Monday, July 21, 2014

రిజర్వేషన్లు ఉండాల్సిందే - బి. విజయభారతి


Published at: 18-07-2014 01:05 AM
రిజర్వేషన్ల గురించీ కులనిర్మూలన గురించీ సాగుతున్న చర్చలు సమస్యలను మరింత జటిలం చేస్తూ సమసమాజ ఆవిర్భావాన్ని మరింత వెనక్కు నెడుతున్నాయి. భారతదేశంలో రిజ ర్వేషన్ల వ్యవస్థ అతి ప్రాచీన కాలం నుంచీ అంటే భా రతీయ/హిందూ ధర్మశాస్ర్తాల కాలం నుంచీ ఉన్నది. గౌరవప్రదమైన వృత్తులు కొన్ని కులాలకూ హీన వృత్తులు కొన్ని కులాలకూ రిజర్వు చేయబడ్డాయి. చాతుర్వర్ణ వ్యవస్థ భారతదేశ సంస్కృతిలో ప్రధానమైనది. బ్రిటిష్‌ వారి పాలనలోకి వచ్చే నాటికి ఈ దేశంలోని అన్ని రాజ్యాల్లోనూ/ సంస్థానాల్లోనూ చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణ వర్గం వారికి విద్యాసంబంధమైన వృత్తులు - దేవాలయాలకు సంబంధించిన వృత్తులు - ఉద్యోగాలు రిజర్వు అయ్యాయి. క్షత్రియులకు పాలనాపర వ్యాపకాలు - వైశ్యులకు వర్తక సంబంధ పనులు రిజర్వు అయ్యాయి. వీళ్ళందరకీ భూములుండేవి. సంపద ఉండేది. శూద్ర కులాలకు సేవక ధర్మం రిజర్వు చేశారు. వారిలో కొన్ని వర్గాలు వస్తూత్పత్తితో వ్యవసాయ పనులతో పై వర్ణాలకు దగ్గర అయ్యారు - కొందరు సేవక ధర్మానికే పరిమితం చేయబడి తమకు విధించిన పనుల్లో ఉండిపోవలసి వచ్చింది. ఇదంతా రిజర్వేషన్‌ వ్యవహారమే. కాలక్రమంలో ఈ వర్ణాలు శాఖోపశాఖలుగా కులాలుగా విస్తరించాయి. కులం అంటే ఒక సముదాయం. భారతదేశంలో వేద మతాన్ని కర్మకాండను నిరసిస్తూ జైన, బౌద్ధ ధర్మాలు తలెత్తిన కాలంలో జైన ధర్మాన్ని పాటించే జన సముదాయాల్లో అతి చిన్న విభాగాన్ని ‘కులం’ అనేవారట. తర్వాతికాలంలో బౌద్ధ, శైవ, వైష్ణవ, జైన ధర్మాలు పరస్పరం కలహించుకున్న చరిత్ర భారతదేశానికి ఉన్నది. అలా సంకుచిత పరిధిలో కులాల ఉనికి వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చు. మతంఏదైనా ఇవి చాతుర్వర్ణాల రిజర్వేషన్లను అతిక్రమించలేదు. భారతదేశంలోని అధిక సంస్థానాలు బ్రిటిష్‌ ప్రభుత్వ ఏలుబడిలోకి వచ్చాకే సమాజంలో మానవ హక్కులు- అవకాశాల గురించి చర్చలు మొదలయ్యాయి. శూద్ర వర్ణాలకూ అప్పటికే ఏర్పడి ఉన్న పంచమ కులాల వారికీ మెరుగైన జీవనావకాశాల గురించి ఆలోచన మొదలైంది. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం బ్రిటిష్‌ పాలకులకు కనబడింది. అందుకే మొదట వారు లేబర్‌ స్కూళ్ళు - కార్మికుల కోసం, కూలీల కోసం, మాలమాదిగల కోసం తెరిచారు. వారి సంక్షేమం కోసం లేబర్‌ డిపార్టుమెంట్‌ ఏర్పడింది. దానినే సాంఘిక సంక్షేమశాఖగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశాలు/హక్కులు వాగ్దానం చేసింది గనుక నిమ్న వర్గాలుగా చెప్పబడే కొన్ని కులాల వారికి వారి సామాజిక స్థాయి పెరిగే వరకూ రిజర్వేషన్లు అవసరమయ్యాయి. శతాబ్దాలుగా అగ్రవర్ణాలు రిజర్వేషన్‌ సౌకర్యాలు అనుభవించి కొన్ని కులాలను కిందికి తొక్కివేశారు. ఇప్పుడు అణగారిన కులాలకు రిజర్వేషన్‌ మొదలై కొన్ని సంవత్సరాలు గడవలేదు. అవి సరిగ్గా అమలుకావటమూ లేదు. అయినా వీరి రిజర్వేషన్లపై అలజడి జరుగుతున్నది.
ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లో మొదట్లో రిజర్వేషన్‌ నియమాలు కొంతలో కొంత పాటించటం వల్ల నేడు ఆ రంగాల్లో కింది కులాల వారు కొందరు కనిపిస్తున్నారు. దానితో ‘ప్రతిభ’ పదం ముందుకు వచ్చింది. ఇప్పుడు మెడికల్‌ విద్య సీట్ల కౌన్సిలింగ్‌లో, ఇతర ఉద్యోగాల ఎంపికలో కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మెరిట్‌లో వచ్చినా సీట్ల కేటాయింపు రిజర్వేషన్‌ లెక్కల్లోనే చేస్తున్నారు. దానివల్ల అర్హత మార్కులు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే విధంగా కార్పొరేట్‌ పాఠశాలలు/ కాలేజీలు వర్ధిల్లేలా నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యుల విద్యకు గండి కొడుతున్నారు. వర్ణవ్యవస్థ చట్ర ంలో రిజర్వేషన్లనూ, ప్రజాస్వామ్య వ్యవస్థ చట్రంలో రిజర్వేషన్లనూ సునిశితంగా అధ్యయనం చేయాలి. సమసమాజం - మానవహక్కులు అనే భావన ప్రజలలో పాదుకొల్పవలసిన బాధ్యత రాజ్యానిదే. ప్రత్యేకంగా కుల నిర్మూలనకు కోట్లు ఖర్చు పెట్టక్కరలేదు. సమధర్మం, సమన్యాయం అన్నివర్గాల ప్రజలకూ సమంగా అందిస్తే కులాల అంతరాలు అవే పోతాయి.
- బి. విజయభారతి

Andhra Jyothi Telugu News Paper Dated: 18/7/2014 

No comments:

Post a Comment