Tuesday, December 20, 2011

బీసీల కోటాలో ముస్లింలకు వాటా?


దేశజనాభాలో ఎస్సీ, ఎస్టీల జనాభా (15+ 7.5) వెరసి 22.5 శాతం కాగా, అనేక సర్వేల, కమిషన్ల సర్వేల ప్రకారం బీసీల జనాభా 52 శాతం, మైనారిటీల జనాభా 10 శాతం. ఇతరుల జనాభా కేవలం 14.5 శాతం అని తెలిసినదే. దేశ సంపద గానీ పాలనాధికారం గానీ ఇప్పటి వరకు ఈ 14.5 శాతం మంది చేతుల్లోనే కేంద్రీకృతమయిందనేది మరో వాస్తవం. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించిన మహనీయుడు డా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌. కుబేర సంపదతో విరాజిల్లుతున్న పారిశ్రామికాధిపతులకు కూడా తలకు ఒకే ఓటే! అలాగే దుర్భర దారిద్య్రంతో రెండు పూటలా తిండికి కూడా నోచుకోని అభాగ్యజీవికీ ఒక ఓటే! తలకు ఒక్క ఓటు కల్పించటానికి ముఖ్యకారణం, దేశంలో శ్రీమంతులూ, అట్టడుగుననున్న వర్గాలూ కలిసి- ఓటు ప్రాబల్యంతో పాలనాధికారాన్ని పంచుకొని, అటు దేశ అభివృద్ధిని, ఇటు ప్రజల జీవనవిధానాన్ని అభివృద్ధి చేసుకుంటూ కొంత కాలానికి అన్ని రంగాలలో సమతుల్యాన్ని పాటించే దిశగా మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించారు. 

అయితే మన రాజ్యంగం అమలులోకి వచ్చి సుమారు 63 సంవత్సరాలయినా అన్ని వర్గాల ప్రజలలో సమతుల్యత రాలేదు సరికదా, ధనవంతులు కుబేరులుగా, బీదవారు మరింత బీదవారుగా తయారయ్యారు. ఇందుకు కారణం 65 సంవత్సరాల పాలన రాజ్యాంగ బద్ధంగాలేదనే కదా! అటువంటప్పుడు 14 శాతం ఉన్న పాలక కులాలను, 86 శాతం ఉన్న ఇతర వర్గాల ప్రజలు ఎందుకు పాలానాధికారాన్నుంచి తొలగించలేకున్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఆలోచించుకోవలసిన తరుణం ఆసన్నమయింది. పాలనాధికారానికి మూలమైన ఓటు సహాయంతో ఈవర్గాలవారు ఎందుకు పాలనాధికారాన్ని అందుకొనలేకున్నారు? జనాభాలో 14.5 శాతం ఉన్న పాలక కులాలు తమ చేతిలోని పాలనాధికారాన్ని ఈ 63 సంవత్సరాలుగా ఎలా నిలబెట్టుకొనగలుగుతున్నాయి? 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలోని ప్రజలు ఎవరనే విషయాన్ని పరిశీలిస్తే, వారందరూ దేశ సంతతికి చెందిన వారేనని స్పష్టమవుతుంది. పాలకులైన 14.5 శాతం మందీ తాము ఆర్య సంతతికి చెందిన వారమని చెప్పుకొంటున్నారు. అయితే ఈ ఆర్య సంతతికి చెందిన వారికి తోడు ప్రస్తుతం అగ్రవర్ణాలుగా పరిగణన పొందిన కొన్ని శూద్ర కులాలు కూడా పాలనాధికారాన్ని చేపట్టాయి! పాలక పక్షాలుగా మారిన శూద్ర కులాలు కూడా మొదట విద్య, ఉద్యోగ రంగాలలోనూ, రిజర్వేషన్లను పొందినవే. ఇవి కూడా కాలక్రమేణా ఆర్యసంతతి వారమని చెప్పుకొనే సామాజిక శక్తులతో కలిసి రాజ్యాధికారాన్ని చేపట్టాయి. అధికారంలో భాగస్వామ్యం అనుభవించిన శూద్రకులాలు అగ్రకులాలుగా పరిగణన పొందడంతో, వాటిని రిజర్వేషన్ల జాబితానుండి తొలగించడం జరిగింది. 

ఒకప్పుడు రిజర్వేషన్లను అభవించి, అనంతరం పాలనాధికారాన్ని చేపట్టిన కులాలు- తమ వర్గం వారిని సంపూర్తిగా మరిచి, బీసీలంటే, నిర్లక్ష్యాన్ని, వ్యతిరేకతను పెంచుకొన్నాయి. తమ రాజకీయ పార్టీలలో బీసీలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, ఒక వైపు వారి ఐక్యతను దెబ్బతీస్తూ, మరో వైపు వారికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో విభేదాలను సృష్టిస్తున్నాయి. బీసీ జాబితాలోని కులాలలకు విద్య, ఉద్యోగ రంగాలలో వాటి జనాభా ప్రాతిపదికన కాక, పాలకులకు ఇష్టం వచ్చిన తీరులో కొంత శాతం రిజర్వేషన్లను ఇస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో వీరికి 25 శాతం రిజర్వేషన్లుంటే- తమిళనాడులో 50 శాతం; హిమాచల్‌ ప్రదేశ్‌లో 18 శాతం; అస్సోంలో 27 శాతం; బీహార్‌లో 33 శాతం; కర్ణాటకలో 32 శాతం ఉన్నాయి. ఈ విధంగా విద్య, ఉద్యోగ రంగాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా రిజర్వేషన్‌ శాతాన్ని కల్పించి- దేశ బీసీలలో రాష్ట్రాల వారీగా తారతమ్యాలు సృష్టించారు.

కాకా కాలేల్కర్‌ కమిషన్‌ దేశవ్యాప్తంగా 2399 కులాలను సామాజిక, విద్యారంగాలలో వెనుకబడిన కులాలుగా గుర్తించి 1955లో కేంద్రానికి నివేదిక సమర్పించిన తరుణంలో, కాకా కాలేల్కర్‌ ఛైర్మన్‌ హోదాలో- ఈ నివేదికలో ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసికొనలేదు గనుక తాను విభేదిస్తున్నాననీ, మెజారిటీ సభ్యుల కోరిక మేరకు, నివేదికను సమర్పిస్తున్నామనీ పేర్కొన్నారు. అందువల్ల కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదు. అనంతరం 1959లో జరిగిన వివిధ రాష్ట్రాల ప్రతినిధుల సభలో కమిషన్‌ నివేదిక చర్చకురాగా బీసీ నాయకుల తీవ్ర ఒత్తిడి మేరకు 1961లో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తూ- అఖిల భారత స్థాయిలో బీసీల జాబితా తయారు చేయడం వీలుకాదు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలే సర్వే చేయించి, వెనుకబడిన కులాలను గుర్తించి, విద్య, ఉద్యోగరంగాలలో రిజర్వేషన్లు కల్పించుకొనవచ్చునని పేర్కొంది. 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మేరకు రిజర్వేషన్లు వివిధ శాతాలతో అమలవుతున్నాయి. వెనుకబడిన తరగతులను ఎస్సీలనీ, ఎస్టీలనీ, బీసీలనీ విభజించి, రిజర్వేషన్ల అమలులో తారతమ్యాలు సృష్టించి ఈ వర్గాలు ఐక్యమయ్యేందుకు వీలులేకుండా ప్రయత్నిస్తున్న పాలకవర్గాలు, జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీల జాబితాలో- అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అనేక ఇతర కులాలను చేర్చి ఉన్న రిజర్వేషన్లకు కూడా తూట్లు పొడుస్తున్నాయి. తరువాత కేంద్ర ప్రభుత్వం, బీసీల విద్య, ఉద్యోగ, సామాజిక స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే చేసి ఒక నివేదిక సమర్పించేందుకు బి.పి. మండల్‌ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ 1980లో నివేదిక సమర్పించగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది. 1990లో యునైటెడ్‌ ఫ్రంట్‌ హయంలో ప్రధానమంత్రి వి.పి. సింగ్‌ తన రాజకీయ మనుగడకు దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలను ఉపయోగించుకొనాలనే వ్యూహంతో, మండల్‌ నివేదికను పార్లమెంటులో చర్చకుపెట్టి బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లను కల్పించేందుకు నాంది పలికారు.

1991లో కేవలం ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లను కల్పించారు. దీనిని వ్యతిరేకిస్తూ పాలక కులాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రతిభను దృష్టిలో ఉంచుకొని దేశంలోని అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే వాదనను బలపరుస్తూ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన (15+7.5) 22.5 శాతం పోను మిగిలిన 27.5 శాతంలో 27 శాతాన్ని బీసీలకు కొనసాగించుకొనవచ్చునని తీర్పునిచ్చింది. అయితే బీసీ లలోని సంపనన్న వర్గాలను రిజర్వేషన్లనుంచి మినహాయించాలని తీర్పునిచ్చింది. ఇందులోకూడా ఎస్సీ, ఎస్టీలకులేని క్రీమిలేయర్‌ మినహాయింపు పద్ధతిని కేవలం బీసీ లకు మాత్రం వర్తింపచేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఒకే వర్గంగా రాజ్యాంగంలో పొందుపరచినా, రిజర్వేషన్ల వర్తింపులో వేరువేరు నిబంధనలతో వీరిని ఐక్యం కాకుండా శాశ్వతంగా విభజించడం జరిగింది. విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా, ఉద్యోగరంగంలో కల్పించడం పట్ల బీసీ వర్గాలు ఉద్యమించడంతో 2008 నుంచి విద్యారంగంలో కూడా 27 శాతం రిజర్వేషన్లను కల్పించారు. 

ఉత్తరప్రదేశ్‌లో బీసీలు, మైనారిటీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన దశలో, వీరిని కలువకుండా చేయాలని పాలకవర్గాలు కుట్రపన్నాయి. మైనారిటీలకు వేరుగా రిజర్వేషన్లను కల్పించమని సచార్‌ కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ నివేదికలు సమర్పించినా, వారికి వేరుగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో కల్పించిన 27 శాతంలోనే, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లను కల్పిస్తామని కేంద్రమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ప్రకటించారు. దీనికి మూలం- వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను- బీసీ జాబితాలో ‘ఇ’ గ్రూపును ఏర్పరచి కల్పించిన పద్ధతినే అనుసరించాలని కేంద్రం కూడా అభిప్రాయపడుతున్నట్లుంది. బీసీ కులాలకున్నట్లు సామాజిక వెనుకబాటు తనం ముస్లింలలో లేదనే వాదనతో సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేక రిట్‌ పిటీషన్‌ పెండింగ్‌లో ఉన్న విషయం కేంద్రానికీ తెలుసు. 

paluri-ramakrishnaiah
ఇలా అగ్రకుల పాలక పక్షాలే తమ రాజకీయ ప్రయోజనాలకోసం రిజర్వేషన్ల పేరిట వివిధ సామాజిక వర్గాలలో భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నాయి. అందువలన రిజర్వేషన్లలోని విభేదాలను ప్రక్కనబెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, జనాభాలో కేవలం 14.5 శాతం ఉన్న పాలవర్గాల కుట్రలను వమ్ము చేసే విధంగా తమ సంఖ్యా బలంతో తమ వర్గనాయకులను ఎన్నికలలో గెలిపించి రాజ్యాధికారాన్ని చేపట్టినప్పుడే ఈ దేశంలోని బడుగు, బలహీన, మైనారిటీ ప్రజల అభివృద్ధి జరుగుతుంది. 


రచయిత బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు
Surya News Paper Dated 20/12/2011

No comments:

Post a Comment