Sunday, September 4, 2011

దళిత ఉద్యమాల్లో దళిత మహిళలు --- జూపాక సుభద్ర Andhra Jyothi 12/08/2011


దళిత ఉద్యమాల్లో దళిత మహిళలు
మనుషులుగా సమాన న్యాయాలు, గుర్తింపు గౌరవాలు లేవని కుల సమాజాన్ని నిలదీస్తున్న దళిత మగవాళ్లు తమతో సమానంగా పోరాడుతున్న దళిత మహిళల్ని గుర్తించకపోవడం న్యాయమేనా? ఉద్యమాల్లో గుర్తింపులు లేకుండా, నాయకత్వ భాగస్వామ్యాల్లోకి రానీయకుండా, ఉద్యమ చరిత్రలో వారి ఆనవాళ్లను కూడా మిగల్చకుండా చేయడం దళిత తాత్వికానికే విరుద్ధమైంది. కారంచేడు హత్యాకాండ, చుండూరు గుండెల గాయం, దండోర పంపక దరువు పోరుల్లో దళిత మహిళలు ప్రాణాలర్పించినా, రక్తం చిందించినా, వారి మీద లాఠీలు విరిగినా దళిత ఉద్యమ నాయకులు దళిత మహిళల్ని అవాచ్యంగా ఉంచడం అప్రజాస్వామికం.
అంటరానివారుగా వుంటూ సాంస్కృతికంగా తక్కువగా, నీచంగా చూడబడుతూ, విద్య, ఉద్యోగ సౌకర్యాలు లేక, వూరికి దూరంగా, ఆర్థిక అణచివేతకు, శ్రమదోపిడీకి, బైట దొర, దొరసాని పెత్తనాలు, ఇంట్లో మగపెత్తనాలను ఎదుర్కొంటున్న వాళ్లు దళిత స్త్రీలు. వీరు బాంచకు బాంచలు దళిత స్త్రీలు సేవకులుగానే వుండాలి. బాంచలకు బాంచలుగానే వుండాలి. చదువుకుంటే చెవుల సీసం, నాలుకలు కోసే సామాజిక వ్యవస్థల్లో వున్నవాళ్లు. దళిత స్త్రీల అనుభవాలు కుల అనుభవాలు, శ్రామిక అనుభవాలు అవి వ్యక్తిగతమైనవి కావు సామూహిక అనుభవాలు.
జాతీయోద్యమం ఆధిపత్య కులాల కనుసన్నల్లో నియంత్రణల్లో నడిచింది. దానిలో పాల్గొన్న అశేష ఉత్పత్తి కులాల స్త్రీలు చరిత్రలో కానరారు. కనిపించకుండా ఆధిపత్య కులాలు అడ్డుకున్నవి. ఎందుకంటే ఆధిపత్య పితృస్వామ్య పరిధిలోని చరిత్రలు రాసుకున్నారు కాబట్టి. యిదే అణచివేత కారంచేడు, చుండూరు దండోర ఉద్యమాల్లో కూడా చూడొచ్చు.
దళితులను చంపితే పూచీలేదు అనే మనుధర్మ శాస్త్ర విలువలకు వ్యతిరేకంగా పోరాడి దేశంలోని దళితులకు కారంచేడు దళిత పోరాటం ఒక వెలుగుదారిగా నిలిచింది. 1985 జూలై 17న దళితులపై ఆధిపత్య కులం హత్యాకాండ తర్వాత జరిగిన కారంచేడు ఉద్యమం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989ని తీసుకొచ్చింది. కుల ప్రధాన వైరుధ్యాన్ని ఎత్తిచూపుతూ అంబేద్కరిజం రాజ్యాంగబద్ధ పరిష్కారం వంటి అంశాలు సమాజంలో చర్చకు వచ్చాయి. దళితుల్లో అస్తిత్వం, ఆత్మగౌరవం, సంఘటితం, ఏకీకరణ చైతన్యం పెరిగాయి. యీ చైతన్యాలు రాజకీయ, విప్లవ పార్టీల్లో కొనసాగుతున్న కుల వివక్షల్ని ప్రశ్నించింది. కారంచేడు మాదిగల రక్తంలోంచి పుట్టి దళితోద్యమాన్ని నడిపిందే అప్పటి 'దళిత మహాసభ'.
ఇంతటి ప్రభావశీల కారంచేడు ఉద్యమంలో మహిళలు ప్రధాన భూమిక పోషించారు. మంచినీళ్ల కోసం జరిగిన సంఘర్షణతో యీ ఉద్యమం మొదలైంది. యీ సంఘర్షణలో మున్నంగి సువార్తమ్మ అనే మహిళ కుల ఆధిపత్య అహంకారాన్ని ధిక్కరించింది. దళితుల మంచినీళ్ల చెరువుల్లో బర్రెలను తోలిన వారిని ఎదిరించింది. అది సహించలేని ఆధిపత్య కుల దురహంకారం ఆరుగురు మాదిగల్ని హత్యచేసింది. యీ హత్యాకాండకు ప్రధాన సాక్షి దుడ్డు అలీసమ్మ. కుల దురహంకారం ఆమెను అంతంచేసింది.
కారంచేడు ఉద్యమానికి ఆయువుగా పనిచేసింది మహిళలే. పోలీసుల్నుంచి ఆధిపత్య కుల దురహంకారుల దాడుల్నుంచి ఉద్యమాల్ని ఉద్యమ నాయకత్వాన్ని కాపాడింది దళిత మహిళలే. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి కార్యకర్తల్ని, నాయకుల్ని వూరు దాటించడం, కాపలా కాయడం, క్యాంపులో వేల మందికి అన్నాలు వండి వార్చింది ఉద్యమాన్ని బతికించింది దళిత మహిళలు. ధర్నాలు, రాస్తారోకోలు చేసారు. హేతువాద లక్ష్మి, సువార్తమ్మ, సులోచన, ఏసమ్మ వంటి అనేక మంది మహిళలు లాఠీదెబ్బలు తిన్నారు.
దళిత మహాసభ నాయకులు, కత్తి పద్మారావు అరెస్టయితే మహిళలంతా ఏకమై రాజకీయ నాయకులను నిలదీస్తే వారి వాహనాలకు అడ్డంపడి కదలనివ్వకుంటే పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నది దళిత మహిళలు. అరెస్టయిన నాయకుల్ని విడిపించే దాకా యీ మహిళలు కారంచేడు పోరాటాన్ని కొనసాగించారు. జిల్లా కేంద్రానికి హైద్రాబాద్, ఢిల్లీ నగరాల కోర్టుల చుట్టూ తిరిగి సాక్ష్యమందించారు. యిన్ని చేసిన యీ దళిత మహిళలు కారంచేడు ఉద్యమంలో ఏరి ఏక్కడ? ఎవరు ఎంతమంది? వారి పేర్లేంటి? కారంచేడు ఉద్యమానికి 25 ఏళ్లు అని చెప్పుకునే దళిత నాయకత్వానికి సువార్తమ్మ, ఏసమ్మ, అలీసమ్మ ప్రాణత్యాగం కనిపించదు, గుర్తుకురాదు.
1991 ఆగస్టు 6న చుండూరు ఘటన జరిగింది. దళిత మగపిల్లలు అగ్రవర్ణం అమ్మాయిల్ని అల్లరి పెట్టారనే కారణంతో అగ్ర వర్ణాల వాళ్లు ఆరుగురు దళితుల్ని ఊచకోత కోసారు. యీ మారణహోమం విచారణ కోసం స్పెషల్ కోర్టు బాధితుల మధ్యకు రావడం యీ పోరాట విజయమనుకోవచ్చు. దళితవాడల మీద జరిగిన అన్ని రకాల దాడుల్ని తిప్పికొట్టింది యిక్కడి దళిత మహిళలే. చుండూరు నుంచి ఢిల్లీ వరకు దళిత మార్చ్ జరిగింది.
ఆ మార్చ్‌లో ప్రాణత్యాగం చేసింది గుడూరి లేయమ్మ. ఢిల్లీ వీధుల్లో వంటలు చేసి మార్చ్ కార్యకర్తలను, నాయకత్వాన్ని బతికించారు దళిత మహిళలు. అటు ఉద్యమాల్లో పాల్గొంటూ యిటు రోడ్ల మీద అన్నాలు వండి అనేక అవస్థలు పడి ఢిల్లీ దళితమార్చ్‌ని విజయవంతం చేశారు. ప్రభుత్వాలు కదిలే దాకా ఢిల్లీ నుంచి కదిలేది లేదని నినదించారు. దళిత మహిళల ఉద్యమ తీవ్రతకు ప్రతిస్పందించిన ఎస్‌సి, ఎస్‌టి పార్లమెంట్ సభ్యులు అప్పటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామ్‌ని కలవడానికి వెళ్లారు. కాని రాష్ట్రపతి కలవడానికి అనుమతించలేదు. అప్పటి నిరసన జ్వాలల్లోంచే దళితుడు రాష్ట్రపతి కావాలనే నినాదంతో బాధితులకు బాసటగా నిలిచారు.
చుండూరు ఉద్యమానికి జనజీవాలందించి బతికించి చివరికంటా పోరాడింది ప్రధానంగా దళిత మహిళలే అనే నిజాన్ని గుర్తించాల్సిన అవసరముంది. చుండూరు ఉద్యమంలో అనేక మంది దళిత మహిళలున్నారు. చుండూరు ఉద్యమ ప్రారంభం నుంచి దోషులకు శిక్షపడే దాకా కార్యకర్తగా, నాయకురాలిగా కార్యకర్తల వెన్నంటి పనిచేసింది బిట్లమేరీ లీలాకుమారి. అగ్రకుల దాడుల్లో కొడుకుని (అనిల్‌కుమార్) కోల్పోయి ఉద్యమం కోసం శవాన్ని తీసుకోడానికి నిరాకరించింది చుండూరు గ్రేసమ్మ.
యింకా యీ ఉద్యమంలో శకుంతలమ్మ, పిప్పర మహాలక్ష్మి, సిద్దెల్లమ్మ, తిమ్మసముద్రం సుబ్బులమ్మ, లలితమ్మ, మణెమ్మలు మరెందరో దళిత మహిళలుచుండూరు ఉద్యమాన్ని నడిపించినా, కుడి భుజంగా వున్నా స్టేజి కింది వాళ్లుగానే పరిగణించడం, పోరాటంలో వాళ్లని గుర్తించకపోవడం దళిత సంస్కృతి కాదేమో! 1994లో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) మాదిగ హక్కుల దండోర ఉద్యమం అనేక కొత్త ప్రశ్నల్ని, కొత్త కోణాల్ని, కొత్త చైతన్యాన్ని సమాజం ముందు పెట్టింది. ఎస్‌సిలంతా ఒక్కటి కాదని, 61 ఎస్సీ కులాల్లో అనేక అంతరాలున్నాయని, దళితపదము ఎస్సీ కులాలందరికి ప్రాతినిధ్యం వహించదని చెప్పారు. రాష్ట్రంలో 61 ఎస్సీకులాల ఉమ్మడి విద్య, ఉద్యోగ, సంక్షేమ రాజకీయ రంగాలకు చెందిన రిజర్వేషన్ల సింహభాగాన్ని ఒక్క మాల కులమే పొందుతున్నారని యీ పరిస్థితిని మార్చి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమించింది.
సమన్యాయం జరిగే ఏర్పాటునుచట్టం ద్వారా రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని దండోర ఉద్యమం డిమాండ్ చేసింది. అంటరానితనం, పేదరికం, అత్యాచారాలు, వెట్టిచాకిరీ, జోగిని, బాలకార్మిక వ్యవస్థ, నిరక్షరాస్యత, భూమి లేమి తదితర సమస్యల్లోకి దళిత కులాలను ఆధిపత్య కులాల సమాజం నెట్టివేసింది. యీ స్థితిలో అస్తిత్వ గౌరవం, హుందాతరం కోసం, న్యాయబద్ధమైన వాటా కావాలని మాదిగలు నినదించారు. ఈ మాదిగ ఉద్యమం ప్రభావితులైన అణగారిన షెడ్యూల్డు కులాలు, అత్యధికంగా వెనుకబడిన కులాలు, ఆదివాసీ సమూహాలు, మైనారిటీలు కూడా మేల్కొని చరిత్రలో తామెంత కోల్పోయింది తమ అస్తిత్వం తాము రూపొందించుకునే ఎరుకలోకి వచ్చారు. యీ చైతన్య ఉద్యమంలో కీలకంగా పనిచేసింది సంచలనాలు సృష్టించింది మాదిగ మహిళలు.
మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధంలో అనే నినాదంతో మాదిగ స్త్రీలంతా పెద్దఎత్తున కదిలివచ్చి ఉద్యమాన్ని నడిపించారు. 1997లో నల్గొండ జిల్లా భువనగిరిలో రాష్ట్రస్థాయిలో 'మాదిగ మహిళా సదస్సు' జరిగింది. వేలమంది మహిళలు పాల్గొన్నారు. కూలినాలి చేసుకునే అనేకమంది మాదిగ మహిళలు అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దండోర ఉద్యమంలో భాగమయ్యారు. అసెంబ్లీ లోపలికి వెళ్లి కరపత్రాలు పంచి సంచలనం సృష్టించిన మేరి మాదిగ, వరలక్ష్మి, ఎల్లమ్మ, సులోచనలు, ఇందిర, ధనలక్ష్మిలు యిప్పుడెక్కడ? వాళ్లు అసెంబ్లీలోకి అక్రమంగా ప్రవేశించి కరపత్రాలు పంచినందుకు పోలీసులు లాఠీదెబ్బల గాయాల్ని దండోర ఉద్యమం గుర్తించలేదు.
దండోరకు ముందుభాగాన వుండి ఉద్యమం నడిపిన బొడిగెశోభ, జీవ, శేషమ్మ, విరూపాక్షమ్మ, దయామణి, యాతాకుల సులోచన రం గమ్మ పోరాటాల్ని ఏ మైసయ్యలు మాయంజేసిండ్రు? వారిని దండోర ఉద్యమం ఏపాటి గుర్తించింది? మాదిగ మహిళలు కరపత్రాల్ని అసెంబ్లీలోకి దూసుకుపోయి పంచడం వల్లనే రాజకీయ పార్టీలు అసెంబ్లీ లోపల, బైట దండోర ఉద్యమానికి మద్దతు పెరిగిందనేది ఎవరూ కాదనలేని నిజం. యీ నాయకురాండ్ర సాహసాలు, నిరుపమాన పోరాట పటిమ, వీరోచిత త్యాగాలు దండోర ఉద్యమానికి దన్ను దరువు అయినయి. కాని దండోర ఉద్యమ చరిత్రలో మహిళల్ని కొరగాని వాళ్లనుగా మిగల్చడమైంది యిప్పుడిప్పుడే దళిత మహిళలు తమ భాగస్వామ్యాలు, గుర్తింపుల సంగతేందని మేల్కొంటున్నారు.
మనుషులుగా సమాన న్యాయాలు, గుర్తింపు గౌరవాలు లేవని కుల సమాజాన్ని నిలదీస్తున్న దళిత మగవాళ్లు తమతో సమానంగా పోరాడుతున్న దళిత మహిళల్ని ఉద్యమాల్లో గుర్తింపులు లేకుండా, నాయకత్వ భాగస్వామ్యాల్లోకి రానీయకుండా, ఉద్యమ చరిత్రలో వారి ఆనవాళ్లను కూడా మిగల్చకుండా చేయడం దళిత తాత్వికానికే విరుద్ధమైంది. కారంచేడు హత్యాకాండ, చుండూరు గుండెల గాయం, దండోర పంపక దరువు పోరుల్లో దళిత మహిళలు ప్రాణాలర్పించినా, రక్తం చిందించినా, వారి మీద లాఠీలు విరిగినా దళిత ఉద్యమ నాయకులు దళిత మహిళల్ని అవాచ్యంగా ఉంచడం అప్రజాస్వామికం.
యిప్పటిదాకా దళిత ఉద్యమాల మీద మాట్లాడాలంటే దళిత నాయకుల్నే గానీ నాయకురాళ్లను ఏ పేపరు పలకరించదు, ఏ కెమెరా కన్ను వుత్తరించదు. కానీ దళిత ఉద్యమానికి సంబంధించి దళిత మహిళల నిర్వచనాల్ని, వ్యక్తీకరణల్ని, సాహసాల్ని, త్యాగాల్ని, అనుభవాల్ని, ఉద్వేగాల్ని కూడా సమాజం వినాల్సిన, గుర్తించాల్సిన అవసరముంది.
- జూపాక సుభద్ర

No comments:

Post a Comment