Friday, December 9, 2011

మహిళలకేదీ రక్షణ? Share


రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరుగుతున్న ఘోరాలు, నేరాలు కలవరపెడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు గుండెలు పిండేసేలా వున్నాయి. అదే సమయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్న నేతల మాటలకు పరమార్థమిదా అన్న అనుమానమూ కలిగిస్తున్నాయి. తెల్లారి లేచింది మొదలు చెల్లీ, తల్లీ అంటూ మహిళలను ములగ చెట్లెక్కించి ఎన్నికల పబ్బం గడుపుకునే నేతల చేతలను బహిర్గతం చేస్తున్న సంఘటనలివి. కంచే చేనును మేసిన చందంగా మంగళవారంనాడు జంటనగరాల్లో రక్షకభటులే ఇద్దరు బాలికలపై అత్యాచారానికి తెగబడ్డారు. అదేరోజున రంగారెడ్డి జిల్లాలో బహిర్భూమికి వెళ్లిన పన్నెండేళ్ల బాలిక అఘాయిత్యానికి గురైంది. కర్నూలుజిల్లా ఆళ్లగడ్డలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ మహిళా రైతు బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్‌జిల్లాలో రెండవసారికూడా ఆడపిల్లకే జన్మనివ్వబోతోందని తెలిసిన భర్త బలవంతపు గర్భస్రావం చేయించడంతో ప్రాణాలు కోల్పోయిందో అభాగ్యురాలు. ఇదే జిల్లాలో అదనపు కట్నం వేధింపులకు ఇద్దరు మహిళలు కాటికెళ్లారు.కన్నవారే కాదన్నారని ఆత్మహత్యకు పాల్పడిందో వృద్ధురాలు. అన్యాయమైపోతున్న మహిళ గురించి మానవహక్కుల దినోత్సవం నాడు చెప్పుకోవాల్సి రావడాన్ని బట్టే పరిస్థితి తీవ్రతను అంచనా వేసుకోవచ్చు. మైనర్‌ బాలికలు, టీనేజీ యువతులపై అత్యాచారాలు, హత్యలు సర్వసాధారణమైపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో హత్యకు గురయిన మహిళల శవాలు తరచూ కన్పిస్తున్నా ప్రభుత్వం పట్టించుకొన్న పాపానపోలేదు. 


హత్యలకు గురవుతున్న వారంతా వ్యభిచారిణులో కాదో తెలియదు కాని వ్యభిచారిణులు హత్యకు గురైనా పట్టించుకోవనక్కర్లేదన్న ధోరణి ప్రభుత్వంలో కన్పిస్తోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఆడపిల్లలను పిండ దశలోనే కడతేర్చే కసాయిలకు కొదవేలేదు. మరో వైపు కుల దురహంకార హత్యలు వుండనే వున్నాయి. బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న అత్యంత పెద్ద దేశంగా భారత్‌ పేర్గాంచింది. ఆ పాపంలో మన రాష్ట్ర భాగస్వామ్యం తక్కువేమీ కాదు. వీటికి వివక్ష తోడైతే ఇక చెప్పేదేముంది. విద్య, ఉద్యోగం, ఆహారం, వైద్యం, వేతనం అన్నింట్లోనే వివక్షే. అమ్మ కడుపులో వున్నప్పటి నుంచి కాటికి చేరే వరకూ ప్రతి చోటా వివక్షే. పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే కాన్పుకోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారు. అదే అబ్బాయైతే కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళుతున్నారు. ఆడపిల్లమీద పుట్టక ముందునుంచే ఖర్చు తగ్గించుకుంటున్న వైనమిది.
సంపాదకీయం    Fri, 9 Dec 2011 ప్రజాశక్తి న్యూస్ పేపర్ తెలుగు 
మహిళలపై జరుగుతున్న నేరాల్లో మన రాష్ట్రమే టాప్‌లో వుంది. నమోదౌతున్న మొత్తం నేరాల్లో మహిళలపై జరుగుతున్న నేరాల వాటా దాదాపు 13 శాతం. మహిళలపై నేరాలు భారీగా పెరగడం ఆందోళన కలిగించకమానదు. జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం ఈవ్‌టీజింగ్‌, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి నేరాల్లో దేశం మొత్తంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో వుంది. వేధింపులలో రెండవ స్థానంలో, వరకట్న హత్యలలో నాల్గవ స్థానంలో వుంది. అత్యాచారాలు 2010లో 1308 జరగ్గా, ఈ ఏడాది ఆ సంఖ్య ఇప్పటికే 1362కి చేరింది. ఈ లెక్కలన్నీ అధికారికంగా వెలువరించినవి. ఇక పోలీస్‌స్టేషన్‌ దాకా చేరని కేసులు, ఆక్రందనలు, కన్నీళ్లు ఎన్నో! ఈసడింపులు తప్ప న్యాయం లభించదని నోరు నొక్కేసుకుంటున్న వారెందదరో! నోరు తెరచి తనపై అత్యాచారయత్నం జరిగిందని చెప్పినా పోలీస్‌స్టేషన్లో వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి నిరాకరించిన ఘటనలూ తక్కువేం కాదు. తాజాసంఘటన ఏకంగా రాజధానిలోనే జరిగింది. కొండంత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో దూసుకెళుతున్న మహిళలకు కీచకుల బాధ, ఆకతాయిల అకృత్యాలు కుంగదీస్తూనే వున్నాయి. ఇంత పెద్ద పోలీస్‌ వ్యవస్థ వున్నా నేరగాళ్లకు శిక్షలు పడడమే గగనమైంది. గతేడాది వెలువడిన తీర్పులను చూస్తే అత్యాచార కేసుల్లో వందమంది నిందితుల్లో ఐదుగురికి శిక్ష పడడమే గగనమైపోయింది. మిగిలిన కేసులు కొట్టివేయడమో...పరస్పర అంగీకారంతో రద్దు చేయడమో జరిగింది. పోలీసు దర్యాప్తు కూడా మందకొడిగానే సాగుతోంది. ఫలితంగా బాధితులకు తీరని అన్యాయం జరుగుతుండగా, నిందుతులకు మాత్రం భరోసా ఏర్పడుతోంది. తీవ్రమైన ప్రభుత్వ అలసత్వం, ప్రజల అవగాహనా లేమి, స్వార్థం అన్నీ కలిసి మహిళల పరిస్థితి దారుణంగా మార్చాయి. కండబలం, ధనబలం, రాజకీయ అధికారం, ఫ్యూడల్‌ భావజాలం మహిళల బతుకులను అత్యంత దయనీయంగా మారుస్తున్నాయి.
వాస్తవాలిలావుంటే ఏలికల కోతలు మాత్రం కోటలు దాటుతుంటాయి. చూడండి మా హయాంలో ఎందరు మహిళలు మహారాణుల్లా పాలిస్తున్నారో! యుపిఎ ఛైర్‌ పర్సన్‌ మొదలుకొని రాష్ట్రపతి, స్పీకర్‌ వరకు మహిళలే. అందాకా ఎందుకు రాష్ట్ర హోంశాఖకు ఓ మహిళ సారథ్యం వహిస్తున్నారని గొప్పలు చెప్పుకుంటారు. అందరు మహిళలుండీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇంతగా పెరుగుతున్నాయంటే ఎవరిని నిందించాలి? పేరుకు మహిళలకోసం అది చేస్తున్నాం. ఇది చేస్తున్నాం. వడ్డీలేని రుణాలిస్తాం. 33శాతం రిజర్వేషన్‌ కోసం పాటుపడుతున్నాం. సాధికారత సాధిస్తాం. అని జబ్బలు చరుచుకుంటే సరిపోతుందా? చేతలు గడప దాటకుండా మాటలు కోట దాటేలా చెప్పడంవల్ల ప్రయోజనముండదు. భ్రూణహత్యలు, వరకట్నం, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలను అరికట్టేందుకు చేసుకున్న చట్టాలను అమలు చేసేందుకు పూనుకోవాలి. వరకట్న వేధింపుల నుంచి రక్షణ కోసం సాధించుకున్న 498 ఎ చట్టాన్ని నీరుగార్చకుండా చూడాలి. ఆడపిల్లల ఉసురు తీస్తూ వ్యాపార కేంద్రాలుగా మారిన స్కానింగ్‌ సెంటర్లను కట్టడి చేయాలి. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకునేలా ప్రజలే ప్రభుత్వంపై ఒత్తిడిచేయాలి. కాలయాపన లేకుండా నేరస్థులకు కఠిన శిక్షలు వేయాలి. 

No comments:

Post a Comment