Monday, July 21, 2014

కొలంబియాలో అంబేద్కర్‌ - ప్రొ. గాలి వినోద్‌కుమార్‌


Published at: 20-07-2014 01:19 AM
భారత రాజ్యాంగకర్త, ప్రపంచ మేధావి డాక్టర్‌ అంబేద్కర్‌ను యూరోపియన్‌, అమెరికన్‌ సమాజాలు గుర్తించినంతగా భారతదేశం గుర్తించ లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1953 జనవరి 12న అంబేద్కర్‌కు గౌరవ డాక్టరేట్‌ పట్టా డి.లిట్‌ను ప్రదానం చేసింది. ఆ సందర్భంగా ‘అంబేద్కర్‌ స్వయం ప్రతిభావంతుడు, గొప్ప న్యాయకోవిదుడు, శాసనకర్త, అణ గారిన జాతుల విముక్తి ప్రదాత’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివర్ణించింది. భారతదేశంలోని మరే విశ్వవిద్యాలయమూ మన రాజ్యాంగ నిర్మాతను, ఆయన బ్రతికి ఉన్న కాలంలో, సముచిత రీతిలో గౌరవించలేదు.
అంబేద్కర్‌ను సమున్నతంగా గౌరవిస్తోన్న పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో అమెరికాలోని కొలంబియా వర్సిటీని ముందుగా చెప్పుకోవాలి. బరోడా మహారాజు ఇచ్చిన ఉప కార వేతనంతో యువ అంబేద్కర్‌ ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీ కోసం ఆయన 1913 జనవరి 20న ఆ విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు. ఆ ప్రవేశ ప్రాధాన్యాన్ని పురస్కరించుకుని కొలంబియా ఏటా జూలై 13న అంబేద్కర్‌ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తోంది. అంబేద్కర్‌ పేరుతో ఒక అధ్యయన పీఠాన్ని, ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక కొలంబియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. తమ విద్యార్థులయిన ప్రపంచ మేధావుల విద్యా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాటి. ఇది చాలా అరుదైన గౌరవం. ఇటువంటి సమున్నత గౌరవాన్ని పొందిన ప్రపంచ మేధావులలో మన అంబేద్కర్‌ ఒకరు. కొలంబియా వర్సిటీ వలే మరికొన్ని ప్రతిష్ఠాత్మక పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు కూడా అం బేద్కర్‌ పేరిట అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అయితే ఈ దేశంలో, చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైతం అంబేద్కర్‌ పేరుతో ఒక్క అధ్యయన కేంద్రమూ ఏర్పాటుకాక పోవడం బాధాకరమే (అయితే ఉస్మానియా పి.జి. న్యాయకళాశాల కొంతలో కొంత ఈ బాధ్యత నెరవేర్చింది. గత ఏడాది ఉస్మానియా వర్సిటీలో అంబేద్కర్‌ పేరుతో ఒక కొత్త గ్రంథాలయాన్ని నిర్మించారు. న్యాయ కళాశాల ముఖ ద్వారం వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్ట మొదటిదైన డాక్టర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ పీఠం అనే పరిశోధన కేంద్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న ప్రారంభించడం జరిగింది). కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబే ద్కర్‌ చదివింది కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే (1913 నుంచి 1916 వరకు). తన విద్యాభ్యాస కాలంలో ఆ విశ్వవిద్యాలయంలో సామాజిక, మానవీయ శాస్త్రాలలో ఆచార్యులుగా ఉన్న జాన్‌డ్యూయి, షాట్‌ వెల్‌, రాబిన్‌సన్‌, ఎడ్విన్‌ సెలిగ్‌ మాన్‌, క్లార్క్‌ సీగెర్‌, మారె, పాట్‌ బిల్‌, చూడ్‌విక్‌, గిడ్డింగ్స్‌, సిమ్‌కోవిచ్‌, గోల్డెన్‌విసెర్‌లను ఆయన తన ప్రతిభాపాటవాలతో ముగ్ధులను చేశారు.
కొలంబియాలో విద్యార్థిగా అంబేద్కర్‌ రోజూ 18 గంటల పాటు నిరంతర అధ్యయనంలో గడిపేవారు. బరోడా మహారాజు ఇచ్చిన ఉపకార వేతనం సరిపోకపోవడంతో అంబేద్కర్‌ ఒక్క పూట మాత్రమే భోజనం చేసి రెండోపూట ఒక బ్రెడ్‌తోనే సరిపెట్టుకునేవారు. మాస్టర్‌ డిగ్రీని ఉన్నత ప్రతిభతో పూర్తిచేసిన వెంటనే 1915లోనే ‘ప్రాచీన భారత వాణిజ్యం’ అనే అంశంపై ఒక పరిశోధనా పత్రాన్ని అంబేద్కర్‌ సమర్పించారు 1916లో ‘నేషనల్‌ డివిడెండ్‌ ఆఫ్‌ ఇండియా: ఏ హిస్టారిక్‌ అండ్‌ అనాలిటికల్‌ స్టడీ’ అనే మరో పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ రెండే గాక, 1916లోనే ‘క్యాస్ట్స్‌ ఇన్‌ ఇండియా : దేయిర్‌ మెకానిజం, జెనిసిస్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌’ అనే ప్రతిభావంతమైన పరిశోధనా పత్రాన్ని కూడా అంబేద్కర్‌ రచించారు (తదనంతర కాలంలో ఆయన రాసిన ‘కులనిర్మూలన’ అనే సుప్రసిద్ధ గ్రంథానికి ఈ పరిశోధనా పత్రమే నాంది). ఈ మూడు పరిశోధనా పత్రాలు కొలంబియా ఆచార్యుల ప్రశంసలను ఎంతగానో పొందాయి. కొందరు ఆచార్యులు అంబేద్కర్‌ గౌరవార్థం విందు కూడా ఇచ్చారు.
కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నకాలంలో పాశ్చాత్య సమాజాన్ని అంబేద్కర్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ సమాజంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాన హక్కులు మొదలైన ప్రజాస్వామిక విలువలు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే ఎలాంటి అసమానతలు లేని నవ భారత సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో భారత రాజ్యాంగ రచనా బాధ్యతలను చేపట్టడానికి అంబేద్కర్‌ అంగీకరించారు. తన ఆశయాలను సంపూర్ణంగా రాజ్యాంగంలో పొందుపర్చే అవకాశాలు ఆయనకు పూర్తిగా లభించలేదన్నది ఒక కఠోర వాస్తవం. అయితే మన సమాజంలో 85 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా కొన్ని ముఖ్యమైన ప్రజాస్వామిక హక్కుల్ని కల్పించడంలో అంబేద్కర్‌ కృతకృత్యులయ్యారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక విలువల్ని తాను బౌద్ధ ధర్మం నుంచి స్వీకరించానే కానీ ఫ్రెంచ్‌, అమెరికన్‌ విప్లవాల నుంచి కాదని ఆయన ఒక సందర్భంలో స్పష్టం చేశారు. తన ఆచార్యుడు జాన్‌ డ్యూయి ప్రభావంతో మానవహక్కుల, మానవ విలువల స్ఫూర్తిని రాజ్యాంగంలో ఆయన పొందుపర్చారు. రాజకీయ అధికారాన్ని సాధించడమే ముఖ్యం కాదని, ఎలాంటి అసమానతలు లేని సమాజాన్ని నిర్మించినపుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని అంబేద్కర్‌ అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ వాదం కాదని, మైనారిటీలకు స్వేచ్ఛ, సమాన హక్కుల్ని కల్పించడమేనని ఆయన పేర్కొన్నారు. అసమానతలకు ఆలవాలంగా ఉన్న సనాతన ధర్మంతో కాకుండా సమత, మానవత, సమాన విలువలతో కూడిన ప్రజాస్వామ్యం కావాలని భారతరాజ్యాంగం ద్వారా అంబేద్కర్‌ ఆశించారు.
అలాంటి సమున్నత విలువల్ని డాక్టర్‌ అంబేద్కర్‌ పాశ్చాత్య సమాజంలో పొందారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి చదువును పూర్తిచేసుకొని భారత్‌కు వచ్చిన వెన్వెంటనే ఆ మేధావికి అడుగడుగునా అవమానమే జరిగింది. ఉండడానికి ఇల్లు, తాగడానికి నీళ్ళు దొరకలేదు. అమెరికాలో ఆఫ్రికన్‌ అమెరికన్‌లు రంగు బేధంతో పడుతున్న బాధలు, భారతీయ సమాజంలో కుల వివక్షతో అట్టడుగు వర్గాల వారు అనుభవిస్తున్న బాధలు వెయ్యి రెట్లు ఎక్కువ అని అంబేద్కర్‌ అన్నారు. అమెరికాలో నల్ల జాతి విముక్తి పోరాటాలకు ఆయన పూర్తి మద్దతు పలికారు. అమెరికాలో శ్వేత, నల్ల జాతీయుల మధ్య సం బంధాలు యజమాని- బానిస సంబంధాలు కాగా భారతీయ సమాజంలోని అంటరానివారుగా పిలవబడే వారి దుస్థితి మహా ఘోరమైనదని అంబేద్కర్‌ అన్నారు.
ఎందుకంటే భారత్‌లో వ్యవస్థీకృతమైన నిషేధాజ్ఞలే కాకుండా, మానసికమైన నిషిద్ధాలు కూడా ఉన్నాయి. కులం పేరుతో సకల మానవీయ విలువలూ మంటగలిసిపోయినందున కులవ్యవస్థను నిర్మూలించాల్సిందేనన్న భావనకు అంబేద్కర్‌ వచ్చారు. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక సమాజం ఏ పునాదులపై నిర్మించబడాలనే విషయమై తన గురువు జాన్‌ డ్యూయీ బోధనలు అంబేద్కర్‌కు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే, మను ధర్మం పునాదిగా నిర్మించబడిన భారత సమాజాన్ని సమానత, మానవతా విలువలు కల్గిన సమాజంగా (భారత రాజ్యాంగం పునాదిగా) పునర్నిర్మించాలని డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశించారు.
పీడిత జన విముక్తికి అంబేద్కర్‌ చూపిన మార్గం ఒక్క భారత్‌లోనే కాదు, యావత్‌ ప్రపంచానికి స్ఫూర్తినిస్తోంది. 21వ శతాబ్దం అంబేద్కర్‌ శతాబ్దంగా ప్రపంచం గుర్తించింది. ప్రపంచ పీడిత మానవాళిని విముక్తపరిచేది అంబే ద్కరిజం మాత్రమేనని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కొలంబియా విశ్వవిద్యాలయం కూడా ప్రపంచ విముక్తికి అంబేద్కర్‌ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించి గౌరవించింది.
మరి అంబేద్కర్‌ పెంపొందించిన రాజ్యాంగ విలువలను పట్టించుకోకుండా ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌’ నిర్మాణం ఎలా సాధ్యమవుతుందో మన ప్రస్తుత పాలకులే చెప్పాలి. కొలంబియా విశ్వవిద్యాలయం స్ఫూర్తితో ప్రతి భారతీయ విశ్వవిద్యాలయమూ అంబేద్కర్‌ ఆలోచనల గొప్పతనాన్ని గుర్తించాలి. ఇది జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామిక సమాజానికి మన దేశంలో పునాదులు పడుతాయి. అటువంటి సమతా సమాజ నిర్మాణమే మన రాజ్యాంగ నిర్మాతకు మనం అందించే నిజమైన నివాళి.
ప్రొ. గాలి వినోద్‌కుమార్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం
(జూలై 20న, అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్‌ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా)

Andhra Jyothi Telugu News Paper Dated: 20/07/2014 

No comments:

Post a Comment