Tuesday, November 6, 2012

ఎన్నాళ్ళీ మొక్కుబడి భూపంపిణీ? - అరటకట్ల రవి


     

కార్పొరేట్ వ్యవసాయాన్ని పేదరైతాంగం మీదుగా దౌడు తీయించాలన్న ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పాలకులు అమలుపరుస్తున్నారు. అలాగే అభివృద్ధిపేరుతో సెజ్‌లు, ప్రాజెక్టులకు వేల ఎకరాలు కట్టబెట్టే విధానాలనూ ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు సమగ్ర భూపంపిణీకి పూనుకుంటాయా? ప్రభుత్వపు మొక్కుబడి కార్యక్రమాలు, బూటకపు పంపిణీలపై భ్రమలు వీడి గ్రామీణ పేదలంతా ఏకమవ్వాలి. 

రాష్ట్రంలో ఆరో విడత భూపంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. గత శనివారం నాడు పుట్టపర్తిలో ముఖ్యమంత్రి 13వేల ఎకరాలు పంచారు. ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో లక్ష ఎకరాలను పంచాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వాలన్నీ ఇటువంటి భూ పంపిణీ తంతుని నిర్వహిస్తూనే ఉన్నాయి. 2004 వరకూ 43 లక్షల ఎకరాలు, దరిమిలా ఐదు విడతల భూ పంపిణీ కార్యక్రమంలో 7 లక్షల ఎకరాలు వెరసి యాభై లక్షల ఎకరాలను 35 లక్షల కుటుంబాలకు పంచినట్లు లెక్కలు చెప్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే పేదల సంఖ్య క్రమేపీ తగ్గాలి. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రోజుకి రూ.20 కంటే తక్కువ ఆదాయం కల్గిన వారు దేశ జనాభాలో 77 శాతం ఉన్నారని అర్జున్‌సేన్ గుప్తా కమిటీ వెల్లడించింది.

ఈ పేదరికం గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరుణంలో రెండు సందేహాలు తలెత్తుతున్నాయి. అరకోటి ఎకరాలు పంచామన్న లెక్కలైనా బూటకం కావాలి లేదా భూసమస్య పరిష్కరిస్తే గ్రామీణ పేదరికానికి కళ్ళెం వేయవచ్చన్న మాటైనా అవాస్తవమవ్వాలి. ప్రభుత్వాలు తాము చేసిన భూ పంపిణీ బూటకమైనదని అంగీకరించేందుకు సిద్ధపడవన్న విషయం తెలియంది కాదు. మరి గ్రామీణ పేదరికం నిర్మూలన భూ సమస్యలతో ముడివడిందన్న విషయం సత్యమా? కాదా? అన్న ప్రశ్నకు ప్రభుత్వమే బదులివ్వాలి. కమ్యూనిస్టులు, ప్రజాసంఘాలు సాగించిన భూపోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కుబడిగానైనా భూపంపిణీ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు కోనేరు రంగారావు భూకమిటీని ఏర్పాటు చేసింది.

'భూమి ఒక ఆర్థిక, సామాజిక సమస్యే గాక మానసిక పెట్టుబడి కూడా. సాంఘిక ఆర్థిక గౌరవాలు, అగౌరవాలను బట్టి నిర్ణయించే ఆదాయ, జీవనోపాధులకు కీలకమైన ఆస్తిగా భూమి ఉంద'ని కోనేరు కమిటీ నివేదిక పై ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించింది. అంటే గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడానికి భూసమస్యను పరిష్కరించడం కీలకమని ప్రభుత్వ నేతలే స్వయంగా అంగీకరించారు.

భూసమస్యను సమగ్రంగా పరిష్కరించకుండా పేదల్లో భ్రమలు పెంచేలా అప్పుడప్పుడూ భూపంపిణీ నాటకాన్ని రసవత్తరంగా ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. పంచ పాండవులు, మంచం కోళ్ళు సామెత ప్రభుత్వ భూపంపిణీకి అక్షరాలా వర్తిస్తుంది. రాష్ట్రంలో 16.63 లక్షల ఎకరాలు మిగులు భూమిగా గుర్తించి, ఎనిమిది లక్షల ఎకరాలు తేల్చి, 5.7 లక్షల ఎకరాలు స్వాధీనపర్చుకుని పంచామన్నారు. ఈ ఒక్క ఉదాహరణ పై సామెతకు చక్కగా సరిపోతుంది. భూపంపిణీ మొక్కుబడి పంపిణీ, బూటకపు పంపిణీ అన్నది అభాండం కానేకాదు; అది ఒక నిష్ఠుర సత్యమన్నది మచ్చుకు కొన్ని వాస్తవాలు తేల్చుతాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం సర్వేలో వెల్లడైన విషయాలు పైన పేర్కొన్న వాటిని రుజువు చేస్తున్నాయి. ఈ జిల్లాలో ఐదు విడతల్లోనూ 17వేల ఎకరాలు పంచగా ఆరో విడతగా 546 ఎకరాలు పంచనున్నామని అధికారులు ప్రకటించారు. మూడు విడతలుగా సాగిన పంపిణీ తీరును పది మండలాల్లోని 34 గ్రామాల్లో సర్వే చేయడం జరిగింది. సదరు గ్రామాల్లో 863 ఎకరాలు పంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో కేవలం 46 ఎకరాలు మాత్రమే కొత్తగా పంచారు. మిగిలిన 817 ఎకరాలలో 10 నుంచి 40 ఏళ్ళుగా పేదలు సాగు చేసుకొంటున్నారు. అంతా పేరుకు భూపంపిణీయే అయినా సాగింది మాత్రం పట్టాల పంపిణీయే.

కొత్తగా పంచిన భూములను నేటికీ పలుచోట్ల స్వాధీనపర్చలేదు. రాష్ట్రంలో ఐదు విడతల్లో పంచిన భూముల్లో 34వేల ఎకరాలు నేటికీ స్వాధీనపరచలేదని ప్రభుత్వమే ప్రకటించింది. కొన్ని చోట్ల పట్టాలు పొందిన వారిలో అనర్హులు ఉన్నారని ప్రజలు మొత్తుకున్నా ప్రభుత్వ స్పందన శూన్యం. కాళ్ళ మండలంలో మూడో విడతలో 78 మందికి పట్టాలిస్తే వీరిలో 16 మంది ఆ గ్రామాల్లో లేనివారే. వీరు ఫైనాన్స్ వ్యాపారులు, భూస్వాములు. రెండో విడతలో గవరవరం గ్రామంలో ఒక పేదవాని భూమినే ఐదుగురికి పంపిణీ చేశారు; పట్టాలిచ్చారు. దేవరపల్లి మండలంలోని రెండు గ్రామాల్లో ఇరవై ఏళ్ళ క్రితం పేదలకు పంచిన భూముల్ని రెండో విడతలో కొత్తవారికి పట్టాలిచ్చారు. దీంతో ఇరువురికి ఘర్షణలు తలెత్తాయి.

వీటికి ముందు నిర్వహించిన పంపిణీ తీరు ఇంతకంటే భిన్నంగా లేదు. 2004కి ముందు రాష్ట్రంలో పంచిన 43 లక్షల ఎకరాలలో 70శాతం అన్యాక్రాంతమయ్యాయని ప్రజాసంఘాలు, మేధావులు అంచనా వేస్తున్నారు. 'పంచిన భూమిలో అధిక శాతం పేదలుకాని వారి చేతుల్లోకి పోయాయని' కోనేరు కమిటీ పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలంలో 1954-88ల మధ్య అసైన్డ్‌భూమి 2014 ఎకరాలు పంచితే 1514 ఎకరాలు 20 మంది సంపన్నుల పరమయ్యాయి. వీటిని చేపల చెరువులుగా మార్చివేశారు.

దెందులూరు మండలంలోని మూడు గ్రామాల్లో 500 ఎకరాలను ఇతర జిల్లాల భూస్వాములు ఆక్రమించుకున్నారు. ఇదే జిల్లాలోని వేములపల్లి గ్రామంలో 1969-85 సంవత్సరాల మధ్య 162 ఎకరాలను ప్రభుత్వం పంచితే అందులో 86 శాతం అంటే 152 ఎకరాలు ఐదుగురు భూస్వాముల చేతుత్లో ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన మూడు మండలాల్లో 47వేల ఎకరాలు గిరిజనుల నుంచి గిరజనేతర భూస్వాముల చేతుల్లోకి పోయిందని నాటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్యా నాయక్ అసెంబ్లీలోనే ప్రకటించారు. కొన్ని గ్రామాల, మండలాల సంఖ్యలే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్త పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఓ ప్రక్క భూమిలేని వ్యవసాయ కార్మికులు క్రమేపీ పెరుగుతున్నారు. వీరిలో అత్యధికులు ఎస్సీలే. వీరు 1961లో 57 శాతం ఉంటే 1991 నాటికి 72 శాతానికి పెరిగారు. దళితుల చేతుల్లో ఉండే సగటు భూకమతాలు 1975లో 1.19 హెక్టార్లుంటే 1996 నాటికి 0.83 హెక్టారుకి కుదించుకుపోయింది. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16 శాతం ఉండగా మొత్తం సాగుభూమిలో 7.5 శాతం మాత్రమే వీరి చేతిలో ఉంది. ఇందుకు యాభై ఏళ్ళ పాటు సాగిన ప్రభుత్వ కృషి, భూసంస్కరణల చట్టాలెన్నున్నా దళితులకు భూమి దక్కలేదని కోనేరు కమిటీ అంగీకరించక తప్పలేదు. సాగుభూమి లేని వారందరికీ భూమి పంచమని ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. 'భూమి ఏమైనా రబ్బరా? సాగదీసి పంచడానికి?' అని ప్రభుత్వ అధినేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే ఉన్నారు.

'ఇచ్చేందుకు భూమి ఉందిగానీ ఇవ్వలేదు' అని కోనేరు కమిటీ కుండబద్ధలు కొట్టింది. ఈ కమిటీ గుర్తించిన మేరకు సీలింగ్ భూములు 8.5 లక్షల ఎకరాలు, దేవాదాయ భూములు 3.76 లక్షల ఎకరాలతో పాటు ఇంకా వివిధ రకాల భూములు 25 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయని తేల్చింది. ఇంతవరకు ప్రభుత్వమే గుర్తించని భూములు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయని అంచనా వేసింది. ఇందుకు 1997లో శేరిలింగంపల్లి మండలంలో ఘాట్ నెంబర్ భూముల సర్వేలో ప్రభుత్వం గుర్తించని భూములు బైటపడ్డాయన్న ఉదంతాన్ని ఉటంకించింది. అంటే పంచేందుకు భూములున్నాయి చిత్తశుద్దే కొరవడిందన్న విషయం నిర్ధారితమౌతుంది.

పంచినా సంపన్నుల చేతుల్లో ఉన్న వాటిని లాక్కొని తిరిగి పేదలకు అప్పగించే పనిచేసినా రాష్ట్రంలో పెద్ద ముందడుగే అవుతుంది. పేదలకు తామేదో చేస్తున్నామన్న భ్రమలు కల్గించినట్లు పబ్బం గడుపుకోవాలన్న యావ తప్ప సమగ్ర భూ సంస్కరణలు ఏ మాత్రం పట్టడం లేదన్నది చేదు నిజం. ఇది ప్రపంచీకరణ కాలం. రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమిని బంగారంలా మారుస్తోంది. కార్పొరేట్ వ్యవసాయాన్ని పేద రైతాంగం మీదుగా దౌడు తీయించాలన్న ప్రపంచ బ్యాంకు ఆదేశాలను పాలకులు అమలుపరుస్తున్నారు. అలాగే అభివృద్ధి పేరుతో సెజ్‌లు, ప్రాజెక్టులకు వేల ఎకరాలు కట్టబెట్టే విధానాలనూ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు సమగ్ర భూపంపిణీకి పూనుకుంటాయని ఆశించడం అత్యాశ అనిపించవచ్చు. ప్రభుత్వపు మొక్కుబడి కార్యక్రమాలు, బూటకపు పంపిణీలపై భ్రమలువీడి గ్రామీణ పేదలంతా ఏకమవ్వాలి. అదే జరిగినప్పుడు ఏ ప్రభుత్వమైనా తన విధానాలు మార్చుకోక తప్పదు.

- అరటకట్ల రవి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి

Andhra Jyothi News Paper Dated : 07/11/2012 

No comments:

Post a Comment