Wednesday, April 18, 2012

పెద్దకూర పండుగ రోజున.. - కడియం రాజుగత కొన్ని నెలలుగా బుల్లెట్ల చప్పుళ్ళు లేకుండా, బాష్పవాయు గోళాల వాసనలు లేకుండా, పోలీసుల కవాతులు లేకుండా, పరీక్షల కోసం అహోరాత్రులు చదువుకుంటున్న మాకు పది పదిహేను రోజులుగా ఎందుకో చదువు మీద ధ్యాస తప్పుతుంది. మా మనస్సు ఎందుకో కీడు శంకిస్తోంది. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనన్న అనుమానం కలుగుతుంది. మా అనుమానాలు నిజమయ్యాయి. ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఉస్మానియా క్యాంపస్‌లో అరాచకం రాజ్యమేలింది. ఎలాంటి శబ్దం రాకుండా నోటి లోపల చదువుకునే మేము రణగొణ ధ్వనులు చేయాల్సి వచ్చింది. మా తోటి మిత్రుల ఆర్తనాదాలు వినాల్సి వచ్చింది. నిశ్శబ్దం బద్ధలైంది. గొడ్డు కూర మాటున రచించిన విధ్వంస రచన ప్రారంభమయింది. 


ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం జరిగిన సంఘటనలు, ఆ సంఘటనలు జరగడానికి ముందు 15 రోజులుగా జరుగుతున్న వ్యూహాలు, ప్రచారాలు, ప్రణాళికలు పక్కాగా అమలుయ్యాయి. బ్రిటీష్ కాలపు విష సంస్కృతికి నకళ్ళుగా నృత్యం చేశాయి. చేశాయని అనటం కంటే చేయించారంటే బాగుంటుందేమో? అదే కాలపు ఆనవాళ్ళు, అదే సంస్కృతి, అదే కుట్ర! అమలు పరిచింది మాత్రం కుహనా భారతీయ మేధావులు. ఓ ప్రక్కన తెలంగాణ మొత్తం విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో శోకసంద్రంలా మారి దుఖిస్తుంటే ఈ గొడ్డుకూర పండుగ ఎందుకు? విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? గొడ్డుకూర పేరిట పండుగలు చేసుకునేంత ఆనందదాయక సమయమా ఇది? తల్లిదండ్రులు గర్భశోకంతో కుమిలిపోతుంటే మీరు పండుగలకు పిలుపునివ్వటం ఎక్కడి సంస్కృతి, సంప్రదాయం? తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్ర ఇది. ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కుట్ర ఇది. అమ్ముడుపోయిన కొందరు వ్యక్తులు ఆడుతున్న విద్రోహ కుట్ర ఇది. సోదరుల్లా కలిసి ఉన్న విద్యార్థుల్ని విడగొట్టేందుకు జరిగిన పండుగ ఇది. సహేతుక సమాధానాలు లేని ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు వేదికే ఈ గొడ్డుకూర పండుగ. గొడ్డు కూర తినడం నేరమేమీ కాకపోవచ్చు. ఎవరి అలవాట్లు వారివి. గొడ్డుకూర తిన్నవారిని మేము వ్యతిరేకించడంలేదు. ఎవరు ఏం తింటున్నారన్నది ముఖ్యం కాదు. ఎవరు ఎక్కడ? ఎలా? తింటున్నారన్నది ముఖ్యం. ఇళ్ళలో, హోటళ్లలో ఇష్టం వచ్చిన చోట తినవచ్చు. మెజార్టీ విద్యార్థులు వ్యతిరేకించే విశ్వవిద్యాలయంలో ఓ పది మంది కోసం బహిరంగంగా అందరూ తింటారు అన్న భావన కల్పించడం తప్పు. దళితులు, మొత్తం గొడ్డుకూర తింటామని ఆ పది మంది ఆ మొత్తం దళితులకు ప్రతినిధులమని ప్రకటించుకోవడం తప్పు. యూనివర్సిటీలో గొడ్డుకూర కార్యక్రమాన్ని వ్యతిరేకించిన వారిలో ఎక్కువగా దళితులు గిరిజనులు ఉన్నారన్న విషయం మరిచిపోకూడదు. సరిగ్గా ఇరవై రోజుల క్రితం, రోజూ లాగే వార్తా పత్రికల్ని తిరగేస్తుండగా ఓ వార్త కొత్తగా కనిపించింది. దాని సారాంశం ఏప్రిల్ 15న యూనివర్సిటీలో గొడ్డుకూర వండుకుని తింటాము ఎవరు వ్యతిరేకించినా దానిని ఆపబోము. ఇది చదివిన చాలా మంది విద్యార్థులు ఆశ్చర్యాన్ని, కొంత మంది ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. తరువాత వారం రోజులకు మా ప్రక్కనే ఉన్న ఇఫ్లూ యూనివర్సిటీలో గొడ్డుమాంసం ఆహారంగా ఎందుకు తీసుకోవాలి? అన్న అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భారత పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్) శాస్త్రవేత్తతో పాటు నలుగురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఇలాంటి చర్చలు, ప్రకటనల ద్వారా రోజూ ప్రచారం కల్పించడం మొదలైంది. కొన్ని పత్రికలు దీనిపై వ్యాసాలు రాసి ప్రాధాన్యం కల్పించాయి. కొన్ని పత్రికలు 'ఎబివిపి అడ్డుకుని తీరుతుంది, జరగనివ్వరు' అంటూ కల్పిత రాతలు రాశాయి. బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులకు ఆశించినట్లుగానే తగిన ప్రచారం లభించింది. విదేశీ మిషనరీల నుంచి భారీగా నిధులు అందుకుని ప్రచారం సాగించిన కొన్ని ఛానళ్ళు, పత్రికలు కూడా తమక్రతువు విజయవంతంగా సాగించాయి. 15వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి విద్యార్థి అడ్డుకోవాలని మాపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ నోట, ఈ నోట అనుకునే మాటలనే కొన్ని పత్రికలు, ఛానళ్ళు, ఎబివిపి అడ్డుకుంటున్నట్టు ప్రచారం సాగించాయి. వాస్తవంగా మేము ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించలేదు, సమర్థించనూలేదు. సరిగ్గా రెండు రోజుల ముందు అక్షర సత్యం పేరుతో వచ్చిన ఓ కరపత్రం క్యాంప స్‌లో అలజడి సృష్టించింది. గొడ్డు కూర పండుగ నిర్వహించే నర్మద హాస్టల్ ముట్టడి అంటూ చేసిన ప్రకటనతో ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ కరపత్రం ఎబివిపి ముద్రించిందని నిర్వాహకులు దుష్ప్రచారం సాగించారు. మళ్ళీ ఎబివిపికి ఆ కరపత్రానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ కరపత్రంలో గొడ్డుకూర పండుగ చేసుకునే నిర్వాహకులకు సంబంధించిన వాస్తవాలు, వారు సాగిస్తున్న అరాచకాలు కళ్ళకు కట్టినట్టు రాయడంతో సాధారణ విద్యార్థులు చైతన్యం అయ్యారు. కులాన్ని అడ్డం పెట్టుకుని విద్యార్థుల్ని వేధింపులకు గురిచేయడం, బలవంతపు వసూళ్ళకు పాల్పడడం, ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెట్టడం ఇలాంటి విషయాలన్నీ అందులో ప్రస్తావించడం జరిగింది. 15వ తేదీ ఉదయాన్నే నిద్రలేవక ముందే కొన్ని ఛానళ్ళ ఓ.బి. వ్యాన్లూ, నర్మద హాస్టల్ ముందు ఉండడం చూశాము. అంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని గాని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌గాని, కాల్చుకు చచ్చిన శవాల్ని గాని, ఏనాడూ చూపించని ఓ చానెల్ ఎందుకు అంత ఉత్సాహం ప్రదర్శిస్తుంది అని అందరం ఆశ్చర్యపోయాం. ఆ రోజు ఉదయం నుంచే గంట గంటకూ బులిటెన్‌లో ఏర్పాట్ల గురించి గొడ్డు మాంసం గొప్పదనం గురించి ధారావాహికలుగా చెబుతూనే ఉన్నారు. చాలా మంది విద్యార్థులు ఇదేమిటి ఇంతమందికి ఇష్టం లేకున్నా బలవంతంగా యూనివర్సిటీ అంతా గొడ్డుకూర తింటారని ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి దౌర్జన్యం? అంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు యూనివర్సిటీ అధికారులు ఆ కార్యక్రమం కోసం లైటింగ్ ఏర్పాట్లు, జనరేటర్ ఏర్పాట్లు ప్రారంభించారు. యూనివర్సిటీ అధికారికంగా ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూనే అనుమతి లేదంటూ బుకాయించింది. కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. సరిగ్గా అప్పుడే గొడవలు జరుగుతాయని ఉద్దేశ్యంతో పోలీసు బలగాలు యూనివర్సిటీ అన్ని దారులు మూసివేసి లోపలికి ఎవర్నీ అనుమతించకుండా తెలంగాణ ఉద్యమం నాటి దృశ్యాల్ని తలపించారు. సి.ఆర్.పి.ఎఫ్. దళాలు, పోలీసులు బలగాలను, నర్మద హాస్టల్ చుట్టూ మోహరించారు. నిర్వాహకులపై ఎవరూ దాడి చేయకుండా రక్షణ వలయంగా ఏర్పడ్డారు. అతిధులైన ప్రొఫెసర్లు పి.ఎల్.విశ్వేశ్వరరావు, భుక్యా భంగ్యా, గాలి వినోద్‌కుమార్, అన్సారీలు వచ్చి ఉపన్యాసాలు ప్రారంభించారు. సరిగ్గా అప్పుడే ఈ టూ హాస్టల్ నుంచి విద్యార్థులు బి. హాస్టల్ వద్దకు చేర్చుకుని అక్కడి నుంచి ఎ హాస్టల్, సి హాస్టల్ విద్యార్థులతో కలిసి నర్మద్ హాస్టల్ దగ్గరకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మోహరించిన పోలీసులు విద్యార్థులను ఆపారు. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరుగుతుండగానే నర్మద హాస్టల్‌లో ముందే సిద్ధం చేసిపెట్టుకున్న కంకర రాళ్ళతో బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు రాళ్ళ వర్షం కురిపించారు. ఒక్కసారిగా విద్యార్థులందరూ గొడ్డు మాంసం తింటున్న వారిపై దాడికి ఉపక్రమించారు. దీనితో పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీలకు పని కల్పించారు. గొడ్డు మాంసం తింటున్న దృశ్యాల్ని లైవ్‌లో చూపిస్తున్న మీడియా వాహనాల్ని ధ్వంసం చేసేందుకు విద్యార్థులు పూనుకున్నారు. బయటి నుంచి వచ్చి గొడ్డు మాంసం తింటున్న వారిపై పిడిగుద్దులు కురిపించారు. 7 నుంచి 9 గంటల మధ్య యూనివర్సిటీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. పోలీసులు, నిర్వాహకులు, సాధారణ విద్యార్థుల మధ్య భీకర యుద్ధం నడిచింది. ఎంతో మంది సాధారణ విద్యార్థులు గాయపడ్డారు. 9 గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. సి. హాస్టల్, ఓల్డ్ పి.జి హాస్టళ్లపై నిర్వాహకులు దాడిచేస్తారని పుకార్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులందరూ అన్ని హాస్టళ్ళ ముందు కర్రలు పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. 12.30 తరువాత విద్యార్థులందరూ వెళ్ళి పడుకున్నారు. సరిగ్గా ఊహించినట్టే జరిగింది. సి హాస్టల్ బాత్‌రూమ్‌ల వద్ద నలుగురు వ్యక్తులు రామారావు అనే విద్యార్థిని బాత్‌రూమ్ వద్ద కత్తులతో పొడవడం జరిగింది. కత్తులు పదునుగా లేకపోవడంతో 5, 6 కత్తిపోట్లతో బ్రతికి బయటపడ్డాడు. అందరం కలిసి అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళగా రక్షణ కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు. వి.సి. కోరితే తప్ప మేం రాము అని సమాధానం చెప్పారు. అందరం కలిసి జాగారం చేస్తూ ఆదివారం సెలవు దినాన్ని అనుభవించాం. విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర జరిగిందని మా అందరికీ అర్థమైంది. దళితులమని చెప్పుకొనే కొంతమంది నిజంగా ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసుకోవాలి. పది మందితో మీరు చేసిన గొడ్డుకూర పండుగ వల్ల మీరు ఏం సాధించారో ఆలోచించుకోవాలి. ఉన్నత చదువులు చదివిన ప్రొఫెసర్లు ఈ సమాజానికి ఎలాంటి సందేశం అందించాలనుకున్నారో ఆలోచించాలి. ఇలాంటి ఎన్నో కుట్రలకు ఎదురొడ్డి పోరాడి నిలిచిన మాకు ఇలాంటి విచ్ఛిన్నకర కార్యక్రమాలను ఎదుర్కొని సంఘటితంగా నిలబడడం పెద్ద సమస్య కాదు. యావత్ ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో సనాతన సాంప్రదాయాలు విభేదించినప్పుడు భారతీయ సంస్కృతి ఆ రెండింటిని సమన్వయం చేస్తుంది. అలాంటి సంస్కృతీ, సాంప్రదాయాలను అంతమొందించాలని ఎన్ని విదేశీ భావజాలాలు ప్రయత్నించినా జరిగేదేమిటి? ఆ భావజాలాలు తమను తాము దహించుకుంటాయే తప్ప భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేయలేవు. అది చరిత్ర చాటిన సత్యం. - కడియం రాజు
జాతీయ కార్యదర్శి, అఖిల భారత విద్యార్ధి పరిషత్
Andhra Jyothi News Paper Dated : 19/04/2012 

No comments:

Post a Comment