Thursday, October 13, 2011

పట్నం తగవులో పరుల స్వార్థం - కె.శ్రీనివాసులు - ఎం.చెన్న బసవయ్య Andhra Jyothi 15/10/2011

పట్నం తగవులో పరుల స్వార్థం
- కె.శ్రీనివాసులు

ప్రస్తుత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన చర్చలలో హైదరాబాద్ స్థాయి కీలక వివాదాంశంగా మారింది. హైదరాబాద్ నగరం చారిత్రకంగా, భౌగోళికంగా రాజకీయంగా, సంస్కృతీపరంగా తెలంగాణకు గుండెకాయ లాంటిది అని తెలంగాణ వాదులు వాదించడం సహజంగానే అర్థం చేసుకోదగ్గది . కానీ హైదరాబాద్‌పై సీమాంధ్రుల వాదనను ఏ కోణం, దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి ? హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి కేవలం తమ పెట్టుబడులే కారణమని సీమాంధ్రులు వాదించడం సరైనదా? కాదా? ఈ వాదన వెనుక నిగూఢ ఎజెండాలేమైనా ఉన్నాయా? ఈ వివాదం పైకి కనపించినంత సులభమైనది కాదు.

మన దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ చరిత్రాత్మక ప్రత్యేకతను కలిగివున్నది. ఈ ప్రత్యేకతకు గల కారణం నిజాం రాజ్యంలో ఉండిన భూపాలన వ్యవస్థ. దీని కారణంగానే నేడు రాష్ట్ర విభజన చర్చలలో హైదరాబాద్ అత్యంత కీలక సమస్యగా మారింది. వీటిని అర్థం చేసుకోవాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత పారిశామిక, వ్యాపారాభివృద్ధి క్రమంలో భాగంగా మారిపోయిన హైదరాబాద్ భూ దృశ్యపు తీరు తెన్నులను, హైదరాబాద్ పట్టణ పెరుగుదలకు గల రాజకీయార్థిక నేపథ్యాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది.

నిజాం కాలంలో భూపాలనా వ్యవస్థ మూడు రకాలుగా ఉండేది. ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా, ప్రావిన్సియల్ సిరీస్, హైదరాబాద్ స్టేట్ (1909) ప్రకారం అవి ఇలా ఉండేవి: (అ) సర్ఫ్-ఏ-ఖాస్ భూములు (రాజమాన్యాలు); (ఆ) జాగీరులు, సంస్థానాలు; (ఇ) ఖాల్స లేదా దివానీ. నిజాం రాజ్యంలోని మొత్తం భూమిలో సర్ఫ్-ఏ-ఖాస్ భూములు పది శాతం ఉండగా, జాగీరులు, సంస్థానాల క్రింద 30 శాతం భూములు ఖాల్స లేదా దివానీల రకం భూములు 60 శాతం ఉండేవి. సర్ఫ్-ఏ-ఖాస్ భూములు అన్నీ (సుమారు 1,30,000 ఎకరాల పైచిలుకు) కూడా అత్రాఫ్-ఇ-బల్దా అంటే హైదరాబాద్ మునిసిపాలిటీ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండేవి.

సర్ఫ్-ఏ-ఖాస్ భూములపై వచ్చే ఆదాయం నిజాం కుటుంబ ఖర్చుల నిమిత్తం ఉపయోగించబడేది. జాగీర్దారుల, సంస్థానాధీశుల భూములు వారి వారి స్వంత భూములుగా పరిగణించబడి కౌలుదారులచే సాగుచేయబడేవి. వీటిపై జాగీరుదారులు, సంస్థానాధీశులు కౌలు రైతుల నుంచి పన్ను వసూలు చేసి కొంత భాగం నిజాం నవాబులకు సమర్పించే వారు. ఖాల్స లేదా దివానీల రకం భూములు రైతుల ఆధీనంలో ఉండి సాగుచేయబడేవి. వాటిపై పన్నును రాజ్యం వసూలు చేసేది.

సర్ఫ్-ఏ-ఖాస్ భూములు, జాగీరు భూములు, జాగీర్దారీ వ్యవస్థ రద్దు, రాష్ట్ర అవతరణ తరువాతి కాలంలో ప్రభుత్వ భూములుగా మారినాయి. హైదరాబాద్ నగరం దేశం నడిబొడ్డున ఉండటంతోపాటు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల సౌలభ్యం కారణంగానే డాక్టర్ అంబేద్కర్ హైదరాబాద్‌ను దేశ రెండవ రాజధానిగా చేయాలనే సూచన చేశారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల అభివృద్ధి ఎక్కువగా జరగటానికి ఈ భూముల సౌలభ్యం ముఖ్య కారణం.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పారిశ్రామిక, ఇతర రంగాల అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వ భూముల వినియోగం అంచలంచెలుగా, ఇటీవలి కాలం వరకు స్వభావరీత్యా ఈ ప్రక్రియ ముఖ్యంగా మూడు ధోరణులుగా కొనసాగింది. మొదటిది- ఈ భూములను కేవలం దేశ, ప్రజా ప్రయోజనాల అభివృద్ధికి వినియోగించడం. పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థలు, పరిశోధన, విద్యా సంస్థలు నెలకొల్పడం ఈ ధోరణి భూ వినియోగం కోవలోకి వస్తాయి. రెండవది- ప్రజాప్రయోజనాలు. పారిశ్రామిక అభివృద్ధిపేరుతోనే సాగిన పరిమిత స్థాయిలో ప్రభుత్వ భూములను ప్రైవేటు పరిశ్రమల పరం చేయడం. ఈ రెండు ధోరణులు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొదలుకొని సుమారు 1970 దశకం వరకు, కొంత మేరకు ఆ తరువాత కాలంలో కూడా కొనసాగినాయి.

మూడోది- భూ వినియోగం. ప్రభుత్వ భూములను కేవలం లాభాపేక్షతో కూడుకున్న పారిశ్రామిక, వ్యాపార, సేవ, రియల్ ఎస్టేట్ రంగాలకు విచ్చల విడిగా ధారాదత్తం చేయడం. ఈ ప్రక్రియ నయా ఉదారవాద విధానాలలో భాగంగా పూర్తిగా దళారి వర్గాలకు రాజకీయ వర్గాలకు ఎక్కువగా ఉపయోగపడింది అని చెప్పవచ్చు. చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్రక్రియ మొదలైంది. ఎన్ టి రామారావు హయాంలోని తెలుగు దేశం ప్రభుత్వానికి, చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్య విధానాల స్వభావరీత్యా తేడాలు ఉన్నాయి.

ఎన్‌టిఆర్ ప్రభుత్వం ఎక్కువగా ప్యాపులిస్ట్, వ్యవసాయ వర్గ స్వభావాన్ని కలిగిఉండగా చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యంగా నయా సంపన్న వర్గ ఎజెండాను ప్రధాన స్రవంతి అభివృద్ధిలో భాగం చేసింది. తద్వారా చంద్రబాబు హయాంలో సీమాంధ్ర నయా సంపన్న వ్యాపార, స్పెక్యులేటర్ వర్గం సంఘటితం కాబడి తెలంగాణ భూములు, వనరులపై ఆధిపత్యం వహించే స్థాయికి ఎదిగింది. దీనిలో భాగంగా తమకు అనుకూల తెలంగాణ దళారీ వర్గాన్ని ఒక దానిని కూడా తయారు చేసుకుంది. దీనితో అభివృద్ధి పేరుతో హైదరాబాద్ వలసీకరణ ప్రక్రియ వేగవంతమైంది.

ప్రభుత్వ భూముల వేలం, ఇతర మార్గాల ద్వారా ప్రైవేటు పరం చేయడం మొదలైంది. ఎంతో కాలంగా చరిత్రాత్మకంగా హైదరాబాద్ తో ముడిపడి ప్రజా ఉపయోగ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, వాటిని రియల్ఎస్టేటు ఆదాయాలుగా మార్చడం (ఆల్విన్, రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు) ఈ కాలంలోనే జరిగింది.

పలు రంగాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి విధానాలు ఎక్కువగా సీమాంధ్ర నయా సంపన్న వర్గాలకు మరింతగా లాభాలు పొందేందుకు దోహదపడగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోని దళిత, బడుగు, బలహీన వర్గాలు, సన్నకారు రైతులు తరాల నుంచి వచ్చిన తమ భూములను కోల్పోయినారు. తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ క్రమపు విధానాలు ఊహించని రీతిలో పెట్రేగిపోయి నేర ప్రవృత్తులను కూడా సంతరించుకున్నాయి.

ఈ ప్రక్రియలో కేవలం సర్ఫ్-ఏ-ఖాస్ భూములే కాకుండా ముస్లిం వక్ఫ్ బోర్డు భూములు సహితం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల వశమైనాయని, వీటి లావాదేవీలతో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని , రెవెన్యూ రికార్డులు సహితం తారుమారు జరిగాయని, అవసరాలకు మించిన భూపందేరాలు జరిగినాయని వార్తలు వచ్చాయి. వీటిలో అత్యధికంగా సీమాంధ్ర వ్యాపార, రియల్ ఎస్టేట్ రాజకీయ వర్గాల వారు ఊహించని విధంగా లబ్ధి పొందగా కొంత మేరకు ఇదే వర్గాలకు చెందిన తెలంగాణ వారు కూడా లబ్ధి పొందారు.

నేడు రాష్ట్ర విభజన చర్చలలో 1969తో పోలిస్తే హైదరాబాదు సమస్యాత్మకంగా మారడానికి పై పరిణామాలే కారణంగా చెప్పవచ్చు. ఒక వేళ తెలంగాణ ఏర్పడితే ముఖ్యంగా హైదరాబాద్ దానిలో భాగమయితే, హైదరాబాద్ భూపందేరాలలో లబ్ధి పొందిన వర్గాల రాజకీయ ఆధిపత్యం కోల్పోవడం జరగవచ్చు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో వెనువెంటనే కాకపోయినా తరువాతి తరువాతి కాలంలోనయినా ఈ విచ్చల విడి భూ పందేరాల బాగోతాలను తిరగతోడవచ్చుననే అనుమానాలు లబ్ధి పొందిన వర్గాలలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

అందువల్లనే ఎట్లాగైనా హైదరాబాద్‌పై పట్టు కోల్పోకూడదు. అలా జరగాలంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే వీరి ప్రయోజనాలు కాపాడబడే అవకాశాలు ఉంటాయి. ఇదీ వీరి వేదనా, తపనా. కావున హైదరాబాద్ నగర అభివృద్ధి పేరుతో జరిగిన రాజకీయాలను వాటి లబ్ధిదారులను తెలంగాణ వాదులు ఉద్యమ క్రమంలో భాగంగా బహిరంగం చేసి కేంద్రపాలిత ప్రాంత వాదనలను ఎండగట్టాల్సిన అవసరమున్నది. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి హయాంలలో చోటుచేసుకున్న హైదరాబాద్ సర్ఫ్-ఏ -ఖాస్ భూముల వ్యవహారాలూ ఒక వేళ బహిర్గతమయితే అవి ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో వెలుగు చూసిన 2 జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని తలదన్నేవిగా ఉండగలవని చెప్పడం ఆశ్చర్యం కాకపోవచ్చు.

- కె.శ్రీనివాసులు
- ఎం.చెన్న బసవయ్య
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులు

1 comment: