Tuesday, December 13, 2011

కోటన్న ధర్మాగ్రహమే కిషన్‌జీ


కిషన్‌జీ పేరుతో తెలంగాణ బిడ్డ మల్లోజుల కోటేశ్వరరావు భారతదేశంలో 18 రాష్ట్రాల్లో నిర్మించిన ఉద్యమం విప్లవోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగింది. కొండపల్లి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉద్యమాన్ని నిర్మిస్తే మల్లోజుల దేశమంతటా నిర్మించారు. 1971-74 ప్రాంతాల్లో కరీంనగర్‌లో నేను బి.ఎస్సీ చదివే రోజుల్లో కిషన్‌జీ నాకు క్లాస్‌మేట్. 1975లో ఆయనతో చివరిసారి మాట్లాడినా పత్రికలు, ప్రసార సాధనాల్లో చాలాసార్లు కిషన్‌జీని చూసాను, ఆయన రాజకీయ సాహిత్య రచనలు చదివాను. నా మిత్రుడు మృదు స్వభావి. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. స్పష్టమైన భావసంపద ఉన్నవాడు. నమ్మిన సిద్ధాంతం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడనివాడు. 

సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు - అలాంటివాడు దేశాన్నే ప్రభావితం చేసే నాయకుడి స్థాయికి ఎదగడం వెనుక ఎంతో శ్రమ ఉంది. పీడిత ప్రజల పట్ల ప్రేమ, వాళ్ళ బాగోగుల పట్ల తీవ్రమైన ఆకాంక్షే ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అడుగడుగునా ప్రమాదాల నెదుర్కొంటూ, ప్రతిక్షణమూ మృత్యువు అంచుల్లోకి వెళ్ళేపనిని ఎదుర్కొంటూ మూడున్నర దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ నిర్మాతగా చరిత్ర సృష్టించాడు. అతనెందుకు నక్సలైట్ అయ్యాడో, ప్రమాదభరితమని తెలిసి కూడా ఉద్యమబాటనెన్నుకున్నాడో అతడిచ్చిన స్టేట్‌మెంట్లు, తల్లికి రాసిన లేఖను చదివితే అర్థమవుతుంది. ఆదివాసీల పట్ల, పేద ప్రజల పట్ల అతనికెంత ప్రేమాభిమానాలున్నాయో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ వ్యవస్థపై, ప్రజాస్వామ్యంపై అపారమైన నమ్మకమున్న వ్యక్తి విప్లవకారుడుగా ఎందుకు మారాడో అతన్ని ఎన్‌కౌంటర్ పేరుమీద హత్యచేసిన ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. అల్లూరి సీతారామరాజు ఎందుకు విప్లవకారుడయ్యాడో, భగత్‌సింగ్ ఎందుకు ఉరికంబాన్ని కౌగిలించుకున్నాడో అందుకే కోటేశ్వరరావు కూడా విప్లవ పంథానెన్నుకున్నాడు. 

కోటేశ్వరరావుది దేశభక్తి కుటుంబం. తండ్రి వెంకటయ్య స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళంతా సాత్వికులు. అయినా అతడు విప్లవమార్గాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే మంచిది. దేశంలో ఉన్న ఫ్యూడల్ నేపథ్యం, దోపిడీ, పీడన, అట్టడుగువర్గాలపై జరుగుతున్న అత్యాచారాలు, కొందరు కోట్లకు పరుగెత్తుతుంటే మరికొందరు తిండికి కూడా లేక అలమటించడం లాంటి సామాజిక రుగ్మతలు కోటేశ్వరరావు లాంటి ఆలోచనాపరులతో తుపాకీ పట్టించాయి. 

దేశంలో లక్షలాది టన్నుల ఆహార పదార్థాలున్నా కోట్లాది ప్రజలు ఆకలి మంటలతో అలమటిస్తుంటే దేశంలో శాంతి ఉంటుందా? తమ ఆహారధాన్యాలను సముద్రంలోనైనా పారబోస్తారు కాని అన్నార్తుల ఆకలితీర్చకపోతే సమాజంపై ఆగ్రహం కలుగదా? ఆకలితో చచ్చేకన్నా పోరాటంలో ఓ సిద్ధాంతం కోసం చావడం మేలని ఎంతో మంది ఉద్యమంలోకి ఉరుకుతున్న విషయం ప్రభుత్వాలకు తెలియదా? ప్రజలకోసం, దీన మానవుల బాగోగుల కోసం తుపాకీ పట్టిన కోటి లాంటి వాళ్ళను చంపడం న్యాయమవుతుందా..? అయితే వాళ్ళు హింసామార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టే, వ్యవస్థకు ఎదురుతిరిగారు కాబట్టే చంపామని పాలకవర్గాలు వాదించవచ్చు. ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే వాళ్ళు చేస్తున్నది, చేసింది హింసో? ప్రతిహింసో తేల్చుకోవాలి. మేము హింస చేయడం లేదు ప్రతిహింస మాత్రమే చేస్తున్నామని విప్లవకారులు అంటున్నారు. 

నేను హంతకున్ని కాను అనివార్యంగా కొందరిని చంపాల్సి వచ్చింది అని స్వయంగా కోటేశ్వరరావే చెప్పాడు. హింస వద్దని చెబుతూనే ప్రభుత్వాలు చేస్తున్నదేంటి? హింస కాదా..? కూలిరేట్లు పెంచమన్నందుకు, విద్యుత్ చార్జీలు తగ్గించమన్నందుకు, పరిమితులకు మించి ఉన్న భూమిని పంచమన్నందుకు కాల్పులు జరిపి చంపలేదా? తమ సిద్ధాంతాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం చేసుకుంటే ప్రభుత్వాలు ఊరుకుంటున్నాయా? అట్టడుగు ప్రజల తరఫున పోరాడితే ఎందుకు అడ్డుకుంటున్నాయి? శాసనసభల్లో, బహిరంగ సభల్లో, సమావేశాల్లో ఒకర్నొకరు బహిరంగంగా తిట్టుకుంటూ, ఆరోపణలు చేసుకునే పాలకవర్గ పార్టీలు అవే విషయాలను ఉద్యమకారులు చెబితే తిరుగుబాటు దారులుగా ముద్రవేయడం ఏం న్యాయం? పోనీ వాళ్ళు ఎందుకోసమయితే పోరాడుతున్నారో ఆ సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించగలరా? పరిష్కరిస్తే హింస అవసరమేముంది? వాళ్ళేమన్నా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా? తమ కోసం అడుగుతున్నారా? సమసమాజం కావాలని కోరుతున్నారు. దోపిడీ, పీడన లేని మనిషిని మనిషిగా చూసే, అంతరాలు బాగాలేని సమాజాన్ని కోరుతున్నారు. భూమిపై భూమిలో పనిచేసేవారి హక్కును కోరుతున్నారు. అంతమాత్రాన వాళ్ళను తీవ్రవాదులుగా ముద్రవేసి చంపివేయడం సరైందేనా? 

ఇంతకూ వాళ్ళు తీవ్రవాదులా? అదేమన్నా మత తీవ్రవాదమా? సరిహద్దు తీవ్రవాదమా? వేర్పాటు వాదమా? భూమి కోసం భుక్తి కోసం పేదల ప్రజల విముక్తికోసం చేసే పోరాటాలను తీవ్రవాద పోరాటాలుగా లెక్కబెట్టడం మంచిదా? వాళ్ళకు తమ సిద్ధాంతాలను ప్రభావం చేసుకునే అవకాశం కల్పిస్తే అడవుల్లోకి పోవాల్సిన అవసరమేముంది? అనుక్షణం మృత్యువు అంచుల్లోకి పోయే మార్గాన్ని వాళ్ళెందుకెన్నుకున్నారు? వాళ్ళ ఉద్యమానికి అశేష ప్రజానీకం మద్దతెందుకుంది? వాళ్లను తీవ్రవాదులుగా ముద్రవేసి ఎన్‌కౌంటర్ల పేరుమీద హత్యలు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? ఇంతమంది యువకులు తమ ప్రాణాలకు తెగించి అలాంటి ఉద్యమంలోకి ఎందుకురుకుతున్నారో పాలకవర్గాలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరముంది. 

అందుకు గల కారణాలను నిర్మూలించాలి కాని యువకులను హత్య చేయడం సరైంది కాదు. అలా చేయకపోవడం వల్లనే రోజురోజుకూ యువకుల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఉద్యమాలవైపు ఆకర్షితులవుతున్నారు. చెట్టుకు పురుగు పడితే వేళ్ళకు, మూలాలకు మందువేయకుండా ఆకులు చించేస్తే వచ్చే లాభమేంటి? కోటేశ్వరరావు లాంటి గొప్ప నాయకున్ని కనీసం అరెస్టు చేయకుండా చంపివేయడం సరైంది కాదు. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్షల్లాంటి వాటిని రద్దు చేయాలని ఆందోళనలు జరుగుతుంటే దేశాన్ని ప్రభావితం చేసిన ఓ గొప్ప నాయకున్ని ఎన్‌కౌంటర్ పేరుమీద హత్య చేయడం అప్రజాస్వామికమే అవుతుంది. అతడు చర్చలు కూడా చేద్దామన్నాడు. తల్లికి రాసిన లేఖలో అతని హృదయం ఉంది. ఎంతో మంది అక్రమార్జనాదారులు, హంతకులు హాయిగా తప్పించుకుంటుంటే ప్రజలకోసం పోరాడిన నాయకున్ని చంపడం విచారించదగ్గ విషయం. అతని మరణం తర్వాత బహుశాః మమతా బెనర్జీ కూడా తనలో తాను పశ్చాత్తాపం చెంది ఉంటుంది. 

కిషన్‌జీ పేరుతో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని వ్యాపింపజేసిన మహానాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు. తెలంగాణ ప్రజల్లో ఉన్న త్యాగశీలత, తెగువ, పరోపకార పరాయణత్వం, కష్ట సహిష్ణుత, పోరాట పటిమ, ఆశయసాధనాతత్వం కోటేశ్వరరావును ఉన్నతోన్నత శిఖరాలకు ఎదిగించింది. అతనికి ఈ వ్యవస్థపై ఉన్న ధర్మాగ్రహం సహేతుకమైనదే. ఇంకేమార్గం ద్వారా కూడా ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం సాధ్యం కాదని నమ్మాడు కాబట్టే కోటన్న సాయుధ మార్గాన్ని ఎన్నుకున్నాడు. నమ్మిన సిద్ధాంతం కోసం అసువులు బాసిన త్యాగశీలి కోటన్న. 

అతనిపేరు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. అయితే మారుతున్న ప్రపంచ పరిణామాల్లో శత్రువు మరింత బలపడుతున్నాడు. ఇలాంటి సమయంలో శత్రువును హింసలేకుండా ప్రజాబలంతో ఎదుర్కోలేమా అన్న విషయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరముంది. ఏదేమైనా 'కిషన్‌జీ' మరణం అటు పాలకవర్గాల్లోనూ, ఇటు ప్రజా సమూహాల్లోనూ ఆలోచన రేకెత్తించి తీరుతుందనడంలో సందేహం లేదు.
- డా. కాలువ మల్లయ్య Andhra Jyothi Telugu News Paper Dated 14/12/2011

No comments:

Post a Comment