Wednesday, September 28, 2011

లోక్‌పాల్‌లో సామాజిక కోణం - ఎం.చెన్న బసవయ్య, ఎస్.మేల్లస్, డి.రవీందర్ Andhra Jyothi 29/09/2011


లోక్‌పాల్‌లో సామాజిక కోణం
- ఎం.చెన్న బసవయ్య, ఎస్.మేల్లస్, డి.రవీందర్

'సా మాజికన్యాయం', 'జెండరు న్యాయం' రెండూ నేడు విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిన సూత్రాలు. ఈ అంశాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, పరిపాలన మొదలైన విధానాలను రూపొందించే ప్రక్రియలో విధిగా గమనంలోకి తీసుకోవాలని అన్ని సభ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. వీటికి భారత రాజ్యాంగం, ముఖ్యంగా ఇటీవల వచ్చిన పలు చట్టాలు కూడా ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. కాని ఈ అంశాల పట్ల ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రభుత్వ లోక్‌పాల్ ముసాయిదా, టీమ్ అన్నాచే అత్యంత నీతిమంతంగా రూపొందించబడినదిగా చెప్పబడుతున్న జన్‌లోక్‌పాల్ ముసాయిదా సహితం శ్రద్ధచూపక పోవడం విచారకరం.

అవినీతిని నిరోధించే చట్టాలు, సంస్థలు సామాజిక, జెండరు న్యాయసూత్రాలకు అతీతంగా ఉంటేనే మంచిదని భావించడం జరిగిందా? ఏది ఏమైనా 'జన్' లోక్‌పాల్ ముసాయిదాలోని అంశాలు. ఇటీవల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రచారోద్యమం, దాని తీరుతెన్నులు భారతసమాజంలోని దళిత, ఆదివాసి, వెనుకబడిన, మైనారిటీ, మహిళా వర్గాలను కలవరపెడుతున్నది.

ముఖ్యంగా 'అన్నిరకాల అవినీతికి రిజర్వేషన్లే మూలకారణమని మనువు చెప్పిన యోగ్యతా ఆధారిత సామాజిక వ్యవస్థను ఏర్పరచిప్పుడే భారత్‌లో నిజమైన విప్లవం వస్తుందని' విశ్వసించే 'క్రాంతికారి మనువాది మోర్చా, రిజర్వేషన్లను వ్యతిరేకించే 'యూత్ ఫర్ ఈక్వాలిటీ', రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి పలు హిందుత్వ సంస్థలు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులు, కార్పొరేట్ మీడియా, సవర్ణ శిష్టులు నడిపే ఎన్జీవోలు మొత్తంగా 'జన్'లోక్‌పాల్ ప్రచారోద్యమంలో కీలక పాత్ర వహించడం, రిజర్వేషన్ల వ్యతిరేక పోస్టర్లను, స్లోగన్లను బాహాటంగా వాడటం హిందూ మతపరమైన చిత్రాలను , కీర్తనలను ప్రదర్శించడం, కీర్తించడం మొదలగు అంశాలు లౌకిక, సామాజిక, జెండరు న్యాయ దృక్పథాలతో ఆలోచించే వారిలో పలు అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తున్నది.

వివక్షలను వ్యతిరేకించే పలు దళిత, ఆదివాసి, వెనుకబడిన, మైనారిటీ, మహిళాసంఘాల ప్రతినిధులు కలిసి ఒక 'బహుజన లోక్‌పాల్' ముసాయిదాను రూపొందించి పార్లమెంటు స్థాయీ సంఘానికి సమర్పించారు. 'జన్ లోక్‌పాల్'తో పాటుగా ఈ ముసాయిదాపై కూడా పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని పౌరసమాజానికే చెందిన ఈ సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌పాల్ వ్యవస్థలో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన సామాజిక, జెండరు న్యాయసూత్రాల అంశాలను చర్చించే ప్రయత్నం చేద్దాం.

(అ) జన్‌లోక్‌పాల్ ముసాయిదాలో పేర్కొన్న అవినీతి, దుష్పరిపాలన, దుష్ప్రవర్తనల నిర్వచనాలను విస్తృతపరచవలసిన అవసరమున్నది. వీటిలో దళిత ఆదివాసివర్గాల అభ్యున్నతికి ఉద్దేశించని 'స్పెషల్ కాంపోనెంట్ ప్లానుల' నిధుల కేటాయింపులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాని ఇతర అవసరాలకు దారి మళ్లించడం, వాటిని లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు ఉపయోగించడం, వీటికి సంబంధించిన పథకాలను రూపొందించక పోవడం, అమలు పరచక పోవడం ఈ నిధులను దుర్వినియోగం చేయడం అనే అంశాలను చేర్చాలి.

(ఆ) కేవలం లంచగొండితనమే కాక అన్ని రకాల వివక్షలను అవినీతిలో భాగంగా చూడాలి. ఇవి లోక్‌పాల్, లోకాయుక్త అధికారాలు, విధులలో భాగం కావాలి. లోక్‌పాల్, లోకాయుక్త సభ్యులలో దళిత, ఆదివాసీ, బలహీన, మైనారిటీ, మహిళాసభ్యుల ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలి. ఇది లోక్‌పాల్, లోకాయుక్త ఎంపికకు జరిగే కమిటీలలో ఇద్దరికీ తక్కువ కాకుండా ఈ వర్గాల సభ్యులు ఉన్నప్పుడే సాధ్యం కాగలదు. ఈ రెండు సంస్థలలోని సిబ్బంది నియామకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిజర్వేషన్లు వర్తింపజేయాలి.

(ఇ) ప్రభుత్వ, జన్ లోక్‌పాల్ ముసాయిదాలలో సూచించిన కేవలం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది మాత్రమే కాకుండా నేటి ఉదారవాద ప్రపంచీకరణలో భాగంగా అవినీతిని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ సంస్థలు, మీడియా, ఎన్జీవోలు కూడా లోక్‌పాల్, లోకాయుక్త పరిధులలోకి తీసుకురావాలి.

(ఈ) లోక్‌పాల్, లోకాయుక్తలపై జాతీయ ఎస్‌సి, ఎస్‌టి, బలహీన వర్గాల మైనారిటీ, మహిళా కమిషన్ల పర్యవేక్షణ ఉండాలి. దళిత, ఆదివాసి, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలపై అవినీతి ఆరోపణలు నిర్ధారించే క్రమంలో సంబంధిత కమిషనుల అభిప్రాయాలను విధిగా తీసుకోవాలి. ఈ వర్గాలపై విచారణను ఈ వర్గాలకు సంబంధిత లోక్‌పాల్, లోకాయుక్త సభ్యుల నేతృత్వంలో చేయాలి. విచారణ పూర్తికాబడి శిక్ష విధించిన తదుపరి సదరు వర్గాలకు చెందిన వ్యక్తులు లోక్‌పాల్, లోకాయుక్త నిర్ణయాలు సముచితమైనవని కావని భావించినట్లయితే తగు ఆధారాలతో సంబంధిత కమిషన్లకు తమ కేసులను నివేదించుకునే అవకాశం ఉండాలి. నివేదనను ఆయా కమిషన్లు అంగీకరించినచో అట్టి కేసులపై లోక్‌పాల్, లోకాయుక్తలు జోక్యం చేసుకోకూడదు. ఇట్లాంటి కేసులపై సంబంధిత కమిషన్ల తీర్పు అంతిమంగా అమలుపరచాలి. వీటన్నిటికి సంబంధించి ఈ కమిషన్ల అధికారాలను, విధులను మార్పు చేస్తూ సవరణలు చేయాలి.

(ఉ) దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళల అభియోగాలపై లోక్‌పాల్, లోకాయుక్త , ఇతర కోర్టులు, కమిషన్లలో విచారణ జరుగుతున్నప్పుడు సదరు వ్యక్తులు తమ కేసులను వాదించడానికి న్యాయవాదులను నియమించుకోజాలని పరిస్థితిలో ఉన్నట్లయితే సదరు వ్యక్తుల విన్న పాల ఆధారంగా ప్రభుత్వమే వారికి న్యాయవాదులను నియమించి సంబంధిత ఖర్చులను కూడా భరించాలి.

(ఊ) జన్ లోక్‌పాల్ ముసాయిదాలో పేర్కొన్న లోక్‌పాల్, లోకాయుక్తల 'సుమోటో' నిర్ణయ విచారణ అధికారాలు దళిత, ఆదివాసి, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు వర్తింప చేయకూడదు. ఈ వర్గాలపై అవినీతి కేసులను లోక్‌పాల్, లోకాయుక్తలు 'క్వాసి సివిల్, క్రిమినల్'గా భావించాలి.

(ఎ) లోక్‌పాల్, లోకాయుక్తలలోని దళిత, ఆదివాసి, బలహీనవర్గాలు, మైనారిటీలు, మహిళా సభ్యులపైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించే అధికారం సంబంధిత కమిషన్లకు ఇవ్వాలి. ఈ వర్గాల వ్యక్తులు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసినప్పుడు వారికి ప్రత్యేక ఆరోణలు కల్పించాలి. ఎందుకంటే వారికి మిగతావారితో పోలిస్తే బెదిరింపులకు ఆస్తి, ఇతర నష్టాలకు గురికాబడే అవకాశాలు సమాజంలో ఎక్కువగా ఉంటాయి.

నిజానికి ప్రొఫెసర్ శివ్ విశ్వనాథన్ తన గ్రంథం 'ఫౌల్ ప్లే: క్రానికల్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా' లో చెప్పినట్లు అవినీతి అనేది ఒక 'వ్యవస్థ పరమైన సమస్య'. చట్ట పరమైన జోక్యాలు అవినీతి నిరోధనలో ఒక స్థాయిలోనే పనిచేయగలవు కాని పూర్తిగా అవినీతిని నిరోధించలేవు. కావున లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు అవినీతి నిర్మూలనలో ఒక మెట్టు గానే భావించాలి. అయితే ఈ మెట్టును నిర్మించే క్రమంలో సామాజిక జెండరు సూత్రాలు విస్మరించ రాదు. పైన పేర్కొన్న అన్ని అంశాలు భారత రాజ్యాంగం, ఇతర చట్టాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి లోబడిఉన్నవే కాని వ్యతిరేకమైనవి కావు. కావున వీటిని లోక్‌పాల్ బిల్లు రూపొందిన ప్రక్రియలో పార్లమెంటరీ లోక్‌పాల్ చట్టంలో పొందుపర్చాల్సిన అవసరముంది. అప్పుడే సామాజిక న్యాయం , జెండరు న్యాయంతో కూడిన లోక్‌పాల్ వ్యవస్థ మన దేశంలో ఏర్పడగలదు.

- ఎం.చెన్న బసవయ్య, ఎస్.మేల్లస్, డి.రవీందర్
ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం

No comments:

Post a Comment