Monday, October 31, 2011

అక్కరకురాని బీసీ కమిషన్ By ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం Andhra Jyothi 1/11/2011


అక్కరకురాని బీసీ కమిషన్

ప్రస్తుతం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల కాలపరిమితి ముగిసింది. గత పాలకమండలిని పునర్నియామకం చేయడానికి ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని బీసీ కమిషన్‌కు ఏ అధికారాలు లేవు. కేవలం నామ మాత్రంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు కల్పిస్తూ ఆయా ప్రభుత్వాలు చట్టాలను సవరించాయి. ఇదే రీతిలో మన రాష్ట్ర బీసీ కమిషన్ చట్టం 20/1993ను సవరించాలి. బీసీలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా అన్ని సమస్యలలో బాసటగా నిలిచే "అపద్భాందువు''గా బీసీ కమిషన్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ డిమాండ్ బీసీ వర్గాలనుండి బలంగా ముందుకు వస్తుంది. అధికారాలు లేకుండా "ఆచరణ'' చేయమంటే సాధ్యమయ్యే పనికాదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు రాజకీయ లబ్ధికోసం "రాజ్యాంగాన్నే'' ఇప్పటికి 95 సార్లు సవరించుకున్న మనం బీసీలకు చేదోడు-వాదోడుగా ఉండేందుకు బీసీ కమిషన్ చట్టాన్ని పలు ఆమోదయోగ్యమైన సవరణలతో ముందుకు తీసుకువెళ్ళడం అసాధ్యం ఏమికాదు. బీసీల అభివృద్ధి, రక్షణ సమగ్ర వికాసాన్ని ఆకాంక్షించిన మనదేశ అత్యున్నత న్యాయస్థానం 1993లో మండల్ కేసుగా ప్రసిద్ధిపొందిన ఇందిరాసాహ్ని వ్యాజ్యంలో వెలువరించిన తీర్పులో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు కమిషన్లు నెలకొల్పినప్పటికి ఎలాంటి అధికారాలను కల్పించకపోవడంతో 'రబ్బర్‌స్టాంప్' ఆర్గనైజేషన్లుగా రూపాంతరం చెందాయి తప్ప, ఈ సామాజిక వర్గాలకు ఇన్నాళ్ళుగా ఏ మాత్రం ఆశించినరీతిలో ప్రయోజనాలు చేకూర్చ లేదు. ఇందుకు ప్రభుత్వపరంగా బీసీ సామాజిక వర్గాల సంక్షేమంపట్ల చిత్తశుద్ధి లోపించడం ఒక కారణం అయితే ఈ వర్గాలను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం మరొక కారణం. అంతేగాక ఈ వర్గాలకు 'అధికారం' శాసించేస్థితికి రాకపోవడం మరో ప్రధాన కారణం.

బీసీ వర్గాలకు చెందిన నాయకులు ప్రభుత్వాధినేతలుగా ఉన్న రాష్ట్రాలలో "ఈ కమిషన్ల'' చట్టాలకు మౌలిక సవరణలు చేశారు. అందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్, సిక్కిం, కర్నాటక, బీహార్ రాష్ట్రాలలో కమిషన్లు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ, మహిళా కమిషన్లకు విశేషాధికారాలు కల్పించి బీసీ కమిషన్‌కు అధికారాలు లేకపోవడం సహించరాని విషయం. మన రాష్ట్రం విషయానికి వస్తే బీసీల సమగ్రాభివృద్ధి కోసం యేటా రూ.2700 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తూ దేశం మొత్తానికి సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలో నిలుస్తున్నాం. ఇక్కడి పథకాలు ఒక్కరోజులో వచ్చినవికావు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో 35 యేళ్ళుగా అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా బీసీలు దశల వారీగా సాధించుకున్నవి. ఇక్కడ అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలులో లేవు. అయితే కళ్ళముందే సంక్షేమ పథకాలకు అధికారులు తూట్లు పొడిచే చర్యలకు ప్పాలడుతున్నప్పుడు సమగ్రంగా విచారించి చర్యలు చేపట్టడానికి ప్రత్యేకమైన చట్టబద్ధ సంస్థ అవసరం వుంది.

బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధిలోకి రావాలని రాజకీయాలకు దూరంగా ఉద్యమించి దశలవారీగా సాధించుకున్న సంక్షేమ పథకాల అమలులో అనేక అక్రమాలు-అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అమలు తీరుతెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం, సమగ్రమైన అధ్యయనాలు నిర్వహించడం, సర్వేలు చేపట్టడం, ఈ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను నిశితంగా పరిశీలించడం, రిజర్వేషన్ల అమలులో లోపాలను సరిదిద్దడం, సమర్థంగా అమలయ్యేలా చర్యలు చేపట్టడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయడం, ఆర్థిక సంవత్సరం కోసం ఖర్చుచేయాల్సిన నిధులకుగాను ముందస్తు 'బడ్జెట్' ఇతర ప్రణాళికలు తయారు చేయడం, అవినీతికి తావులేని విధంగా బీసీ సంక్షేమ శాఖ అమలుచేసే అన్ని పథకాలు, కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో నిఘావిభాగంగా పనిచేసే ఒక 'పర్యవేక్షణ వ్యవస్థ' అవసరం. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు.

అందుకు చట్ట ప్రకారం ఏర్పాటై ప్రత్యేకంగా ఉన్న 'రాష్ట్ర బీసీ కమిషన్'ను ఉపయోగించుకోవాల్సి ఉంది. ఈ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అధికారాలు పెంచుతూ పటిష్టపరచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం మన రాష్ట్ర బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం మినహా, వేరే అధికారాలు లేవు. అలాగే ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పించడంలాంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం మేరకు కమిషన్ చైర్మన్, సభ్యులను బీసీల వాస్తవ జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని వారిని నియమించడం వలన 'కమిషన్' పనితీరు ఆశాజనకంగా కొనసాగడం లేదు. ప్రధానంగా చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జీలను నియమిస్తుండడం వలన వయోభారంతో వీరు సరిగా పనిచేయలేక పోతున్నారు. వీరికి బీసీల పట్ల అవగాహన ఉండటం కూడా అరుదు. వీరు ఆకళింపు చేసుకునేసరికే పుణ్యకాలం కాస్తా పూర్తయి కొత్త పాలకమండలి నియామకం కావడం సాధారణ అంశంగా మారింది.

జాతీయ, రాష్ట్రాల పరిధుల్లో రాజ్యాంగబద్ధ హక్కులు కలిగి ఉన్న ఎస్.సి, ఎస్.టి, మహిళా, మైనార్టీ కమిషన్ల సభ్యులు ప్రధానంగా చైర్మన్ల నియామకాలలో ఆయా సామాజిక రంగాలలో విశేషంగా కృషిచేస్తున్న ప్రముఖుల్ని, సామాజిక వేత్తలను, రాజనీతిజ్ఞులను నియమించుకునే సంప్రదాయాన్ని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు బీసీ కమిషన్లకు ఈ వర్గాలపై పరిజ్ఞానంలేని జడ్జీలను నియమించాలనే నిబంధన సమంజసం కాదు. ఇందులో ఎలాంటి హేతుబద్దత లేదు. సాధారణంగా రిటైర్డ్ జడ్జీలు మాత్రమే చైర్మన్లుగా పనిచేయడానికి సమ్మతిస్తారు. అయితే ఈ హోదా వారికి సమాజంలో గౌరవం లభించడానికి దోహదం చేస్తుంది. కాని బీసీలకు ఏమాత్రం ప్రయోజనం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గమనించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి బీసీల సమగ్రాభివృద్ధిని కాంక్షించిన ఉత్తరప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి బీసీ కమిషన్ చట్టాలను సవరించి, కమిషన్‌లకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను పర్యవేక్షించే విశేషాధికారాలను కల్పించాయి. చైర్మన్, సభ్యులుగా సామాజిక వేత్తలను, ఈ వర్గాల హక్కుల కోసం పనిచేసే రాజకీయ వేత్తలను నియమించుకోవడానికి వీలుగా చట్టాల్ని సవరించుకున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజిక వేత్తను లేదా సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజనీతిజ్ఞుడిని నియామకం చేయడానికి కమిషన్ చట్టం 20/1993ను సవరించాలి. ఇందుకు సిక్కిం, కర్ణాటక, బీహార్, యుపి బీసీ కమిషన్ చట్టాలను ఆధారంగా తీసుకోవాలి.

బీసీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించి బాధ్యులపై చర్యలు చేపట్టడానికి కమిషన్ అధికారాలను విస్తృతపర్చాలి. అందుకు ఉత్తరప్రదేశ్ బీసీ కమిషన్ చట్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులను ముగ్గురినుండి, ఐదుగురికి పెంచాలి. ఇందులో ఒకరు తప్పక ఈ సామాజిక వర్గాలకు చెందిన మహిళా ప్రతినిధికి అవకాశం కల్పించాలి. అందుకు ఉత్తరప్రదేశ్, కర్నాటక బీసీ కమిషన్ చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాల పరిమితి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచాలి.
- ఆర్. కృష్ణయ్య
అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం

No comments:

Post a Comment