Tuesday, September 6, 2011

రెండంచెల పోరు మొదటికే చేటు -- కొంకల వెంకటనారాయణ, పాపని నాగరాజు Andhra Jyothi 06/09/2011


రెండంచెల పోరు మొదటికే చేటు
- కొంకల వెంకటనారాయణ, పాపని నాగరాజు

సామాజిక న్యాయం గురించి చర్చ జరపడం అవసరమే. చర్చలో పాల్గొంటున్న వారి నైతిక, సైద్ధాంతిక, కార్యాచరణ ఎటువైపు నుంచి ఎటువైపుకు కొనసాగుతుందో దాని ఆధారంగా చర్చించడం అవసరం. సామాజిక 'కుల' పోరాటం గురించి మాత్రమే చర్చిస్తున్నారు. ఈ చర్చలో తమ కుల అస్తిత్వాన్ని స్థిరీకరించే దృష్టితో రాస్తున్నారు. దీనికి అంబేద్కర్‌ను, మారోజు వీరన్నను కేంద్రం చేసుకుంటున్నారు. వీరి వాదనలో కుల వ్యవస్థను కూల్చే కుల నిర్మూలన పోరాట అవగాహన లోపించింది. మాదిగ 'రిజర్వేషన్' పోరాటం, ఎస్సీల్లోని మాల-మాదిగ, వీరి ఉపకులాల్ని ఎబిసిడిలుగా వర్గీకరించాలని ఏర్పడింది.

అమరుడు వీరన్న మొట్టమొదట వర్గీకరణకు మద్దతును ప్రకటించారు. ఈ డిమాండ్ న్యాయమైనదని పిడిఎస్‌యు నాయకత్వాన సంఘీభావాన్ని ప్రకటించి, వివిధ విప్లవ ప్రజాస్వామిక వాదులతో సంఘీభావ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గద్దర్‌ను కన్వీనర్‌గా, కో కన్వీనర్‌గా పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు పి.నర్సింలును ఎంపిక చేశారు. మిగతా బిసి, ఎస్‌టి, మైనార్టీ సామాజిక వర్గాలను సభ్యులుగా ఎంపిక చేసి రాష్ట్ర వ్యాపితంగా ఓ బలమైన ఉద్యమాన్ని నిర్మించారు. ఆనాడు వీరన్న ప్రాతినిధ్యం వహించిన సిపిఐఎంఎల్ - జనశక్తి పార్టీలో అంబేద్కర్‌పై, కులంపై అంతరంగిక సైద్ధాంతిక చర్చకు తెరలేపి అందుకు కార్యాచరణను ప్రారంభించారు. ఈ క్రమంలోనే వర్గీకరణ ఉద్యమానికి ఆయన మొదట సంఘీభావం ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో దేశంలో ఏ ప్రాతిపదికన ప్రజలు విడిపోయారో అదే ప్రాతిపదికన ఏ కులానికి ఆ కులాన్ని (కుల ప్రాతిపదికన) కూడగట్టి రాజ్యాధికారాన్ని, కులనిర్మూలనను సాధించాలని వీరన్న భావించాడు. విడివిడిగా నిర్మించిన అస్థిత్వ పోరాటాలను 'ఉమ్మడి' దళిత బహుజన మహాసభ వేదికలో ఐక్యంచేసే మహత్తర కార్యానికి పూనుకున్నారు. అందరూ వీరన్న నెలకొల్పిన సిపియుఎస్ఐ (దళిత బహుజన శ్రామిక విముక్తి) పార్టీకి దళిత కార్మిక వర్గదృక్పథాన్ని రూపొందించి ఇరుసుగా పెట్టారు. దళిత బహుజన కులాలతో పాటు ఈ ఉమ్మడి వేదికలోకి మాదిగల్ని తీసుకొచ్చే క్రమాన్ని చేయసాగాడు.

ఈ క్రమంలో 'అణగారిన కులాల ఐక్య దండోరా'నే 'మహాజన ఫ్రంట్'గా ఏర్పాటైంది. ఈ దండోరా - ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉండాల్సిన మాదిగ దండోరాని, చంద్రబాబు, వైఎస్‌లు ప్రజల ప్రత్యామ్నాయం అభివృద్ధి కారాదనే కుట్రతో, మహాజన ఫ్రంట్ నుంచి చీల్చారు. మాకు మాదిగ వర్గీకరణే ముఖ్యం అని మందకృష్ణ చంద్రబాబుకు మద్దతిచ్చాడు.

తదనంతరం 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతిచ్చి మాదిగ, మొత్తం పీడిత కులాలకు వ్యాన్‌గార్డ్ పాత్రను పోషించే బాధ్యత నుంచి వైదొలిగి అగ్రకుల దళారీ పాలకవర్గాలను ఆశ్రయించారు. ప్రజలకు ప్రత్యామ్నాయం అగ్రకుల పాలకవర్గాలు కాదనే స్థితిని కోల్పోయి, పాలకులందించే సంక్షేమ పథకాల, రాయితీలకు పరిమితం చేశారు. ఒక్కమాటలో మాదిగ జాతికి ద్రోహం చేసే కార్యానికి పూనుకొన్నాడు. దీని మూలంగా అస్థిత్వవాద పోరాటాలు అంటేనే అగ్రకుల పాలకవర్గాలను ఆశ్రయించారనే అపవాదు వచ్చింది.

అస్థిత్వ ఉద్యమాలలో భాగమే తెలంగాణ అంశం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతను మొట్టమొదట గుర్తించిన నక్సలైట్ నేత వీరన్న. 1996-97లోనే తెలంగాణ మహాసభ ద్వారా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి వీరన్న కార్యరూపం ఇచ్చారు. విశాలాంధ్రలో తెలంగాణకు, దళిత బహుజన పీడితులకు తీరని అన్యాయం జరిగిందని, అందుకు భౌగోళిక తెలంగాణతో పాటు తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం కావాలనే సిద్ధాంతాన్ని రూపొందించి, ఒక డిమాండ్‌గా మార్చి గ్రామగ్రామానికి తీసుకెళ్లి వేలాది మందిని సమీకరించారు.

అంతేకాదు తెలంగాణ వీరులు చాకలి ఐలమ్మ, దొడ్డికొమురయ్య, భాయిబందగీ, సమ్మక్క సారక్క, బండి యాదగిరి, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, కొమురం భీం తదితరుల చరిత్రను, బతుకమ్మ, వివిధ కులాల, గ్రామాల, గూడెం తండాల ప్రజల సంస్కృతులను వెలికితీసారు.

ఈ చారిత్రక వాస్తవాన్ని ఆలస్యంగానైనా ఆనాటి సిపిఐఎంఎల్-పీపుల్‌వార్ (నేటి సిపిఐ-మావోయిస్టు) పార్టీ ప్రజాస్వామ్య తెలంగాణ డిమాండ్‌తో 1997లో స్వీకరించి పోరాటాలను నిర్మిస్తున్నది. కానీ, భౌగోళిక, ప్రజాస్వామ్య తెలంగాణ పేరుతో బడుగువర్గాల మహాజనులకు అధికారాన్ని అందించే సామాజిక న్యాయాన్ని పక్కనబెట్టింది. మరికొన్ని విప్లవ పార్టీలు ప్రత్యేక మండళ్ళు కావాలని కోరినా తదనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అంగీకారాన్ని వ్యక్తం చేసే పరిస్థితిని కల్పించడం జరిగింది. వీరు కూడా సామాజిక న్యాయవాదాన్ని పక్కనబెట్టి భౌగోళికవాద డిమాండ్‌తో ముందుకు వెళుతున్నారు.

ప్రత్యేక తెలంగాణలో దళిత బహుజనులకు రాజ్యాధికారం రావాలనీ ఉద్యమాలను నిర్మించడంతో చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను కావాలనే రాజకీయ హత్య చేసింది. మరో తెలంగాణ నేతపై పోలీసు కాల్పులకు పాల్పడింది. ప్రభుత్వమే ప్రైవేట్ సైన్యంతో బెల్లి లలిత, ఐలన్నను హత్యచేయించింది. వీరన్న స్థాపించిన సంస్థలు టిఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం ముఖ్యంగా 2005 తర్వాత లేకపోవడంతో, ప్రజా ఉద్యమాలు నిర్మించే నాయకత్వం లేకపోవడంతో, ఆ అవకాశం టిఆర్ఎస్‌కు, అగ్రకుల పాలకవర్గాలకు అందివచ్చింది.

ఆ వారసత్వాన్ని కొనసాగించే క్రమాన్ని ఆనాటి ఉద్యమశక్తులైన మేము సామాజిక తెలంగాణ మహాసభగా రూపాంతరం చెందాం. ఈ పరిణామం ఓవైపు ఉండగా కృష్ణమాదిగ గతంలో అనేక తప్పిదాల్ని చేసినా, ఈ సారైనా మాదిగల్ని సామాజిక తెలంగాణతోగాని, ప్రజా ఉద్యమశక్తులతో గాని మమేకం చేయాల్సింది. కానీ, ఇప్పుడుకూడా ఆ కార్యానికి పూనుకోలేదు. పైగా కులంపై కులవ్యవస్థపై మేం యుద్ధం చేస్తామని, కులనిర్మూలనను సాధిస్తామని అనడం అర్ధరహిత వాదనే అవుతుంది.

ఈ చారిత్రక వాస్తవాలను గుర్తుంచుకొని సమాజానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బైటపెట్టడానికి ఉ.సా.(ఉ.సాంబశివరావు)తో పాటు మేము ఉన్నాం. 1996-97లో మహాజన ఫ్రంట్‌ను అధికారంలోకి తెచ్చి, సామాజిక న్యాయాన్ని సాధించే ప్రయత్నానికి కృష్ణమాదిగ తోడ్పడివున్నట్టయితే, ఎస్సీ వర్గీకరణతో పాటు ఇతర సామాజిక సమూహాలకు సామాజిక న్యాయం అందేది. కానీ అదే కృష్ణ మాదిగ నేడు సామాజిక న్యాయం గురించి మాట్లాడడం మరోసారి బడుగువర్గ మహాజన ప్రజలను నయవంచనకు గురిచేయడమే అవుతుంది.

ఢిల్లీలోని ఆంధ్రాభవన్ ఉద్యోగి చందర్‌రావుపై ఎమ్మెల్యే హరీష్‌రావు దాడిని వ్యతిరేకించే పేరుతో మందకృష్ణ తెలంగాణకే ఎసరు పెట్టారు. ముందు వర్గీకరణ ఆమోదించండి, తర్వాత తెలంగాణను ఇవ్వండనే అంశాలను తెరమీదకు తేవడం సరైంది కాదు. ఎస్సీ వర్గీకరణ-తెలంగాణ అను ఈ రెండు అంశాలు పార్లమెంట్‌లో ఆమోదించబడేవి. ఈ రెండింటిని వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడం సరైందే అవుతుంది.

కానీ, ముందు వర్గీకరణ ఆ తర్వాత తెలంగాణ అనే రెండంచెల పోరాటాల్ని ప్రతిపాదించడం సబబుకాదు. ఈ క్రమంలో కొద్ది మంది మందకృష్ణను సమర్థిస్తూ, మరికొద్ది మంది హరీష్‌రావును సమర్థిస్తూ అనేక వ్యాసాలు రాశారు. సిపిఐ మావోయిస్టు (రాజకీయ ఖైదీ) నేత శ్రీరాముల శ్రీనివాస్ మందకృష్ణను, ఆయన అనైతిక విధానాలను ఎత్తిచూపుతూ వ్యాసాన్ని రాశారు. అవి వాస్తవమైనా, సామాజిక తెలంగాణపై తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించలేకపోవడం విచారకరం.

ఈ దేశ సమాజంలో వర్గవ్యవస్థతో పాటు కులవ్యవస్థ కూడా విడదీయరాని విధంగా ఉందన్న విషయం గమనంలో పెట్టుకోవాలని అటు మావోయిస్టు పార్టీని ఇటు శ్రీరాముల శ్రీనివాస్‌ని కోరుతున్నాం. నిజంగా ఈ సమాజం వర్గసమాజమని భావిస్తే అది ఒంటిచేతి చప్పట్ల లాంటిదే అవుతుంది. వర్గవ్యవస్థతో పాటు కులవ్యవస్థ ఉందని, ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు కుల నిర్మూలన (కుల) పోరాటాలు అవసరమని గుర్తిస్తే అది జంటచేతి చప్పట్లు అవుతాయి. సామాజిక తెలంగాణకు పక్కనపెట్టే భౌగోళిక, తెలంగాణ వాదం కూడా ఒంటిచేతి చప్పట్ల లాంటిదే అవుతుంది. మావోయిస్టుపార్టీకే కాదు భౌగోళిక తెలంగాణ వాదంతో ఉద్యమిస్తున్న వారికి తెలియజేస్తున్నాం.

నేటి తెలంగాణ పోరాటం భౌగోళిక తెలంగాణ రాష్ట్రం కావాలనే తొలి లక్ష్యంగా ఉద్యమించాలని ఆగస్టు 16న చిక్కుడు ప్రభాకర్ వ్యాసాన్ని రాశారు. ఈయన తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ నాయకుడిగా, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉండి ఇలా రాయడం దుర్మార్గం. తను ప్రాతినిధ్యం వహించే తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆవిర్భావ సభలో తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో గానీ తెలంగాణ పునర్నిర్మాణంలో గానీ సామాజిక న్యాయాన్ని తప్పకుండా పరిగణిస్తామని విధాన ప్రకటన చేశారు.

నేడు ఈ విధాన ప్రకటనకు కావాలనే కాలం చెల్లించి సామాజిక తెలంగాణవాదం భౌగోళిక తెలంగాణకు అడ్డు అని ప్రకటించారు. సామాజిక తెలంగాణని ఎత్తివేయడానికి వారి రాజకీయ విధానమైన ప్రజాస్వామ్య తెలంగాణవాదాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడుతున్నాడు. భౌగోళిక-సామాజిక తెలంగాణవాదం తెలంగాణకి జైకొట్టేదే కాని - దెబ్బకొట్టేది కాదు. దెబ్బకొట్టనిచ్చేది కూడా కాదు. సామాజిక తెలంగాణ మహాసభ ప్రజల తరుపున ప్రజల పక్షాన, అగ్రకుల రాజకీయ జేఏసీని, దళారీ సామాజిక తెలంగాణవాదులను దరిచేరనీయక నిజమైన కుల-వర్గ అసమానతల్ని నిర్మూలించే సామాజిక తెలంగాణ కావాలని ఉద్యమిస్తోంది.

మా సంస్థ తరపున తెలంగాణలో ఎక్కడ ఏ సభ నిర్వహించినా ఫ్రంట్ అధినేత గద్దర్ ముఖ్యఅతిధిగా పాల్గొనేవారన్న విషయం గుర్తుచేస్తున్నాం. గద్దర్‌ను మావేదికలోకి ముఖ్యులుగా పిలవడంలో ఉద్దేశం సామాజిక తెలంగాణ కావాలంటూ ఉద్యమిస్తామని ప్రకటించడంతోనే. కానీ చిక్కుడు ప్రభాకర్ మాత్రం ఈ అంశాలను గమనంలోకి తీసుకోక అగ్రకుల భౌగోళిక తెలంగాణవాదానికి కొట్టుకుపోతున్నాడు.

సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యాన్ని రెండవ దశకు వాయిదావేయటమంటే తమ వైఖరికి తామేకట్టుబడకుండా పక్కకుతప్పుకోవటమే అవుతుంది. మరోమాటలో ఉమ్మడి లక్ష్యంలేని తెలంగాణ అగ్రకుల పాలకవర్గ పార్టీల రాజకీయ జేఏసీ పంచన చేరడమే అవుతుంది. ముందు సామాజిక న్యాయం తర్వాత తెలంగాణ అని ఎవరైనా అంటే అవకాశవాద సామాజిక న్యాయవాదమే అవుతుంది. దాన్ని నిజమైన సామాజిక తెలంగాణవాదులకు అంటగట్టరాదు.

- కొంకల వెంకటనారాయణ, పాపని నాగరాజు
సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కో కన్వీనర్లు

No comments:

Post a Comment