Saturday, December 31, 2011

సకల జనులకు విద్య



విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమంలో ‘అందరికి విద్య’ అన్న అంశానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన ఒక దశాబ్ద కాలం తర్వాత కూడా ఈ లక్ష్యం అందుబాటులోకి రాలేదు. మానవజాతి అక్షరాన్ని కనుగొని వేల సంవత్సరాలు దాటుతున్నా ఇంకా అక్షర జ్ఞానం లేకపోవ డం, కళ్లున్నా కళ్లముందు రాసిఉన్న అక్షరాలని చదవలేకపోవడం ఎంత విషాదం! చదవడమే విద్య అని కాదు. విద్య, విజ్ఞానము మనిషి శ్రమ మీద ఆధారపడి, శ్రమ నుంచి వచ్చిన అనుభవ సారంలో ఉంటుంది. కాని ఆ మనిషికి అవి అందుబాటు లోకి రాకపోవడం పెద్ద విషాదం. అక్షరాలు నేర్చుకోకూడదని ఆంక్షలు పెట్టిన బ్రాహ్మణ మత ధర్మాన్ని మనం ధ్వంసం చేయా లి. భౌతిక పరిస్థితులు మారుతూ సామాజిక సంబంధాలు మారుతున్న క్రమంలో కూడా ‘అందరికి విద్య’ అనే విలువ ఆచరణలోకి రాకపోవడాన్ని విశ్లేషించుకోవాలి. 
మన దేశంలో ఉత్పత్తి శక్తుల్లో మార్పు వచ్చినా ఉత్పత్తి సంబంధాలలో(విద్య అందులో భాగం) మార్పు రాకపోవడానికి భూస్వా మ్య, వలసవాద సంబంధాలు గుణాత్మకంగా మారకపోవడమేనన్న సూత్రీకరణ ఆర్‌ఎస్ రావు చేశాడు. అభివృద్ధికి సంకేతమైన భారీ సాగునీటి ప్రాజెక్టులను ఉదహరిస్తూ, ఆర్‌ఎస్ రావు హిరాకుడ్ డ్యాం ‘అభివృద్ధి’కి ఒక పెద్ద సంకేతమైనా, దీపం కింద చీకటిలా ఆ ప్రాజెక్టు చుట్టూ జీవించే మనుషుల లో మరీ ముఖ్యంగా సామాజిక సంబంధాలలో ఎలాంటి గుణాత్మక మార్పు రాకపోవడమేకాక, కొన్ని సందర్భాలలో ఆ సంబంధాలు కొంత వెనక్కి కూడా పోయిన ఉదంతాలను చూపుతూ వచ్చారు. అందుకే పరిక్షిశమలు వచ్చినా, ప్రాజెక్టులు కట్టినా, అంతర్జాతీయ విమానాక్షిశయాలు వచ్చినా, కేంద్రీయ విశ్వ విద్యాలయాలు స్థాపించినా..వీటి చుట్టు నిరక్షరాస్యులైన ప్రజలు చాలా సంఖ్యలో ఇప్పటికీ ఉన్నారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం చుట్టు వేలాది మంది నిరక్షరాస్యులుండడం విశ్వవిద్యాలయానికి సిగ్గుచేటు అని భావించి, అప్పటి వైస్ చాన్స్‌లర్ కోట హరినారాయణ విశ్వవిద్యాలయ పరిధిలో జీవిస్తున్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులు చేయవలసిన బాధ్యత విశ్వవిద్యాలయం చేపట్టాలని కృషి చేశారు. 

దాంట్లో మా లాంటి వాళ్లు కూడా భాగస్వాములమయ్యాము. ఇదొక కళ్లు తెరిపించే ప్రయోగం. హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన హైటెక్‌సిటీకి కనుచూపు మేరలోనే ఒక తండాలో గ్రామ సర్పంచ్‌తో సహా అందరూ నిరక్షరాస్యులుంటే అందులో ఒక వెయ్యిమందిని అక్షరాస్యులుగా చేయగలిగాం. కేవలం తెలుగు డిపార్ట్‌మెంట్, సామాజికశాస్త్ర విద్యార్థులు కొంత శ్రద్ధ తీసుకున్నారు. ఈ ప్రయోగం విఫలం కావడానికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా చాలా మంది నిరక్షరాస్యులు వలస కూలీలు కావ డం. ఇందులో పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లు చాలా మంది. వీళ్లు ఉదయమే పనికి వెళ్లి, సాయంత్రం చాలా ఆలస్యంగా వచ్చి వంట చేయడం, ఇతర ఇంటి పనులుండడంతో వాళ్లను చదువుకొనడానికి ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. ఇలాంటి అనుభవాల ఆధారంగానే ఆర్‌ఎస్‌రావు ఉత్పత్తి పెంచే ప్రాజెక్టు నిర్మాణం జరిగినా, ఉత్పత్తి సంబంధాలు మారలేదని సాక్ష్యాధారాలు చూపుతూ వచ్చారు.
మన సమాజంలో ‘పుట్టకతోనే మనుషులు సమానం కాదు’ అనే మత వాదనను ‘మను ధర్మ శాస్త్రం’ ప్రతిపాదించి బోధించింది. శారీరక శ్రమ మీద ఆధారప డ్డ వాళ్లందరూ చదవడానికి అనర్హులని మనువు ప్రతిపాదించాడు. మనుషులందరిని భగవంతుడే సృష్టిస్తే కొందరిని ఎక్కువ, కొందరిని తక్కువ ఎందుకు సృష్టించాడు అనే మౌలికమైన ప్రశ్న అడిగి దీనికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు రాకపోవడం, వచ్చినా వాటిని నిర్దాక్షిణ్యంగా పాలక వర్గాలు అణచివేయడం జరిగింది. బుద్దుడు,చారువాకులు, లోకాయనులు, తర్వాత వచ్చిన భక్తి ఉద్యమం ఈ సంబంధాలను మౌలికంగా మార్చలేకపోయాయన్నది చారివూతక వాస్తవం. 

అందరికి విద్య అందకపోవడానికి కుల వ్యవస్థ బలంగా పనిచేసింది. కులము సామాజిక ఉత్పత్తిలోని అదనపు విలువను ఎక్కువ బలవూపయోగము, భౌతిక హింస ఉపయోగించకుండానే కొల్లగొట్టగలిగింది. కులము అంటే.. ‘సాంస్కృతిక హింస’నే. ఈ సామాజిక నిర్మాణాన్ని కూలగొట్టవలసిన అవసరం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక విలువల నుంచి వచ్చిన మధ్యయుగాల మొఘలుల పాలనకు కూడా కలగలేదు.అస్పృశ్యలుగా పరిగణించబడిన పంచములు అనబడే వాళ్లు ఇస్లాం మతాన్ని స్వీకరించి కొంచెం గౌరవంగా బతకగలిగారు. అయితే చాలా వరకు వాళ్లలో వృత్తిపరమైన మార్పు రాలేదు. తెలంగాణలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన చాలా మందిని ‘తోళ్ళోళ్ళు’ అని పిలుస్తారు. మహిళల విషయంలో కూడా మధ్యయుగాల రాజ్యాలు అలాగే ప్రవర్తించాయి.

ముస్లిం రాజుల ఓటమి తర్వాత, దేశంలోని భిన్న ప్రాంతాల రాజులు, రాజ్యా లు బ్రిటిష్ ఇండియా కంపెనీతో రాజీ చేసుకున్నాయి. దీంతో భూస్వామ్య పాలనకు వలసపాలన జతగూడి దోపిడీని స్థిరపరచగలిగారు. నిజానికి అన్ని రకాల దోపిడీ రాజకీయ వ్యవస్థలకు కుల వ్యవస్థ చాలా ఉపయోగపడింది. ఆ సామాజిక నిర్మాణాన్ని ఎవ్వరూ మార్చాలని ప్రయత్నించలేదు. అందుకే కింది వర్గాల సామాజిక స్థితిగతులు గుణాత్మకంగా మారకపోవడమేకాక నిరక్షరాస్యత లాంటి సమస్య ఇప్పటికి అపరిష్కక్షుతంగా మిగిలింది. భూస్వామ్యం వలసపాలన మిలాఖత్ కావ డం వలన మొత్తం భారతదేశ చరిత్రే ముందుకు సాగడం కష్టమైంది. ఇటు ఉత్పత్తిశక్తులు పెరగక, సామాజిక సంబంధాలు మారకపోవడం వలన మన దేశంలో సోషలిస్టు విప్లవానికి కానీ, పెట్టుబడిదారీ విధానం సఫలం కావడానికి కానీ కావలసిన భౌతిక పరిస్థితులు ఏర్పడలేదు. సమాజం ముందుకు పోవడానికి సుదీర్ఘమైన ప్రసవవేదనను అనుభవిస్తున్నది.
దేశ చరివూతలో భూస్వామ్య వ్యవస్థ, కొద్దిగా మారుతున్న సామాజిక శక్తులు కలిసి చేసిన పెద్ద పోరాటం 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం. ఈ తిరుగుబాటు వలన ఈస్ట్‌ఇండియా కంపెనీ నుంచి అధికారం బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి పోయింది. ఈ తిరుగుబాటుతో ‘బ్రిటిష్ పాలనకు భద్రత కాని, సుస్థిరత కాని లేవు’ అని అర్థం కావడంతో, తమ పాలనకు కావలసిన ఒక సామాజిక నిర్మాణం, లేదా ఒక సామాజిక మద్దతు ఇచ్చే వర్గాన్ని సృష్టించుకోవాలని మెకాలె ఇంగ్లిషు భాషలో విద్య బోధన ప్రారంభించాడు. దీంతో ‘రూపంలో భారతీయుడు సారంలో బ్రిటిష్ గా మార్చి, ఆ వర్గం ద్వారా అధికారాన్ని సుస్థిరపరుచుకోవచ్చ’ని భావించి ఆ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. మన దేశంలో ఇంగ్లిషు భాష ప్రవేశం, దాంట్లో నుంచి పుట్టుకు వచ్చిన ‘గిరీశం జాతి’ని ఇప్పుడు మన మధ్య స్పష్టంగా చూడవచ్చు. ఈ వర్గానికి లోతైన విలువలు, సమాజంపట్ల బాధ్యత, వ్యక్తిగత నిజాయితీ లోపించడంతో సామాజిక మార్పులో భాగం కావలసిన ఒక ప్రజాస్వామ్య మధ్యతరగతి లేకుండాపోయింది. దాంతో ‘అందరికి చదువు’ అనే భావన ఉద్యమ రూపం తీసుకోలేకపోయింది. 

స్వాతంత్య్ర ఉద్యమం కంటేముందే మొట్టమొదట విద్య గురించి మాట్లాడి, దాని కోసం కృషిచేసిన వాళ్లలో మహాత్మ ఫూలే, సావిత్రి బాయి ఫూలే ముందు వరుసలో ఉన్నారు. ఆ కాలంలోనే అమ్మాయిల చదువు ప్రాధాన్యాన్ని వాళ్లు గుర్తించారు. స్వాతంవూతోద్యమం ప్రారంభమైన తర్వాత 20వ శతాబ్ద ఆరంభంలో అందరికి విద్య అన్న స్పృహ కొంత కనిపించింది. అందరికి విద్య అంటే ఎలాంటి విద్య? ఒక స్వతంత్ర దేశానికి ఎలాంటి విద్యావిధానం ఉండాలి? అనే స్పష్టత లేదు. కాని అందరికి విద్య అన్న భావన 1940 వరకు కొంత ముందుకు నడిచి 1944 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అంశం గురించి ఒక తీర్మానం చేసింది. స్వాతంత్య్రం తర్వాత ఎన్ని సంవత్సరాలలో అందరికీ విద్య సాధిస్తామన్న దాని మీద జరిగిన చర్చలో ఒక సభ్యుడు నాలుగు దశబ్దాలు పట్టవచ్చు అన్నప్పుడు, మిగతా సభ్యులంతా స్వతంత్ర సార్వభౌమదేశంలో ప్రజలు నాలుగు దశాబ్దాల కాలం చదువు కోసం వేచి ఉండడానికి సిద్ధంగా ఉండరని వాదించి, ఒక దశాబ్ద కాలంలో అందరికి విద్యను అందించాలని నిర్ణయించారు. అదే అంశం భారత రాజ్యాంగంలో చేర్చా రు. అయితేరాజ్యాంగంలో దీన్ని ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించకుండా ఆదేశిక సూత్రాలలో చేర్చడం పాలకవర్గాల నైజాన్ని తెలుపుతుంది. 

రాజ్యాంగంలో ఒక దశాబ్ద కాలంలో 6నుంచి 14 ఏళ్ల వయసులోని పిల్లలందరికి చదువు అని అంగీకరించినా, ఆరు దశాబ్దాలు దాటినా అది ఇంకా చాలా దూరంలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక నిరక్షరాస్యులు మన దేశంలో ఉన్నా రు. ఇంతమంది నిరక్షరాస్యులున్న దేశం ‘సూపర్ పవర్’ ఎలా అవుతుందో అహ్లువాలియా, మన్‌మోహన్‌సింగ్, చిదంబరానికే తెలియాలి. అయితే అంతర్జాతీయ ఒత్తిడి వలన, ప్రజా చైతన్యం పెరగడం వలన అంతిమంగా 2009లో పిల్లందరికీ విద్యను ప్రాథమిక హక్కుగా అంగీకరించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. చాలా మంది ఈ చట్టం ఆహ్వానించ తగ్గదని ప్రచారం చేసినా, ఈ చట్టం పిల్లలందరికీ చదువును కాని, సమాన అవకాశాలను కాని, నాణ్యమైన విద్యను కాని అందిస్తుందన్న భరోసా చట్టంలో లేదు. అంటే ఈ చట్టం కూడా చారివూతక కొనసాగింపే కాని చారివూతక మలు పు కాదు అని గ్రహించవలసి ఉంది. విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమం ఈ అంశాన్నే చర్చకు పెట్టి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అనే లక్ష్యం కోసం పనిచేస్తున్నది.

పొఫెసర్ హరగోపాల్
Andhra Jyothi news paper Dated 1/1/2012

No comments:

Post a Comment