం. ఈ సెక్షన్‌లోనే ప్రథమంగా అవగాహన కల్పనకు కృషి చేయాలి. చరిత్ర పట్ల అవగాహన కల్పించగలిగితే ఐక్యత, తద్వారా అధికారం సులభ సాధ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసలు సమస్య పేదరికం కానేకాదు- అధికారం, స్వయంగౌరవం అసలు సమస్య! దీన్ని మౌలికంగా గుర్తించని వర్గాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

ఇది వేల సంవత్సరాల క్రితమే బీజాలు వేసుకుంది. స్వయంగౌరవం లేని జాతులు బానిసలుగా మారుతాయని చరిత్రకారుల భాష్యం నిజమే. ఆత్మగౌరవం కోల్పోవడం వల్లే బహుజనులు బానిసత్వానికే మొగ్గుచూపుతున్నారు. పెరియార్ ఈ దృష్ట్యా తన ఉద్యమానికి 'స్వయం గౌరవ ఉద్యమం'గా పేరు పెట్టారు. స్వయం గౌరవం ఉన్న జ్రలు మానవహక్కుల గురించి ఆలోచిస్తారు. పెత్తందారుల, అగ్రకులాల ఆధిపత్యంపై తిరగబడతారు. పెరియార్ ఇదే దృక్పథం కులనిర్మూలనకు దోహదకారి కాగలదని భావించాడు. ఫూలే తన ప్రతిబోధనలోనూ అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మనూన్యతా భావాన్ని పోగొట్టేందుకే ప్రయత్నించాడు. అందులో భాగంగానే బలిచక్రవర్తిని చరిత్రల్లోంచి వెలికి తీశాడు. బ్రాహ్మణ కులాల దాడుల చరిత్రను అవలోకించి స్పష్టమైన దృక్పథాన్ని అందించాడు. సామాజిక, చారిత్రక రంగాల్లోని గజి బిజిని చేధించి బహుజన దృష్టి కోణాల్లో మొత్తం వ్యవస్థను నిర్వచించాడు. ఇదే మూలవాసీ దృక్పథాన్ని హైదరాబాద్ సంస్థానంలో భాగ్యరెడ్డివర్మ, మద్రాస్ ప్రెసిడెన్సిలోని ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామస్వామి ప్రచారంచేశారు. చివరగా స్వతంత్ర, పాలిష్‌డ్ నాయకత్వాన్ని బహుజన పితామహ సైద్ధాంతిక పునాదుల వెలుగులో నిర్మించుకోగలిగినప్పుడు రాజ్యాధికారం వస్తుంది, నిలుస్తుంది. డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నట్లు సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి, రాజకీయ విప్లవం సామాజిక, ఆర్థిక విప్లవానికి దారితీసి సమ సమాజం నెలకొనాలి. అప్పుడే ఈ బానిస కులాలకు విముక్తి. దీనిని సాధించడం ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లోని విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు, నాయకుల కర్తవ్యం.

- కదిరి కృష్ణ
రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్ కన్వీనర్

Surya Telugu News Paper Dated : 24/09/2013 


No comments:

Post a Comment