Thursday, December 15, 2011

మంటగలుస్తున్న మానవ హక్కులు


సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో.. జమ్మూ కశ్మీర్ తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో సైనికబలగాలు సాగిస్తున్న హత్యాకాండ, అత్యాచారాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఊపందుకుంది. సైనికబలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) ఎత్తివేయాలని ఇరోమ్ షర్మిల గత పదేళ్లుగా సాగిస్తున్న దీక్షా ఉద్యమానికి మరింత నైతిక మద్దతు లభించింది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుతో.. ‘కశ్మీర్‌లో సైనిక బలగాలకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఎత్తి వేయాల’ని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో మరోసారి సైనికబలగాలు ఉగ్రవాదులు, మిలిటెంట్ల అణచివేత పేరిట సాగిస్తున్న అత్యాచారాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కశ్మీర్‌లోని బెమినా పట్టణానికి చెందిన ముస్తాక్ అమ్జద్ దర్ అనే పేద ముస్లిం యువకుడు ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. ఉన్నట్టుండి 1997 ఏప్రిల్ 13 మధ్యరాత్రి అమ్జద్ ఇంటిని చుట్టి ముట్టిన సైకులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. నాటి నుంచి అతని తల్లి అజ్రా బేగం పోలీస్‌స్టేషన్లు, సైనికబలగాల క్యాంపుల చుట్టూ తన కొడుకు ఆచూకీ చెప్పమంటూ తిరుగుతూనే ఉంది. కానీ ఎవరూ అమ్జద్ జాడచెప్పలేదు. పోగా.. అమ్జద్‌ను తాము తీసుకెళ్లలేదని స్థానిక సైని క క్యాంపు అధికారులు చెప్పారు. దీంతో.. స్థానిక మానవహక్కుల కార్యకర్తల సాయంతో అమ్జద్ తల్లి తన కొడుకు జాడ తెలపాలని హైకోర్టును ఆశ్రయించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది.

జమ్మూ కశ్మీర్ హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా.. అమ్జద్ అదృశ్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి కైఫుల్లా 2003లో స్థానిక పోలీసులను ఆదేశించారు. కానీ.. స్థానిక పోలీసులు 2009 దాకా ‘ఎఫ్‌ఐఆర్’ కూడా నమోదు చేయలేదు. అనేకసార్లు అమ్జ ద్ అదృశ్యానికి సంబంధించి తగు సమాచారాన్ని, వివరణను అడిగినా సరియైన స్పందన లేని సైనిక బలగాల తీరును న్యాయమూర్తి తీవ్రంగా గర్హించారు. ‘ఏళ్లకేళ్లు గా బాధితుల సమయాన్ని వృథా చేస్తూ.., మనోవేదనకు కారణమైన సైనిక బలగాలు మనిషి జీవించే హక్కును హరిస్తున్నాయ’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి పదిలక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.

అమ్జద్ అదృష్యం ఉదంతంతో.. జమ్మూ కశ్మీర్‌లో దశాబ్దాలుగా సైనిక బలగాలు చేస్తున్న దమనకాండ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్జద్ ఉదంతానికి ముందు వందలాది ‘హెబియస్ కార్పస్’ పిటిషన్లు దాఖలైనా వేటికీ పోలీసు లు, సైనిక అధికారులు స్పందించలేదు. సరైన సమాధానం చెప్పలేదు. వీటిపై అనేక మార్లు ప్రజ లు, మానవహక్కుల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నారు. విజ్ఞాపన పత్రా లు సమర్పించారు. కానీ.. వేటిపైనా కేంద్ర ప్రభు త్వం స్పందించిన పాపాన పోలేదు. కశ్మీర్‌లో టెర్రరిస్టుల అణచివేత పేరుతో.. సైనికుల అత్యాచారా లు పెచ్చరిల్లుతున్నాయని స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 

మిలిటెంట్లు, పాక్ ప్రేరేపిత టెర్రరిస్టుల పేరు తో ఎంతో మంది అమాయక గ్రామీణ యువకులను అక్రమంగా నిర్బంధించడమే కాదు.. వేలాదిమందిని ఎదురు కాల్పుల పేరిట కాల్చి చంపారని స్థాని క మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేగా చాలా సంఘటనల్లో.. అదుపులోకి తీసుకున్న యువకులు కనిపించకుండాపోయిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. గుర్తుతెలియన ఉగ్రవాదుల పేరుతో ఎంతో మందిని ఆర్మీ క్యాంపుల సమీపంలో పూడ్చిపెడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చనిపోయిన వారిలో, కనిపించకుండాపోయిన తమవారు ఉన్నారేమో చూడనివ్వాలని కోరినా సైనిక అధికారులు అందుకు నిరాకరించి ఖననం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

అంతర్జాతీయ ప్రజా హక్కుల సంస్థ జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కుల విషయంపై అధ్యయనం చేసి ‘పూడ్చివేయబడిన సాక్ష్యాధారాలు’ పేరిట ఓ రిపోర్టును వెలువరించింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం ఉత్తర కశ్మీర్‌లో.. సైనిక బలగాలు మిలిటెంట్ల పేరిట అమానుషానికి పాల్పడ్డాయని తెలిపింది. దీనికి స్థానికంగా జరిగిన ఓ ఘోర ఉదంతాన్ని ఉదహరించింది. ఒకసారి సైనిక బలగాలు పాక్ ఉగ్రవాదుల పేరిట 50 మందిని కాల్చిచంపాయి. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక ప్రజలు, మానవహక్కుల కార్యకర్తలు ఆ శవాలను పరిశీలిస్తే.. అందులో 46 మంది స్థానిక యువకుల శవాలేనని తేలింది. అందులో.. ఒక యువకుడు మాత్రమే మిలిటెంట్‌గా గుర్తించారు.

ఇలా ఏళ్లకేళ్లుగా పోలీసులు, సైనిక బలగాలు కశ్మీర్ యువకులపై హత్యాకండ జరుగుతోందని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్ ‘స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్’ కూడా చాలా సందర్భాలలో సైనిక బలగా లు అకృత్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. అనేక ఘటనలలో యువకులను నిర్బంధించి, చంపి గుర్తుతెలియని టెర్రరిస్టులుగా సైనిక క్యాంపుల ఆవరణలోనే పూడ్చి పెడుతున్నారని ఆరోపించారు. సరిహద్దు (లైన్ ఆఫ్ కంట్రోల్) సమీప ఆర్మీ క్యాంపుల దగ్గర ఇలాంటి శవాల గుట్టలు అనేకం బయట పడ్డాయి. 

సరిహద్దు సమీప సైనిక క్యాంపులు ఉన్న క్రాల్సాన్‌గిరి, చాస్మాసాహి, ఛాన్పొరా తదితర ప్రాంతాల్లో ఆర్మీ క్యాంపుల దగ్గర ఎన్నో మానవశరీరాల ఎముకల గూళ్లు బయటపడ్డాయి. బారముల్లా దగ్గరలోని ‘దెలినా’లో ఓ హాస్పిటల్ నిర్మాణానికి బుల్డోజర్‌తో పునాదులు తీస్తుండగా అనేక మానవ కళేబరాలు బయటపడ్డాయి. ఇవన్నీ.. సైనిక బలగాలు గుర్తుతెలియని టెర్రరిస్టుల పేరుతో హత్యచేసిన యువకుల శవాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే.. స్థానిక పోలీసులు, మిలిటరీ అధికారులు రివార్డులు, అవార్డులకు ఆశపడి అక్రమ నిర్బంధాలకు, ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని మానవహక్కుల సంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. 2006 డిసెంబర్‌లో శ్రీనగర్‌లోని బాటమలూ బస్‌స్టాండ్ నుంచి 35 ఏళ్ల అబ్దుల్ రహమాన్ పాద్రూ అనే కార్పెంటర్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసికెళ్లారు. తీసుకెళుతుండగా వందలాదిమంది స్థానికులు చూశారు. అయినా.. అతన్ని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. తరువాత అతన్ని పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్టు అబూ హఫీజ్ అని కథనం అల్లారు.

దీంతో.. కరుడు గట్టిన టెర్రరిస్టును కాల్చిచంపినందుకు ప్రభుత్వం వీరికి 1,20,000 రూపాయలు నజరానాగా.పకటించింది. ఇలాగే.. కశ్మీర్ వ్యాలీ అంతటా పోలీసులు, మిలిటరీ బలగాలు బూటకపు ఎదురు కాల్పులు, టెర్రరిస్టులపేరుతో.. ఎంతో మంది అమాయకులను కాల్చిచంపారు. కశ్మీర్ అంతటా కోకొల్లలుగా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల పట్ల చాలా తక్కు వ సందర్భాలలోనే కోర్టు స్పందించింది. కోర్టు విచారించిన దాదాపు అన్ని కేసులలో కూడా పోలీసు, మిలిటరీ బలగాలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని తేల్చింది. ప్రభు త్వ బలగాలు చెప్పుతున్నదంతా అబద్ధ్దాలని ప్రకటించింది. 


ఈ AFSPA చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా.. మిలిటరీ బలగాలు టెర్రరిస్టుగా అనుమానిస్తే కాల్చిచంపేయవచ్చు. దేశ వ్యతిరేక, టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని పోలీస్ మిలిటరీ బలగాలు దుర్వినియోగం చేస్తున్నాయని చాలా ఏళ్లుగా పౌర, మానవహక్కుల సంఘాలు అంటున్నాయి. కశ్మీ ర్ మొదలు ఈశాన్య భారత్‌లోని మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, అస్సాం తదితర రాష్ట్రాలలో సైనిక బలగాలు మిలిటెంట్ల ఏరివేత పేరుతో హక్కుల ఉల్లంఘన నిరాఘాటంగా సాగుతూనే ఉంది. ఈ చట్టం దుర్విని యోగమవుతున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి.

ఈ నేపథ్యంలోనే మణిపూర్‌లో సైనికబలగాలు చేస్తున్న అత్యాచారాలకు నిరసనగా సైనికబలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయాలని ఇరోమ్ షర్మిల 11 ఏళ్ళుగా నిరసన పోరాటం చేస్తోంది. అయినా .. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆమె రోదన అరణ్యరోదనగానే మిగిలింది. నిరహారదీక్ష చేస్తున్న ఇరోమ్‌కు నిర్బంధంగా ద్రవ ఆహార పదార్థాలను ముక్కుద్వారా ఎక్కిస్తున్నారు. నిరహార దీక్ష చేస్తూ అచేతనంగా ఉన్న ఇరోమ్‌ను హాస్పిటల్‌నే జైలుగా మార్చింది ప్రభుత్వం. ఇరోమ్ కోరుతున్న డిమాండ్‌ను కనీసం పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. మాట మాట కు గాంధీ, అహింస అంటూ.. జపం చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరోమ్ దీక్ష పట్ల వ్యవహరిస్తున్న తీరు వాటి నైజాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ప్రజల న్యాయమైన పోరాటాల్లు, సమస్యల పట్ల ప్రభుత్వ తీరు మారాలి. లేకుంటే.. మునుముం దు సమస్యలు తీవ్రమై.. ప్రజలు తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి వస్తుంది. 

-ఎస్. మల్లారెడ్డి
Namasete Telangna   News Paper Dated 16/12/2011 

No comments:

Post a Comment