Wednesday, July 23, 2014

చుండూరు న్యాయ పోరాటం-సామాజిక, చారిత్రక నేపథ్యం By డాక్టర్‌ కత్తి పద్మారావు                       ఆ రోజు చేసిన ఉద్యమ ఫలితం వల్లే చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పడింది. పివి నర్సింహారావు ముందు పెట్టిన రెండవ ప్రధానమైన డిమాండ్‌ చుండూరులో రెసిడెన్షియల్‌ కాలేజీ నిర్మాణం. ఈ కాలేజీ ఏర్పాటు తరువాత సుమారు 50 గ్రామాల దళిత విద్యార్థులు చుట్టు ప్రక్కల విద్యావంతులు అవడమేకాక 50 శాతం సీట్లు చుండూరు బాధితులకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్య కల్గిన దళితవాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొందింది. ఈ డిమాండ్‌ను మొదట్లో జనార్దనరెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది.
                   చుండూరు మారణ హోమం జరిగి 2014 ఆగస్టు 6కు 23 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో చుండూరు న్యాయ పోరాట పునశ్చరణ చేద్దాం. 1991 ఆగస్టు 6 ఉదయం అగ్రవర్ణాల వారు బరిసెలు, గండ్ర గొడ్డళ్ళు, కత్తులు, సరిగ బాదులతో చుండూరు దళితవాడ మీద దాడిచేసి ఎనిమిది మందిని దారుణంగా హత్య చేశారు. సామాజిక, సాంస్కృతిక నేపథ్యం నుంచి ఆలోచిస్తే ఈ దారుణ హత్యకు కారణం కేవలం ఈర్ష ్య అని తేలుతుంది. ఈర్ష ్యకు కారణం కేవలం దళితులకు విద్య రావడం, మంచి బట్టలు వేసుకోవడం, అంబేద్కర్‌ విగ్రహాన్ని స్థాపించుకోవడం, కారంచేడులో ప్రారంభమైన దళిత ఉద్యమాన్ని ప్రోత్సహించడం. ఆత్మ గౌరవంతో బతకడమని నిగ్గు తేలింది. చిన్న చిన్న ఘటనలను ఆధారం చేసుకుని అగ్రవర్ణాల వారు దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని వ్యూహం పన్ని ఈ దారుణమైన హత్యలు చేసి, గోనె సంచుల్లో కట్టి తుంగభద్ర కాలువల్లో తొక్కి పెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ తుంగభద్రలో ఉన్న శవాలను ఏరి బయటకు తీసి ప్రపంచానికి చూపించి, పోరాటానికి నడుం కట్టి చలో ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకువెళ్ళింది.
                       జనార్దన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నిందితుల తరపునే ఉన్నారు. ఈ పోరాటంలో ప్రత్యేకమైన మూడు డిమాండ్లు ముందుకొచ్చాయి. ఒకటి 1989 ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఊరిలోనే ప్రత్యేక కోర్టును పెట్టాలనేది ముఖ్యమైన డిమాండ్‌. రెండవది రక్తపాతం జరిగిన దగ్గర ఊరిని మొత్తాన్ని యూనిట్‌గా తీసుకుని అందరికీ పునరావాసం కల్పించాలనేది, మూడవది రెసిడెన్షియల్‌ కాలేజీ ఊరిలో కట్టాలనేది ఈ మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకు చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మూడు ప్రధానమైన డిమాండ్ల కోసం ఢిల్లీలోని బోట్‌క్లబ్‌లో సుమారు నెల రోజులు పోరాటం చేసింది. రాష్ట్రపతి భవన్‌కు ఎస్సీ, ఎస్టీ ఎంపిలు 107 మందితో ర్యాలీ సాగింది. అప్పటి రాష్ట్రపతి ఆర్‌ వెంకట్రామన్‌ మెమోరాండం తీసుకోవడానికి నిరాకరించారు. అప్పుడే దళితుడు రాష్ట్రపతి కావాలనే డిమాండు పుట్టింది. ఒక గ్రామ స్థాయి నుంచి జాతీయవాద స్థాయికి వెళ్ళిన ఉద్యమంలో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, రామ్‌దాస్‌ అటాలే, అరుణ్‌ కాంబ్లే, దళిత్‌ ఏలుమలై, సిఆర్‌ దాస్‌ (కేరళ), భగవాన్‌ దాస్‌ వంటి ప్రముఖ దళిత ఉద్యమకారులతో పాటు బోట్‌ క్లబ్‌లో చుండూరు బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడిన విపి సింగ్‌, శరద్‌పవార్‌, వెంకటస్వామి, బూటాసింగ్‌ వంటి వివిధ పార్టీల ప్రతినిధులు దళిత ఉద్యమ విస్తృతికి దోహదకారులయ్యారు. ముఖ్యంగా నాటి ప్రధానమంత్రి పివి నర్సింహారావుతో చర్చల సందర్భంలో బూటాసింగ్‌ మధ్యవర్తిత్వం వహించారు. ఆనాడు జెఎన్‌యులోని దళిత స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు ఈ చర్చల్లో ఎంతో చురుకుగా పనిచేశారు. ఢిల్లీలో అంబేద్కర్‌ భవన్‌ నుంచి రోజూ బోట్‌ క్లబ్‌ వరకు 25 రోజులు జరిగిన ర్యాలీలు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పివి నర్సింహారావు ఇంటి ముందు జరిగిన ధర్నా ప్రధానమైంది. అక్కడ ఊరిలోనే ప్రత్యేక కోర్టు డిమాండ్‌ ముఖ్యమైంది. ఆ డిమాండ్‌ను ఒప్పుకోవడానికి పార్లమెంటులో ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది. ఆ రోజు చేసిన ఉద్యమ ఫలితం వల్లే చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పడింది. పివి నర్సింహారావు ముందు పెట్టిన రెండవ ప్రధానమైన డిమాండ్‌ చుండూరులో రెసిడెన్షియల్‌ కాలేజీ నిర్మాణం. ఈ కాలేజీ ఏర్పాటు తరువాత సుమారు 50 గ్రామాల దళిత విద్యార్థులు చుట్టు ప్రక్కల విద్యావంతులు అవడమేకాక 50 శాతం సీట్లు చుండూరు బాధితులకు లభ్యమవ్వడంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యున్నత విద్య కల్గిన దళితవాడగా చుండూరు బాధితుల కాలనీ రూపొందింది. ఈ డిమాండ్‌ను మొదట్లో జనార్దనరెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది. దళిత ఉద్యమం నంద్యాలకు చేరుకుని ఆయన మీద మృతవీరుల భార్యలను ఎన్నికల పోటీలో నిలబెట్టడానికి సిద్ధపడినప్పుడే పివి నర్సింహారావు కూడా చర్చలకు కబురు పంపారు. ఈ చర్చల్లో ఆయన రెసిడెన్షియల్‌ కాలేజీని అంగీకరించారు. ఈ పోరాట ఫలితంగా చుండూరు దళితవాడలో ప్రతి కుటుంబానికీ అర ఎకరం చొప్పున 225 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఎక్కువ భూమిని భూమి కొనుగోలు పథకంలోనే ఇచ్చారు. 69 మందికి సామూహిక వివాహాలు చుండూరులో నిర్వహించి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన కుల నిర్మూలన భావాన్ని విస్తృతం చేయడం జరిగింది. చనిపోయిన వారి కుటుంబాలతో సహా 40 మందికి పైగా ఉద్యోగాలు సంపాదించాం.చుండూరు ఉద్యమం గురించి 1998లో మలేషియాలో జరిగిన ప్రపంచ దళిత మహాసభల్లో అభినందన తీర్మానం జరిగింది. ఈ సభకు రెండు వందల దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక కోర్టు నెరవేరే వరకు అన్ని దేశాల ప్రతినిధులు కట్టుబడి ఉంటామని శపథం చేశారు. 1999లో లండన్‌లో జరిగిన మానవ హక్కుల సదస్సుల్లో విపి సింగ్‌తో పాటు పలువురు చుండూరు విషయాన్ని ప్రస్తావించారు. ఇది దేశ, అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడే దశకు వెళ్ళింది.
                       ఇక చుండూరు న్యాయ పోరాటానికి వస్తే చుండూరులో 2004లో ప్రత్యేక కోర్టు ప్రారంభమైంది. చుండూరు సాక్షులకు అమ్ముడుపోయే అవసరం లేదు. వారికి ఇల్లు, పొలం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో ఉన్నారు. చుండూరు సాక్షులు చెప్పిన సాక్ష్యాలతో భారతదేశం అంతా మారుమ్రోగాయి. వారు ఇచ్చిన సాక్ష్యాలతో జడ్జీలే కంటతడి పెట్టారు. ప్రత్యేక కోర్టులో ముద్దాయిలు 219 మంది. ప్రత్యేక కోర్టులో సాక్షులు 134 మంది. అయిదుగురు జడ్జీలు ఈ కేసును విచారించారు. ఈ కోర్టు తీర్పు 2007 జులై 31న వచ్చింది. ఈ కేసు వీర్పు వచ్చే నాటికి 219 మంది ముద్దాయిలకు గాను 179 మంది ముద్దాయిలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ 219లో ఏడుగురిని ఇంకా అరెస్టు కూడా చేయలేదు. చుండూరు ప్రత్యేక కోర్టు 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 2007 ఆగస్టులో ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది. 2014 జనవరిలో అప్పీలుకు వచ్చింది. 2014 ఏప్రిల్‌ 22న చుండూరు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టి వేసింది. దేశమంతా ఈ కేసు కొట్టివేయడాన్ని ఖండించి ఇందులో వివక్ష ఉందని ఉద్యమం చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో అన్ని సంఘాలూ తమ వంతు బాధ్యతను నిర్వహించాయి. డీజీపీ ప్రసాదరావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీలు చేయడానికి అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టులో కేసు అడ్మిట్‌ అయ్యింది (20472/2014). ప్రైవేటు కేసు బాధితుల కమిటీ కన్వీనరు జాలాది మోజెస్‌ వేశారు. దానిని సుప్రీం కోర్టు అంగీకరించింది. 2014 జులై 30న ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ కానుంది. ఈ కేసును వాదించాల్సిందిగా కారంచేడు కేసును సుప్రీం కోర్టులో వాదించిన ఎంఎన్‌ రావును దళిత మహాసభ కోరింది. ప్రభుత్వం అంగీకరించింది. సుప్రీం కోర్టులో మళ్ళీ తప్పక శిక్షలు పడతాయని దళితులే కాక దళిత ఉద్యమ, దళిత ప్రజల మద్దతుదారులంతా ఆశిస్తున్నారు. దేశంలో న్యాయస్థానాలకు, ధర్మానికి కూడా కులం ఉందని చుండూరు కేసు ఋజువు చేసింది. అయితే సామాజిక న్యాయం దళితులకు చేకూరే వరకూ ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి. దళితులు మిగిలిన అన్ని కులాలతో, వర్గాలతో సమాంతరంగా ఎదిగే వరకూ అన్ని దిశలుగా ఈ పోరాటం సాగుతుంది. అయితే చుండూరు న్యాయ పోరాటం వెనుక ఉన్న చరిత్రను సరిగా అవగాహన చేసుకోకపోతే ఇది కేవలం కేసుల కోసం పోరాడినట్టే భావించడం జరుగుతుంది. ఈ న్యాయ పోరాటం దళిత విముక్తి పోరాటంలో భాగం మాత్రమే. అంతిమంగా కులం నిర్మూలన అయ్యే వరకు, భూమి పంపిణీ అయ్యే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో అందరూ భాగస్వాములే.
(ఆగస్టు 6న చుండూరు బాధితుల 23వ వర్ధంతి, జులై 30న సుప్రీం కోర్టులో 
చుండూరు కేసు విచారణ సందర్భంగా) 
- డాక్టర్‌ కత్తి పద్మారావు 
(వ్యాసకర్త దళిత ఉద్యమ నేత)

Prajashakti Telugu News Paper Dated : 23/07/2014 

No comments:

Post a Comment