Tuesday, November 20, 2012

ఉద్యమాల్లోనూ పటేల్ గిరేనా? - కృపాకర్ మాదిగ



మా దళిత కులాల మీద పటేల్ గిరి చెయ్యకండి. నాయకత్వ పటేల్ గిరి, నాయకత్వ పట్వారీ తనం, నాయకత్వ దొరతనాలను వొదులుకునేలా ఆధిపత్య కులాల్లో పరివర్తన తెండి. నాలుకలను వాతలుపెట్టే కర్రులుగా, ములుగర్రులుగా, చర్నాకోలలుగా, కొరడాలుగా, దండనాయుధాలుగా ఉపయోగించే కాలం చెల్లిపోయింది. 

జహీరాబాద్‌లో (నవంబర్ 11న) జరిగిన తెలంగాణ విద్యార్థుల సభలో రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావాలంటే గీతారెడ్డికి కర్రు కాల్చి వాతలు పెట్టాలని అన్నారు; గీతారెడ్డి సంపాయించుకున్నది గానీ, ఆమె తల్లి (ఈశ్వరీబాయి) సంపాయించుకున్నది గానీ తాము అడగడం లేదని ఆయన పేర్కొన్నారు. గీతను గద్దెనెక్కించింది మేమేనని, ఆమె మంత్రిపదవికి రాజీనామా చేసి పక్కకి జరిగితే, ఢిల్లీ పీఠం దిగొస్తదని, సోనియాగాంధీని గానీ, కిరణ్ కుమార్‌ని గానీ, చంద్రబాబును గానీ ఏమీ అనాల్సిన పనిలేదని కోదండరామిరెడ్డి అన్నారు. దళితులు, పేదల సంక్షేమం కోసం పోరాడిన ఆ తల్లి (ఈశ్వరీబాయి) కడుపున ఈమె ఎలా పుట్టిం దో?! అంటూ తీవ్రఅభ్యంతరకరమైన, దొరహంకారపూరిత మాటలతో దళితబిడ్డ, ఉన్నత విద్యావంతురాలు, సీనియర్ మంత్రి అయిన గీతారెడ్డిని, ఆమె కుటుంబాన్ని, యావత్తు దళిత జాతిని కోదండరామిరెడ్డి తీవ్రంగా గాయపరిచాడు, అవమానించాడు.

కులానికి ఉండే శక్తిని, అది ఆపరేట్ అవుతున్న తీరుని అర్థం చేసుకోలేకపోతే పై సంఘటన అర్థం గాదు. తెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తులన్నింటిని తెలంగాణలోని రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు తమ దామాషాకి మించి (ఆదాయానికి మించి ఆస్తులంటామే అలాగా) కూడేసుకున్నారు. కులాధిక్యత, భూసంపద, రాజకీయ పెత్తనాలతో దళిత కులాల ప్రజలను నలుసుకు తిన్నారు. మునసబు గిరి, కరణం గిరి, భూస్వామ్యం తెచ్చిన పెత్తందారీ అహంకారాలతో 'పటేలా', 'పట్వారీ', 'దొరా' అని దళితులతో పిలిపించుకున్నారు.

'నీ బాంచెన్, నీ కాల్మొక్తా'గా సాగించుకున్నారు. దళిత కులాలను లొంగదీసుకున్నారు. ఇదంతా వెనకటి చరిత్ర అనుకున్నాం. సాయుధ రైతాంగ విప్లవ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు తెలంగాణలో అనేకం జరిగాయి. వీటివల్ల భూ యాజమాన్య సంబంధాల్లో పై పై మార్పులు, రూపాలు కొన్ని వచ్చినాయే తప్ప, మౌలికమైన గొప్ప మార్పులేవీ రాలేదు. ఆధిపత్య కుల హిందూ భూస్వామ్యమే ఉద్యమాల 'అధినాయకత్వం'గా పెత్తందారీ పోకడలు పోతూ ఉంది. ఇది పార్లమెంటరీ రాజకీయాల నుంచి మొదలుకొని రాష్ట్ర సాధన ఉద్యమం వరకూ, ఇతర రాజకీయ ఉద్యమాలదాకా బలం గా కొనసాగుతూనే ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన సంగతి.

ఆ మధ్య ఢిల్లీ ఎ.పి.భవన్‌లో దళితుడైన చంద్రరావుపై హరీశ్‌రావు దురుసు దొరర్కం చూపించిన సంగతి అందరికీ గుర్తుంది. కొంతకాలం క్రితం సీపీఐ నారాయణ కూడా గీతారెడ్డి వస్త్రాలంకరణ అంశమై హీనంగా తూలనాడిన సంగతి ప్రజలకింకా గుర్తుంది. వీటన్నింటి వెనకా కారణాలు కులాధిక్యతలే. గీతమ్మను ఉద్దేశించి కోదండరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన రెడ్డితనంలోని ఆర్థిక, సామాజిక, రాజకీయ ఆధిక్యతల పునాదులకు చెందినవి. కోదండరామిరెడ్డి అంతశ్చేతనలో దళితుల పట్ల ఉన్న హీన భావనలే దళితురాలైన గీతారెడ్డిపై బురద చల్లే మాటలుగా బయటికొచ్చాయి.

తెలంగాణ నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో సీనియర్ మంత్రిణులుగా ముగ్గురు రెడ్డెమ్మలు కొనసాగుతున్నారు. వారి నియోజకవర్గాలకి వెళ్ళి కోదండరామిరెడ్డి ఇవే రెడ్డి, మగదురహంకార పూరితమైన వ్యాఖ్యలు ఆ రెడ్డమ్మలను ఉద్దేశించి చెయ్యగలడా? చెయ్యడు. ఎందుకంటే అంతా ఒక్కటే ఆధిపత్య కులం (ఈ విధంగా ఏ మహిళనూ హీనపరచకూడదని అలా చేస్తే నేరమని ఈ వ్యాసకర్త ఉద్దేశం). కోదండరామిరెడ్డి చేసిన అవమానకరమైన, నేరపూరిత వ్యాఖ్యలు పడటానికి దళితురాలైన మా గీతమ్మే దొరికిందా? దళితురాలన్న చులకన భావన కాకపోతే గీతమ్మపై ఈ పటేలు గిరి భాషేమిటి?

తెలంగాణలో భూమిలేని దళిత ప్రజలకు భూమి పంచాల్సింది తెలంగాణ ఆధిపత్య కులాలే. ఇందుకు తెలంగాణ రాజకీయ జేఏసీ వద్ద కార్యక్రమం ఏమైనా ఉందా? తెలంగాణ చేను చెల్కల్లో కూలిచేసుకుని బతుకుతున్న తెలంగాణ దళితులకు కనీస వేతనాలు కల్పించాల్సింది తెలంగాణ భూస్వాములే. తెలంగాణలో దళితులపై ఇంకా కొనసాగుతున్న అంటరాని తనం, హోటళ్ళలో రెండు గ్లాసుల వ్యవస్థ, గుళ్ళల్లోకి ప్రవేశాల నిరాకరణకి బాధ్యులు తెలంగాణ ఆధిపత్య కులాలే. దీనికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఎటువంటి బాధ్యతాయుత కార్యక్రమం తీసుకోదా? కాలువలతో నీళ్ళు గుంజుకుపోయే భూస్వాములు కడివెడు నీళ్ళకి పరిమితమయ్యే దళితులను తమ ఆధిపత్య రాజకీయ ఉద్యమాలకు ఉయోగించుకోవడం అన్యాయం కాదా? ఇది ఎలా సరైంది? రెడ్డి, వెలమ, బ్రాహ్మణ కులాల్లోని కొందరికి రాజకీయ, ఆర్థిక, నాయకత్వ వనరుగా కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టే వనరుగా, అణగారిన కులాల్లోని కొందరికి ఆత్మ బలిదానాలు చేసే స్థితికి నెట్టేదిగా, కేవలం మీకు అనుచరులుగా ఉంచే స్థితికి నెట్టివేసేదిగా రాష్ట్ర సాధనోద్యమం ఎందుకు మారిపోయిందో తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకత్వం జవాబు చెప్పాలి.

అణగారిన కులాల వారు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు అంతగా పట్టించుకోని రాజకీయ జేఏసీ నాయకత్వం, అడపాదడపా రెడ్డి ఇతర ఆధిపత్య కులాల వారు బలిదానాలు చేసినపుడు, ఘనంగా పట్టించుకుని నివాళులర్పిస్తున్నదని ఇటీవల సామాజిక తెలంగాణ జేఏసీ వారు చేసిన విమర్శకు రాజకీయ జేఏసీ జవాబు చెప్పదా? ఈ నిర్లక్ష్య వైఖరి కులవివక్షతో కూడుకున్న రాజకీయ వివక్ష కాదా? రాజ్యమైనా, రాష్ట్రసాధన ఉద్యమమైనా కీలక నాయకత్వ స్థానాలైనా సవర్ణులు, సవర్ణులు మాత్రమే పంచుకునేవేనా? మా దళితుల దాకా వచ్చే భాగాలు ఏమీ ఉండవా? ఉద్యమాల్లో దళిత కులాలవారు కేడర్! మీ కులాల వారు నాయకులూనా? తెలంగాణ ఉద్యమంలో దళిత నాయకత్వాన్ని ద్వితీయం చేస్తున్న వివక్షలు కొనసాగుతున్నప్పుడు దళితులు మీ నాయకత్వాన్ని ఎందుకు అనుసరించాలి?మాకు తెలంగాణ రాష్ట్రం కావాలె. ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ కావాలె. దొరల, పటేళ్ళ, పట్వారీల తెలంగాణ కాదు. తెలంగాణ రాజకీయ జేఏసీలో భాగస్వాములుగా పనిచెయ్యడానికి పనికొచ్చే దళిత, ఆదివాసీ మహిళలు తెలంగాణలో లేరని రాజకీయ జేఏసీ అభిప్రాయమా? దళిత స్త్రీల నాయకత్వాలపై ఆంక్షలు, పరిమితులు అప్రకటితంగా కొనసాగించడంలో 'కులం' ఉంది. దళిత స్త్రీలను నాయకత్వంలో భాగస్వాముల్ని చెయ్యకపోవడం కుల, జెండర్ వివక్షలకు కొనసాగింపే. రాజకీయ జేఏసీ దీన్నుంచి బయటపడదా?

సమైక్యాంధ్ర పార్టీలను, నాయకత్వాలను ప్రతిఘాతుకమైనవిగా మనం చూసినట్లుగానే వర్గీకరణ వ్యతిరేక, దళిత వ్యతిరేక తెలంగాణ మాల మహానాడుని కూడా ప్రతిఘాతుకమైనదిగానే చూడాలి. 61 ఎస్సీ కులాలకు పంపిణీ న్యాయం చేకూర్చే రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్న ప్రతిఘాతుక మాల శక్తుల్ని కలుపుకుపోతున్న తెలంగాణ రాజకీయ జేఏసీ సత్తా ఉన్న సామాజిక పంపిణీ న్యాయ ఆచరణను కొనసాగిస్తున్న మాదిగ ప్రాతినిధ్యాలను పక్కకి పెట్టింది. తెలంగాణలో మాలలు రెండు శాతం కూడా లేరు. మాదిగలు కనీసం తెలంగాణ జనాభాలోనే 20 శాతానికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద జనాభా కలిగిన మాదిగ కుల నాయకత్వానికి భాగస్వామ్యం కల్పించని ఉద్యమం ముందుకెలా పోతుంది? రాజకీయ జేఏసీలో ఉండదగిన మాదిగ నాయకురాళ్లు, నాయకులే లేరని మీ ఉద్దేశ్యమా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పదవిని మీరు మాకు ఇవ్వనవసరం లేదు. మేమే సాధించుకుంటాం. ఇప్పుడు ఉద్యమం పేరుతో రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు అనుభవిస్తున్న కీలక నాయకత్వ పదవులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితర పదవుల్లో మా దళితులకు తగిన చోటివ్వండి. అందుకు వీలుగా మీరు తప్పుకోండి. మాకదే మీరు చేయగలిగిన మేలు.

కోదండరామిరెడ్డిగారూ, మీరు మీ ఆధిపత్య కులాలను మానవీకరించే ఉద్యమం చేపట్టండి. మేం కూడా బలపరుస్తాం. మీ కులాల్లో ఉన్న చట్ట వ్యతిరేక ఆస్తులను, అవకాశాలను దళితులకు పంచిపెట్టే విధంగా ఆధిపత్యాలు వొదులుకునే విధంగా సంస్కరణలు తీసుకురండి. మా దళిత కులాల మీద పటేల్ గిరి చెయ్యకండి. నాయకత్వ పటేల్ గిరి, నాయకత్వ పట్వారీ తనం, నాయకత్వ దొరతనాలను వొదులుకునేలా ఆధిపత్య కులాల్లో పరివర్తన తెండి.

నాలుకలను వాతలుపెట్టే కర్రులుగా, ములుగర్రులుగా, చర్నాకోలలుగా, కొరడాలుగా, దండనాయుధాలుగా ఉపయోగించే కాలం చెల్లిపోయింది. మీలాంటి ఆధిపత్య కుల పెత్తందారీ నాయకత్వాల కింద పశువుల్లా, బానిసల్లా మునుపటిలా ఎల్ల కాలం, ఎంతోకాలం దళితులు నలిగిపోలేరు. నాయకత్వంలో పటేల్ గిరులు, పట్వారీ గిరులు, దొరతనాలను ఇప్పటికైనా వొదులుకోండి. ఇకచాలు మీ నాయకత్వ కిరీటాలను దించుకోండి. ప్రజల మధ్యకు రండి. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపాన్ని ప్రకటించండి. అణగారిన సమూహాల నాయకత్వాలను ఆహ్వానించ ండి. అంగీకరించండి. ప్రజాస్వామికవాదినని నిరూపించుకోండి.

చివరిగా గీతారెడ్డి కూడా ఒక విషయం ఆలోచించాలి. రెడ్డిని ఆదర్శ వివాహం చేసుకుని, పేరు చివర 'రెడ్డి' చేర్చుకున్నంత మాత్రాన ఆమె 'పటేలు' కాలేరు. చివరికి రెడ్డి అహంకారానికే ఆమె గురికావాల్సి వచ్చింది. ఆమె 'నా కుటుంబం' అని చెప్పుకున్న సొంత నియోజకవర్గంలో, ఆమెకున్న పరిమిత అధికారాలతోనైనా ఎంత మంది దళితులకు లాభం చేకూర్చారో, ఎంత మంది దళితుల్ని నాయకత్వ స్థానాల్లోకి ప్రోత్సహించారో, వివక్షలు అణచివేతలకు వ్యతిరేకంగా ఏం కార్యక్రమం అమలు జరిపారో ఒక్కసారి గీతారెడ్డి కూడా పునస్సమీక్షించుకోవాలి.

- కృపాకర్ మాదిగ
ఎమ్మార్పీయస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
Andhra Jyothi Telugu News Paper Dated: 21/11/2012 

No comments:

Post a Comment