Tuesday, November 27, 2012

సమన్యాయ సత్యశోధకుడు(మహాత్మ జ్యోతిరావు ఫూలే ) - పాపని నాగరాజు



విప్లవ ప్రతిబంధకమైన ఈ కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థను తనలో అంతర్భాంగా ఇముడ్చుకుంది. కనుక ఈ దేశంలో కుల-వర్గ వ్యవస్థలు ఉన్నాయన్న సత్యాన్ని శోధించిన ఫూలే-అంబేద్కర్‌లను విమర్శించడం గుడ్డితనమే అవుతుంది. ఫూలే-అంబేద్కర్ అవగాహనతో నూతన ప్రత్యామ్నాయ సమన్యాయ పోరాటాల్ని నిర్మించడమే ఫూలేకి అర్పించే నిజమైన నివాళి. 

మహాత్మ జ్యోతిరావు ఫూలే ఈ దేశ ఆధునిక యుగ వైతాళికుడు, నిజమైన పునరుజ్జీవనోద్యమ పితామహుడు. ఫూలేను పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా, ఆధునిక యుగ వైతాళికుడిగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు, అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు.

బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించాడు. 1834-38 కాలంలో ఫూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు, అగ్రవర్ణాలకు సేవలు చేయాలేగానీ విద్య నేర్చుకోకూడదని బ్రాహ్మణులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి ఫూలే చదువు(బడి) మాన్పిస్తారు. బ్రాహ్మణుల కుటిలోపాయాల్ని గ్రహించిన ఫూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహుజీబువామాంగ్ వద్ద క్రిస్టియన్ మిషనరీ (ఇంగ్లీష్) పాఠశాలలో మళ్లీ విద్యాభ్యాసం ప్రారంభిస్తారు. బ్రాహ్మణ విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడవుతాడు.

తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి ఫూలేను తన వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆ వివాహానికి హాజరైన ఫూలేను బ్రాహ్మణులు, మాలి కులస్తుడని తెలుసుకొని బ్రాహ్మణులతో పెళ్లిలో సమానంగా నడవడమా? అంటూ, శూద్రుడంటూ ఫూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. అలా అవమానించిన బ్రాహ్మణుల దోపిడీ, అణిచివేతల్ని బహిర్గతపర్చాలని కంకణం కట్టుకొని 1848లో ఫూణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేస్తారు. అయినా కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోతాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మిస్తారు ఫూలే.

ఫూలే కేవలం శూద్ర వర్ణాల్లో అణిచివేతకు గురౌతున్న కులాల ప్రజల పక్షాన పోరాడటమే కాకుండా, అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో 'గులంగిరి' 'సేద్యగాని చర్మకోల' అనే గ్రంథాల్ని రచించారు. 'దీనబంధు' అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై భావజాల ప్రచారాన్ని మరింత ప్రచారం చేశారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో 'సార్వజనిక్ సభ', 1873 సెప్టెంబర్ 24న 'సత్యశోధక సమాజం సంస్థ'ను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలస వాదులకు '1882లో హంటర్ కమిషన్‌కు' శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలిచ్చి, అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారితో పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక కులం కోణంలో అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జున్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ)ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారధ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉంది. ఫూలే-లోఖండే నిర్మించిన కార్మికవర్గ పోరాటాల్ని చరిత్ర పుటల్లో చేర్చకపోవడంలోనే బ్రాహ్మణీయ కుట్ర ఉంది.

బాట్‌జీ, సేట్‌జీల దోపిడీ, వివక్షలతో శూద్రవర్ణ ప్రజలు మనుషులుగా గుర్తించ నిరాకరిస్తున్న మూలంగా శూద్రులు వడ్డీకి అప్పులు తీసుకోవడం, మంగలి కులస్తులు క్షవరాలు చేయడం మానేస్తారు. అంతేకాదు ఫూలే ఒక అడుగు ముందుకేసి శూద్ర వర్ణాల ప్రజలకు పాలకులకన్నా బ్యూరోక్రాట్స్ ప్రమాదకారులని ప్రకటిస్తారు. ఇలా బ్రాహ్మణీయ వ్యవస్థపై స్పష్టంగా యుద్ధాన్ని చేయడంలో ఫూలేకు మరెవ్వరూ సాటిలేరు.

బ్రాహ్మణీయ కుల వ్యతిరేక పోరాట చారిత్రక అంశాల్ని పరిశీలించి స్వీకరించడంలో ఫూలే తీసుకున్న అవగాహనను భారతదేశ విప్లవ మార్క్సిస్టులు తీసుకోకపోవడం విచారకరం. పైగా విప్లవానికి అడ్డంకిగా మారుతుందని చిత్రీకరించడం విడ్డూరం. ఫూలే వారసులుగా పిలువబడేవారు బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక, స్వయం గౌరవ సమన్యాయ పోరాట అవగాహనను వదిలి అగ్రకుల పాలకవర్గాలకు ఉపయోగపడే కులస్థిరీకరణకై బారులు తీరడం, బడుగు ప్రజల్ని ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేయడమే అవుతుంది. ఇది విచారకరం, ప్రమాదకరం కూడా. ఇది ఫూలే-అంబేద్కరిస్టుల అవగాహనకు విరుద్ధం.

విప్లవ ప్రతిబంధకమైన ఈ కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థను తనలో అంతర్భాంగా ఇముడ్చుకుంది. కనుక ఈ దేశంలో కుల-వర్గ వ్యవస్థలు ఉన్నాయన్న సత్యాన్ని శోధించిన ఫూలే-అంబేద్కర్‌లను విమర్శించడం గుడ్డితనమే అవుతుంది. ఫూలే-అంబేద్కర్ అవగాహనతో నూతన ప్రత్యామ్నాయ సమన్యాయ పోరాటాల్ని నిర్మించడమే ఫూలేకి అర్పించే నిజమైన నివాళి.

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ
(నేడు ఫూలే 122వ వర్థంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 28/11/2012

No comments:

Post a Comment