Monday, July 21, 2014

ప‌నికోసం ఆదివాసీ కార్మి‌కుల అగ‌చాట్లు‌ By అర్చనా ప్రసాద్‌
               ఆదివాసీలు రిజర్వ్‌ లేబర్‌లో పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రూపంలో పెట్టుబడి దారీవాదం కొనసాగించాలంటే ఇది-ఈ రిజర్వ్‌ లేబర్‌ -అనేది చాలా కీలకం. ఆ రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితకు, పని కోరుతున్నా లభించని ఆదివాసీ కార్మికుల సంఖ్య పెరగడానికి, సమకాలీన పెట్టుబడిదారీ విధానం హయాంలో ఆదివాసీలకు ఏమీ లభ్యం కాని ధోరణికి మధ్య సంక్లిష్టమైన, వైవిధ్యమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆదివాసీ కార్మికుల మౌలిక హక్కుల కోసం ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీల్లో తమ రాజకీయపరమైన నిర్మాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా కూడా వారి హక్కులకై పోరాడాల్సి ఉంది
                  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను రూపొందిస్తున్న సమయంలో కఠినమైన రోజులు ముందున్నాయంటూ ఆర్థిక మంత్రి ప్రజలను సమాయత్తం చేస్తున్న తరుణంలో, జనాభా గణాంకాలు ఆదివాసీ కార్మికుల పనితీరుకు సంబంధించిన వివరాలు వెల్లడించాయి. పని కోసం వారు పడుతున్న అగచాట్లను వివరించాయి. ఉపాధి వెతుక్కుంటూ ఆదివాసీ కార్మికులు లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించారని ఈ డేటా స్పష్టంగా పేర్కొంది. అయితే, వారికి ఉపాధి మాత్రం దొరకడం లేదని, దాంతో వారు బతకడం కోసం తక్కువ కూలీకి కూడా సిద్ధపడిపోతున్నారని పేర్కొంది. ఈ ధోరణి, సంస్కరణలు ప్రారంభమైన నాటి నుంచీ ఉన్నప్పటికీ గత దశాబ్ద కాలంలో అయితే మరీ ఎక్కువైంది. ఈ దశాబ్దంలోనే రెండు జనాభా లెక్కలు వెలువడ్డాయి. అదీ 2001, 2011 సంవత్సరాల్లో. ఈ రెండు జనాభా లెక్కల మధ్య గల దశాబ్దంలో వనరులు సుసంపన్నంగా గల ప్రాంతాల్లోకి కార్పొరేట్‌ శక్తులు ముమ్మరంగా చొరబడడం పెరిగింది. అలాగే బడా ప్రాజెక్టుల కోసం ఆదివాసీ భూములను స్వాధీనం చేసుకోవడం కూడా ఈ దశాబ్దంలోనే కనిపించింది. పైకి పురోగతి, అభివృద్ధి సూచికలుగా కనిపించే ఈ ఉదాహరణలను చాలా తరచుగా నయా ఉదారవాదాన్ని బలపరిచే శక్తులు సమర్థిస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరిగితేనే ఆదివాసీలకు ఉపాధి లభిస్తుందని, తద్వారా వారి ప్రాంతాల అభివృద్ధికి దారి తీస్తుందని వారు చెబుతూ ఉంటారు. అయితే, దీనికి విరుద్ధంగా, కార్పొరేట్‌ చొరబాటు కేంద్రాలన్నీ కూడా ఉపాధి కల్పించే కేంద్రాలకు బదులుగా హింసాత్మకమైన, ప్రగతిశీల సామాజిక వైరుధ్యాలకు, ఘర్షణలకు కేంద్రాలుగా మారిపోయాయి. నిలకడగా కొనసాగుతూ వచ్చిన ఈ విధానం యొక్క దీర్ఘకాలిక ప్రభావాన్ని 2001, 2011 మధ్య కాలంలో ఆదివాసీ కార్మిక వర్గంలో వచ్చిన మార్పుల్లో చూడవచ్చు.

పని ప్రాతినిధ్యంలో ప్రధాన ధోరణులు

                  కార్మిక వర్గానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన డేటాను బాల కార్మికులు (5-14 ఏళ్ళు), రెగ్యులర్‌ కార్మికులు(15-59), వృద్ధులైన కార్మికులు (60 ఏళ్ళు, ఆ పైబడిన వారు)గా వర్గీకరించి విశ్లేషించవచ్చు. ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే ఆదివాసీ కార్మికులకు సంబంధించి వివిధ వర్గాల్లో నయా ఉదారవాదం విస్తృత ప్రభావం ఏ మేరకు ఉందో మనకు తెలిసిపోతుంది. 2001, 2011 మధ్య కాలంలో ఎస్‌టి కార్మిక వర్గంలో మార్పులు కూడా ఈ కింది పరిస్థితులను తెలియపరుస్తున్నాయి.
                  మొదటగా, మొత్తం కార్మిక వర్గంతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల నమోదై నప్పటికీ రెగ్యులర్‌ కార్మికులకు (15-59 సంవత్స రాలు) సంబంధించి చూసినట్లైతే ఉపాధిలో బాగా క్షీణత కనిపిస్తోంది. బాల కార్మికులు కూడా తగ్గారు. ఇక రెండవది, ఉపాధిలో క్షీణత అనేది గ్రామీణ ప్రాంతాల్లో పని కొరవడడం వల్లనే జరుగు తోంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఈ స్థాయిలో క్షీణత అనేది కనిపించడం లేదు. పైగా, పట్టణ కార్మిక వర్గంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇది కూడా పట్టణ మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెరగడం వల్లనే సంభవించింది. గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ మహిళా కార్మికుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మహిళా కార్మికుల ప్రాతినిధ్యం పెరిగింది. దాదాపు ఐదు లక్షల మంది మహిళా కార్మికులు నమోదయ్యారు లేదా దామాషా పద్ధతిలో 2.68 శాతం పెరిగారు. దీనికి భిన్నంగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల సంఖ్య 32 లక్షల వరకు పెరిగింది. కానీ ప్రతికూల వృద్ధిరేటు 1.84 శాతం నమోదైంది. గ్రామీణ పురుష కార్మికులు ఒక అర శాతం పెరిగారు. లేదా 42 లక్షల మంది వరకు నమోదయ్యారు. కానీ, ఈ పెరుగుదల అనేది స్వల్ప కార్మిక వర్గంలోనే కనిపించింది. మరోవైపు మహిళా కార్మికులు 2 శాతం కన్నా తక్కువ రేటు చొప్పున తగ్గుతూ వచ్చారు. ప్రధాన పనుల్లో ఈ నష్టం, మహిళా కార్మికుల స్థానే పురుష వ్యవసాయ కార్మికులను చొప్పించడం చూస్తుంటే గ్రామీణ రంగంలో ఉపాధి సరిగా లేదని, పైగా సంక్షోభం, నిరాశా నిస్పృహలు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఇక మూడవది, మొత్తం కార్మిక వర్గంలో 60 ఏళ్ళకు పైబడిన కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ కూడా, బాగా పెద్ద మొత్తంలో పెరిగింది మహిళా కార్మికులే. అది కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే. పెరిగింది కూడా ఐదు లక్షల మంది వరకు మహిళా కార్మికులే. ఈ డేటా అంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. రెగ్యులర్‌ కార్మికులకు సరైన, లాభసాటి అయిన ఉపాధి దొరకడమే కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితుల్లో మరింత మంది మహిళలు పని వెతుక్కుంటూ వస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

పెరుగుతున్న నిరుద్యోగం

               ఎస్‌టిల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నప్పటికీ మరింత మంది పురుషులు, మహిళలు, పిల్లలు పని కోసం వెతుక్కుంటూ లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుండడం గణనీయంగా కనిపిస్తోంది. మొత్తం కార్మికుల్లో బాల కార్మికుల సంఖ్య తగ్గినప్పటికీ లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే బాలల సంఖ్య మాత్రం పెరిగింది. బాల కార్మికులు తగ్గుతున్నారంటే దానర్థం నయా ఉదారవాద ప్రభుత్వ విద్యా విధానాల ప్రభావం కారణమని భావించాల్సిన అవసరం కూడా లేదని, మరింత పనిచేయగలిగిన కార్మికులు లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడమే కాకుండా తక్కువ వేతనాలకు చేయడానికి కూడా సుముఖంగా ఉండడంతోనే బాల కార్మికుల సంఖ్య తగ్గుతోందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల, రెగ్యులర్‌ కార్మికుల కన్నా కూడా పని కావాలని కోరుతూ వచ్చే బాల కార్మికుల సంఖ్య ఎక్కువ ఉండడం మనం చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ పురుష, మహిళా కార్మికులు పెరగగా పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా మహిళా రెగ్యులర్‌ కార్మికులే పెరిగారు. రెగ్యులర్‌ కార్మికుల్లో పట్టణ పురుష కార్మికులు తగ్గుతున్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే పురుష కార్మికులు మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళిపోతుండడం కనిపిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ పనుల వైపు వీరు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇలా పని కోసం వెతుక్కుంటూ వెళుతున్నారంటే వ్యవసాయ రంగ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించబడిందని కూడా అనుకోనక్కరలేదు. దానికన్నా కూడా తక్కువ వేతనాలు, సరిగా లేని పని పరిస్థితుల కారణంగా గ్రామీణ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గడానికి ఇది దారి తీసే అవకాశం ఉంది.
                  పైన పేర్కొన్న విశ్లేషణలో సూచించినట్లుగా, ఆదివాసీ కార్మికులు పెద్ద సంఖ్యలో లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారని జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, వారికి అక్కడ ఎలాంటి ఉపాధీ దొరకడం లేదు. అంటే, దీన్ని బట్టి చూస్తే ఆదివాసీలు రిజర్వ్‌ లేబర్‌లో పెద్ద సంఖ్యలో మిగిలిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుత రూపంలో పెట్టుబడి దారీవాదం కొనసాగించాలంటే ఇది-ఈ రిజర్వ్‌ లేబర్‌ -అనేది చాలా కీలకం. ఆ రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగితకు, పని కోరుతున్నా లభించని ఆదివాసీ కార్మికుల సంఖ్య పెరగడానికి, సమకాలీన పెట్టుబడిదారీ విధానం హయాంలో ఆదివాసీలకు ఏమీ లభ్యం కాని ధోరణికి మధ్య సంక్లిష్టమైన, వైవిధ్యమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆదివాసీ కార్మికుల మౌలిక హక్కుల కోసం ప్రజాస్వామ్య ఉద్యమాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీల్లో తమ రాజకీయపరమైన నిర్మాణాలను మరింత బలోపేతం చేయడం ద్వారా కూడా వారి హక్కులకై పోరాడాల్సి ఉంది. అయితే, ఆదివాసీ కార్మికుని మనుగడపై జరుగుతున్న నయా ఉదారవాద దాడిని తిప్పికొట్టేందుకు విశ్వసనీయమైన, ప్రగతిశీల సవాలును విసిరేలా అన్ని సామాజిక గ్రూపులకు చెందిన కార్మికుల మధ్య ఐక్యత నెలకొన్న నేపథ్యంలో ఈ పోరాటం చేపట్టాల్సిన అవసరం ఉంది.
                

Prajashakti Telugu News Paper Dated: 17/07/2014 

No comments:

Post a Comment