Friday, November 30, 2012

ఉప ప్రణాళికలు--Namasete Telangana Sampadakiyam


ఉప ప్రణాళికలు

దళితులు, గిరిజనుల ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టడం హర్షణీయం. దేశ చరివూతలోనే ఇట్లా ఉప ప్రణాళికను చట్టబద్ధం చేయడం ఇదే మొదలు. అయితే ఇందుకు గర్వపడాల్సింది మాత్రం ఏమీ లేదు. దళితుల, గిరిజనుల ఉప ప్రణాళికలను కొన్నిరాష్ట్రాలు సమర్థవంతంగా,నిజాయితీతో అమలు చేస్తుండగా, మన రాష్ట్రం మాత్రం విఫలమైంది. నిధులు దారి మళ్ళడంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఒత్తిడి వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించ వలసి వచ్చింది. అందువల్ల ఈ బిల్లును ప్రవేశ పెట్టడం దళితులు పోరాడి సాధించిన విజయం. అయితే ఈబిల్లులో ఇంకా కొన్ని లోపాలున్నాయి. శాసనసభలో సాగే చర్చలో వీటిని గుర్తించి చట్టాన్ని మరింత పకడ్బందీగా రూపొందిస్తే బాగుంటుంది. దళితుల, గిరిజనుల ఉప ప్రణాళికలను అమలు చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో చట్టబద్ధత కల్పించడం తప్పనిసరైంది. షెడ్యూల్డు కులాలు, తెగలకు జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు జరపడంతో సరిపోదు. అమలు జరపడాని కి ఎటువంటి వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు, అమలు జరగకపోతే తీసుకునే చర్యలేమిటనేది ప్రధానం. తాజా బిల్లు ప్రకారం- షెడ్యూల్డు కులాల, తెగల అభివృద్ధి మండలి విధాన నిర్ణయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పథకాల రూపకల్పన, అమలులో సూచనలు ఇస్తుంది. వివిధ శాఖల ఉపప్రణాళికా ప్రతిపాదనలను ఆమోదిస్తుంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఈ మండలి ఏడాదికి రెండుసార్లు సమావేశమవుతుంది. నోడల్ ఏజెన్సీలు ఆయా శాఖల సహాయంతో సంధాన, సమన్వయ పాత్ర పోషిస్తాయి. అమలు, పర్యవేక్షణలను సమీక్షిస్తాయి. విధినిర్వహణలో లోపం ఉంటే శిక్షించడం, ఉత్తమ సేవలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల జవాబుదారీతనాన్ని ప్రవేశ పెట్టినట్టు అవుతున్నది. నిజానికి వ్యవస్థాగత ఏర్పాటు ఇప్పుడు లేదని కాదు. ఇప్పటి వరకు ఉన్న ఏర్పాట్ల ప్రకారం- ముఖ్యమంత్రి చైర్మన్‌గా అపెక్స్ కమిటీ ఉంటుంది. నోడల్ ఏజెన్సీలతో పాటు జిల్లా డివిజన్, మండల స్థాయిలో పర్యవేక్షక కమిటీలు కూడాఉంటాయి. ఇవన్నీ నిర్ణీత వ్యవధిలో సమావేశాలు జరుపుతుండాలె. కానీ చిత్తశుద్ధితో అమలు జరగడం లేదు. అందుకే దళితులు చట్టబద్ధత కోసం పట్టుపట్టి పోరాడారు. 

ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ బిల్లు లోపభూయిష్టంగానే ఉన్నదనే విమర్శలున్నాయి. చట్టానికి పదేళ్ల పరిమితి పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. నిజానికి దళితులు, గిరిజనులకూ ఇతర సామాజిక వర్గాలకు మధ్య వ్యత్యాసం తగ్గినప్పుడు చట్టం దానికదే నిరర్థకమై కాలం చెల్లిపోతుంది. అంతే తప్ప కాలపరిమితిని కృత్రిమంగా నిర్ణయించకూడదనే వాదన ఉన్నది. బడ్జెట్ విడుదల అధికారం నోడల్ ఏజెన్సీకి లేకపోవడం మరో లోపమనే విమర్శ ఉన్నది. ఈ కాలంలో మౌలిక సదుపాయాల కల్పనా రంగం ప్రాముఖ్యం గలది. ఈ రంగంలో పనుల విభజన సాధ్యం కాదనే కారణం చూపడం భావ్యం కాదు. అంబుడ్స్‌మన్ వ్యవస్థ నెలకొల్పాలనేది మొదటి నుంచీ ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. కానీ బిల్లులో ఈ ప్రతిపాదన లేదు. కనీసం రాష్ట్ర మండలి ఏడాదికి రెండు కన్నా ఇంకా ఎక్కువసార్లు సమావేశమై సమీక్షిస్తుంటే బాగుంటుంది. నిధులు మురిగి పోకుండా, మళ్ళించకుండా నిబంధనలు లేవనే అభ్యంతరం కూడా వ్యక్తమవుతున్నది. నిజానికి ఉప ప్రణాళికలపై ఉన్న ప్రధాన విమర్శ ఇదే. ప్రభుత్వం బడ్జెట్‌లో దళితులకు, గిరిజనులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు చూపి ఖర్చు చేయడం లేదు. బడ్జెట్ కేటాయింపులు ఆశించిన రీతిలో వినియోగించక పోవడం ప్రజాస్వామ్య విరుద్ధం కూడా. ఈ బిల్లు రూపకల్పనకు ముందు భారీ కసరత్తు జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ అభివూపాయాలు సేకరించి నివేదికను సమర్పించింది. ఆ నివేదికే ఈ బిల్లుకు ప్రాతిపదిక. ప్రభుత్వం ఆ నివేదికను వెంటనే బయట పెడితే ఇప్పటి వరకు అందులోని అంశాలపై చర్చ జరిగేది. ప్రభుత్వం ప్రజాభివూపాయాన్ని గమనించి బిల్లు రూపొందిస్తే బాగుండేది. ఉప ప్రణాళిక అమలులో పారదర్శకత పాటిస్తామని చెబుతున్న ప్రభుత్వం కీలకమైన నివేదికను ఇంత కాలం మరుగున పెట్టక పోవాల్సింది. 

దళితులకు, గిరిజనులకు వారి జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలనే భావన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1970 దశకంలో మొదలైంది. కానీ ఆ ఫలాలు అనుభవించకుండానే అప్పటి నుంచి దళితులు, గిరిజనులలో ఒక తరం గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసినట్టయితే సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు వారి కోసం ఉపయోగపడేవని అంచనా. వివిధ పథకాల రూపంలో ఈ నిధులు ఈ అట్టడుగు వర్గాలకు ఉపయోగపడితే ఒక తరం అనేక సదుపాయాలు అనుభవించి సర్వతోముఖాభివృద్ధిని సాధించేది. ఈ అభివృద్ధి ప్రభావం మిగతా తరాలపై కూడా ఉండేది. ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇప్పుడు అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి. ప్రత్యేకించి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఈ హంగామాలో భాగమే. కానీ ఇప్పటి వరకు దళితుల, గిరిజనుల నిధులను దారి మళ్ళించడంలో అన్ని ప్రభుత్వాల పాత్ర ఉన్నది. ఉప ప్రణాళికల అమలు తీరును ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పెడతామని ప్రభుత్వం అంటున్నది. దీని వల్ల కొంత మేర మాత్రమే ఫలితం కనబడవచ్చు. దళితుల పట్ల, గిరిజనుల పట్ల వివక్ష చూపడం అనేది సామాజిక రుగ్మత. సామాజిక సమస్యకు పరిష్కారం సాంకేతిక రంగంలో లభించదు. పాలకుల భావజాలంలో, ప్రభుత్వ యంత్రాంగ స్వభావంలో మార్పు రావాలె. పాలకవర్గం వివక్షాపూరితంగా ఉన్నదనడానికి ఉప ప్రణాళికలు పెట్టవలసి రావడమే నిదర్శనం. ఉప ప్రణాళికలు ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితమైనవి. కానీ పరిపాలనా రంగంలో, సామాజిక రంగంలో నిత్యం ఎదురయ్యే వివక్షను, అణచివేతను రూపుమాపడం కూడా అవసరమే. శాసన సభలో చర్చ ఇంత విస్తృతంగా సాగాలె.

Namasete Telangana News Paper Dated: 1/12/2012

No comments:

Post a Comment