Wednesday, December 14, 2011

పంచవర్ష ప్రణాళికలు ఏం సాధించాయి ?


- ధనికవర్గాలకే ప్రయోజనాలు

- 12వ ప్రణాళికపై చర్చలన్నీ వృథాప్రయాసే!
- పాలకుల పాత విధానాలే కొనసాగింపు
- స్విస్‌ బ్యాంకుల్లో ధనం గురించి చెప్పరేం?
- అవినీతి ధనం రాబట్టే ఊసే లేదు
- మొక్కుబడి మాటలతో కాలక్షేపం


ndcmeet
అక్టోబర్‌ చివరి వారంలో 12వ పంచవర్ష ప్రణాళిక (1212- 17) ఆమోదం కోసం జాతీయ అభివృద్ధి మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇలాంటి సమావేశాలు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అక్షరాలా 56 జరిగాయి. ఇలాంటి పంచవర్ష ప్రణాళికలు 11 అమలు అయ్యాయి. జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు, కొందరు కేంద్రప్రభుత్వ కార్యదర్శులు పాల్గొంటారు. ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. తాజాగా జరిగిన మండలి సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ రాజకీయ పార్టీలు దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరించవద్దని, తమ తక్షణ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టించవద్దని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక భావనలు పెరిగాయని, అది సరియైన ధోరణి కాదని అన్నారు. సూటిగా చెప్పాలంటే గత ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట, ప్రణాళికల పేరిట చేస్తున్న కృషిలో అత్యధికం ధనిక వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్నది.


గత 11 ప్రణాళికలవలె కాకుండా, 12వ ప్రణాళికకు అప్రోచ్‌ పేపర్‌ను దాదాపు ఏడాది క్రితం విడుదలచేసి, దానిపై చర్చలో పాల్గొనవలసిందిగా దేశంలోని వివిధ సంస్థలను, మేధావులను ఆహ్వానించారు. కాని అదంతా వృథా ప్రయాసగా మిగిలింది. ప్రజలను మభ్యపెట్టేందుకు చర్చలు- భాగస్వామ్యం అన్నారు తప్ప, చివరకు ప్రభుత్వం తాను చేయదలచుకున్నదే చేసింది. సంస్కరణలపట్ల వ్యామోహంతో మన్మోహన్‌సింగ్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుకు అనుకూలంగా ఏ ఉదార వాద విధానాలను ప్రవేశపెట్టారో, అవే విధానాలను మార్పు లేకుండా 12వ ప్రణాళికా పత్రంలో పొందుపరిచారన్నది విమర్శ.

ఎంతసేపూ ఆర్థికాభివృద్ధి, జిడిపి శాతం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మమేం కావడం, ఎగుమతుల ఆధారంగా అభివృద్ధి సాధించడం గురించి మాట్లాడటం, అందుకు ఆటంకాలు సృష్టించవద్దని ప్రజలను కోరడం మినహా- ప్రజల సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదు అన్న విమర్శ బలంగా వచ్చింది.
దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగినా, మళ్ళీ ఏర్పడినా దాన్ని తట్టుకోవటం ఎట్లాగో ఈ ప్రణాళికలో ఒక్క మాట లేదు. ప్రపంచంలో ఎక్కువమంది పేదలుగల దేశం మనది. ఈ దేశంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ పేదజనం ఆర్థికమాంద్యాన్ని తట్టుకోగలరోకూడా ఈ పత్రంలో లేదు.

ఐఎంఎఫ్‌ అధికారులుగా పనిచేసి వచ్చిన మన్మోహన్‌సింగ్‌, మాంటెక్‌ సింగ్‌లు 12వ ప్రణాళికను ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు రచిస్తూ, వ్యతిరేక ధోరణి వద్దని ప్రజలకు బోధించటం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం పట్ల ప్రజలకు వ్యతిరేక ధోరణి పెరిగిందని, ఇది సరియైన ధోరణి కాదని గురువింద వలె ప్రధానమంత్రి మాట్లాడడం విచిత్రంగా ఉంది. తన పార్టీ వారికి, తన మంత్రి వర్గ సహచరులకు చెప్పాల్సిన మాటలను ఆయన ప్రజలకు చెప్పడం ఆశ్చర్యం. నిజానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా ప్రజా వ్యతిరేక ధోరణిలో పడి కొట్టుకుపోతున్న వేళ, ప్రజలు ప్రభుత్వంపట్ల నెగిటివ్‌ ధోరణి పెంచుకుంటున్నారనే విషయాన్ని ఆయన గ్రహించకుండా ప్రజలకు హితవులు పలకడం నెట నిజంగా గడసరితనమే.

ప్రజలు సృష్టిస్తున్న సంపద, సహజవనరుల దోపిడీ సరిపోక జాతిని తాకట్టు పెట్టి అమానవీయ నిబంధనలను ఒప్పుకొని ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి అధికారులు, రాజకీయవాదులు కోట్లకు కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు, చేస్తున్నారు. ఆ అప్పులను, వడ్డీలను దేశ ఖజానాలో నుంచి ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ప్రజలు సృష్టించే సంపదను, దేశ భవిష్యత్తును ముందే అమ్మేస్తున్న దుర్మార్గమైన పద్ధతులను ఆయన, ఆయన మంత్రివర్గ సహచరులు అనుసరిస్తూ, పైకి తను బుద్ధిమంతుడినని, సత్యవ్రతుడినని మాట్లాడటం అన్యాయం. దొంగ చేసే దుర్మార్గం ఎంతో, దొంగలకు సద్దులు మోసేవాడిది అంతే దుర్మార్గం అన్న నానుడి తనకు వర్తించదనుకొంటున్నాడు.

స్విస్‌ బ్యాంక్‌లో దాచిన రూ. 400 లక్షల కోట్ల నల్ల ధనం గురించి ఒక్కమాట మాట్లాడకుండా, దేశంలో రాజకీయవాదులు, అధికారులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు కలిసి కూడబెట్టిన అవినీతి సొమ్ము విషయాన్ని ప్రస్తావించకుండా ప్రజలు ప్రభుత్వంపై నెగెటివ్‌ ధోరణిని పెంచుకోవవద్దని సన్నాయి నొక్కులు నొక్కడం ఆయనకే చెల్లింది.మొత్తం దేశ సంపదలో 95 శాతం కేవలం ఐదు శాతంమంది దగ్గర పోగయింది. ఇందులో మళ్ళీ ఒక్క శాతం మంది దగ్గరే అందులో 90 శాతం డబ్బు పేరుకున్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఇదే కారణం వల్ల మల్లెల విప్లవాలు, వాల్‌స్ట్రీట్‌ ముట్టడి లాంటి తీవ్ర పరిస్థితులు నెలకొంటున్న సందర్భంలో ప్రధానమంత్రి ఇక్కడ సర్దుబాటు చర్యలు చేపట్టకుండా ప్రజలను మభ్యపెట్టాలని చూడడం విచిత్రం.

ఇది ఎంత అసమంజసమో ఆయనకు తెలియదని అనుకోవాలా? యధాతథస్థితిని కొనసాగిస్తూ ఇంకొన్ని రోజులు పదవి అనుభవించి పోవడమే ఆయన లక్ష్యం అని అనుకోవాలా? దేశంలో ఒకవైపు వందల సంఖ్యలో సంపన్నులు పెరుగుతుంటే, కోట్ల సంఖ్యలో పేదలు తయారు అవుతున్నారు. ఈ విషయాన్ని 12 వ ప్రణాళిక పత్రంలో వారు వివరించనే లేదు. ఒకవైపు ఒక రోజుకు రూ. 26 ఉంటే చాలు. ఆ రోజు గడిపివేయవచ్చు- అనే ప్రకటనలు చేస్తూ, రూ. 26 ఆదాయం ఉన్న వారందరూ భాగ్యవంతులే అనే అభిప్రాయాన్ని ఇదే ప్రణాళికా సంఘం నిస్సిగ్గుగా రాతపూర్వకంగా సుప్రీంకోర్టుకు వివరించింది. ఇదే ప్రణాళికా సంఘం మహిళల ఆర్యోగం, పోషకాహారం తప్ప అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి అనే అర్థం వచ్చే మాటలను చెబుతోంది.

ప్రపంచ బ్యాంకు చెప్పే సంస్కరణలు కాదు, గ్రామస్థాయిలో జరగాల్సిన సంస్కరణల మాట ఏమిటో చెప్పాల్సిన సందర్భంలో- విషయాలు ఏమీ చెప్పకుండా ‘ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకత పెంచుకోవద్దు’ అనడం ఆశ్చర్యం. సామాన్యుడిని పట్టించుకోకుండా, ఒక్క సాహసోపేత నిర్ణయం తీసుకోకుండా, మేడమ్‌ అడుగులకు మడుగులొత్తుతూ ప్రపంచ బ్యాంకు తాబేదారుల్లా పదవి నిర్వహించడం దేనికో ఆయనకే తెలియాలి.జాతీయ అభివృద్ధి మండలిలో 12వ ప్రణాళికా పత్రాన్ని సమర్పించే ముందు పదకొండు పంచవర్ష ప్రణాళికల ద్వారా గత ప్రభుత్వాలు సాధించినదేమిటో వివరించాలి. ఇంకా సాధించాల్సినది ఏమిటో చెప్పాలి. జరిగిన పొరపాట్లకు జాతికి క్షమాపణ చెప్పాలి, వైఫల్యాలను ధైర్యంగా ఒప్పుకోవాలి.

durgam-ravinder
కాని, ఇవన్నీ మరిచి, మేం సత్పురుషులం, మమ్మల్ని ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు, ఇది మంచిది కాదని వాపోవడం ఏమిటో?!అన్ని రంగాల్లో అన్నీ చేసేశాం, దేశంలో మహిళల ఆరోగ్యం, పోషకాహారం లోపం ఒక్కటే మిగిలిపోయింది. ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో దానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రణాళికా సంఘం ప్రకటించడం మరో విచిత్రం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 75 శాతం మహిళలు నేటికీ ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వారు పరిశుభ్రత పాటించడం లేదట! ఈ విషయమై రాబోయే ప్రణాళికా కాలంలో ప్రభుత్వం ఉద్యమంలా పనిచేసి పరిస్థితి చక్కదిద్దుతుందట. ఇలా ఏదో ఒకటి మొక్కుబడి మాట మాట్లాడి ఎన్నాళ్ళు ప్రజల గోస తప్పి పుచ్చుకుంటారు? ప్రజల కష్ట సుఖాలను పట్టించుకునే ప్రభుత్వం, ప్రణాళికా సంఘం ఈ దేశంలో ఎప్పటికి వస్తాయి?

statepr
Surya News Paper Dated 15/12/2011 

No comments:

Post a Comment