Wednesday, July 23, 2014

‘దళిత ప్రతిఘటనా నినాదం’ - దుడ్డు ప్రభాకర్‌

Published at: 24-07-2014 01:11 AM
ఈ దేశంలో పేదలందరికీ ఆకలి సమస్య అయితే, ఆ పేదల్లోని దళితులకు ఆకలితో పాటు అంటరానితనం కూడా సమస్యగా ఉంది. రెండు సమస్యలతో పోరాడుతున్న ఈ దేశ నిషిద్ధ మానవుడు ఆకలి, అంటరానితనం లేని సమాజ నిర్మాణంలో ముందు వరుసలో నిలబడ్డానికి ‘దళిత ప్రతిఘటనా నినాదం’ పుస్తకంలోని వ్యాసాలు, విశ్లేషణలు, డిబేట్‌లు ఉపయోగపడతాయి.
కారంచేడు నరమేధం (1985) నుంచి లక్షింపేట మారణకాండ (2012) దాకా దళితులపై జరిగిన సామూహిక దాడులు, ఆ హంతక మూకల అరెస్టుకై జరిగిన పోరాటాలు, ఆ సందర్భంగా జరిగిన చర్చలను రికార్డు చేసి పుస్తక రూపంలో మనముందుంచిన పాపని నాగరాజు అభినందనీయుడు. కారంచేడు నుంచి ప్యాపిలి దాకా దళితుల పోరాట చరిత్రను ‘దళిత రణన్నినాదం’ పేరుతో ఉ.సా. 2005లో రికార్డు చేశారు. ప్యాపిలి నుంచి లక్షింపేట దాకా ‘దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం’ పేరుతో నాగరాజు పుస్తకరూపంలో తేవడాన్ని ఉసా రాజకీయ వారసత్వ కొనసాగింపులో భాగమని నేననుకుంటున్నాను. అయితే కారంచేడు నుంచి లక్షింపేట దాకా రాష్ట్రంలో అన్ని సంఘటనలు ఇక్కడ రికార్డు కాలేదు. ఇక్కడే కాదు ప్రతిఘటనా దళిత నెత్తుటి చరిత్రగా ఎక్కడా రికార్డు కాలేదు. కారణాలు అనేకం ఉన్నాయి. దళితుల ఆత్మగౌరవ సమస్య ముందుకొచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి చోటా దళితసమూహంపై అత్యంత క్రూరమైన సామూహిక హత్యాకాండ జరుగుతూనే ఉంది. మనిషిగా బతకడం కోసం దళితులు వేస్తున్న ప్రతి అడుగూ నెత్తుటి మడుగవుతుంది. అవన్నీ వెలుగు చూడడం లేదు. బయటి ప్రపంచానికి తెలుస్తున్నవి కొన్నిమాత్రమే. వాటిలో ఉద్యమరూపం తీసుకున్నవి అత్యల్పం. దాడితీవ్రత, పారిన నెత్తుటి పరిమాణం, పెరుగుతున్న టీవీల రేటింగ్‌ను బట్టి లాభాల్ని అంచనావేసుకొని ప్రచారానికి ప్రాధాన్యతస్తున్న కార్పొరేట్‌ మీడియా మాయజాలంలో నాగరాజు చేసిన ప్రయత్నం చిన్నది కాదు.
ఈ దేశ చరిత్రలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరా టాలలో చిందిన నెత్తుర్ని, జరిగిన కుట్రల్ని, తెగిపడిన తలల్ని ఏ చరిత్రకారుడు లెక్కగట్టలేదు. అందుకే ప్రపంచ చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రగా రికార్డయింది. ఈ దేశ ప్రత్యేక పరిస్థితుల్ని నిర్దిష్టంగా పరిశీలించనందువల్ల జరిగిన పొరపాటు కాదది. ఉద్దేశపూర్వకంగా దాటవేసిన కుట్ర. లక్షింపేట మారణకాండ సందర్భంగా జరిగిన డిబేట్‌లో ఆ కుట్రలు ఇంకా స్పష్టంగా, నగ్నంగా బయటపడ్డాయి. అభ్యుదయ వాదులుగా చెలామణి అవుతున్న అనేకమంది ముసుగుల్ని లక్షింపేట దళిత మృతవీరులు బదాబదలు చేశారు. అందుకే ఈ సంకలనం ఒక చారిత్రక అవసరం. మనిషిని మనిషిగా గుర్తించే సమాజాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకమిది. కారంచేడు నాటి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యం లక్షింపేట జరిగిన నాటికి నిర్జీవమయింది. ఎందుకయింది? కారకులెవ్వరు? అని చెప్పడానికే ఆ గాయాల్ని మళ్లీ ఒకసారి గుర్తు చేశాను. ఆ నెత్తుటి బాటలోని ప్రతి మలుపూ వివరంగా పరిశీలించడానికి మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.
కారంచేడు మాదిగలు చిందించిన రక్తం దళిత ఆత్మగౌరవ పోరాటాల్ని పదునెక్కించి ప్రతిఘటనా పోరాటాలకు బాటలు వేసింది. అనేకమంది ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులకు జన్మనిచ్చింది. తరతరాలుగా అగ్రకుల పెత్తందారుల దాడులకు అణచివేతకు గురైన దళితులు స్వతంత్రంగా ఉద్యమం నడుపుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. అంటరానితనం, అవమానాలు, అత్యాచారాలు మౌనంగా భరిస్తూ మూగగా రోదిస్తున్న గొంతుల్లో పొలికేకల్ని ధ్వనింపజేసింది. కుల సమస్య ఈ దేశంలోని అన్ని పార్టీ ఎజెండాల్లో ప్రధాన అంశంగా చేర్చింది.
మహారాష్ట్రలో జరిగిన దళిత పాంథర్స్‌ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్న సమయంలోనే అగ్రకుల భూస్వామ్య పాలకవర్గాలు వ్యూహాలు మార్చుకున్నాయి. వేంపెంట మారణహోమంలో రెడ్లు వెనకుండి మాదిగలు, బీసీలపైకి మాలల్ని కొందరు బీసీలను రెచ్చగొట్టి దాడులు చేయించారు... ఈ నేపథ్యంలో దళిత, బహుజనులకే రాజ్యాధికారం అంటూ రాజ్యాధికారమే ఇలాంటి దాడులకు పరిష్కారమని ఉద్యమనాయకులు తేల్చేశారు. ఆశయం మంచిదే. వారంతా పల్లెల్ని వదిలి పదవులపై ఆశలు పెంచుకోవడమే విషాదం.  అదే అదనుగా స్థానిక ఆధిపత్య శక్తులు పీడిత కులాల మధ్య మిత్ర వైరుధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మార్చుతున్నారు. అందులో భాగంగానే లక్షింపేట జరిగింది. లక్షింపేట మాత్రమే కాదు. వేంపెంట తర్వాత ద ళితులపై జరిగిన మెజారిటీ దాడులు బీసీలు కాకుంటే ఊరు ఊరంతా కలిసి చేసినవే. లక్షింపేట మాలలపై జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమం కంటే మేధాపరమైన చర్చే ఎక్కువగా జరిగింది. కాంగ్రెస్‌ నుంచి సీపీఐ, సీపీఎం దాకా దళితులు నమ్ముకున్న అన్ని ఓట్ల పార్టీలు మెజారిటీ ‘ఊరు’ ఓట్ల కోసం ‘వాడ’ బతుకుల్ని నిర్లక్ష్యం చేశాయి. అంతేకాదు ఊరుకి ప్రత్యక్ష మద్దతు తెలియజేస్తున్నాయి. కారంచేడు తర్వాత కొన్ని ప్రత్యామ్నాయ కుల ఉద్యమ సం స్థలు మినహా అనేక కుల సంఘాల నాయకుల్ని నమ్ముకుంటే స్వార్థ ప్రయోజనాలకు, ప్రలోభాలకు లొంగినట్టే ముంచి హంతక మూకలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఎవరెన్ని ‘దగా’లు చేసినా దళితులు మాత్రం ప్రత్యక్ష యుద్ధక్షేత్రాలుగా మారుతున్న వెలివాడలో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో పేదలందరికీ ఆకలి సమస్య అయితే, ఆ పేదల్లోని దళితులకు ఆకలితో పాటు అంటరానితనం కూడా సమస్యగా ఉంది. రెండు సమస్యలతో పోరాడుతున్న ఈ దేశ నిషిద్ధమానవుడు ఆకలి, అంటరానితనంలేని సమాజ నిర్మాణంలో ముందు వరుసలో నిలబడ్డానికి ఈ పుస్తకంలోని వ్యాసాలు, విశ్లేషణలు, డిబేట్‌లు ఉపయోగపడతాయని ఆశిస్తూ...
దుడ్డు ప్రభాకర్‌
కులనిర్మూలన పోరాట సమితి
(‘దళిత ప్రతిఘటనా నినాదం’ అనే సంకలనం నేడు  హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా ముందుమాటలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi Telugu News Paper Dated: 24/07/2014 

No comments:

Post a Comment