Saturday, April 21, 2012

చరిత్ర చెక్కిలిపై సంతకం - కె. శ్రీనివాస్చనిపోవడానికి చాలా రోజుల ముందటి నుంచి కె.జి. సత్యమూర్తిగారు స్ప­ృహలో ఉన్నప్పటికీ స్మారకంలో లేరు. ఆయనను పలకరించడానికి కుటుంబసభ్యులు రకరకాల ప్రశ్నలతో ప్రయత్నించేవారు. చాలా వాటికి ఆయన సమాధానం చెప్పలేకపోయేవారు. ఒకసారి, వర్తమాన రాజకీయాల గురించి ఆయనను అడిగారట. 'ఎన్నికలు వస్తున్నాయట, ఓటెవరికి వేయాలి, చిరంజీవికా, చంద్రబాబుకా' అన్నది ప్రశ్న. 'ఎందుకు, సుందరయ్య లేడా?' అని సత్యమూర్తి ఎదురు ప్రశ్న వేశారట. 

పద్ధెనిమిదో తారీకునాడు విజయవాడలో కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో సత్యమూర్తి భౌతిక కాయం సమక్షంలో జరిగిన నివాళిసభలో ఆయన సోదరి మంజులాబాయి ఆ ఉదంతాన్ని చెప్పారు. దాన్ని విన్న తరువాత అనివార్యంగా శ్రీశ్రీ గుర్తుకు వచ్చారు. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు శ్రీశ్రీ 'స్పెయిన్ నియంత ఎవరు?' అని ప్రశ్నించారట. ఎప్పటినుంచో ఆపేరు గుర్తుకు రాక ఆయన ఆ ప్రశ్న వేసి ఉంటారు. జీవితాంతం సాధకులుగా గడిపినవారు చరమదినాలలో, అంతిమక్షణాలలో ఏ కాలాలలో, ఏ విషయాలలో తమ మనస్సులను నిమగ్నం చేసుకుని ఉంటారో? 

తన భావాలను, సాహిత్యసంస్కారాన్ని అమితంగా ప్రభావితం చేసిన 1930ల నాటి స్పెయిన్ అంతర్యుద్ధపు రోజులలోనే శ్రీశ్రీ మనసు కొట్టుకులాడుతుంటే, మార్క్సిస్టు లెనినిస్టు విప్లవకారుడిగా ఇంకా పరిణమించని, తన వ్యక్తిత్వానికి బీజాలు వేసిన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రోజులలో సత్యమూర్తి ఎందుకో పచార్లు చేస్తున్నారు. ఒక సుదీర్ఘ జీవితం, సాయుధ స్వాప్నిక జీవితం, కవిత్వపు జవనాశ్వం మీద పరుగులు తీసిన జీవితం, ఒడిదుడుకుల జీవితం- అన్నిటికి ముగింపు చెప్పి, గాజుపెట్టెలో విశ్రమిస్తున్న సత్యమూర్తిని చూసినప్పుడు అవిశ్రాంత చరిత్ర వలె కనిపించారు. 

ఆయనలో సుడులు తిరిగిన సంచలనాలతో, సదసదత్సంశయాలతో, రెక్కలు తొడుక్కున్న కొత్త ఆలోచనలతో, లోలోపల సాగిన వైఫల్యసాఫల్యాల ఆత్మసమీక్షణతో- ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న సమూహాలకు సంబంధం ఉన్నదా అన్న అనుమానం కలిగింది. ఆయనతో గతానుబంధాలు కలిగిన సహచరులు, కుటుంబసభ్యులు తప్ప చివరిదాకా ఉన్న వారెవరూ లేరు. అభిమానులు తప్ప అనుయాయులెవరూ లేరు. వారిలోనూ, దళితోద్యమంతో ఆయనతో కలసి నడిచినవారే ప్రధానంగా కనిపించారు. అంతిమయాత్రలో నీలిజెండాలు అనేకం రెపరెపలాడితే, ఒకటో రెండో ఎర్రజెండాలు వెంట నడిచాయి. 

మనిషి చనిపోగానే, అంచనాలకు పాల్పడడం అమానుషంగా కనిపిస్తుంది. నిజమే, చనిపోయిన మనిషి ఇక ఏ తప్పూ ఒప్పూ చేయడు కాబట్టి, అంతా గతమే కాబట్టి, ఒక సమీక్షకు అవకాశం ఉంటుంది. అయినంత మాత్రాన, అంతిమయాత్రకంటె ముందే అంతిమ నిర్ధారణలకు రావలసిన అవసరం ఉన్నదా? కొన్ని స్థూల ప్రతిపాదనలు మాత్రం చేయడంలో తప్పు లేదు. విస్తరించడానికి, సవరించుకోవడానికి ఆస్కారం వదిలి కొన్ని సూత్రీకరణలనూ చర్చించవచ్చు. కానీ, వెంటనే ముద్రవేసి, సీల్‌చేసి అటకెక్కించడానికి సాహసించకూడదు. ఆకాశానికెత్తే ప్రశంసలయినా, తక్కువ చేయాలనుకునే ప్రయత్నాలయినా- ఈ పరిమితులను గుర్తుంచుకోవాలి. 

మనిషి లేని లోటు క్రమక్రమంగా తెలిసివస్తుంది. బతికి ఉన్నప్పుడే అవశిష్టంగా మిగిలిన మనిషి నిష్క్రమణ సహజంగా కనిపిస్తుంది. ఎనభైఏండ్ల జీవితం గడిపిన సత్యమూర్తి భౌతికంగా చెందింది కాలధర్మం కావచ్చు. ప్రభావం వేయగలిగిన కార్యాచరణ నుంచి ఆయన చాలా కాలం కిందటే ఉపసంహరించుకుని ఉండవచ్చు. కానీ, సత్యమూర్తి కేవలం ఒక సంస్థలోనో, అనేక సంస్థల్లోనో భౌతికమయిన ఆచరణ చేసిన వ్యక్తి మాత్రమే కాదు, అతను శివసాగర్ కూడా. అతని ఆలోచనలు, ఊహలు, ఉద్వేగాలు- అన్నీ అక్షరాల్లో సురక్షితంగా ఉన్నాయి. అవి దూరాన్ని కాలాన్ని అధిగమించి తరతరాలను పలకరిస్తాయి. కాలనాళికలో భద్రపరచిన జీవకణాలు అవి, మళ్లీ మళ్లీ అవి ప్రాణం పోసుకుంటాయి. 

విప్లవకారుడిగా, విప్లవకవిగా శివసాగర్ రాసిన కవిత్వం, వ్యాసాలు నిశ్చలనిశ్చిత భావాలతో ఉండి ఉండవచ్చు, అందులో సంశయాలకు సందేహాలకు ఆస్కారం తక్కువ కావచ్చు. ఆ నిబద్ధ అక్షరం సైతం అమోఘమైన సృజనాత్మకతతో, జీవకళతో అలరారింది. ఆ ఘట్టం గడచివచ్చిన తరువాత అతను అంతటి పరిణామంలో గొప్ప కవిత్వం రాసి ఉండకపోవచ్చు. కానీ, అందులో ఎంతో మథన, ఎంతో తపన. నక్సల్బరీతరం కవులను అందుకోవాలని శ్రీశ్రీ చేసిన ప్రయత్నం వంటి ప్రయత్నం, దళితోద్యమ సృజనాత్మకతను అందుకోవడానికి శివసాగర్ చేశాడు. శ్రీశ్రీ కంటె ఎక్కువ విజయం పొందాడు. తన సొంత ముద్ర కలిగి 

ున సాహిత్యప్రేరణలు ఆధునికవాద ప్రగతిశీల సాహిత్యంలో ఉన్నాయి. గురజాడ అంటే శివుడికి పిచ్చి. ఆయన ఒక కుమారుడికి సౌజన్యరావు పేరు పెట్టుకున్నాడు. ముత్యాలసరాలను రాశాడు. కన్యాశుల్కాన్ని వర్తమాన వ్యవస్థకు అనువర్తిస్తూ దీర్ఘకవిత రాశాడు. అట్లాగే, శ్రీశ్రీ ప్రభావం అతని మీద అమితంగా కనిపిస్తుంది, గేయాల్లోనూ వచనకవిత్వంలోనూ. 1960లలో వచనకవిత్వోద్యమం తరువాత సీవీ, దిగంబర కవులు తీర్చిదిద్దిన వచనకవిత్వ శైలి ప్రభావమూ శివసాగర్‌మీద ఉన్నది. శివసాగర్ దళితవిముక్తివాదాన్ని స్వీకరించినప్పుడు, అతని స్థాయి, పరంపర ఉన్న సీనియర్ కవి ఎవరూ ఆ శిబిరంలో లేరు. సత్యమూర్తి దళితరాజకీయాల స్వీకరణ- దళిత ఉద్యమానికి గొప్ప స్థాయిని, ప్రతిష్ఠను అందించింది. 

విప్లవపార్టీలో సత్యమూర్తికి వచ్చిన సమస్యలేమిటో, లేదా ఆయనతో వారికి వచ్చిన సమస్యలేమిటో, వాస్తవంగా జరిగిందేమిటో, ఆయన బాహాటంగా చెప్పిన అంశాలేమిటో- ఆయన సాధారణ అభిమానులకు పెద్దగా ముఖ్యమైన విషయాలు కావు. పైకి వ్యక్తమయ్యే అంశాలేమయినప్పటికీ, ఏదో ఒక వైరుధ్యమూ ఘర్షణా ఉన్నాయన్నది వాస్తవం. ఉద్యమంలోని కొందరు వ్యక్తుల మీద ఆయన ప్రదర్శించిన వ్యతిరేకత, ఉద్యమం మీద చూపలేదు. 

జీవితంలో అధికభాగం తనకు మార్గదర్శిగా ఉన్న మార్క్సిజాన్ని వదలడానికి ఎన్నడూ ఆయన సిద్ధపడలేదు. విప్లవ కార్యాచరణానుభవం ఆయనను అనంతరకాలంలోనూ ప్రభావితం చేస్తూనే ఉన్నది. గత ఇరవయ్యేళ్ల కాలంలో ఆయన అనేక సంస్థలను, పార్టీలను, శిబిరాలను వదిలివెళ్లడానికి, లేదా వారే ఆయనను వదలడానికి సత్యమూర్తి మార్క్సిజం పట్టింపు ఒక కారణమా- అన్వేషించాలి. 

దళిత శిబిరాలలో పదేళ్లు పనిచేసిన తరువాత కూడా ఆయన మరోసారి మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ సారథ్యాన్ని, అజ్ఞాత జీవితాన్ని స్వీకరించడానికి కారణం ఏమిటి- కుల, వర్గ వాదాలను సమ్మిళితం చేయడంలో ఆయన ప్రయత్నాలు విజయవంతం కాలేదా, స్వీకరించేవారు లేకపోయారా?- అన్నదీ మరో ప్రశ్న. శివసాగర్ కవిత్వజీవితంలో చివరి దశాబ్దంలో ఆయన రాసిన కవితలను పరిశీలిస్తే, అటూ ఇటూ ఉండడానికి ఆయన చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. జీవితం ఆయనకు మరో యవ్వనాన్ని ఇస్తే, ఏమి చేసి ఉండేవాడు? అని కుతూహలం కలుగుతుంది. 

ఒక ఉన్నత సమాజాన్ని ఆవిష్కరింపజేయడానికి జీవితాంతం పనిచేసిన మనిషి సత్యమూర్తి. ఆ పనిలో భాగంగా వివిధ మార్గాలను అన్వేషించాడు. చివరకు దేనితోనూ పూర్తి సంతృప్తి సాధించినట్టు కనిపించదు. కానీ, ఆయన తొలి, మలి దశల్లో వేసిన, నడచిన మార్గాలు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నాయి, ఆయనను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా.

- కె. శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated : 22/04/2012 

No comments:

Post a Comment