Tuesday, November 6, 2012

సోషలిస్టు వ్యవస్థ ద్వారానే స్త్రీలకు విముక్తి By బృందాకరత్‌


   Sun, 4 Nov 2012, IST  

'మహిళలు - సోషలిజం' అన్న గ్రంథాన్ని రచించిన ఆగస్ట్‌ బెబెల్‌ జర్మన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సంస్థాపకుల్లో ఒకరు. అత్యంత జనాదరణ కలిగిన నాయకుల్లోనూ, నలభైయేళ్ళ జర్మన్‌ సోషలిస్టు ఉద్యమ ప్రతినిధుల్లోనూ ఒకరిగా ఉన్న బెబెల్‌ అత్యుత్తమ సోషలిస్టు నాయకుడు, అంతర్జాతీయవాది, మార్కిస్టు సిద్ధాంతకర్త, పార్లమెంటేరియన్‌, వక్త, రచయిత, నిర్మాణదక్షుడు, కార్మిక సంఘనాయకుడు. మొదటగా ఈ పుస్తకం 1879లో ప్రచురితమైంది. పెట్టుబడిదారీ సమాజంలో స్త్రీల స్థితిగతులపై బెబెల్‌ చేసిన అధ్యయనము, విశ్లేషణా ఆయనకున్న ప్రగాఢమైన లోచూపును తెలియజేస్తాయి. శ్రామికునిగా ఆయనకున్న స్వీయానుభవంతోపాటు, రకరకాల దోపిడీలనూ, అణచివేతలనూ శ్రామికవర్గ స్త్రీలు ఎదుర్కొన వలసి రావడం ఈ లోచూపుకు కారణమై ఉండవచ్చు. మానవజాతి చరిత్ర ప్రారంభం నుంచీ స్త్రీల స్థానాన్ని సవివరంగా అధ్యయనం చేసేందుకూ, సోషలిస్టు సమాజంలో స్త్రీల భవితవ్యాన్ని గురించి తన ఊహలను ఆవిష్కరించేందుకు చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన జీవిత కాలంలోనే ఈ పుస్తకం జర్మను భాషలో 53 ముద్రణలు పొందింది. 20 భాషల్లోకి అనువాదమైంది. 15 లక్షల కాపీలు అమ్ముడైనట్లుగా సమాచారం.
విశ్లేషణాత్మక ప్రాతిపదిక వేసిన ఎంగెల్స్‌
బెబెల్‌ పలుమార్లు ఉదహరించిన ఎంగెల్స్‌ మహోత్కృష్ట గ్రంథం, 'కుటుంబము- స్వంత ఆస్తి-రాజ్యముల పుట్టుక' అన్నది ఈ పుస్తకానికి ఆయువుపట్టుగా ఉన్నదని చెప్పవచ్చు. వాస్తవానికి, ఎంగెల్స్‌ నిర్దేశించిన ప్రాతిపదికపైనే మహిళల అణచివేతకు దారితీసిన సామాజిక పరిస్థితుల గురించీ, కారణాల గురించీ బెబెల్‌ మరింతగా అన్వేషించాడు. 'మోర్గాన్‌ పరిశోధనలపై ఆధారపడి రాసిన తన అద్భుతమైన పుస్తకంలో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌, అప్పటి వరకూ అహేతుకమైనవిగా, అసమగ్రమైనవిగా కనిపించిన అనేక విషయాలపైనా, మానవాభివృద్ధిలోని వివిధ దశలకు ప్రాతినిధ్యం వహించే ప్రజల చరిత్రపైనా వెలుగును ప్రసరింపచేశాడు. సాంఘిక నిర్మాణం క్రమక్రమంగా ఎలా ఏర్పడిందనే విషయంలో ప్రగాఢ దృష్టిని వాళ్ళు మనకు కలిగించారు. తత్ఫలితంగా వివాహం, కుటుంబం, రాజ్యం వంటి వాటి గురించి ఇంతకు పూర్వం మనకున్న భావనలన్నీ తప్పుడు ఆధారాలపై నిలబడినవని తెలుసుకోగలిగాం. వివాహం, కుటుంబం, రాజ్యం - ఈ విషయాల గురించి ఏదైతే నిరూపితమైందో అది స్త్రీల విషయంలోనూ సత్యమే. ఎన్నటికీ మారని 'శాశ్వత' స్థానం స్త్రీలదనే అభిప్రాయంతో మౌలికంగా విభేదించి వివిధ సాంఘిక దశలలో స్త్రీల స్థానం కూడా మారుతూ వచ్చిందని నిరూపించగలిగాం'. మార్క్సిస్టు దృక్పథాన్ని అనుసరించి, మహిళల అణచివేతకున్న చారిత్రక మూలాలు స్వంత ఆస్తిపై ఆధారపడిన వర్గ సమాజాభివృద్ధిలోనూ, స్త్రీలకు అనుకూలంకాని లైంగిక శ్రమ విభజనలోనూ కన్పిస్తాయి. స్త్రీలపై సాగిన కిరాతక అణచివేతను అది తెలియజేస్తుంది. కుటుంబ చరిత్రనూ, కుటుంబ సంబంధాలనూ, అలానే ఉత్పత్తి పద్ధతుల్లోనూ, ఉత్పత్తి సంబంధాల్లోనూ చోటుచేసుకున్న మార్పులతో దానికి గల సంబంధాలనూ అది తెలియజేస్తుంది. బెబెల్‌ ప్రకారం, 'గత మానవాభివృద్ధిలోని పురోగతిలో ఈ సంబంధాలు మారిన ఉత్పత్తి, పంపిణీ పద్ధతులను బట్టి మారాయని నిరూపించగలిగితే, ఇకముందు ఉత్పత్తి, పంపిణీలలో వచ్చే మార్పుల వల్ల స్త్రీపురుష సంబంధాలలో మళ్ళీ మార్పులు వస్తాయన్న విషయాన్ని నిరూపించవచ్చు. ప్రకృతిలోనూ, మానవ జీవితంలోనూ ఏదీ శాశ్వతం కాదు. మార్పు ఒక్కటే శాశ్వతమైనది'. ఆ కాలంలో ఇలాంటి అభిప్రాయాలు ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. బూర్జువా వివాహాల్లోని కపటంపై బెబెల్‌ చేసిన తీక్షణ విమర్శలూ, లైంగికంగా స్త్రీలను దోచుకుంటున్న తీరుపై ఆయన చేసిన దాడులు, విధిలేక వ్యభిచార కూపంలో దిగబడ్డ స్త్రీలపట్ల ఆయనకున్న సానుభూతి, చూపిన సంఘీభావం ప్రత్యేకించి ఆయన వ్యతిరేకులను రెచ్చగొట్టాయి. వివాహము, కుటుంబం గురించి బెబెల్‌ వ్యక్తపరచిన అభిప్రాయాలు మరీ ముఖ్యంగా మతాధిపతుల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి.
ఆదిమకాలం నుండి పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందేవరకు చోటుచేసుకున్న మార్పుల్ని ఈ పుస్తకం నమోదు చేసింది. విభిన్న సంస్కృతులపైనా, ప్రాంతాలపైనా శ్రమభరితమైన పరిశోధనలు చేయటం ద్వారా, వీటిల్లో ప్రతి ఒక్కటీ, స్త్రీలకు సమానత్వాన్ని మించిన స్థాయిని కలిగించిన సమాజాల నుండి (వీటినే ఆయన మాతృస్వామ్యం అని పిలిచాడు) స్త్రీలను ద్వితీయ పౌరులుగా పరిగణించే ప్రపంచంగా ఎలా పరిణమించిందీ బెబెల్‌ వివరిస్తాడు. చివరికాయన మనుస్మృతిని సైతం ఉదహరిస్తూ, కుటుంబ అభివృద్ధిలోని వివిధ దశలనూ, అదేవిధంగా భారతదేశంలోని వివక్షాపూరిత వ్యవస్ధనూ చిత్రించడానికై హిందూ పురాణాల నుండి ఉటంకింపులు ఇస్తాడు. బెబెల్‌ అధ్యయనం చేసిన పలు సమాజాలలో ఒక శతాబ్దానంతరం కూడా ఆస్తిగల సంపన్న వర్గాలలో వివాహ వ్యవస్థ బలంగా సజీవంగా ఉండటం, సంపదనీ, ఆస్తినీ, కార్పొరేటు కంపెనీ షేర్లనూ వారి సంతానానికి అందించే మార్గంగా వివాహ వ్యవస్థని ప్రయత్నపూర్వకంగా రక్షించడం ఈనాటికీ ఒక నిజం.
సామాజిక సంకుచిత వాదానికి వ్యతిరేకంగా
ఈ పుస్తకాన్ని చదువుతుంటే, దోపిడీతత్వం కలిగిన పెట్టుబడిదారీ సామాజిక వ్యవస్ధనూ, మానవుల మధ్య అది ఏర్పరిచే సంబంధాలనూ బెబెల్‌ వంటి నాయకులు ఎంత నిర్భయంగా విమర్శించిందీ కొట్టవచ్చినట్లు కనబడుతుంది. వర్గాధారిత సమాజాలపై విమర్శే ఈ పుస్తకానికి పునాదిగా ఉన్నది. పెట్టుబడిదారీ సమాజపు ద్వంద్వ విలువలనూ, కపటత్వాన్ని ఎండగట్టేటప్పుడు బెబెల్‌ శ్రామిక మహిళల స్థితిగతుల గురించేకాక మొత్తం మహిళా లోకం గురించే చాలా సునిశితంగా స్పందించాడు. ఇది వర్గేతరం అంటూ ఉద్యమంలో కొందరు చేసిన తప్పుడు విశ్లేషణను బెబెల్‌ తిప్పికొడుతూ సమాజంలో అన్ని తరగతుల మహిళలూ పెట్టుబడిదారీ వ్యవస్థ బాధితులేనన్నాడు.
సమూల మార్పుకు సోషలిజం అవసరం
పెట్టుబడిదారీ సమాజంలో సంస్కరణల కోసం ఉద్యమాలు చేయాలని బలంగా వాదించిన బెబెల్‌ పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మూలించి సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా మాత్రమే స్త్రీల విముక్తి సాధ్యం కాగలదని నిస్సందేహంగా భావించాడు. భవిష్యత్‌ సోషలిస్టు సమాజంలోని విభిన్న అంశాల గురించి చర్చించడానికి ఆయన ఈ పుస్తకంలో 11 అధ్యాయాలను కేటాయించాడు. జనాభా సమస్య నుండి వ్యవసాయం, కళలు, వ్యక్తి స్వాతంత్య్రం తదితరాలను ఆయన చర్చకు పెట్టాడు. వాటిలో ప్రాథమికమైనవి ఏమంటే, ఇంటిబయట చేసే ఉత్పాదక శ్రమ ద్వారా స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి సోషలిస్టు సమాజం హామీని కల్పించడం, శిశు సంరక్షణా బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించడం, అసమాన శ్రమ విభజనను అంతం చేయడానికి ప్రభుత్వమే భోజనశాలలు నడపడం ద్వారా ఇంటి చాకిరిని తొలగించి గృహ జీవనాన్ని మార్చివేయడం వంటివి. వివాహాలకు లేదా మానవ సంబంధాలకు స్వంత ఆస్తి పునాది తొలగిపోవడంతో స్త్రీపురుషుల మధ్య సంబంధాలు మార్పుకు లోనవుతాయి. అయితే సోషలిస్టు సమాజావిర్భావాన్ని చూడటానికి బెబెల్‌ జీవించి లేడు. ఉండివున్నట్లయితే తాను ఊహించిన సోషలిస్టు సమాజపు పలు వాగ్దానాలను యథార్థం చేసే దిశలో లెనిన్‌ నేతృత్వంలోని బోల్షివిక్‌ ప్రభుత్వం చేపట్టిన తొలి చర్యలను చూసి బెబెల్‌ ఉప్పొంగిపోయే వాడే.
బెబెల్‌ పుస్తకాన్ని, అది వెలువడిన చారిత్రక పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకుని చదవాలి. అందులోని కొన్ని సూత్రీకరణలను విలువైనవిగా మనం భావించకపోవచ్చు. కాని ఈ పుస్తకం వివిధ వర్గ సమాజాలలో స్త్రీలపై సాగిన చరిత్రాత్మక అణచివేతను సవివరంగానూ కదిలించే విధంగానూ చిత్రించింది. ఒకవైపున సంస్కరణల అవసరాన్ని చెెబుతూనే మరోవైపు స్త్రీల అణచివేతను సమూలంగా రూపుమాపడానికి సోషలిస్టు విప్లవమే పునాది అన్న అంశాన్ని చర్చించిందీ పుస్తకం. ఆంధ్రప్రదేశ్‌ ఐద్వా కమిటీ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాలని నిర్ణయించడం ముదావహం. స్త్రీల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక మార్పుల కోసం సాగే ఉద్యమంలో మన పాత్రను, విధులను సవ్యంగా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం సహాయపడగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను.
(రేపు హైదరాబాద్‌లో 'మహిళలు-సోషలిజం' పుస్తకావిష్కరణ) 
-బృందాకరత్‌

Prajashakti News Paper Dated: 04/11/2012 

No comments:

Post a Comment