Thursday, October 13, 2011

తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్ By మందకృష్ణ మాదిగ Andhra Jyothi Dated 13/10/2011

తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్
- మందకృష్ణ మాదిగ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశం సెప్టెంబర్ 30న ఖమ్మంలోని అంబేద్కర్‌హాల్‌లో జరిగింది. రాష్ట్ర కమిటీలోని మూడు ప్రాంతాల సీనియర్ నాయకులు, ప్రాంతీయ ఇన్‌చార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణలో ఎమ్మార్పీయస్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని, తెలంగాణలోని 90 శాతం గల బిసి, యస్‌సి, యస్‌టి, మైనారిటీ వర్గాలను సామాజిక తెలంగాణకు అనుకూలంగా పెద్దఎత్తున సమీకరించాలని తీర్మానించడం జరిగింది.

సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఈ వర్గాలను సంఘటితంచేయడంలో భాగంగా చైతన్యం చేయడానికి అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రెండు నెలల పాటు ప్రతి రోజు రెండు నియోజకవర్గాలలో సామాజిక తెలంగాణ సాధనకై, పెద్ద ఎత్తున సభలను నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. మరో తీర్మానంలో తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బడుగు, బలహీన వర్గాల నాయకుడు త్యాగం, పోరాటం, సాహసం, పట్టుదల, అంకిత భావం ఉద్యమ స్ఫూర్తితో బాటు పాలనా దక్షత గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనే నియమించాలని ఎమ్మార్పీయస్ తీర్మానించింది.

తెలంగాణ రాష్ట్రసాధనకై జరుగుతున్న ఉద్యమంలో త్యాగపూరితమైన పాత్ర పోషిస్తున్న ఈ అణగారిన వర్గాలు వచ్చే తెలంగాణలో సామాజికన్యాయం అమలుజరిగే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు ఆర్థిక, సామాజిక, విద్య -ఉపాధి, రాజకీయ తదితర రంగాలలో తీసుకోవాలని అనుకుంటే అందుకు ముఖ్యమంత్రిగా బాపూజీ నిజమైన అర్హుడని ఎమ్మా ర్పీయస్ సంపూర్ణంగా విశ్వసిస్తుం ది. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని అమలు చేయించుకునే దిశగా బాపూజీని ముఖ్యమంత్రిగా నియమించడానికి ఎమ్మార్పీయస్ ముందు వరుసలో నిలబడి పీడిత కులాలన్నింటినీ కూడగడుతుంది.

బాపూజీని ముఖ్యమంత్రిగా నియమించడానికి బలమైన అండదండలు అందిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను ఒక తాటి మీదకి తీసుకొచ్చే విషయంలో కూడా ఎమ్మార్పీయస్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే విషయంలో తెలంగాణ ప్రజల, వివిధ వర్గాల సమూహాల మధ్య ఏకాభిప్రాయం వుంది. అందులో రెండో మాటే లేదు. అంతే కాకుండ సీమాంధ్ర ప్రాం తాలలో కూడ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న దళిత, బలహీనవర్గాలు, విద్యావంతులు, మేధావులలో తెలంగాణ ఏర్పాటు పట్ల సానుకూలత వుంది.

తెలంగాణ ఏర్పాటు పట్ల సీమాంధ్రలో ఉండే సానుకూలతను కూడగట్టే విషయంలో కూడా ఎమ్మార్పీయస్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి బాపూజీని ప్రథమ ముఖ్యమంత్రిని చేయడం వల్ల ఆయనలో ఉన్న సామాజిక దృక్పథం, సామాజిక తెలంగాణకు దారితీస్తుంది. దొరల తెలంగాణకు సీమాంధ్రలోని పీడిత కులాలలో సహజంగా ఉండే వ్యతిరేకత కనుమరుగై సామాజిక తెలంగాణకు మరింత మద్దతు సీమాంధ్ర పీడిత కులాల నుంచి దొరుకుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తెలంగాణప్రజల్లో ఏకాభిప్రాయం ఉన్నది. తెలంగాణేతర ప్రజల్లో కూడా సానుభూతి ఉన్నది. అయినా తెలంగాణ ఏర్పడ్డ తరువాత అది దొరల చేతికి పోతుందేమో అనే భయం, తద్వారా దొరల పాలనలో మరింత అణచివేతకు, వివక్షకు గురవుతామనే ఆందోళన తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలకు ఉంది. నిజాం పరిపాలనను అడ్డం పెట్టుకొని భూస్వాములుగా, జమిందారులుగా, జాగీర్దారులుగా ఎదిగిన వెలమ, రెడ్డి దొరలు సామంతరాజులుగా గడీల ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను వారి వారి పరిధిలోని వందలాది గ్రామాలను ఆయా గ్రామాల్లో పీడిత కులాల ప్రజలను నిట్టనిలువున దోపిడీ చేశారు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనలో వున్న భూభాగంలో పేదవాడు ఏ పనిచేసినా కనీస వేతనాలు అమలు జరగడం వల్లనే పీడిత కులాలు కొంత ఆర్థికంగా పుంజుకోవడం జరిగింది. తెలంగాణలోని ఈ వెలమ, రెడ్డి దొరలు పీడిత కులాల వారందరి చేత వెట్టిచేయించుకున్న చరిత్ర వుంది. తెలంగాణ అవతలి ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో దళితులు, పీడితకులాలు చదువు నేర్చుకోవడానికి మార్గం ఏర్పడితే తెలంగాణలో ఈ దొరలు తమ బిడ్డలను ప్రాథమిక, మాధ్యమిక చదువులకు పక్క రాష్ట్రాలకు పంపి ఇంగ్లీషు చదువులు నేర్పించి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు.

దళితులు, పీడిత కులాల ప్రజలు చదువు నేర్చుకోవాలని ఆలోచిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పడకుండ ఈ దొరలు అడ్డు పడింది వాస్తవం కాదా? అంతే కాకుండ మీ పిల్లలను బళ్ళోకి పంపితే మాకు ఎట్టి చేసేటోడు ఎవడ్రా అని దౌర్జన్యాలు చేసిన సంఘటనలు కోకొల్లలే కదా? గడీల ముందు దొరలు ఎదురయినప్పుడు తన కాళ్ళ చెప్పులను తన సంకలో పెట్టుకొని తలదించుకొని దొరలకు వంగి వంగి దండం పెట్టే పరిస్థితే గతంలో కొనసాగిన విషయం మేం మరచిపోలేం. తెలంగాణలోని దొరల అణచివేత, పీడనకు వ్యతిరేకంగా పీడిత కులాలు తమ ప్రాణాలను అడ్డంపెట్టి ఎదురు తిరిగిన సందర్భాలున్నాయి.

ఆ సందర్భమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కావటానికి దారితీసింది. ఎట్టికి వ్యతిరేకంగా, తెలంగాణ దొరల, భూస్వాముల అహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో 1946 నుంచి 1951 వరకు దాదాపు 6 వేల మంది అణగారిన వర్గాల వారు అసువులు బాశారు. సాయుధ పోరాటానికి, ప్రజల తిరుగుబాటుకు భయపడ్డ దొరలు ఊర్లను, గడీలను వదలి పట్నం చేరారు. సాయుధ పోరాట విరమణ అనంతరం ఆ దొరలు, భూస్వాములే తిరిగి కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని, ఆ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువాలు టోపీలు ధరించి గ్రామాలు చేరి ప్రజల మీద పెత్తనం చేయడం ప్రారంభించారు.

ఆ విధంగా దొరల పెత్తనం తిరిగి అన్ని అణగారిన వర్గాలను దౌర్జన్యంగ తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం జరిగింది. దొరల పెత్తనాన్ని ప్రశ్నించిన వాళ్ళను హింసలకు గురిచేయటం పీడితకులాల మహిళల మీద దొరల అన్ని రకాల అకృత్యాలు పెరగడం సర్వసాధారణమయింది. ఆ పరిస్థితుల్లోనే మళ్ళీ దొరలకు వ్యతిరేకంగా పీడిత కులాల హక్కుల, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మొదలైన ఉద్యమమే నక్సలైట్ ఉద్యమానికి దారి తీసింది.

పీడిత కులాల ఆగ్రహం నక్సలైట్ ఉద్యమం మరింత బలపడడానికే దారి తీసింది. పీడిత కులాల ప్రజల ప్రతిఘటన వల్ల కొంత మంది దొరలు ప్రజల ఆగ్రహానికి గురై హతం కావడంతో మిగిలిన దొరలు మళ్ళీ పట్నాలకు చేరారు. ఆనాడు సాయుధ పోరాటానికి భయపడి పట్నాలకు చేరిన దొరలు (1946-51), సాయుధపోరాటం విరమణ అనంతరం కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకొని తిరిగి పల్లెలకు చేరినట్టుగానే, మూడు నాలుగు దశాబ్దాల క్రితం నక్సలైట్ ఉద్యమానికి భయపడి పట్నాల దారి పట్టిన దొరలే టిఆర్ఎస్ ఏర్పడ్డ గత దశాబ్దం నుంచి తెలంగాణ సెంటిమెంటు ముసుగులో గ్రామాలకు చేరి టిఆర్ఎస్, జెఎసిల పేరుతో గ్రామీణ ప్రజల మీద తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇది వాస్తవం.

పీడితకులాల పోరాట స్ఫూర్తి, త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆ ఏర్పడ్డ తెలంగాణ పరిపాలన టిఆర్ఎస్ ముసుగులో జెఎసి పేరుతో వెలమ, రెడ్ల చేతికే అధికారం పోతే ఇక అణగారిన వర్గాల జీవితాలు మళ్ళీ అధోగతి పాలే. ఈ భయం తెలంగాణ లోని అన్ని అణగారిన వర్గాల ప్రజలను వేధిస్తుంది. దీనికి పరిష్కార మార్గమే కొండా లక్ష్మణ్ బాపూజీని ముఖ్యమంత్రిగా చేయడం. తద్వారా సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీస్తుందని ఎమ్మార్పీయస్ భావిస్తుంది. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని దొరలు నమ్మించవచ్చు. దొరల మాటలు నమ్మేంత అమాయకులు ఇప్పుడు ఎవరూ లేరు.

ఎందుకంటే టిఆర్ఎస్ ఏర్పడ్డ ఈ పదేళ్ళ కాలంలో తెలంగాణలోని పది జిల్లాల్లో ఈ నాటికీ ఏ జిల్లాకు ఒక్క దళితుణ్ణి టిఆర్ఎస్ అధ్యక్షుణ్ణి చేయలేదు. లక్షలాది మందితో జరుగుతున్న బహిరంగ సభల వేదిక మీద ఒక దళిత నేతనూ ముందు వరసన తమ పక్కన కూర్చో బెట్టుకున్న సందర్భం మచ్చుకైనా లేదు. టిఆర్ఎస్ అధినాయకత్వం ఆయా సందర్భాల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో గాని వివి ధ జాతీయ రాజకీయపక్షాల నేతలతో గాని చర్చలు జరపటానికి వెళ్ళి న సందర్భాలలో ఒక్క దళిత నాయకుణ్ణి కూడా వెంటతీసుకెళ్ళిన సంద ర్భం లేదు.

ఇక పోతే 97 ఏళ్ళ వయస్సుగల కొండా లక్ష్మణ్ బాపూజీనే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎందుకు కోరుకుంటున్నారనే ప్రశ్న కొంత ఉదయించక తప్పదు. ఎమ్మార్పీయస్ ఆయనలో రెండు నిర్దిష్టమైన లక్షణాలను గమనించింది. (అ) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత; (ఆ) అణగారిన కులాల ప్రజలు పడుతున్న బాధలను తొలగించే విషయంలో వారికి దక్కవలసిన న్యాయమైన హక్కులను అందించే విషయంలో ఆయన పీడిత కులాల పక్షపాతిగా గతంలో నిలబడ్డారు. ఇక ముందు కూడ ఆయన సామాజిక న్యాయాన్ని కోరే శక్తులను ప్రోత్సహించే విషయంలో మరింత క్రియాశీలమైన పాత్ర వహిస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.

కొండా లక్ష్మణ్ బాపూజీ గారినే ఎమ్మార్పీయస్ ప్రథమ ముఖ్యమంత్రిగా కోరుకోవడానికి ఆయనలోవున్న ఈక్రింది పది లక్షణాలు కారణాలని మేం స్పష్టం చేస్తున్నాం. తాను స్వాతంత్య్ర సమరయోధుడిగా జైలు జీవితాన్ని గడిపిన మొదటి తరం యోధుడు; నైజాం స్టేట్ భారతదేశంలో విలీనమయ్యేందుకు ఎన్నోకష్టాలకు ఓర్చి ఉద్యమాన్ని నిర్వహించిన ధీశాలి; 1959లో తమ స్వగృహమైన జలదృశ్యంలో దేశంలోనే ప్రథమ దళిత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన దళిత దీన జనుల పక్షపాతి;

1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కిరాతకంగా అణచివేస్తున్న సందర్భంలో ఉద్యమానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తన క్యాబినెట్ మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మొట్ట మొదటి త్యాగశీలి; తన జలదృశ్యాన్ని (తన ఇంటిని) అణగారిన కులాల సామాజిక ఉద్యమాలకు, తెలంగాణ ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమాలకి, సంఘాలకి, పార్టీలకు గొడుగుగా మార్చిన పెద్ద మనసున్న పెద్ద మనిషి;

తన సామాజిక వర్గమైన చేనేత సహకార సంఘానికే కాకుండా మాదిగ చర్మకార పరిశ్రమ అభివృద్ధికి 1960లోనే నాయుడమ్మ కమిషన్‌ను నియమించిన మాదిగ బంధువు. ఈ రోజువున్న బలహీన వర్గాల ప్రతి వృత్తి కులసంఘాలయిన గీత, మత్స్య, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకార, రజక, మేదరి తదితర కులవృత్తి సంఘాలను నెలకొల్పడానికి మనసావాచా ప్రోత్సహించిన పీడిత కులాల పక్షపాతి; టి.ఆర్.యస్ ఆవిర్భావానికి తన ఇల్లు (జలదృశ్యం) ఇచ్చి ఆనాటి ముఖ్యమంత్రి కోపానికి గురై ఇంటినే పోగొట్టుకున్న నిఖార్సయిన తెలంగాణ స్ఫూర్తిదాత;

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి డిప్యూటీ స్పీకరై, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా వుండి ఇప్పుడు సొంత ఇల్లులేని నిస్వార్థ ప్రజాసేవకుడు; 97 ఏళ్ళ వయస్సు వచ్చినా ఇప్పటికీ ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణం కట్టుకొని తెలంగాణ వాదులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రమజీవి; తన సుదీర్ఘ ప్రజారాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తెలంగాణ విషయంలో గాని పీడితకులాలకు సామాజిక న్యాయం సాధించే విషయంలో గాని రాజీపడకుండా ధృడ సంకల్పంతో తను నమ్ముకున్న ఆశయ సాధన కోసం పట్టువదలని విక్రమార్కుడిలాగ ప్రయాణిస్తున్న బాటసారి.

- మందకృష్ణ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

No comments:

Post a Comment