Saturday, April 28, 2012

సిఐటియు 2012 మేడే ప్రణాళిక వర్గ పోరాటం మరింత ఉధృతం---prajashakti



తమ హక్కులపై, జీవనాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మొత్తం యూరోపియన్‌ దేశాల్లో కార్మికులు సమ్మెలు, ఇతర కార్యాచరణలకు పూనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం తరహాలో మొత్తం ప్రపంచంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అమెరికాలో గత సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం 75 నగరాలకు విస్తరించింది. ఆ తరువాత ప్రపంచంలోని నలుమూలలా వేలాది నగరాల్లో ఈ ప్రదర్శనలు విస్తరించాయి. ఈ ఉద్యమంలో ''90 శాతం - ఒక శాతం'' నినాదం ముందుకు వచ్చింది. ''స్పెక్యులేటర్లకు బిలియన్లు, ప్రజలకు పెన్నీలు'' అనేది ఈ సందర్భంగానే వచ్చిన మరో నినాదం. స్వచ్ఛందంగా జరిగే ఇటువంటి ప్రదర్శనలను సిఐటియు ఆహ్వానిస్తున్నది. కార్మికుల సంఘటిత ఉద్యమంలో ఈ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొనాలని 2012 మే దినోత్సవం సందర్భంగా సిఐటియు పిలుపునిస్తోంది. కార్మికులందరూ అంకితభావంతో అందుకు కృషి చేయాలి.
కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యత, సంఘీభావానికి చిహ్నమైన మే దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని, అలాగే ప్రపంచంలోని కార్మికవర్గానికి, పీడిత, తాడిత ప్రజానీకానికి సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌యూనియన్‌(సిఐటియు) ముందుగా తన విప్లవాభినందనలు తెలియజేస్తున్నది. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేసే అన్ని రకాల దోపిడీల నుంచి మానవ సమాజానికి విముక్తి కల్పించేందుకు, వర్గ పోరాటాలను ముందుకుగొనిపోయేందుకు కృత నిశ్చయంతో కృషి చేస్తానని సిఐటియు ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నది.
99 శాతం సామాన్య ప్రజలను ఒక శాతంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గం నిరంతరం లూటీ, దోపిడీ చేయడానికి ఆసరా కల్పిస్తున్న నయా ఉదారవాద పెట్టుబడి విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, వివిధ రంగాలకు చెందిన సామాన్య ప్రజానీకం గొంతెత్తి నినదిస్తున్న నేపథ్యంలో 2012 మే దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. నయా ఉదారవాద విధానాల మాటున సాగే పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా భారత కార్మికవర్గం ఈ సంవత్సరం మే దినోత్సవాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో, అంకితభావంతో జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది కార్మికులు పోరాటాన్ని మిలిటెంట్‌ స్థాయికి తీసుకెళ్లాలనే అంకితభావంతో సంయుక్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె చారిత్రాత్మక విజయం సాధించిన దరిమిలా ఈ ఏడాది మే దినోత్సవం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మే దినోత్సవానికి మరో ప్రాధాన్యత కూడా ఉంది. మే 1న కష్టజీవుల పెన్నిధి, విప్లవ నాయకుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య శతజయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకునికి సిఐటియు విప్లవ జోహార్లు అర్పిస్తోంది. ఆ మహోన్నత నాయకుని శతజయంతిని పురస్కరించుకుని ఈ సంవత్సరం అంతా సముచిత రీతిన కార్యక్రమాలు జరుపుకోవాలని తన అనుబంధ శాఖలన్నిటికీ సిపిటియు పిలుపునిస్తోంది.
సౌహార్థ శుభాకాంక్షలు
శాస్త్రీయ సోషలిజం విలువలను నిలబెట్టేందుకు పోరాడుతున్న సోషలిస్టు దేశాల కార్మికులకు ఈ మేడే సందర్భంగా సిఐటియు తన అంతర్జాతీయ సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తోంది. పెట్టుబడిదారీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు విప్లవ ప్రతీఘాతానికి అదే పనిగా కుట్రలు, కుతంత్రాలు సాగిస్తున్న శత్రువులపై వామపక్ష, ప్రగతిశీల శక్తులు విజయం సాధించగలవన్న విశ్వాసాన్ని సిఐటియు వ్యక్తం చేస్తున్నది.
అభివృద్ధి చెందిన దేశాల కార్మికులు, శ్రమజీవులు ప్రమాదకర నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అలాగే సామాన్య ప్రజలపై ప్రస్తుత ఆర్థిక సంక్షోభ భారాలను మోపేందుకు సాగిస్తున్న దుష్ట యత్నాలకు వ్యతిరేకంగా సాగే పోరాటాలకు కూడా సిఐటియు తన సంఘీభావం తెలియజేస్తోంది. ఒక వైపు తమ దేశ సామాజిక-రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై సామ్రాజ్యవాద శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూనే, మరోవైపు తమ హక్కులు, జీవనభృతిపై సామ్రాజ్యవాద నయా ఉదారవాద వ్యవస్థ ప్రోద్బలంతో ఇక్కడి పాలక పార్టీలు సాగిస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు నికరంగా పోరాడుతుంది. ఈ విషయంలో పెద్దయెత్తున పోరాటాలు సాగిస్తున్న వర్థమాన దేశాల కార్మికులకు సిఐటియు తన సంఘీభావాన్ని తెలియజేస్తోంది. ముదురుతున్న వ్యవసాయ సంక్షోభం, దాని ప్రభావంతో తీవ్రతరమవుతున్న పేదరికం, తరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఆదాయాలు, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై నేపథ్యంలో జీవన్మరణ పోరాటం చేస్తున్న నిరుపేద, చిన్న వ్యవసాయ దారులకు సిఐటియు అండగా నిలుస్తుంది.
వివక్షత, నిరుద్యోగం, నయా ఉదారవాద విధానాల కారణంగా ఉత్పన్నమవుతున్న విద్య, ప్రభుత్వ సేవా సంస్థల వ్యాపారీకరణ, ప్రయివేటీకరణలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలు, యువజన, విద్యార్థి సంఘాలకు కూడా సిఐటియు సాదర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. దేశం కోసం, దేశ ప్రజల కోసం ఈ సెక్షన్ల చెంతకు చేరాల్సిన అవసరముంది.
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం
పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌, గాజా ప్రాంతాలను దశాబ్దాలపాటు ఆక్రమించుకుని ప్రజలపై దాడులు చేస్తూ, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ, దిగ్బంధం గావిóస్తూ, నేరపూరిత చర్యలకు పాల్పడుతున్న యూదుల వైఖరిపట్ల సిఐటియు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్‌ పాలకులు అనుసరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద ప్రాయోజిత, అనాగరిక, పాశవిక చర్యలను సిఐటియు నిర్ద్వంద్వంగా ఖండించింది. పాలస్తీనా ప్రజలు సాగిస్తున్న పోరాటాలకు ప్రపంచవ్యాపితంగా వున్న సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు, దేశభక్తియుత, ప్రజాతంత్రవాదులు , ప్రజానుకూలమైన, కార్మిక వర్గ అనుకూల విధానాల కోసం పోరాడే కార్మిక ఉద్యమం మొత్తం మద్దతుగా నిలవడం వాటి కనీస నైతిక, మానవతావాద బాధ్యత అని సిఐటియు పేర్కొంది.
నియంతృత్వ పాలకులపై చారిత్రాత్మక పోరాటాల్లో చేతులు కలిపిన అరబ్‌ దేశాల కార్మికులకు, ప్రజలకు సిఐటియు అభినందనలు తెలిపింది. ఉత్తర ఆఫ్రికా, మద్య ప్రాచ్య దేశాలు కేంద్రంగా ఈ పోరాటాలు జరిగాయి. అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద శక్తుల రెండు ముఖాల నయ వంచన పూర్తిగా బట్టబయలైంది. అమెరికా, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యం, పౌరహక్కుల పేరుతో కుట్రలుపన్నుతూ తమకు దాసోహం అనని సిరియా, ఇరాన్‌ దేశాల్లో అల్లర్లను రెచ్చగొడుతున్నాయి. అదే సమయంలో బహ్రెయిన్‌, యెమెన్‌, జోర్డాన్‌, మొరాకో, సౌదీఅరేబియా మొదలైన దేశాల్లో సామ్రాజ్యవాద అనుకూల నియంతృత్వ ప్రభుత్వాలు హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిపై అమానుష అణచివేత చర్యలకు, అత్యాచారాలకు పాల్పడుతుంటే వాటికి అమెరికా, దాని మిత్రదేశాలు బహిరంగంగా వత్తాసు పలుకుతున్నాయి. ఆ దేశాలకు ఆర్థిక, సైనిక పరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమెరికా వూహాత్మక ప్రాంతాల్లో, చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న అరబ్‌ దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో పోరాటం చేస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని అంతర్జాతీయ కార్మికోద్యమానికి మే దినోత్సవం సందర్భంగా సిఐటియు విజ్ఞప్తి చేసింది. ఈ దేశాల్లో తమకు అనుకూలమైన నయా ఉదారవాద కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటుచేసి ఆధిపత్యం చెలాయించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్న అమెరికా, దాని యూరోపియన్‌ మిత్రపక్షాల సామ్రాజ్యవాదాన్ని గట్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.
లాటిన్‌ అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు
సామ్రాజ్యవాదశక్తులు వెనకడుగు వేసే విధంగా దశాబ్దాలపాటు అంకితభావంతో, మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహిస్తున్న లాటిన్‌ అమెరికా దేశాల కార్మికులకు సిఐటియు శుభాకాంక్షలు తెలియజేసింది. వెనిజులా, బొలీవియా, ఈక్వెడార్‌, నికరాగువా, మరికొన్ని లాటిన్‌ అమెరికా దేశాల్లో వామపక్ష అనుకూల రాజకీయ శక్తులు సాధించిన విజయాలు, నయా ఉదారవాద విధానానికి ప్రత్యామ్నాయ పంథాను అనుసరించేందుకు ఆయా దేశాలు చేస్తున్న కృషి అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురుదెబ్బ వంటివనడంలో సందేహం లేదు. 33 లాటిన్‌ అమెరికా,కరీబియన్‌ దేశాలు వెనిజులాలో జరిగిన సమావేశంలో కమ్యూనిటీ ఆఫ్‌ లాటిన్‌ అమెరికన్‌, కెరీబియన్‌ స్టేట్స్‌ పేరుతో ఒక ప్రాంతీయ వేదికను ఏర్పాటు చేయడం అత్యంత కీలక పరిణామం. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సోషలిస్టు క్యూబా ఆశాకిరణం.
2012 మే దినోత్సవ ప్రాధాన్యతలు
ఈ మే దినోత్సవం నాడు అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి కింద సామ్రాజ్యవాద నయా ఉదారవాద రాజకీయ-ఆర్థిక విధానాల రూపంలో పెట్టుబడి వ్యవస్థ పాశవిక స్వరూపాన్ని 2012 మే దినోత్సవం బట్టబయలు చేసింది. ఈ వ్యవస్థ ఒకవైపు అసమానతలు, వివక్షతలు, పేదరికం, నిరుద్యోగాన్ని పెంచుతోంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి వేగంగా పడిపోతోంది.. మరోవైపు ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టు బడులకన్నా స్పెక్యులేటివ్‌ పెట్టుబడులు ప్రాబల్యం వహిస్తున్నాయి. ఫలితంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా లాభాలు గరిష్ట స్థాయిలో త్వరితగతిన పోగుపడుతున్నాయి.ఈ వైఖరి ముందెన్నడూ లేని స్థాయిలో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. సామ్రాజ్యవాద శక్తులకు ప్రధాన కేంద్రమైన అమెరికాలో ఈ సంక్షోభం తలెత్తింది. ఆ తరువాత మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచానికి విస్తరించింది. ఈ సంక్షోభ భారాన్ని కార్మికులపైకి బదలాయిస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టడం, వేతనాలపై కోత విధించడం వంటివి జరుగుతున్నాయి. ప్రజలు ఈ లూటీని గట్టిగా వ్యతిరేకిస్తునారు. తమ హక్కులపై, జీవనాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మొత్తం యూరోపియన్‌ దేశాల్లో కార్మికులు సమ్మెలు, ఇతర కార్యాచరణలకు పూనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉద్యమం తరహాలో మొత్తం ప్రపంచంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అమెరికాలో గత సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం 75 నగరాలకు విస్తరించింది. ఆ తరువాత ప్రపంచంలోని నలుమూలలా వేలాది నగరాల్లో ఈ ప్రదర్శనలు విస్తరించాయి. ఈ ఉద్యమంలో ''90 శాతం - ఒక శాతం'' నినాదం ముందుకు వచ్చింది. ''స్పెక్యులేటర్లకు బిలియన్లు, ప్రజలకు పెన్నీలు'' అనేది ఈ సందర్భంగానే వచ్చిన మరో నినాదం.
స్వచ్ఛందంగా జరిగే ఇటువంటి ప్రదర్శనలను సిఐటియు ఆహ్వానిస్తున్నది. కార్మికుల సంఘటిత ఉద్యమంలో ఈ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొనాలని 2012 మే దినోత్సవం సందర్భంగా సిఐటియు పిలుపునిస్తోంది. కార్మికులందరూ అంకితభావంతో అందుకు కృషి చేయాలి.
భారత్‌లో దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని కాపాడే ధ్యేయంతో , అన్ని సెక్షన్ల కార్మికులు, శ్రమజీవుల మౌలిక సామాజిక - ఆర్థిక హక్కులను సాధించే లక్ష్యంతో కార్మిక సంఘాలు సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించిన గర్వించతగ్గ సెమ్మ చేసిన నేపథ్యంలో వస్తున్న మే దినోత్సవం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 1991లో నయా ఉదారవాద విధానాలు ప్రవేశపెట్టిన తరువాత 14వ సారి సార్వత్రిక సమ్మె అత్యంత విజయవంతమైంది. యుపిఎ-2 ప్రభుత్వం నయా ఉదారవాద అజెండాను దూకుడుగా అనుసరిస్తోంది. చారిత్రాత్మక సమ్మె తదనంతర చర్యగా కార్మిక సంఘాల మధ్య అట్టడుగు స్థాయిలో ఐక్యతను పటిష్టం చేసి కార్మికుల హక్కుల పరిరక్షణలో మిలిటెంట్‌ పోరాటాలను నిర్వహించాలని కార్మికులకు సిఐటియు పిలుపునిస్తోంది. ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిస్తున్నది.
ప్రజాతంత్ర ఉద్యమంపై దాడికి నిరసనగా పోరాటానికి సంఘీభావం
అంతర్జాతీయ కార్మిక సంఘీభావ దినోత్సవం కార్మికులపై, ప్రజాతంత్ర ఉద్యమంపై దాడులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తున్నది. పెట్టుబడిదారీ యజమాన్యాలు, వాటి ఆదేశాలతో వ్యవహరించే ప్రభుత్వం కార్మికులపై మరింత దూకుడుగా వ్యవహరించి కార్మికులను, కార్మిక సంఘాలను అణచివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును హరించేందుకు కార్మిక సంఘాల నాయకులు, అందులో చేరేవారిపై వేధింపులకు పాల్పడుతున్నది. నాయకులు, కార్మికులపై క్రిమినల్‌ కేసులు బనాయించింది. హర్యానాలో మారుతీ సుజుకీ కార్మగారం, తమిళనాడులో హుండారు, కర్నాటకలోని వోల్వో, యానాంలోని రీజెన్సీ కొన్ని ఉదాహరణలు మాత్రమే.
బెంగాల్‌లో ప్రజలపై దాడులు
2011లో అసెంబ్లీ ఎన్నికలు, టిఎంసి- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం పశ్చిమ బెంగాల్‌లో కార్మిక సంఘాలు, ప్రజాతంత్ర హక్కులపై దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. కార్మిక సంఘాలపై తీవ్రస్థాయిలో భౌతిక దాడులు జరిగాయి. ముఖ్యంగా సిఐటియు, ఇర కార్మిక సంఘాలపై, విద్యార్థి, మహిళా, చిన్న రైతులు, యువజన సంఘాలపై ఇవి ఎక్కువగా కేంద్రీకరించబడ్డాయి. కార్మిక సంఘాల కార్యాలయాలకు నిప్పుపెట్టడం, అంగన్‌వాడీ కార్యకర్తలతో సహా మహిళలపై దాడులకు దిగడాం, వారిని చిత్రహింసలకు గురిచేయడం నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటివరకు 58 మంది ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను పొట్టన పెట్టుకున్నారు.
లెఫ్ట్‌ ఫ్రంట్‌ పాలనలో ఉన్న త్రిపురలో కూడా ఇటువంటి దాడులు సాగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2013 ప్రారంభంలో జరగనున్నాయి. కార్మిక ఉద్యమం బలంగా ఉన్న కేరళలో కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి.
2012 మే దినోత్సవం పిలుపు
నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా, తమ హక్కులు, జీవన ప్రమాణాలను రక్షించుకునేందుకు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు తన సంపూర్ణ సంఘీభావాన్ని సిఐటియు వ్యక్తం చేస్తున్నది. కార్పొరేట్‌ శక్తుల్లో బందీగా ఉన్న అధికార పార్టీ కార్మికుల హక్కులు, జీవనాలపై సమిష్టి పోరాటాలు జరిపేందుకు కార్మికుల మధ్య సంపూర్ణ ఐక్యత నెలకొనాలని సిఐటియు అన్ని కార్మిక సంఘలకు విజ్ఞప్తి చేసింది. కార్మికుల దైనందిన కార్యకలాపాల విషయంలో కూడా సంఘీభావ చర్యలు పాటించాలి. ఇది మే దినోత్సవ పిలుపు
కార్మికులు అప్రమత్తంగా ఉండి విచ్ఛిన్నకర శక్తులపై పోరాటం చేయాలి. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్న శక్తులపై నికరంగా పోరాటం కొనసాగించాలి.
వర్థిల్లాలి మేడే! అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి సంఘీభావం!
పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద వ్యవస్థ నశించాలి!
నయా ఉదారవాద సామ్రాజ్యవాద, ప్రపంచీకరణ నశించాలి!
(ఎల్లుండి మేడే సందర్భంగా...)

Prajashakti News Paper Dated : 29/04/2012 

No comments:

Post a Comment