Friday, July 4, 2014

పౌరసమాజం, శాసనమండలి - ప్రొఫెసర్‌ జి. కృష్ణారెడ్డి డైరెక్టర్‌,


Published at: 04-07-2014 05:33 AM
శాసన మండళ్లలో ఇప్పటికి ఉన్న నియోజకవర్గాలను తొలగించి, అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చిన దళిత, సీ్త్ర, ఆదివాసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించేలా నిర్మాణం చేయాల్సి ఉంది... దిగువసభలు అంటే శాసనసభ, లోక్‌సభలు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎగువ సభలైన శాసనమండలి, రాజ్యసభలు పౌర మాజంలోని శక్తులకు ప్రాతనిధ్యం వహించేలా ఉండాలి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో అణగారిన ప్రజల ప్రాతినిధ్యం చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్య ప్రక్రియలో, చట్టసభల్లో వీరికి ప్రాతినిధ్యం కల్పించడం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ప్రశ్న. రాష్ట్రంలోని శాసనమండలి పునర్నిర్మాణం కొంత మేరకు ఈ శక్తులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అవకాశం ఉంది. సాధారణంగా శాసనమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా చూస్తారు. కానీ లోతుగా చూసినట్లైతే శాసనమండలి నిర్మాణంలో మార్పులు తీసుకువచ్చినట్లైతే ఈ శక్తుల ప్రాతినిధ్యానికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాలలోని చట్ట సభలలో ద్విసభ విధానం అమలులో ఉంది. ఈ విధానాన్ని బైకామరిలిజం అం టారు. సాధారణంగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులతో కూడిన సభ ఒకటి కాగా, పరోక్ష పద్ధతిన నిర్దిష్ట ఓటర్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన సభ మరొకటి. ఈ విధానానికి మూలం బ్రిటిష్‌ పార్లమెంటు వ్యవస్థ. ఉదాహరణకు బ్రిటిష్‌ పార్లమెంటులోని ఎగువ సభను హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ అని, అమెరికాలోని ఎగువ సభను సెనేట్‌గా, భారతదేశంలోని ఎగువ సభను రాజ్యసభ అనీ, రాష్ట్రాల్లో ఉన్న ఎగువ సభలను శాసనమండళ్లు అనీ అంటారు. ప్రజలందరూ ఓట్లు వేసి ఎన్నుకున్న సభ్యులు ఉన్న సభ అన్నింటికంటే శక్తిమంతమైనది.
అలాంటి పరిస్థితుల్లో ఇంకో సభ ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి మౌలికంగా కొన్ని వివరణలు ఉన్నాయి. జాన్‌ స్టువార్ట్‌ మిల్‌ పేర్కొన్నట్లుగా ‘అరిస్టోక్రాటిక్‌ ఇంటలెక్చు వలిజమ్‌’ ప్రకారం డెమోక్రసీలో ప్రజలచే ఎన్నుకోబడిన వ్యవస్థతో పాటుగా మేధోసంపన్న వర్గాలకు కూడా ప్రాతినిధ్యం అవసరం ఉంటుంది. కానీ అలాంటి వారికి ప్రజలచే ఎన్నుకోబడిన చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. అలా వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మరో సభ అవసరం ఉంటుంది. రెండవ సభలో మేధావులకు వోటు కల్పించి చట్టాల రూపకల్పనలో వారికి భాగస్వామ్యం ఇవ్వ డం ద్వారా శాసనవ్యవస్థను పటిష్ఠంగా ఉంచవచ్చనే భావనతో రెండు సభలను ఏర్పాటు చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన సభ అన్ని అంశాలకు, వర్గాలకు ప్రాతినిధ్యం వహించలేదు. ప్రజలచే ఎన్నుకోబడిన సభలలో మెజారిటీకి స్థానందక్కుతుంది. మైనారిటీలకు ఆ సభలో స్థానం ఉండదు. దేశంలో అమలులో ఉన్న ‘ఫస్ట్‌ పాస్ట్‌ పోస్ట్‌ సిస్టం’ సాధారణంగా మెజారిటీ రూల్‌కు దారితీస్తుంది. దాంతో చట్టసభల్లో మైనారిటీలకు స్థానం లేకుండా పోయింది. కావున ఇప్పటివరకు ఉన్నట్లుగా కాకుండా ఎగువ సభల్లో మైనారిటీలకు స్థానం కల్పించాలి. మారుతున్న భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చట్టసభల్లో మైనారిటీలకు, అణగారిన ప్రజలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. అలాంటి వారికి ప్రాతినిధ్యం కల్పించాలని వచ్చిన రిజర్వేషన్ల పద్ధతి చట్టసభల్లో పూర్తిగా ప్రాతినిధ్యం కల్పించలేక పోయింది.
దీనికి రాజ్యసభ, శాసన మండళ్ల (ఎగువసభల) నిర్మాణంలో మార్పు తీసుకురావడం ఎంతైనా అవసరం. దళితులు, సీ్త్రలు, ఆదివాసీలు, మైనారిటీ, ఇతర అణగారినవర్గాల ప్రజలకు తెలంగాణ శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే మార్పులు తీసుకురావాలి. ఇప్పటి లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల నిర్మాణం జనాభా దామాషా ప్రకారం అందరికీ ప్రాతినిధ్యం కల్పించే స్వభావం ఉన్నప్పటికీ, అది మెజారిటేరియన్‌ సిస్టంకు మాత్రమే దారితీస్తుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి మన పార్లమెంటరీ వ్యవస్థ పనిచేసే విధానం దీనిని స్పష్టం చేస్తుంది. మన దేశంలో అధికశాతం చట్ట సభలు సంపన్న వర్గాలకే మేలు చేసే విధంగా పనిచేశాయి. భారతదేశంలో ద్విసభ శాసన వ్యవస్థ భారత ప్రభుత్వ చట్టం -1919 ద్వారా ప్రారంభమైనది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1980ల వరకూ ఎగువ సభలు క్రియాశీలకంగా పనిచేసిన దాఖలాలు లేవు. మొత్తం వ్యవస్థ అప్పటివరకూ కాంగ్రెస్‌ పెత్తనంలో ఉంది. రజినీ కొఠారి నిర్వచించిన విధంగా ‘కాంగ్రెస్‌ సిస్టం’లో పార్లమెంట్‌ 1980ల వరకూ పనిచేసింది. అనగా ప్రతిపక్షం లేకుండా ఉండడం (అటూ, ఇటూ రెండూ కాంగ్రెసే). 1980లలో కొంతవరకు ప్రాంతీయ పార్టీలు బలంగా ముందుకు వచ్చి ఎగువ సభల తీరును మార్చాయి. 1990లలో పౌర సమాజంలో వచ్చిన నూతన, సామాజిక ఉద్యమాల్లోంచి పుట్టిన చిన్న చిన్న పార్టీలతో కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలకు దారితీసింది. దీనితో రాజ్యసభ స్వభావం సామాజికంగా, ప్రాతినిధ్యపరంగా మారిపోయింది.
చాలా రాష్ట్రాల్లో ప్రాం తీయ పార్టీలు అధికారంలోకి రావడంతో రాజ్యసభలో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం పెరిగింది. అయినప్పటికీ, రాజ్యసభ నిర్మాణ స్వభావం మారుతున్న కాలానుగుణ పరిస్థితులకు అనుకూలంగా లేదు. ద్విసభ వ్యవస్థలో పెద్దల సభ అణగారిన వర్గాలు, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఉండడం ప్రజాస్వామిక లక్షణం. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులకనుగుణంగా రాజ్యసభ నిర్మాణస్వభావం మారుతున్నప్పటికీ రాజ్యాంగ బద్ధంగా రాజ్యసభ నిర్మాణ స్వభావంలో మార్పులు చేపట్టడం చాలా అవ సరం. ఇదే పద్ధతి తెలంగాణ శాసనమండలిలో తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. మరోవిధంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాలలో పార్టీలు ఏ విధంగా అయితే రాజ్యసభ ద్వారా సమాఖ్య వ్యవస్థను పటిష్ఠ పరచుకోవాలని భావిస్తున్నాయో, అదే విధంగా రాష్ట్రాల్లో శాసనమండళ్ల ద్వారా స్థానిక శక్తులకు ప్రాతినిధ్యం కల్పిస్తే అధికార వికేంద్రీకరణ ప్రక్రియకు తోడ్పడినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ సమైక్య రాష్ట్రంలో శాసనమండలి చరిత్రను చూసినట్లైతే, 1958లో శాసనమండలిని ఏర్పాటుచేయడం జరిగింది. పైన పేర్కొన్నట్లుగా ‘కాంగ్రెస్‌ సిస్టం’లోని ఈ శాసనమండలి ఎప్పడూ ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే శాసనమండలిని నిరర్థకమని పేర్కొన్నప్పటికినీ తమ అధికారానికి విరుద్ధంగా పనిచేస్తుందనే రాజకీయకారణంతో దానిని 1985లో రద్దు చేయడం జరిగింది.
ఒకవైపు భారత సమాఖ్యలోని రాజ్యసభను పటిష్ఠపరిచే ప్రయత్నంలో ఉన్న తెలుగుదేశం మరో వైపు రాష్ట్రంలోని శాసనమండలిని రద్దుచేసిన విధం స్థానిక శక్తుల ఎదుగుదలకు అవరోధం కల్పించింది. ఇక్కడ మనం 1980 దశకంలో టీడీపీతో పాటుగా ఇతర ప్రాంతీయ పార్టీల ద్వంద్వ విధానం అధికార వికేంద్రీకరణకు ఉద్దేశించిన 64వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకించడంలో కనిపించింది. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్వీయరాజకీయ కారణాలతో 2007లో శాసనమండలిని పునఃస్థాపితంచేశారు. ఏది ఏమైనప్పటికినీ రాజకీయ పార్టీలు శాసనమండలిని ప్రజల ప్రాతినిధ్యం అనే దృష్టి కోణంతో ఎప్పుడూ చూడలేదు. కానీ, తెలంగాణలో వచ్చిన ప్రజా ఉద్యమాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనమండలికి ప్రజాప్రాతినిధ్యాన్ని కల్పించే సామర్థ్యాన్ని గమనించాలి. ఫంక్షనల్‌ రిప్రజెంటేషన్‌ ప్రకారంగా శాసనమండళ్లు ఐదు ప్రధానమైన నియోజకవర్గాలు కలిగి ఉన్నాయి. అవి: స్థానిక సం స్థల ప్రతినిధులు; ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఎమ్మెల్యేలు, గవర్నర్‌ విచక్షణ. రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఈ ఐదు నియోజక వర్గాల ఆధారంగా శాసనమండళ్లను నిర్మించారు. కానీ ఇప్పుడు స్థానికసంస్థల ప్రతినిధులు మినహా ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అప్రా ధాన్యంగా మారాయి. ఇప్పటి పరిస్థితులను చూసినట్లైతే నూతన సామాజిక ఉద్యమాల నుంచి పుట్టుకువచ్చిన దళిత, సీ్త్ర, ఆదివాసీ, మైనారిటీ శక్తులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మండళ్ల నిర్మాణాన్ని మార్చాల్సిన అవసరం ఉంది.స్వాతంత్య్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాలలో రాజకీయాలు ఏకపక్షంగా ఉండేవి. కుల ఆధిపత్య ధోరణిలో రాజకీయాలు సాగేవి. వాటిలో క్రింది శ్రేణులకు ప్రాతినిధ్యం అనే అంశమే లేకుండా ఉండేది.
1980ల తరువాత సమాజంలో వచ్చిన చైతన్యం, అస్తిత్వ, సామాజిక ఉద్యమాల్లో పుట్టుకొచ్చిన శక్తులైన దళిత, సీ్త్ర, ఆదివాసీ, మైనారిటీలకు కొంతవరకు స్థానం దొరికింది. తద్వారా రాజకీయాల్లో స్థూల మార్పులు తీసుకురాబడ్డాయి. సం కీర్ణ రాజకీయాలు వాటి ఫలితమే. రాజకీయాల్లో వచ్చిన మార్పు లకు అనుగుణంగా శాసన మండళ్ల నిర్మాణంలో మార్పులు అవసరం. శాసన మండళ్లలో ఇప్పటికి ఉన్న నియోజకవర్గాలను తొలగించి, అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చిన దళిత, సీ్త్ర, ఆదివాసీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించేలా నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ వర్గాలు తమ తమ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకు తోడ్పడ్డాయి. ఇప్పటికే వారు స్థానిక సంస్థల ద్వారా అధికార వికేంద్రీకరణ ప్రక్రియలో క్రియాశీలకంగా భాగస్వామ్యం పొం దారు. ఈ ప్రజాస్వామిక స్ఫూర్తిని కొనసాగించాలంటే శాసనమండలి నిర్మాణంలో మార్పులు చేసి పైన పేర్కొన్న వర్గాలకు ప్రాతినిధ్యం కొనసాగించాలి. ఇందుకు శాసనమండలి నిర్మాణంలో మార్పులు చేసి పైన పేర్కొన్న వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. తద్వారా తెలంగాణలోని ప్రజా ఉద్యమాల వల్ల సంతరించుకున్న వైవిధ్యత ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దిగువసభలు అంటే శాసనసభ, లోక్‌సభలు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎగువ సభలైన శాసనమండలి, రాజ్యసభలు పౌర మాజంలోని శక్తులకు ప్రాతనిధ్యం వహించేలా ఉండాలి.
- ప్రొఫెసర్‌ జి. కృష్ణారెడ్డి డైరెక్టర్‌,
భారత సామాజిక శాస్ర్తాల పరిశోధన మండలి


Andhra Jyothi Telugu News Paper Dated: 4/7/2014 

No comments:

Post a Comment