Sunday, September 4, 2011

అవకాశవాద ఒప్పందాలు----- గుర్రం సీతారాములు Andhra Jyothi 09/8/2011


అవకాశవాద ఒప్పందాలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేడు అందరూ అనుకున్నట్లు తుది దశకు చేరుకుందని భావించినా వాస్తవానికి అది కోస్తాంధ్ర పెట్టుబడిదారులతో మమేకమయిన అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాళ్ళ దోపిడీకి తలుపులు బార్లా తెరిచి ఉంచిన యూపీఏ కబంధహస్తాలలో బిక్కుబిక్కుమంటోంది. దోపిడీ శక్తులన్నీ ఎలాగయినా దీన్ని రూపుమాపాలని రాజీనామాల నాటకానికి తెరదీశాయి.
అందరూ అనుకున్నట్లు రాజకీయ శూన్యత తెస్తే కేంద్రం దిగొస్తది అని భావించిన తెలంగాణ వాదులకు ఇది ఆశనిపాతం. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ రాజకీయ అడ్డంకుల కంటే అంతర్జాతీయ కార్పొరేట్ లాబీనే తెలంగాణను అడ్డుకుంటోంది. దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర పెట్టుబడిదారీ వర్గం, పాలకవర్గం ఒకటి కావడమే. అందునా కోస్తాంధ్ర పెట్టుబడిదారులు కేంద్రంలో పార్లమెంటరీ రాజకీయాలను శాసించే శక్తులు కావడమే. దీని వల్ల రేపు తెలంగాణ వచ్చినా పెట్టుబడిదారీవర్గ ఆకాంక్షలకు అనుగుణంగానే ఉం టుంది.
తెలంగాణ ఉద్యమం విశాల ప్రజా ఉద్యమంగా మారినా విజయం వైపు ఎందుకు ప్రయాణించడం లేదు అనేది కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులు సాంకేతికంగా కొందరు ఇంకా మంత్రులుగా ఉన్నట్లే. దీనికి కారణం రాజీనామాలు అధిష్టానం కనుసన్నలలోనే జరిగాయి అనే అనుమానం రాక మానదు. దీనిద్వారా పచ్చి తెలంగాణ వ్యతిరేకులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు మళ్ళీ గ్రామాలలో స్వేచ్ఛగా తిరిగే వెసలుబాటు మాత్రం కలిగించుకున్నారు. తెలంగాణ సాధనలో జరిగిన పచ్చి మోసం ఇది.
ఈ మోసాలు, కుట్రలు నాలుగు దశాబ్దాలుగా నెత్తురోడుతున్న తెలంగాణకు కొత్తకాదు. దీని మూలాలు తొలిదశలో జరిగిన ఉద్యమం, అప్పుడు జరిగిన ఒప్పందాలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు. 1969లో చెన్నారెడ్డి సారధ్యంలో వెల్లువలా వచ్చిన తెలంగాణ ఉద్యమం తద్వారా ఆ త్యాగాల పునాదుల మీద రాజకీయ సౌధాలు నిర్మించుకున్న దుష్టాంతాలు కోకొల్లలు. ఆ క్రమంలో దానికి సమాంతరంగా వచ్చిన నక్సల్బరీ ఉద్యమం దానికి ఒక సైద్ధాంతిక భూమికను ఇచ్చింది.
దానిని ఒక ప్రజాస్వామిక డిమాండ్‌గా మార్చి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దింది. వందల మంది విద్యార్థుల రక్తతర్పణంతో రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్న చెన్నారెడ్డి నాయకత్వం చర్చల పేరుతో కేంద్రంతో చేసుకున్న ఒడంబడిక ఒప్పందాలు అన్నీ అవకాశవాద ఒప్పందాలే. ఆనాడు ఉద్యమకారులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరగాల్సింది పోయి అవకాశవాద రాజకీయ నాయకుల ప్రయోజనాలు నెరవేర్చే ఒప్పందంగా మారింది. అదొక అధికార మార్పిడి తంతుతో బలమైన ప్రజల ఆకాంక్షను పురిట్లోనే పీక నులిమింది తెలంగాణ నాయకత్వం.
దాని తదనంతరం ప్రత్యేక ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న విద్యార్ధి, మేధో వర్గం ఆ ఉద్యమ కొనసాగింపు క్రమంలోనే అడవి బాట పట్టారనేది దాచేస్తే దాగని సత్యం. ఇక రెండవ దశలో అంటే 1995లో గ్రామాలలో భూమి ఇరుసుగా సాగిన నక్సల్బరీ ఉద్యమ ఉద్రితి మూలంగా అలిసిపోయిన భూస్వామ్య పెత్తందారీ వర్గాలు ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక నగరాల బాట పట్టారు. దొరలు గ్రామాలను వదిలినప్పటికీ దోపిడీ రూపం మళ్ళీ రాజకీయ ముసుగు వేసుకొని గ్రామాలలోకి ప్రవేశించింది. ఈ దశలో అది కాపిటలిస్టు ముసుగులో తెలుగుదేశం, కాంగ్రెస్‌తో మమేకమయి రాజకీయాలను కార్పొరేటీకరించారు.
మూడవ దశలో ఆంధ్ర తెలంగాణ భూస్వామ్య వర్గం రైతాంగ సమస్యలను ప్రధాన ఎజెండాగా రాజకీయ సమీకరణలు చేసిన రాజశేఖరరెడ్డి స్థానిక పెత్తందారీ శక్తులతో కలిసి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రకటిస్తాం అనే బూటకపు వాగ్దానంతో అటు తెరాసతో పొత్తు పెట్టుకుని ఇటు నక్సల్స్‌తో శాంతి చర్చల పేరుతో రాజకీయ నరమేధం సృష్టించాడు. ఎన్నికల ముందు తెలంగాణ కోసం చేసిన వాగ్దానాలను అమలుపరచలేదు.
ఏనాడు భూమి ఇరుసుగా ఉద్యమాలు ప్రజల విముక్తి కోసం నిర్మించారో అదే భూమిని అడ్డుపెట్టుకొని వందల కోట్ల రూపాయలు చేతులు మారే విధంగా రాజకీయాలు నడిపాడు. గడిచిన 5 దశాబ్దాలలో మారిన రాజకీయ పరిస్థితులలో సమస్త సంపద భూముల రూపంలో ఒనగూర్చుకొని హైదరాబాద్ చుట్టూ తమ రాజకీయ ఆర్ధిక సౌధాలను నిర్మించుకున్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రధాన అడ్డంకి సంపద అంతా వనరుల రూపంలో ఉండడమే. దీని చుట్టూ ఉన్న సంపదకు తెలంగాణలో ఇప్పటికీ రాజీనామా చేయని తెలంగాణ పెట్టుబడిదారీ వర్గం కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు కష్టోడియన్‌లుగా వ్యవహరిస్తున్నారు.
నేడు మలివిడత తెలంగాణ పోరాటం విద్యార్థుల త్యాగాల పునాదుల మీదుగా సాధించిన డిసెంబర్ ప్రకటన, చిదంబరం మలి ప్రకటన మరింత సంక్షోభంలోకి నెట్టింది. సీమాంధ్ర పెట్టుబడిదారుల ముందు తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు నిలబడలేకపోయాయి. ఉత్పత్తి శక్తుల అనైక్యత వల్ల వాళ్ళను పైన పేర్కొన్న మూడు ఉద్యమ స్రవంతులు, రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులు కలిసి ఐక్య సంఘటన ఇంకా ఏర్పాటు చేయకపోవడం ప్రస్తుత ఉద్యమ ప్రధాన లోపం.
ఉద్యమ, ఉద్యోగ, ప్రజా సంఘాలకు, పొలిటికల్ జాక్‌ల మధ్య సమన్వయ లోపం మాత్రమే ఈ స్థితికి కారణం. ఐక్యతా పోరాటం స్ఫూర్తితో విద్యార్ధి, ఉద్యోగ, ప్రజాసంఘాలు ఐక్య సంఘటనతో ప్రజాపోరాటాలను తీవ్రతరం చేయడం ద్వారా మాత్రమే తెలంగాణ విముక్తి కలిగించిన వాళ్ళమవుతాం.
- గుర్రం సీతారాములు

No comments:

Post a Comment