Monday, November 19, 2012

'రాజకీయ' ప్రొఫెసర్లు రాజీనామా చేయాలి - కంచ ఐలయ్య



ఒక వ్యక్తి కుల బలం - ధన బలం ఉపయోగించి ప్రభుత్వ సంస్థ రూల్సును దారుణంగా ఉల్లంఘిస్తుంటే మిగతా వారు ఆ సంస్థలో ఎందుకు పనిచెయ్యాలనే నైతిక ప్రశ్న ఆ సంస్థలో పనిచేసే వారందరి ముందు ఉంటుంది. ఉద్యమాల పేరుతో ఇటువంటి ఇమ్మోరాలిటీకే యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పాల్పడినా మొత్తం యూనివర్సిటీ కుప్పకూలుతుంది... ఇటు తెలంగాణ ఉద్యమాల్లో గానీ, అటు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో గానీ పనిచేస్తూ రోజూ రోడ్లమీద ఉండాలనుకునే ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా రాజీనామా చెయ్యాలి. అది వారి నైతిక బాధ్యత. 

దేశంలో ఉన్న విద్యా సంస్థల్లో యూనివర్సిటీలు అత్యున్నతమైనవి. ఈ యూనివర్సిటీల్లోనే దేశాన్ని అభివృద్ధి చేసే అన్ని రకాల రీసెర్చ్, టీచింగ్ జరగాలి. యూనివర్సిటీ కాన్సెప్ట్ మనదేశంలో నలందా యూనివర్సిటీతో (బుద్దిస్టు) మొదలైందని చెప్పినా అది యూరప్‌లో రూపుదిద్దుకొని మన దేశానికి దిగుమతి అయ్యాక మనకు ఉన్నత విద్యా ప్రమాణాలంటే ఏమిటో అర్థమయ్యాయి. ఇంగ్లండులో మొదట ఒక రూపం తీసుకున్న ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ల నమూనాల్లో ప్రపం చదేశాల్లో ఎన్నో యూనివర్సిటీలు ఏర్పడ్డాక అవి ప్రపంచ రూపురేఖల్నే మార్చనారంభించాయి. ఆధునిక ప్రపంచ విప్లవమంటే యూనివర్సిటీల్లో విద్యాబోధన, రీసెర్చ్ ఒక అద్భుతమైన విప్లవం. విప్లవమంటే తుపాకుల పోరాటం, రక్తపాతం కానక్కరలేదు. విప్లవం భావాత్మకంగా ప్రారంభమై భౌతిక మార్పు రూపం తీసుకుంటుంది. మార్క్స్ విప్లవ సిద్ధాంతం కూడా యూనివర్సిటీ పరిశోధనల్లోనే పుట్టింది.

ప్రతినిత్యం టీచింగ్, రీసెర్చ్‌తో సంఘర్షణపడాల్సిన యూనివర్సిటీలు తెలంగాణ ప్రాంతంలో పదేళ్ళుగా కుప్పకూలిపోయాయి. ఇందుకు రెండు కారణాలున్నాయి : (1) యూనివర్సిటీ ప్రొఫెసర్లలో కొంతమంది పాఠాలు చెప్పి, రీసెర్చ్ చేసే పని పక్కకుపెట్టి 'తెలంగాణ రాష్ట్ర సాధన' నాయకులను తయారుచెయ్యడమో లేదా స్వయంగా నాయకులం కావాలనో తిరగడం. (2) ఈ కార్యక్రమాన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చుతూ ఉపన్యాసాలిస్తూ, కరపత్రాలకు మించని రాతలు రాస్తూ క్లాస్‌రూమ్ టీచింగ్‌ను డీలెజిటిమేట్ చేశారు. యూనివర్సిటీల్లో మూడంచెల పోస్టులుంటాయి. లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ (పాత పేర్ల ప్రకారం). లెక్చరర్ చదివి పుస్తకం చేత పట్టకుండా లెక్చర్లు ఇవ్వాలి. ఈ విధంగా లెక్చర్ ఇవ్వడానికి వ్యక్తి తాను చెప్పే అంశం చుట్టూ ఎక్కువగా చదవడం, కొంత పరిశోధన చెయ్యడం అవసరం. 

రీడర్‌కు ఆ పేరు పెట్టింది ఆ పోస్టులో ఉన్న వ్యక్తి లెక్చరర్ కంటే ఇంకా ఎక్కువ 'రీడ్' చెయ్యడం, క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పడంతో పాటు రీసెర్చ్ గైడెన్స్‌లోకి ఈ దశలోనే ప్రవేశించాలి. రీడర్, రీడ్ అండ్ టీచ్ దశ నుంచి కొత్త అంశాలను కనుక్కొనే రీసెర్చ్ తను చెయ్యడం, రీసెర్చ్ స్కాలర్లచే చేయించడం ప్రారంభించాలి. ఇక ప్రొఫెసర్ పదవి విద్యారంగంలోనే అత్యున్నతమైన పదవి. దాని తరువాత వచ్చేవన్నీ అడ్మినిస్ట్రేటివ్ పదవులు. ప్రొఫెసర్ అత్యున్నత జ్ఞానంతో విద్యార్థులకు, స్కాలర్లకు, బయటి ప్రపంచానికి ప్రొఫెస్ చేస్తాడు/ చేస్తుంది. ఈ దేశంలో టీచింగ్‌లోనూ పరిశోధనా రచనల్లోనూ చుట్టూ పరిస్థితుల్ని అంచనా వెయ్యడం, భవిష్యత్ పరిణామాల్ని ప్రెడిక్ట్ చెయ్యడం, మానవ అభివృద్ధి, సమానత్వం, సమాజంలో ఉన్నత విలువలను నెలకొల్పేందుకు తన లెక్చర్స్ ద్వారా, తన రచనల ద్వారా కృషి చెయ్యాలి. ఈ దేశంలోని యూనివర్సిటీల్లో ఈ విలువలు ఇంకా యూరప్, అమెరికా, కనీసం చైనా స్థాయికి కూడా ఎదగలేదనే చెప్పాలి.

యూరప్‌లో సమాజ శాస్త్ర రంగంలో మొదట విప్లవం తెచ్చిన ప్రొ. ఆడమ్‌స్మిత్ ఆయన రాసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకం యూనివర్సిటీ పరిశోధనల్లో పుట్టిందే. ఆ తరువాత ప్రపంచ భావ విప్లవానికి నాంది వేసి హెగెల్ రచనలు జర్మనీ యూనివర్సిటీలో రూపుదిద్దుకున్నాయి. అదే విధంగా మార్క్సిజం కూడా జర్మనీ యూనివర్సిటీలోనే రూపుదిద్దుకున్నది. క్రమంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో సోషలిజం, బిహేవియరిజం, డెమొక్రాటిక్ సోషలిజం మొదలగు సిద్ధాంతాలన్నీ యూనివర్సిటీ రచనలో ముందుకొచ్చినవే. మన జీవితకాలంలో జాన్ రాల్స్ రాసిన 'సోషల్ జస్టిస్' పుస్తకం యూనివర్సిటీ పరిశోధనగా బయటికి వచ్చిందే. బేసిక్ సైన్సులో, ఖగోళ శాస్త్రంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనలెన్నో ప్రపంచ మార్పుకు నాంది పలికాయి. మనదేశంలో ఈ మధ్య కాలంలో కొంత మంచి రీసెర్చ్ యూనివర్సిటీలో జరుగుతుంది. 

డి.డి.కోశాంబి, కోమిలాథాపర్ వంటి వారు చేసిన మంచి చరిత్ర రచనలు యూనివర్సిటీల్లోంచి వచ్చినవే. ముఖ్యంగా అమర్త్యసేన్ ఆర్థిక రంగ పరిశోధనలు యూనివర్సిటీల్లోంచి వచ్చినవే కదా! ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తెలంగాణలో ఎన్నో విప్లవాత్మక పరిశోధనలకు అవకాశముంది. కానీ ఇక్కడి సీనియర్ ప్రొఫెసర్లు ఎక్కువ మంది రాజకీయ నాయకులవ్వాలనుకోవడం, క్వాలిఫికేషన్లు లేకున్నా పైరవీలతో, కుల-ధన బలంతో ప్రొఫెసర్లు కావడం వల్ల రీసెర్చ్ అనేది 'పిచ్చివాళ్ళ' పనిగా లెక్కచేయబడుతోంది.

తను ప్రొఫెసర్ వృత్తిగా ఎంచుకున్న సబ్జెక్టులో బలమైన పరిశోధనలను చెయ్యడం సాధ్యం కానప్పుడు లేదా ఇష్టం లేనప్పుడు ఉద్యోగంలో ఉంటూనే మరో పనో, మరో వృత్తో చేస్తూ ఉండడం యూనివర్సిటీకి, మౌలికంగా ఉపాధ్యాయ వృత్తికి తీవ్ర నష్టం చెయ్యడమే. ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయ రంగం కూడా ఒక హోల్ టైమ్ వృత్తి. ఆ వృత్తిలో కొనసాగదలుచుకున్న వాళ్ళు తన ప్రొఫెసర్ లేదా టీచర్ పనికి రాజీనామా చేసి యథేచ్ఛగా చేసుకోవచ్చు. ప్రతి మానవునికి తాను జీతం తీసుకుని పనిచేసే పని తప్ప ఇతర పనులు చెయ్యడానికి ఎన్నో కారణాలు చెప్పే అవకాశముంటుంది. వాటి చుట్టూ ఒక అత్యవసరతను చూపించే వాతావరణం ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో కొంతమంది సీనియర్ ప్రొఫెసర్లు జీతాలు తీసుకుంటూ పాఠాలు చెప్పకుండా అడపాదడపా, కాదు, ప్రతి నిత్యం తిరుగుతున్నారు. ఊళ్ళళ్లో, రోడ్ల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారు. క్లాస్‌రూమ్ లెక్చరుకు దీన్ని ప్రత్యామ్నాయం చేశారు. క్లాస్ రూమ్ లెక్చర్‌కు నిర్దిష్టత ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. అక్కడ ఒక క్రియాశీలత ఉంటుంది. ఆ క్రియాశీలతను తన రీసెర్చ్‌లో చూపించవచ్చు. కానీ గ్రామంలో ఒక ప్రాంతం గురించో, ప్రజలకున్న సమస్యల గురించో మాట్లాడడానికి ఆ ప్రిపరేషన్, దానిచుట్టూ రీసెర్చ్ అవసరం లేదు.

తెలంగాణలో 1969 ముందునుంచే ఈ పనిచేసే బ్యాచ్ ఒకటి తయారైంది. తమ ప్రమోషన్లు కూడా వీళ్లు ఉద్యమ బలం చూపి తెచ్చుకున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడది జిల్లాకొక యూనివర్సిటీ, తాలూకాకు కొన్ని కాలేజీలు, మండలంలో ఎన్నో స్కూళ్లు వచ్చినాక కూడా చెక్కు చెదరకుండా కొనసాగుతుంది. విద్యారంగంలో ఈ సంస్కృతిని 'సాధారణీకరించినాక' తెలంగాణ రాష్ట్రం సాధించినా కూడా ఈ రంగాన్ని దారిలో పెట్టేదెట్ల?

ఈ ఉద్యమం చుట్టూ పనిగా తిరిగే ప్రొఫెసరు క్లాసు జరిగే వాతావరణం కంటే జరగకుండా ఉండే వాతావరణాన్ని కోరుకుంటారు. రాష్ట్ర సాధన జీవిత ప్రధాన లక్షణం, టీచింగ్ రీసెర్చ్ కాదు. తాను అటెండ్ చేసిన మీటింగ్‌లు లెక్కబెట్టుకుంటారు గానీ, రాసిన వ్యాసాలో రీసెర్చ్ పేపర్లో ఉండవు. కనుక వాటి లెక్క అనవసరం అని సిద్ధాంతీకరించే పరిస్థితి అతి సాధారణంగా వస్తుంది. వృత్తి మొరాలిటీ కంటే ప్రాంత మొరాలిటీని ప్రధానం చేస్తారు. ఉద్యమ దశలో సంస్థలు ఎంత చచ్చిపోతే అంత మంచిదనే అనాగరిక విలువ చుట్టూ ఆవరించేట్టు చేస్తారు. ఈ పని ఒక క్లర్కుగానో, ఫైలురాసే ఆఫీసరుగానో ఉండి చేస్తే అంత నష్టం ఉండకపోవచ్చు. కానీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌గా ఉండి చేస్తే చాలా ప్రమాదం.

చదవకుండా పరీక్షలు రాయకుండా మార్కులు తెచ్చుకోవాలనుకునే విద్యార్థులకు ఇటువంటి ఫ్రొఫెసర్లు ఆదర్శవంతమౌతారు. వీరికి కూడా రోజూ క్లాసురూములో పాఠాలు వినడానికి విద్యార్థులు కాక, రోడ్డు మీద ఉపన్యాసాలు వినడానికి జనమే కావాలి. క్లాసులన్నిటినీ బాయ్‌కాట్ చేయిస్తూ ఉంటే రోడ్డు మీద 'ఆడియన్సు కరువులేని' ఆనందం ఉంటుంది. ఈ దేశంలో కుల వ్యవస్థ చెయ్యబట్టి పై కులాలవారికి తమ కింది కులాల వారికి ఏం జరిగినా గిల్టీ ఫీలింగో, సెన్స్ ఆఫ్ షేమో ఉండవు. ఈ విధమైన గిల్ట్, షేమ్ లేని లక్షణాలు యూనివర్శిటీ టీచర్లలో గూడుకట్టుకున్నంక, తన చుట్టూ ఉన్న ధనం, ఒక మందను వెంటేసుక తిరిగే అమానుషత్వం, మానవత్వం లేని భాష మాట్లాడటం అలవాటైపోతాయి. ఈ క్రమంలోనే రాజకీయ రంగంలో (ముఖ్యంగా ఆసియా దేశాల్లో) ఉండే ఒకర్ని చంపడమో లేదా తాను చావడమో చెయ్యాలనే 'అన్‌సివిలైజ్‌డ్' జీవన విధానం ప్రొఫెసర్లకూ అలవడుతుంది. 

తాను నమ్ముకునే కాజ్-అది ప్రాంతీయం కావచ్చు లేదా పదవి సంపాదించడం కావచ్చు-కోసం కొందర్ని చంపించడమో, వారంతలు వారే చనిపోయే వాతావరణం కలిగించడమో ప్రొఫెసర్లు చేశాక ఏ వ్యవస్థ బాగుపడుతుంది? విద్యార్థులు ఆత్మహత్యలు, ఆత్మాహుతి చేసుకునే విలువల్ని పెంచి వారు చనిపోయాక, శవానికి మొక్కుతూ ఊరేగింపులు తియ్యడం ప్రొఫెసర్లు చేస్తుండడం ఈ దేశంలోనే చూడగలం. ఈ ప్రక్రియకు సహకరించని తోటి టీచర్లను టీచర్లో, విద్యార్థులో తిట్టడం కూడా ఇక్కడ చూస్తాం. మానవుల్ని నాగరికత వైపు నడిపించాల్సిన యూనివర్సిటీలు, అందులో పనిచేసే ప్రొఫెసర్లు ఏదో ఒక కాజ్‌తో సంస్థల విలువల్ని చంపాక, మానవుల చావు ఒక లెక్కలోకి రాదు. అంటే సమాజంలోని కుల అమానుషత్వాన్ని చదువు, రీసెర్చ్ పేరుతో కాకుండా ఉద్యమాల పేరుతో స్టాండరడైజ్ చెయ్యడం, యూనివర్సిటీలను సైతం ఈ స్థాయికి నెట్టడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతపు యూనివర్సిటీలు, వీటిని చూసి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతపు యూనివర్సిటీలు కూడా 'చదువు సాగనటువంటి' మట్టికుండలయ్యాయి. వాటికో రూపముంది కానీ సారం లేదు.

ఇప్పుడేం చెయ్యాలి అనేది సమస్య. ఎవరి నమ్మకాల్ని, ఆశయాల్ని వేరొకరు కాదనలేరు. తెలంగాణ రాష్ట్రమొస్తే ఇక్కడి అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని చెప్పే వారి హక్కును కాదనలేము. వ్యక్తులుగా అలా నమ్మే హక్కు వారి ప్రజాస్వామిక హక్కు. అయితే ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ - ముఖ్యంగా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రోజూ రోడ్ల మీద ఉండే హక్కు వారికి లేదు. అది వారి పై వ్యవస్థ తమను ప్రశ్నించలేని స్థితికి తెచ్చి కావచ్చు, లేదా ఏదో ఒక 'లీవ్' నెపంతో కావచ్చు. ఉదాహరణకు, ఒక ప్రొఫెసరో, ఉద్యోగో నెలలు మెడికల్ లీవ్ పెట్టి, దాన్ని డాక్టరుతో సర్టిఫై చేయించుకొని, రోడ్ల మీద, గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ ఉంటే, అతను/ఆమె బెడ్ మీద కాక రోడ్డు మీద ఉంటే ఉద్యోగమిచ్చిన సంస్థలు అతన్నీ, అతని/ఆమె రోగాన్ని సర్టిఫై చేసిన డాక్టర్‌ను ముందు సస్పెండ్ చెయ్యాలి గదా? అలా చెయ్యగలిగే ధైర్యాన్ని సంస్థ కోల్పోయినాక మిగతా ఉద్యోగులు సంస్థల్లో ఉండి కూడా పనిచెయ్యరు. 

ఒక నేరస్థునిపై చర్య తీసుకోలేని సంస్థ, ఎవరి మీదా తీసుకోలేదు. ఒక వ్యక్తి కుల బలం - ధన బలం ఉపయోగించి ప్రభుత్వ సంస్థ రూల్సును దారుణంగా వాయిలేట్ చేస్తుంటే మిగతా వారు ఆ సంస్థలో ఎందుకు పనిచెయ్యాలనే నైతిక ప్రశ్న ఆ సంస్థలో పనిచేసే వారందరి ముందు ఉంటుంది. ఉద్యమాల పేరుతో ఇటువంటి ఇమ్మోరాలిటీకే యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పాల్పడినా మొత్తం యూనివర్సిటీ కుప్పకూలుతుంది. అటువంటి స్థితిలో అలా తిరగదలుచుకున్న వారు రాజీనామా చేసి ఏ రాజకీయం చేసినా పర్వాలేదు. అది అతని హక్కు. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు రాజకీయాల్లో ఉండే హక్కు లేదని కాదు. తాను నమ్మిన రాజకీయ నాయకుని గేటు దగ్గర నిలబడి, తాను ఒక దశలో అటువంటి రాజకీయ నాయకుడుగా ఎదిగినా అభ్యంతరం లేదు. అది వారి హక్కు, ఇష్టం. కానీ ఉద్యోగంలో ఉంటూ సంవత్సరాల తరబడి పిల్లలకు పాఠాలు చెప్పకుండా, రీసెర్చ్ చెయ్యకుండా, రాజకీయాల్లో తిరుగుతూ సంస్థల్ని సర్వనాశనం చెయ్యడం పెద్ద నేరం. అందుకే ఇటు తెలంగాణ ఉద్యమాల్లో గానీ, అటు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో గానీ పనిచేస్తూ రోజూ రోడ్లమీద ఉండాలనుకునే ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా రాజీనామా చెయ్యాలి. అది వారి నైతిక బాధ్యత. 

- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated: 20/11/2012 

No comments:

Post a Comment