Thursday, September 22, 2011

గడీలను కాచేవారితో జాగ్రత్త..! - గుడపల్లి రవి Andhra Jyothi 23/09/2011


గడీలను కాచేవారితో జాగ్రత్త..!
- గుడపల్లి రవి

దొర గడీలో చేసిన కూలి అడగబోతే దొరకంటే ముందు అక్కడ పనిచేసే జీతగాడు గావు కేక పెట్టి బెదిరించేటోడు. కష్టానికి దగ్గ ఫలితం దొరను అడిగితే దొరకు బాధ కలగక ముందే దొర తరపున గద్దించేవాడు. దొర అహంభావాన్ని జీతగాడు ప్రదర్శించే ఒక భావదారిద్య్రం ఉండేది. అదింకా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ గురించిగానీ, వర్గీకరణ గురించి గానీ మాట్లాడితే దొరల కంటే ముందే నయా జీతగాళ్లే బహుజనులను బెదిరిస్తున్నారు. దొరల జీతగాళ్లుగా వ్యవహరిస్తున్న వీళ్లు సామాజిక తెలంగాణ డిమాండు చేస్తున్న బహుజన మేధావులను సూడో సామాజికవాదులనీ, కుహనా సామాజికవాదులనీ నిందిస్తున్నారు.

అవాకులు చెవాకులూ పేలుతున్నారు. విప్లవం పేర ఉద్యమకారులుగా చెలామణి అవుతున్న మరికొంతమంది విప్లవవాద నయా జీతగాళ్లు ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో సామాజిక తెలంగాణవాదులను అవహేళన చేస్తున్నారు. సామాజిక తెలంగాణవాదులను విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అదే రీతిలో కొందరు పత్రికల్లో రచనలు చేస్తున్నారు. విఫల ఉద్యమాల ఉపాధ్యాయుడిగా కీర్తినార్జించిన భౌగోళిక సామాజిక తెలంగాణవాది ఉ.సాంబశివరావు సామాజిక తెలంగాణవాదులను సూడోలుగా ఆడిపోసుకున్నారు.

చిక్కుడు ప్రభాకర్ అనే గద్దర్ అనుచరుడు పాలేగాళ్ల ప్రతినిధిగా సామాజిక తెలంగాణ అసాధ్యం కనుక దొరలకు ఊడిగం చేయమని ఉపదేశిస్తున్నాడు. గద్దర్ ఆలోచనలేమిటో తెలుసుకుంటే చిక్కుడు ప్రభాకర్ వాదనలోని చిక్కుముడి వీడిపోతుంది. వీరి ప్రజాస్వామికవాదం, భౌగోళిక సామాజిక తెలంగాణవాదంలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

పైన పేర్కొన్న వారి రూపం వేరయినా, పని చేస్తున్న సంఘం వేరైనా సారం మాత్రం ఒక్కటే. శంఖంలో పోసిన నీళ్లే తీర్థం అన్నట్టు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు తనకే ఉందని ఉ.సా దృఢ విశ్వాసం. మిగతా వాళ్లంతా సూడో సామాజికవాదులని ఆయన సూత్రీకరణ. కుల వర్గ దృక్పథం నుండి తెలంగాణ సమస్యను విశ్లేషించి తాను కొత్తగా భౌగోళిక సామాజిక తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఉ.సాకు తన సిద్ధాంతం పట్ల తనకే నమ్మిక, విశ్వాసం లేదు.

మారోజు వీరన్న ఉద్యమ వారసత్వాన్ని కొనసాగించేందుకు ముందుకు రావాలని ఆయన్ని సిపియుయస్ఐ బృందం తరపున ఆహ్వానించాం. ఒకప్పుడు మారోజు వీరన్నతో కులవర్గ జమిలి పోరాటమే సరైనది, ఒంటరి వర్గపోరాటం ఉట్టి పోరాటం అని చెప్పిన ఉ.సా మా ప్రతినిధి బృందంతో అందుకు వ్యతిరేకమైన వాదనలు చేశారు. ఈ దేశంలో ఒంటరి వర్గ పోరాటమైనా విజయవంతం అవుతుంది లేదా కుల పోరాటమైనా విజయవంతం అవుతుందని వాదించారు.

వర్గపోరాటానికి పశ్చిమ బెంగాల్, కుల పోరాటానికి ఉత్తరప్రదేశ్ ఉదాహరణలన్నారు. మారోజు వీరన్న చెప్పిన కుల వర్గ సిద్ధాంతం విజయవంతం కాదని ఆయన మా ఆహ్వానాన్ని నిరాకరించారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలోని మహాజన పార్టీని తీసుకెళ్లి ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. ఎజెండా మాది జెండా మెగాస్టార్‌ది అని ఉ.సా సమర్ధించుకున్నారు. ఆ తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. సైద్ధాంతిక దివాళాకోరుతనంలో ఇరుక్కున్న ఉ.సా తిరిగి మళ్లీ మారోజు వీరన్న సిద్ధాంతానికి తానే అసలు సిసలు వారసుడనని బుకాయిస్తున్నారు.

తాను, తన గుంపు సభ్యులతో సామాజిక తెలంగాణ వాదుల మీద విమర్శలు చేయిస్తున్నారు. సామాజిక భావజాల పోరాటంలోనూ రాజకీయ పోరాటంలోనూ స్థానం కోల్పోయిన ఉ.సా తిరిగి ఒక స్థానం సంపాదించేందుకు విచిత్రమైన భౌగోళిక సామాజిక తెలంగాణవాదం ప్రతిపాదించారు. భౌగోళిక, సామాజిక తెలంగాణ సాధించేందుకు రెండు అంచెల పోరాటం కాదు, రెండూ ఒకేసారి రావాలని అంటున్నారు. ఈ విషయంలో కూడా ఉ.సాలో స్పష్టత లోపించింది. ఒకవేళ సామాజిక తెలంగాణ ఏర్పాటు కాకపోయినా భౌగోళిక తెలంగాణను అడ్డుకోవాల్సిన అవసరం లేదని ఉ.సా వాదిస్తున్నారు. అంటే భౌగోళిక తెలంగాణకు సామాజిక తెలంగాణ పూర్వ షరతు కావాల్సిన పని లేదనీ, అలా షరతు విధించే వారంతా సూడో సామాజికవాదులని నిందిస్తున్నారు. ఇది తర్కరహితమైన వాదన.

సామాజిక తెలంగాణ ఏర్పడితే అది నిర్దిష్ట భౌగోళిక సరిహద్దుల మధ్య మాత్రమే ఏర్పడుతుంది. అందువల్ల భౌగోళిక తెలంగాణ అంతర్భాగంగానే ఏర్పడుతుంది. కాని, భౌగోళిక తెలంగాణ ఏర్పడితే మాత్రం సామాజిక తెలంగాణ ఆవిర్భవిస్తుందనే హామీ లేదు. ఎందుకంటే సామాజిక పునాదుల మీద నిర్మాణం కాని ఒక రాష్ట్రం కొన్ని భౌగోళిక సరిహద్దుల మధ్య ఏర్పడుతుంది. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం తెలంగాణ బహుజనులకు చేకూరదు. బ్రిటీషు పాలకుల నుండి అగ్రకుల నాయకుల చేతిలోకి ఈ దేశం వచ్చిన తరువాత అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాని అవేవీ సామాజిక స్వభావంతో నిర్మాణమైనవి కావు.

ఉ.సా చిక్కుడు ప్రభాకర్‌తో విభేదిస్తున్నాడు. గద్దర్ పట్ల అపారమైన అవ్యాజమైన ప్రేమ వున్న ఉ.సా తెలంగాణ ప్రజాఫ్రంట్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారు. సామాజిక తెలంగాణ అనే ప్రాథమిక అంశం పట్ల అంగీకారం వ్యక్తం చేసినందుకే 'సామాజిక తెలంగాణ మహాసభ వేదిక' మీదికి గద్దర్‌ను అతిథిగా పిలిచినట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి గద్దర్‌కు సామాజిక తెలంగాణ అనే కీలకమైన అంశం పట్ల స్పష్టత లేదు.

'భౌగోళిక సామాజిక తెలంగాణ' అనే ఉ.సా భావన కూడా సారాంశంలో అగ్రకుల భౌగోళికవాదమే. అందుకే గద్దర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారు. గద్దర్‌తో సుదీర్ఘ ఉద్యమ చెలిమి ఉ.సాది. కాని ఆయన ఏనాడు గద్దర్‌ను మారోజు వీరన్న మీద ఒక్క పాటైనా ఎందుకు రాయలేదని గానీ, పాడలేదని గానీ, కనీసం విప్లవ వీరుడు వీరన్న పేరైనా ఎందుకు వేదికల మీద ఉచ్చరించవని గానీ ప్రశ్నించిన దాఖలా లేదు.

తెలంగాణ ఉద్యమంలో హత్యకు గురైన బెల్లి లలిత గురించి పాడే గద్దర్, తెలంగాణ పోరాటాన్ని 1969 తర్వాత అనేక సంవత్సరాలకు తిరిగి వేదిక మీదికి తెచ్చి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను విశాల ఉద్యమంలో రగిలించిన మారోజు వీరన్న పేరును కనీసం తెలంగాణ వేదికల మీద ప్రస్తావించటం లేదంటే ఆయన దృక్పథం ఏమిటో అర్థమవుతుంది. బహుజన రాజకీయాలనూ ప్రత్యామ్నాయ సాంస్కృతిక కళావేదికలను నిర్మించిన మారోజు వీరన్ననే గౌరవించని గద్దర్, ఆయన కోరుతున్న ప్రజాస్వామిక తెలంగాణలో బహుజనవాదానికి తావుంటుందని ఎలా విశ్వసించగలం? వెన్నులో తూటాలు మోసుకు తిరుగుతున్న గద్దర్ ఎట్టి పరిస్థితిలోనూ బహుజనతత్వాన్ని మాత్రం మనసులో మోయడానికి సిద్ధంగా లేడు.

గద్దర్‌తో చర్చకు గానీ, ఆయన్ని అనుసరించేందుకు గానీ ఆయన శరీరంలో దిగిన బుల్లెట్లు ప్రాతిపదిక కాదు. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడా లేదా అనేది ప్రాతిపదిక కావాలి. గద్దర్ ఆలోచనల ప్రతిరూపమే చిక్కుడు ప్రభాకర్. ఆయనకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. అదే విధంగా పాలకవర్గాలు మోసం చేస్తాయనీ హితవు పలుకుతున్నట్టు నటిస్తూనే న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి అగ్రకులాలు ఆశిస్తున్న భౌగోళిక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేద్దాం అంటున్నాడు.

ఒప్పందాలు ఉల్లంఘించబడతాయి కాబట్టి వాటిని పక్కకు పెట్టండి అంటాడు. పోనీ సాయుధ పోరాటానికైనా పిలుపిస్తున్నాడా అంటే అదీ లేదు. అంతిమంగా కేసీఆరే మీకు దిక్కు... ఆయన పంచనే చేరి తరించండీ.. అని సూచిస్తున్నాడు. మీకు ఎలాగూ చావు తప్పదు కాబట్టి ఉరేసుకొని చస్తారా లేదా కత్తితో పొడుచుకొని చస్తారా అదీ కాదంటే మేమే ఆ పని చేయాలా? అని చిక్కుడు ప్రభాకర్ అడుగుతున్నట్టుంది. అందువల్ల గద్దర్, చిక్కుడు ప్రభాకర్, ఉ.సా తదితరుల వాదనలు రూపంలో వేర్వేరుగా కనిపిస్తాయి గానీ సారంలో ఒక్కటే.

తెలుగును నిషేధించాడనీ, ఉర్దూ భాషను బలవంతంగా రుద్దాడని నిజాం రాజుపై ఒక ఆరోపణ. ఈ వాదన ఆర్య సమాజం బలంగా చేసేది. ఇప్పటికీ కాషాయదళం అదే ప్రచారం చేస్తుంది. అన్ని కులాలకూ మతాలకూ మాధ్యమిక సాధనంగా సాహిత్య, సామాజిక శాస్త్రాలను అద్భుతమైన భాషలో బోధించిన ఉర్దూను ఆంధ్ర పాలకులు సర్వనాశనం చేసిన సంగతి మరిచారా? తెలంగాణ భాషకు ఆంధ్ర భాషకూ ఎలాంటి సంబంధం లేదు. అనేక తెగలకున్న ప్రత్యేక భాషలూ కులాలకు వున్న భాషలూ ఆర్య సమాజం, గ్రంథాలయోద్యమం వల్ల తుడిచి పెట్టుకుపోయాయి.

నిజాం రాజు తెలుగు మీడియంలో పాఠశాలలు ఏర్పాటు చేశాడనేది సత్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశాడు. అంతేకాదు అంటుకోబడని పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోకపోతే శిక్షపడుతుందని హెచ్చరించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అన్ని విధాలుగా, ఆర్థికంగా సహకరించాడు. 1937లో ఉరిశిక్షను రద్దు చేశాడు. ఇవాళ మనం ఉపయోగించుకుంటున్న అనేక కట్టడాలను కట్టించింది ఆయనే.

తెలంగాణ సాయుధ పోరాటంలో మూడు వేల మందిని నిజాం సైన్యం, రజాకార్లు చంపారని ఆయన వాదిస్తున్నారు. కాని నిజాం రాజు పాలనలో కేవలం 400 మందిని మాత్రమే చంపారు. తెలంగాణ ప్రజలను దోచుకున్నది కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో వున్న అగ్రకుల పాలకవర్గం. కానీ ఈ ప్రజాస్వామికవాదులెప్పుడూ అగ్రకులాలే తెలంగాణను నాశనం చేశాయన్న సంగతి ఎందుకు చెప్పరు?

నేటి తెలంగాణ ఉద్యమానికి, నిజాం నవాబుకు సంబంధం ఏమిటో ఎంతకీ అర్థం కాదు. తెలంగాణను సర్వనాశం చేసింది అగ్రకుల పాలకులైతే నేటికీ నిజాం ఏడో నవాబును నిందించటంలో న్యాయం లేదు. కానీ గడీల దొరలను పరిరక్షించేందుకు, నేడు తెలంగాణకు నాయకత్వం వహిస్తున్న ఆనాటి దొరలకు, పెత్తందారీతనానికీ తగిన ఆమోదం కల్పించేందుకు భౌగోళికవాదులు, ప్రజాస్వామిక తెలంగాణవాదులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక తెలంగాణ డిమాండును అంగీకరించని, గౌరవించని భౌగోళికవాదులకూ, ప్రజాస్వామిక తెలంగాణవాదులకూ ప్రజలు మద్దతిస్తారా? ఒకవేళ అనాలోచితంగా మూక మనస్తత్వంతో వీరి వలలో పడితే తెలంగాణ ప్రజలు తప్పకుండా అన్యాయానికి గురవుతారు. గడీలను కాచేవాళ్ళు దొరలంత ప్రమాదకారులనే సంగతిని గుర్తిద్దాం.

- గుడపల్లి రవి
బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్

No comments:

Post a Comment