Monday, July 21, 2014

అడవి చెంచుల్ని ఆదుకోవాలి - గంగాపురం లాలయ్య


Published at: 20-07-2014 01:17 AM
గిరిజన తెగలలో చెంచులు, ఎరుకలు, లంబాడీ కులాలవారు ప్రధానంగా ఉన్నారు. లంబాడీలు, ఎరుకల కులస్థులు గ్రామాలలో, మైదాన ప్రాంతాల్లో నివసిస్తుండడంతో చెంచులతో పోలిస్తే సాపేక్షంగా అభివృద్ధి చెందారు. లంబాడీలు, ఎరుకల కులస్థులను గిరిజన జాతుల్లో కలిపిన పిదప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల్లో వారు ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం ఫలితాలను అందుకొని చాలా వరకు అభివృద్ధి చెందారన్నది వాస్తవం. అయితే అడవుల మధ్య, కొండల నడుమ చెంచు గూడేల్లో, పెంటల్లో ఉన్న అడవి చెంచులు నాగరికతకు దూరంగా ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించి, సమర్థులైన అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలితాలు వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నల్లమల అడవి తల్లి బిడ్డలు, గిరి పుత్రులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బతుకంత చీకటి. నిలువ నీడలు లేవు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు చేయడానికి పని కల్పించినపుడే చెంచులు మనలో ఒకరుగా కలసి పోగలరన్న విషయం గుర్తుంచుకొని చర్యలు తీసుకోవాలి. ఆధునిక సమాజంలో అంతరించి పోతున్న చెంచుల జనాభాను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ఆ అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నల్లమల అడవి ప్రాంతంలో కొండల నడుమ నివసిస్తున్న చెంచులు కనీస మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణ భారతదేశంలో దట్టమైన అడవులుగా ప్రసిద్ధి పొందిన నల్లమల అడవులు క్షీణించడం వల్ల చెంచుల జీవనోపాధి సంక్షోభంలో పడి ంది. రెండు దశాబ్దాల క్రితం అడుగడుగున ఉన్న వృక్షాల్ని స్మగర్లు తరలించుకుని పోవడంతో అటవీ ఉత్పత్తులు లభించక, తిండి తిప్పలు నోచుకోక అల్లాడుతున్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాలకు రహదారిలో ఉన్న చెంచు గూడేల్లో కొంత అభివృద్ధి జరిగింది. అయితే గ్రామాలకు దూరంగా నల్లమల అడవి మధ్యలో కొండల నడుమ నివసిస్తున్న చెంచుల అభివృద్ధికి జరిగిన కృషి అత్యల్పం. నిరక్షరాస్యత, ఆరోగ్యం పరిశుభ్రత గురించి తెలియని ఈ చెంచులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గిరిజన స్ర్తీలు, పిల్లల్లో ఎదుగుదల లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం దశాబ్దాలుగా వందలాది కోట్లు నిధులు మంజూరు చేసినా వాటిలో నామమాత్రంగానైనా చెంచుల అభివృద్ధికి చేరుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిథులు, దళారులు ఆ నిధుల్ని భుక్తం చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి పేరుతో మంజూరయ్యే కోట్లాది రూపాయలను ఆయా అధికారులు వెనకేసుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఏకంగా అటవీ ప్రాంతాల నుంచి తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది. అయితే అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో బతుకుదెరువు కోసం వలస బాటనే ఎంచుకుంటున్నారు. 1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. అయితే ఆ అభయారణ్యం నుంచి పులులు బయటికి వచ్చి గ్రామాలపై దాడి చేసి పశువులను కబళించడమే కాక, మనుషులపై కూడా దాడికి తెగబడుతున్నాయి. పులివాత పడి చనిపోయినవారికి ప్రభుత్వం నామమాత్రంగా చెల్లించడంతో ఎంతో మంది చికిత్స పొందుతూనే చనిపోయారు. వేల రూపాయలు విలువ చేసే పశువులు పులి దాడిలో చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వం నామమాత్ర నష్టపరిహారం ఇస్తోంది. దాంతో ఎంతో మంది ఆదివాసులు, అడవి అంచు గ్రామాల్లోని రైతులు వ్యవసాయం మానుకొన్న ఘటనలు అనేకం. చెంచులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం. గిరిజన జాతుల్లో లంబాడీ, ఎరుకలి కులాలవారు చాలావరకు సాంఘికంగా, ఆర్థికంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఎదిగారు. ఈ నేపథ్యంలో చెంచుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది.
ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అమాయక చెంచులకు అందేలా ప్రభుత్వం డెలివరీ మెకానిజంను రూపొందించాలి. కొత్త ప్రభుత్వంపై అడవి చెంచులు కోటి ఆశలు పెట్టుకొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలలో చెంచుల పిల్లలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవుల్లోని పెంటలు, గ్రామాలు, మైదాన ప్రాంతాలలో నివాసం ఉంటున్న చెంచులు ఉపాధి పనులకు వెళ్ళటం, గ్రామాల్లో కూలీలకు వెళ్ళేటపుడు వారి పిల్లల్ని చూసుకునే వారు లేరు. దీంతో వారిని సంరక్షించేందుకు ప్రభుత్వం గత నెల 15న, జీవో 17 విడుదల చేసింది. పుట్టిన ఆరు నెలల పాప నుంచి ఆరేళ్ళ పిల్లల వరకు కేంద్రాలలో సంరక్షించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేస్తూ, సంరక్షణ కోసం ఒక మహిళని నియమించనున్నారు. మహిళకు నెలకు వేతనాన్ని చెల్లించి నియమించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి కొందరు అప్పుడప్పుడు చెంచు గూడేలకు వెళ్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం ఆశించిన స్థాయిలో నాగరికత అబ్బలేదు. ఈ చెంచులకు శాశ్వతగృహాలను నిర్మించడం జరుగుతున్నా సుదూరంగా ఉండే వారికి ఈ సదుపాయం కల్పించడానికి ఇంతవరకు అధికారులు కృషి చేయలేదు. అందువల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు అవకాశం లేకుండా పోయింది. ఉపాధి కల్పన పథకాలలో వీరికి తగిన ప్రోత్సాహం కనిపించడంలేదు. వ్యవసాయ బావులు తవ్వించడం, వ్యవసాయానికి ఎడ్లబండ్లను ఇవ్వడంలోను అడవి చెంచులకు అన్యాయం జరుగుతోంది. అధికారుల దృష్టి అంతా గ్రామాల్లోనూ, అందులోను రహదార్లకు దగ్గర ఉండే వారిపైనే ఉందనడంలో సందేహం లేదు. క్రూర మృగాల సంరక్షణ ప్రాంతాల్లో చెంచు గిరిజన గూడేలు అనాదిగా ఉన్నాయి. అంటే క్రూర మృగాల సంఖ్య పెరగడం వల్ల వారందరిని తరలించి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. అటవీ ప్రాంతాల్లోని పెద్ద గ్రామాల పరిధిలో గిరిజనులకు గృహాలని నిర్మించాలని ప్రభుత్వ సంకల్పించినా, వారు మాత్రం పెద్ద గ్రామాలలో నివసించడానికి ఇష్టపడటంలేదు. అడవిలో చెంచులు మంచినీటి కోసం గూడెం నుంచి కనీసం మూడు కిలోమీటర్లు దూరం నడచి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారి మంచినీటి అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పించక పోవడం దురదృష్టకరం. గిరిజనుల అభివృద్ధికి కోసం కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేయకపోవడంతో తరచూ మురిగిపోతున్నాయి. గ్రామాలకు దగ్గరగా ఉన ్న చెంచులలో కొంత నాగరికత కనిపించినా, సుదూరంగా అడవుల్లో నివసించే వారు బాగా వెనకబడి ఉన్నారు. ఆదివాసుల కోసం రూపొందించే ఏ పథకమైనా వారికి అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించాలి. గిరిజనులకు పునారావాసాలను కేవలం అడవులకు పరిమితం చేయకుండా అవసరమైతే సాధారణ జనావాసాలకు చేరువగా నిర్మించి వారి అభ్యున్నతికి రెండు తెలుగు రాషా్ట్రలు కృషిచేయాలి.
గంగాపురం లాలయ్య
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

Andhra Jyothi Telugu News Paper Dated: 20/07/2014

No comments:

Post a Comment