Friday, November 23, 2012

ఇదేమి భావ దారిద్య్రం? - అద్దంకి దయాకర్



విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే గీతమ్మ విషయంలో కోదండరామ్‌ను విమర్శిస్తున్నారు, గీతారెడ్డిని విమర్శిస్తున్నారు, మాలలనూ వదలడం లేదు. ఇంతకన్నా భావ దారిద్య్రం లేదు... మొట్టమొదట కోదండరామ్‌ను ప్రశ్నించింది మేము, వివరణతో కూడిన క్షమాపణ కోరింది మేము. కోదండరామ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు. అతని అంగీకారాన్ని మన్నించాల్సిన అవసరం అటు గీతారెడ్డితో పాటు ఇటు కుల, ప్రజాసంఘాలకు ఉంది. లేదంటే తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలుగుతుంది. 

సామాజిక న్యాయం పేరిట సమాజంలో వచ్చిన మార్పును తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం పరిపాటి అయింది. సహజ న్యాయ సూత్రం నుంచే సమానత్వం, సామాజిక న్యాయం లాంటి సిద్ధాంతాలు పుట్టాయి. సమాజంలో అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం జరగాలనే దృష్టితో భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఈ అంశాలకు ఇప్పుడిప్పుడే సామాజిక మద్దతు లభిస్తోంది. రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్లు సమన్యాయానికి కొనసాగింపుగా ఫూలే సామాజిక న్యాయ సూత్రాన్ని, దాని ఆవశ్యకతను అంబేద్కర్ మరొక్కసారి సమాజం దృష్టిలోకి తెచ్చాడు. సామాజిక న్యాయ చైతన్యానికి సమాజం నుంచి మద్దతు పెంచుకోవడానికి కాకుండా దాన్ని ఇష్టానుసారం కొన్ని సంఘాలు వాడుకోవడం వల్లనే అసలు సమస్య మొదలవుతుంది. గీతారెడ్డిపై కోదండరాం చేసిన వ్యాఖ్యలను, అగ్రవర్ణాలు సైతం ఖండించిన మాట వాస్తవం.

దళితులపై ఎవరూ ఏ రకమైన అత్యాచారాలు, అవమానకర దాడులు చేసినా యావత్ దళిత సమాజంతో పాటు మానవతావాదులు, అగ్రకులాలకు చెందిన ప్రజాస్వామిక వాదులు గర్హిస్తూనే వస్తోన్నారు. గీతారెడ్డిపై కోదండరాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడం, జరిగిన దానిపై అతను రెండు సార్లు క్షమాపణ చెప్పడం, దాన్ని గీతారెడ్డి అంగీకరించకపోవడం లాంటి విషయాలు జరుగుతున్న క్రమంలోనే తెలంగాణ వ్యతిరేకులు, కోదండరామ్ వ్యతిరేకులు, మాల వ్యతిరేకులు కూడా దీన్ని వాడుకొని వారి అక్కసును వెళ్ళగక్కడం గమనిస్తున్నాము.

ఒకవైపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ఏ విధంగా ఈ అంశాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంటే మరోవైపు తెలంగాణ వ్యతిరేక శక్తులు అతనిపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. తప్పు దొర్లిన మాట వాస్తవం. అలా అని చెప్పి పదే పదే ఆ అంశాన్ని నాన్చి లబ్ధి పొందాలనుకోవడం స్వార్థం. గీతారెడ్డి ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రి. ఉద్యమ నేత ఈశ్వరీ బాయి కుమార్తె కావడం వల్ల ఆమెకు సమాజంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం చూశాము. మరో వైపు చుండూరు, కారంచేడు సంఘటనల అనంతరం తన అగ్రవర్ణ బహిరంగ సూచిక అయిన రెడ్డిని కత్తిరించుకున్న దళిత అనుకూల కోదండరాంను అందరూ విమర్శించడం చూశాము. సంఘటన జరిగిన తీరు, దానికి లభించిన మద్దతు, విమర్శలను ఎవరూ వ్యతిరేకించలేదు. అది ప్రజాస్వామికమైన చర్చే ఆశ్చర్యంగా.. కోదండరాం అంశంలో మాలలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం విడ్డూరం. ఒకరు గీతారెడ్డికి మద్దతు చెపుతూనే మీరు దళితుల పక్షాన నిలబడాలంటూ కోదండరాం పటేల్ గిరిని ప్రశ్నిస్తారు.

ప్రతిఘాతమైన శక్తిగా తెలంగాణ మాల మహానాడును చిత్రీకరించడం ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్రగా భావిస్తున్నాము. గీతారెడ్డిపై వ్యాఖ్యలు చేసిన కోదండరామ్‌కు, జేఏసీలో మా సంఘం భాగస్వామిగా ఉండడానికి సంబంధమేమిటి? తెలంగాణ శక్తులన్నింటినీ ఏకం చేసేందుకు ఏర్పాటైన ఒక ఫెడరల్ కాన్సెప్ట్‌తో ఏర్పడ్డ సంస్థ తెలంగాణ జేఏసీ. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాలల భాగస్వామ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో పాటు, మా హక్కుల రక్షణ కోసం ఏర్పడ్డ సంస్థ తెలంగాణ మాల మహానాడు. దీనిలో మాదిగ దండోరా ఉండకూడదని ఎవరూ అడ్డుకోలేదు. అగ్రవర్ణాల నాయక త్వం క్రింద పనిచేయలేమనో... మరో అంశంతోనో విభేదించి మాదిగ నాయకత్వం జేఏసీ నుంచి వెళ్ళిపోయింది.

కానీ మాదిగ నాయకులున్నారనేది వారికి తెలియదు. నువ్వు లేనిది అడుక్కో, కానీ నేనెందుకున్నానని ప్రశ్నించడం అవివేకం. ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే గీతమ్మ విషయంలో కోదండరామ్‌ను విమర్శిస్తున్నారు, గీతారెడ్డిని విమర్శిస్తున్నారు, మాలలను కూడా వదలడం లేదు. ఇంతకన్నా భావ దారిద్య్రం లేదు. దీనిమీద మిమ్మల్ని స్పందించమన్నదెవరు? మాలలను దోషులుగా నిలబెట్ట మంటున్నదెవరు? ఇదీ ఒక కుట్రేనా? తెలంగాణలో దళితులు ఎలా ఉండాలో నిర్దేశించేదీ వీళ్ళే. ఉద్యమకారులను, అగ్రవర్ణాలను దోషులు చేసేదీ వీళ్ళే. చివరికి బాధితులను కూడా బోనులో నిలబెట్టేది వీళ్ళే. వీరే ఇంకో అడుగు ముందుకేసి జనాభా లెక్కలను తామే సేకరించి ప్రకటించారు. మాలలు 2శాతం ఉన్నారని, మాదిగలు 20 శాతం ఉన్నారని.... ఇంక జనాభా లెక్కల సేకరణ ఎందుకు? మాలలపై విషం వెళ్ళగక్కేందుకు ఇంత దిగజారాలా? ఇంతకూ గీతారెడ్డిపై ప్రేమో కోదండరామ్‌పైనా, మా సంఘం పైనా ఎందుకింత కోపమో ఇంకా అర్థం కాలేదు కానీ... ఈ అంశం ద్వారా మళ్ళొక్కసారి చర్చకు రావడానికి ప్రయత్నించిన మిత్రులకు స్వాగతం.

మాదిగల కోసం కానీ తెలంగాణ కోసం కానీ కనీసం ప్రయత్నించని వ్యక్తులే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఉద్యమించని మీకు ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిది? ఉద్యమంలో పనిచేయకుండా పటేల్ గిరి కావాలని కోరుకుంటున్నారు. దాని కోసం దాదాగిరి చేస్తే రాదు. పటేల్‌ల నాయకత్వంలో సమాంతర ఉద్యమాన్ని చేయొచ్చుగా! అది చేతకాదు. పటేళ్ళను విమర్శించడమే పనిగా ఎందుకు పెట్టుకున్నారు? గీతారెడ్డి అంశాన్ని అవకాశంగా తీసుకొని కోదండరామిరెడ్డిని చెడ్డ పటేల్ చేశారు. రెడ్డయినా, దొరయినా ఇంత కాల్చుకు తినాలా? గతంలో గీతారెడ్డి తెలంగాణ ప్రాంతంలో వీరోచితమైన పోరాటం చేసిన యోధురాలి తనయ. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ కంటే సీనియర్ మంత్రి. వాస్తవానికి ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి రాకుండా చేసిన నాడు ఏం చేశారు?

ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి పటేల్ గిరిని ప్రశ్నించలేదు. సామాజిక న్యాయానికి కూడా రిజర్వేషన్లు ఉంటాయా? అది కూడా కులాలవారీగానా? ప్రాంతాల వారీగానా? చెప్పాలి. గీతారెడ్డి సంఘటనలో స్పందించాల్సింది మేము. జరిగిన విషయాన్ని పెంచడం వల్ల ఉద్యమానికి విఘాతం కలుగుతుందనే భావన, స్వయంగా మేము జేఏసీలో ఉండడం, జేఏసీలోని పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాలు, దళిత పక్షపాతంగా ఉండడం వల్ల అందరం బాధపడే క్షమాపణలు కోరడం జరిగింది. చెప్పిన క్షమాపణలను రాజకీయం చేశారు. మరీ విచిత్రమైన విమర్శలు చేస్తున్నారు- మాల మహానాడు కోదండరాంకు మద్దతునిస్తుంటే దండోరా గీతారెడ్డి వైపు నిలబడిందని. మొట్టమొదట కోదండరామ్‌ను ప్రశ్నించింది మేము, వివరణతో కూడిన క్షమాపణ కోరింది మేము. కోదండరామ్ తెలంగాణ ఉద్యమ నాయకుడు. అతని అంగీకారాన్ని మన్నించాల్సిన అవసరం అటు గీతారెడ్డికి, ఇటు కుల, ప్రజాసంఘాలకు ఉంది. లేదంటే తెలంగాణ ఉద్యమానికి విఘాతం కలుగుతుంది.

వేలు మనదే -కన్ను మనదే. దళితుల ఆత్మగౌరవం ఎంతగొప్పదో ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంతే గొప్పది. ఎందుకంటే 90 శాతం బడుగుల కోసం ఆధిపత్య కులాలు ఉద్యమిస్తున్నప్పుడు సమీకరించాలనే సదుద్దేశంతో బడుగులందరం కలిసి నడవాలి. దీనికి సహకరించని వాళ్ళే ఇప్పుడు కోదండరామ్‌పై విరుచుకు పడుతున్నారు. తప్పు జరగడాన్ని తప్పుబట్టడం తప్పు. జరిగిన తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తప్పుపై జరుగుతున్న చర్చ సమస్య పరిష్కారం దిశగా కాకు ండా సమస్యను జటిలం చేసే వైపు పయనించడాన్ని ప్రశ్నిస్తున్నాము. ఈ సంఘటన ద్వారా మాల, మాదిగ సంఘాలు మూకుమ్మడిగా స్పందించి మేమంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు సాగారు. అది సంతోషించాల్సింది పోయి వైరుధ్యాలను పెంచేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. 

మాల, మాదిగల మధ్య ఉన్న వర్గీకరణ సమస్య వల్ల 1.5 కోట్ల మంది దళితులు బాధపడుతున్నారు. ఆ సమస్య పరిష్కారానికి ఏ ఒక్క మాదిగ నాయకుడు ముందుకురాడు. సమస్యను సమస్యగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పరిష్కారం కోసం ఆలోచించేవారే లేరు. ఎన్నోసార్లు మా సంఘం చేసింది ఆ ప్రయత్నం. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామంటే కలిసిరారు. వర్గీకరణపై చర్చించుకుందామంటే ఒప్పుకోరు. దేశ జనాభాలో 18.3 శాతంగా ఉన్న దళితులకు రిజర్వేషన్లు పెంచమని ఎందుకు కోరడం లేదు? వర్గీకరణ మీద రాద్దాంతం చేసే నాయకులందరికీ ఒక విన్నపం. మాదిగల పట్ల మాకు వ్యతరేకత లేదు.

మాదిగ నాయకత్వంపైనే. వర్గీకరణ వల్ల నష్టపోయే దైనా లాభపడేదైనా మాలలే. మాలల సమ్మతం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యం. అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు దళితులనెప్పుడూ విభజించడానికే ప్రయత్నిస్తూ మాదిగలవైపే ఉంటాయి...అన్యాయంగా మాలలపై అసత్య ప్రచారాలు చేసిన మేధావుల, రాజకీయనాయకుల, ప్రజాసంఘాల, విప్లవ సంఘాలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వర్గీకరణను అగ్రకుల ప్రభుత్వాలు ఎలా వాడుకుంటున్నాయనేది. ఇంకా మాల, మాదిగల మధ్య వైరుధ్యాలను పెంచి, వైషమ్యాలవైపు తీసుకెళ్ళొద్దని కొందరు మాదిగ నాయకులను కోరుతున్నాము. మీకు చేతనైతే, వీలైతే వర్గీకరణ సాధన కోసం ప్రభుత్వాలపై పోరాడండి మాలలపై కాదు. మీ లక్ష్యం వర్గీకరణఫై ఉండాలి కానీ మాలనాయకత్వం ఉన్న దగ్గర కావద్దు.

మీరు తెలంగాణ ఉద్యమంలో ఉండరు. ఆ ఉద్యమాల్లో ఉన్న మాలనాయకత్వాన్ని విమర్శిస్తారు. రాజకీయ పార్టీలో ఎదిగిన మాల నాయకత్వంపై పోటీగా ఎదగాలని విమర్శిస్తారు. ఎక్కడైనా మాలలుంటే వారే లక్ష్యంగా పనిచేయడం పరిపాటి అయింది... కమ్యూనల్ బ్లాక్ మెయిలింగ్ మొనాటనీ అయిపోయింది. ఇక సాగదు. ఒక సమస్యతోని ఇద్దరు ముగ్గురిని టార్గెట్ చేస్తే గొప్ప అనుకుని భంగ పడవద్దు. ఇక్కడ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి మాలల మీద, ఇటు గీతారెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను వెళ్ళగక్కినందుకు మాకేమీ బాధలేదు. తెలంగాణలో కూడా వర్గీకరణ పేరు మీద దళితులను విడగొట్టేందుకు సీమాంధ్ర మాదిగలు ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు. వర్గీకరణపై చర్చించడానికి మేము సిద్ధం. రండి సమస్యను పరిష్కరించుకుందాం. కలిసి పోరాడుదాం.

- అద్దంకి దయాకర్
వ్యవస్థాపక అధ్యక్షులు - తెలంగాణ మాల మహానాడు
అధికార ప్రతినిధి - తెలంగాణ జేఏసీ

Andhra Jyothi News Paper Dated: 24/11/2012

No comments:

Post a Comment