Tuesday, April 17, 2012

అంబేద్కర్ విగ్రహ రాజకీయాలు - సుజాత సూరేపల్లిఅంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్టించాలని ఒక అగ్రకుల నాయకురాలు అనుకోవడం, దానికి అనుకున్నదే తడవుగా భిన్న పార్టీలకు చెందిన దళిత నాయకులు మూకుమ్మడిగా సానుభూతి తెలపడం చాలామందికి వింతగా అనిపించకపోవచ్చు. కాని ఒక పక్క సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి, సమాజాన్ని మార్చే కార్యక్రమంలో తెలంగాణ 'చె' అని కీర్తించబడుతున్న జార్జిరెడ్డి నలభయ్యవ వర్ధంతి జరుపుకుంటుంటే, మరో వైపు నలభై ఎనిమిది గంటల దీక్షని ప్రకటించడం విచారకరం. 

విగ్రహాలు కాదు నా ఆశయాలను, సిద్ధాంతాలను ఆచరణలో పెట్టండి అని మొత్తుకున్నా అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ప్రతిన పూనినవారు, తెలంగాణ పోరాటాల గడ్డ ఒస్మానియా కాంపస్‌లో జార్జిరెడ్డిని పొట్టన పెట్టుకున్న శక్తులు, వీరిద్దరూ కలిసి రాబోయే తెలంగాణలో తమ తమ పాత్రలను పదిలంగా ఉంచుకోవడానికి జరుపుతున్న హైడ్రామా ఇదని దళిత, ప్రజాస్వామిక మేధావుల అభిప్రాయం. తెలంగాణలో రోజుకొక్క బిడ్డ తమ ప్రాంతం కోసం ప్రాణాలను బలి పెడుతుంటే ఆ విషయం పక్కకు పెట్టి, అంబేద్కర్‌ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే దళితుల వోట్లు దండిగా పడతాయని హటాత్తుగా విగ్రహోద్యమానికి తెర తీసిన నాయకురాళ్లకు, వారి వెనుక ఉన్న నాయకులకు జోహార్లు. మరి ఆత్మహత్యల ఉద్యమం ఎవరు చేస్తారో? రేపటి తెలంగాణలో ఎవరు నిలబడాలనో! 

ఇప్పుడెందుకు జార్జిరెడ్డి ముఖ్యుడయ్యాడు? ఈ తెలంగాణ ఉద్యమం జార్జిరెడ్డి లాంటి వాళ్లని తయారు చేసుకొని ఉంటే కనీసం ఇన్ని వందల బడుగు, బలహీన వర్గాల యువత బతికి ఉండేవారు కదా? ధైర్యం, పట్టుదల, తెలివి తేటలు ముఖ్యమని చెప్పిన జార్జిలను ఇప్పుడున్న హిందుత్వ శక్తులు బతకనిస్తాయా? చావు మార్గం చూపించి, చస్తేనే తెలంగాణ వస్తుందని నమ్మబలికిన నాయకులు ఇప్పుడు రోజుకొక్క పానం పోతున్నా కూడా మౌనంగా ఉండడం ఉద్యమ ద్రోహమే. 

అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఈ హత్యలకు ముమ్మాటికి బాధ్యులే. చుక్క రక్తం కూడా పడకుండా దశాబ్దం పాటు ఉద్యమం నడిపామని చెప్పుకుంటున్న నాయకులకి, మనుషుల శవాల గుట్టలు పడుతున్నా కూడా కనిపిస్తలేవా? విగ్రహాలు కూల్చివేస్తున్నా, నిగ్రహాలను కాలరాస్తున్నా, ఇవ్వాల్టికి కూడా దొరలు భూముల మీద పడి, బతుకులను దోచుకతింటున్నా పలకరించని వాళ్లు అంబేద్కర్ విగ్రహాలను పెట్టమని ఎలా అడుగుతారు? దళితులపై, ఆదివాసీలపై, మైనారిటీలపై వివక్ష లేని ప్రాంతం గ్రామం ఏదైనా ఈ దేశ భూభాగం మీద ఉన్నాదా? అంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకపోవడం అంటే, ఇక్కడ ఉన్న అసమానతలని రూపుమాపడం, కుల వ్యవస్థని కూలద్రోయడం, అందరూ ఆత్మగౌరవంతో బతకడం. అంతేకాని ఎలక్షన్ల స్టంట్‌కోసం, కులం కనపడకుండా అమాయక, అత్యుత్సాహ దళితులను ఆసరాగా తీసుకుని అపర నాయకులం అయిపోదామనుకోవడం మూర్ఖత్వమే. 

నిజంగా అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాటం చేసే నాయకులకి అంబేద్కర్ గురించి అన్నీ తెలవకపోయినా, అంత పెద్ద మనసున్నందుకు మా చిన్న కోరికలు కొన్ని- ఇవి కనుక మీరు పరిష్కరిస్తే మొత్తం సమాజం మీ వెంటే ఉంటది. ఇది అసాధ్యమైనది కాదు, మీరు కోరుకుంటున్న అంబేద్కర్ అసెంబ్లీలో మనశ్శాంతిగా ఉండాలంటే చేయాల్సిన పనులు, తెలంగాణ పార్టీగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే, మీరు చేయగలిగిన పనులు: 

1. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో సెజ్జు పేరిట, అభివృద్ధి అని పోలేపల్లి భూములు గుంజుకున్నరు. నేటికి 60 మంది పానాలు గాల్లో కలిసిపోయాయి, దిగులుతోని, గుండెలవిసి. అందులో అందరూ దళితులూ, బడుగులూ, ముస్లిం మైనారిటీలే. ఉద్యమాలు చేసి చేసి అలిసిపోయారు. చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 90 వేల పై చిలుకు వోట్లు సాధించుకున్నారు. ఈ వోట్లే గనుక చీలకపోతే టీఆర్ఎస్ వోడి పోయేది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ భూములు ఇప్పించమని దీక్షలు, యజ్ఞాలు చేయండి, ఈ బడుగులకి అండగా నిలబడండి. 

2. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, పాలమూరు, వలసలతో విలవిలలాడుతున్నది. చెంచులు టైగర్ ప్రాజెక్టులు అని, మైనింగ్ అని తరిమివేయబడుతున్నారు. వారికి చేయూతనివ్వండి. మీ సాక్షిగా ముస్లిం అభ్యర్థి ఎన్నికలలో నిలబడి ఓడిపోయినాడు సారీ ఓడించబడ్డాడు. 

3. ఖమ్మం జిల్లా పోలవరం ప్రాజెక్టులో 300 ఆదివాసీ గ్రామాలు, అరుదైన కోయ జాతి అంతరించబడే ప్రమాదం ఉన్నది, అడవిని, బద్రాద్రిని, ఆదివాసీల సంస్కృతిని కాపాడండి. 

4. అడవులకి, ఆదివాసీలకి నిలయమైన ఆదిలాబాదు ఒక వైపు గనులతో, ఇసుక తవ్వకాలతో, అతలాకుతలం అయితున్నది. దానికి తోడూ కవ్వాల్ పులుల ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం వేలమంది ఆదివాసీలను పొట్టనబెట్టుకోబోతున్నది. వాళ్లని కాపాడండి. అటు బీజేపి గెలిచిందో లేదో, మతోన్మాద శక్తులు విజృంభిస్తూనే ఉన్నాయి. ముస్లింలకి రక్షణ కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ముస్లిం సోదరులకి అండగా నిలబడి, హిందుత్వ శక్తులను వోడించండి. ఇలా కొన్నింటినే ప్రస్తావిస్తున్నాను. మీరు కోరుకున్న అంబేద్కర్ ఆశయాలు ఇవే, ఒక్క విగ్రహం పెడితే వచ్చే గౌరవం ఈ పనులు చేస్తే వెయ్యి రెట్లు వస్తుంది. 

మా దౌర్భాగ్యం ఏమిటంటే, మీరు 'డి కాస్ట్' అంటే కులంను వదులుకోగలుగుతున్నారు (కనీసం భ్రమింపజేస్తున్నారు), గొడ్డు మాంసం తింటారు, మా ఇండ్లల్లోకి దేవుళ్లను తీసుకొస్తారు, స్వయానా తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారినే తెస్తరు, మీరు మహానుభావులైతారు, మేము మీకు చప్పట్లు, జేజేలు కొడుతుంటాం. ఊరు చివర, వెలివేసిన బతుకు అష్టకష్టాలు పడి మోసి, నాలుగు ముక్కలు చెప్పి మిమ్మల్ని అన్ని విధాలుగా దాటిపోయినా మాకు అగ్రకులత్వం రాదు. మాకు మీరు జేజేలు కొట్టడం అటుంచి, చితిమంటల్లో విసిరేస్తారు. ముక్కల కింద నరికి మూటలు కడతారు. కారంచేడు చేదు అనుభవాలు ఇంకా కండ్ల ముందు కదలాడతానే ఉన్నాయి. 

ఊరు పేరు మారి, వేషం, భాష మార్చి మళ్లా మా ముందుకొచ్చి నిలబడ్డారు. మా విగ్రహాలనే, మా నాయకులనే ప్రతిష్టించమని కోరుతున్నారు. మీరు మహానుభావులు! మిమ్మల్ని మోస్తున్న మేము కారణ జన్ములం! అసలు అంబేద్కర్‌ని అసెంబ్లీలో పెట్టడం అంటే ఆయనని మళ్లీ చంపడమే, అక్కడ ప్రతి నిత్యం బడుగు, బలహీన వర్గాల వధ జరుగుతూనే ఉంటుంది. మా నేతలెవరూ నోరు మెదపని చోటు, మాకు ఏమి వొరుగని చోటు. మా తలరాతలు మార్చనిచోటు, ఇన్ని చూస్తూ బాబా సాహెబ్ మౌనం గా ఉండాలేమో. అయినా ప్రేమతో ఎవరైనా అంబేద్కర్‌ని కొలవచ్చు. 

కాని ఆయన ఆలోచనా విధానాలను ముందు ఆచరించి ఆ తరువాత విగ్రహాల జోలికి పొండి. మీకు మేము గ్యారంటీ, మీ వోట్లు ఎటూ పోవూ. ఒక అంజమ్మ, చుక్కమ్మ, అయిలమ్మ కూచుంటే రాలనంత సానుభూతి మీకు దక్కింది. దానికి కారణం, మీ కులం, మీ వారస త్వం, మొత్తం మీడియాని మీ చుట్టూ తిప్పింది. అదే మా నళినీ డిఎస్ పి పదవి వొదులుకొని ఢిల్లీకి పోయి పార్లమెంట్ కాడ తెలంగాణ కోసం దీక్ష చేస్తే పట్టించుకున్నది ఎవరు? నళినికి కులం-వారసత్వం లేదు. లోకం పోకడ తెల్వది. అవును, శంకంలో పోస్తేనే తీర్థం. దొరలు చేస్తేనే యుద్ధం, ఉద్యమం, పోరాటం. పోలేపల్లి ప్రజలు చేసే ఆకలి పోరాటా లు, వాకపల్లి ఆత్మ ఘోషలు, కరీంనగర్ గుట్టల పోరాటాలు, పోలవ రం, కవ్వాల్, చెంచుల పోరాటాలు, దళితుల ఊచకోతలు ఏవి కూడా ఎవరికీ తెలియని అంటరాని వసంతాలు. వాళ్లకి (అగ్ర) కులం లేదు! చివరికి మీరే గెలిచారు! మేము మా తిండి, గొడ్డు మాంసం తినడానికి కూడా కొట్లాడాలె.. 

మాకు రెడ్ కార్పెట్‌లు వేసి ఎవరూ స్వాగతించరు. మా బతుకులు నిత్యం గాయాల గేయాలే! దళిత, పీడిత వర్గాల, ప్రజాస్వామిక మేధావుల్లారా! మాకు విగ్రహాలొద్దు, అందునా మీరు కొట్లాడి సాధించే విగ్రహాలు అంతకన్నా వద్దు, మా బతుకులు మాకు కావాలె. మా చరిత్ర, సంస్కృతీ, మా ఆత్మగౌరవం మాకు కావాలె. ఇవన్ని కావాలంటే మాకు అధికారం కావాలె. ఆలోచించండి ఒక్కసారి. న్యాయం మాట్లాడండి ఒక్కసారైనా!

- సుజాత సూరేపల్లి

Andhra Jyothi News Paper Dated : 17/04/2012 

No comments:

Post a Comment