Saturday, December 24, 2011

కోటాల రాజకీయం - సంపాదకీయం


దేశంలోని మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగుతులకు (ఓబీసీ)లకు ఉన్న 27 శాతం రిజర్వేషన్‌లో మైనారిటీలకు 4.5 శాతం సబ్ కోటాను కల్పించనున్నారు. అల్పసంఖ్యాక వర్గాలకు సబ్ కోటాను ఏర్పాటు చేయాలని మత, భాషాపరమైన మైనారిటీల జాతీయ కమిషన్ చేసిన సిఫార్సు మేరకు యూపీఏ సర్కారు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో 18 శాతంగా ఉన్న ముస్లిం, సిక్కు, క్రైస్తవ, పార్శీ, భౌద్ధ మైనారిటీలకు లబ్ధి చేకూరనుంది. 

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలోనే యూపీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓబీసీ కేంద్ర జాబితాలో గుర్తించిన అల్పసంఖ్యాక వర్గాలు, సముదాయాలన్నింటికీ ఈ సబ్ కోటా వర్తింస్తుంది. మైనారిటీ వర్గాలకు ఓబీసీ కోటాలో అంతర్భాగంగా సబ్‌కోటా కేటాయించడం వలన వెనబడిన వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఓబీసీ రిజర్వేషన్ కోటాను పెంచి, ఆ మేరకు హిందూయేతర వెనబడిన వర్గాలకు సబ్ కోటా కల్పించడం వల్ల ఎవరికీ న ష్టం ఉండదని వారు సూచిస్తున్నారు. అయితే ఇంత సున్నితమైన విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా యూపీఏ ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకోవడం వెనుక సామాజిక న్యాయం కంటె రాజకీయ ప్రయోజనమే అధికంగా ఉందన్న విమర్శలూ వస్తున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో నెగ్గితే దేశవ్యాప్తంగా ఎదురుండదనేది ఒక సాంప్రదాయక రాజకీయ నానుడి. యూపీ ఎన్నికల ఘట్టం రాజకీయపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాహుల్‌ను ఢిల్లీ పీఠంపై అధిష్ఠింపజేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటోంది. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కోటను బద్దలు కొట్టేందుకు అక్కడి ఓటర్లలో గణనీయమైన భాగంగా ఉండే ముస్లిం ప్రజానీకం ఓట్లను కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. 2009 ఎన్నికల్లో ముస్లింల మద్దతుతోనే యూపీలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 21 లోక్‌సభ స్థానాల్లో నెగ్గింది. 

ఈ అనుభవం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముస్లిం ఓటు బ్యాంకును స్థిరపరచుకునేందుకు మైనారిటీ రిజర్వేషన్ లేదా ముస్లిం కోటాను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే యూపీఏ కేటాయించిన మైనారిటీ రిజర్వేషన్ కేవలం కంటితుడుపు మాత్రమేనని సమాజ్‌వాది పార్టీ, సిపిఎంలు విమర్శించగా, ఓబీసీ రిజర్వేషన్‌లకు గండిపెట్టి మైనారిటీలకు సబ్ కోటాను నిర్ణయంచడం మోసపూరితమైన విధానం అని బిజెపి వ్యతిరేకించింది. దేశంలోని మతపరమైన, భాషాపరమైన మైనారిటీల స్థితిగతుల అధ్యయనం కోసం జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన రంగనాథ మిశ్రా కమిషన్ 2007లో కేంద్రానికి సమర్పించిన నివేదిక ముస్లింలకు 10 శాతం, ఇతర మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్లను సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ప్రాతిపదికన కల్పించాలని సిఫార్సు చేసింది. 

ప్రస్తుతం అమలవుతున్న 27 శాతం ఒబిసి రిజర్వేషన్లలో మైనారిటీలకు 8.4 శాతం సబ్‌కోటాను కల్పించాలని, అందులో 6 శాతం ముస్లింలకు కేటాయించాలని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మండల కమిషన్ ప్రకారం 53 శాతం ఒబిసి కోటాను, అందులో 8.4 శాతం హైందవేతర వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. అదే సమయంలో ముస్లిం ప్రజానీకం జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన సచార్ కమిటీ కూడా మైనారిటీలకు ప్రత్యేక కోటాలను ఇవ్వాలని సిఫార్సు చేసింది. 

అయితే, యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణంచిన కోటా ఆ సిఫార్సులతో పోలిస్తే మైనారిటీలకు సంతృప్తికరంగా కనిపించదు. ముస్లిం రిజర్వేషన్ విషయంలో రాష్ట్రస్థాయిలో వైఎస్ఆర్ బిసి 'ఇ' కేటగిరిని రూపొందించి ఎక్స్‌ట్రా న్యూమరరీ సీట్లను సృష్టించి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు. బిసి కోటాలో మైనారిటీలను చేర్చాలా వద్దా అన్న వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. కేంద్రం తీసుకున్న మైనారిటీ సబ్ కోటా నిర్ణయం కూడా కోర్టులో తేలవలసి ఉంది. 

రాబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో యూపీఏ సర్కారు రెండు రకాల మైనారిటీల కోటాలను రూపొందించింది. ఒక కోటా లోక్‌పాల్ బిల్లుకు సంబంధించినదైతే, మరొక కోటా ఉద్యోగాలు, ఉన్నత చదువులకు సంబంధించినది. ఈ రెండు కోటాలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ రెండు కోటాలు ఆ లోక్‌పాల్ ఉద్విగ్నతను దారి మళ్ళించాయి. లోక్‌పాల్ బిల్లు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ కాస్తా కోటాల కేటాయింపు వైపు మళ్ళింది. ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్‌సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. 

బిజెపి, వామపక్షాల నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు సైతం లోక్‌బిల్లులోని మైనారిటీ కోటా, సిబిఐపై సర్కారు అజమాయిషీ, రాష్ట్రాలలోని లోకాయుక్త విధులు తదితర అంశాలపై నిరసనలు వ్యక్తం చేశాయి. బిజెపి లోక్‌పాల్ వ్యవస్థలోని మైనారిటీ కోటాను వ్యతిరేకించింది. బలమైన లోక్‌పాల్ కింది స్థాయి బ్యూరోక్రసీని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని, సర్కారు గుప్పిట్లో నుంచి సిబిఐని తప్పించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి, శివసేనలు లోక్‌పాల్‌ను వ్యతిరేకించాయి. జెడియూ, డిఎంకె, బిజెడి, ఏఐడిఎంకె, తెలుగుదేశం పార్టీలు రాష్ట్రాలపై లోకాయుక్తలను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించాయి. 

ఈ గందరగోళం మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాల లోపు లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి నోచుకునేట్టు కనబడడం లేదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లున్న లోక్‌పాల్ బిల్లును బిజెపి వ్యతిరేకిస్తోంది. కాబట్టి సభలో మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చే అవకాశమే లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ ్యంలో లోక్‌పాల్ బిల్లుకు కూడా గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పట్టిన గతే పడుతుందన్న సందేహాలు రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పౌర అణువిద్యుత్తు బిల్లు సందర్భంగా చిన్న చిన్న రాజకీయ పార్టీలను కాంగ్రెస్ సమీకరించింది. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. 

పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ముంబాయి ఎంఎంఆర్‌డిఏ మైదానంలో మూడురోజుల పాటు నిరశన దీక్షలకు, ఆ తర్వాత జైల్ భరో కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. ఆ మైదానం అద్దె తగ్గించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించడమే కాకుండా హజారే ఒక నిరశన దీక్ష ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా రచ్చ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. పార్లమెంటుతో సహా కీలక రాజ్యాంగ వ్యవస్థలన్నీ లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలన్న హజారే బృందం డిమాండ్లు అప్రజాస్వామికమైనవని కొన్ని మినహాయింపులతో రాజకీయ పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దాంతో అన్నా బృందం రాజకీయంగా ఒంటరి అయిపోయింది. 

పౌరసమాజం డిమాండ్లతో రాజకీయ పక్షాలు పూర్తిగా విభేదించకపోయినా గతంలో అనేక అంశాల్లో మద్దతునిస్తున్న పరిస్థితి ఉండే ది. పార్లమెంటు లోపల బయటా ప్రతిపక్షాలు, పౌరసమాజం ఐక్యంగా పోరాడితేనే బలమైన లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించే అవకాశముంటుంది. కోటాల వివాదం, ప్రతిపక్షాలకు పౌరసమాజ ప్రముఖులకు మధ్య ఐక్యత లోపించడం తదితర కారణాల వల్ల లోక్‌పాల్ బిల్లు అమలుకు నోచుకునే పరిస్థితులు కనబడడంలేదు. ఆమోదం కోసం పదవసారి లోక్‌సభలో ప్రవేశిస్తున్న లోక్‌పాల్ బిల్లు చట్టంగా రూపొందుతుందో లేదో వేచి చూడాలి.
Andhra Jyothi Sampadakiyam Date 24/12/2011

No comments:

Post a Comment