Saturday, April 28, 2012

విప్లవ 'సత్యం' - చంద్రశ్రీ


రెండు దశాబ్దాల క్రితం నాటి మాట. 1985లో రాజమండ్రిలో రైతు-కూలీ మహాసభల ప్రచారం కోసం ఆర్ఎస్‌యు, ఆర్‌వైఎల్ దళాలు పనిచేస్తున్న సందర్భం. నేను, ద్రోణవల్లి అనసూయమ్మగారు, కొండపల్లి మనుమరాలు చుక్కు(సుధ) మరికొంత మంది బృందాలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో 45 రోజులుంచారు. అపుడు నా వయసు 18 సంవత్సరాలు. నాకు ఏ రాజకీయాలు తెలియకుండానే ఆ టీంలో ఉన్నాను. 

ప్రతీరోజు అనసూయమ్మ గారి రాజకీయ తరగతులు, చుక్కు పాటలు నేను బాగా జీర్ణించుకున్నాను. చుక్కు కేవలం కె.జి. సత్యమూర్తిగారి పాటలే పాడేది. నేనూ ఆ పాటలన్నిటినీ నేర్చుకున్నాను. ఆ తరువాత 1989లో నేను దళంలో ఉన్నపుడు ఆ పాటలు పాడేదాన్ని. దళం కదలికలకు ఆయన పాటలే స్ఫూర్తి. 'గాలిలోని వాలులా/ ఏటిలోని నీటిలా/ నీటిలోని చేపలా/ ప్రజల మధ్యన ఒకనిగా/ రైతు బిడ్డడు లేచెనోయ్/ రైతు బిడ్డడు గెరిల్లాగా /కదన శంఖం ఊదెనోయ్ ' ( 'తూర్పు పవనం వీచెనోయ్' నుంచి). ఈ పాట దళం కదలికలకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది. 

1996లో హైదరాబాద్ నుండి విజయవాడ ట్రెయిన్‌లో వెళుతుండగా నేను కూర్చున్న బోగీలో చాలా సందడి కనిపించింది. వాళ్ల పాటలు మాటలు సుపరిచితమైనట్లు అనిపించాయి. వెళ్లి చూస్తే మా పాటల రచయిత అక్కడున్నారు. 'నమస్కారం సత్యమూర్తిగారు' అన్నాను. 'అమ్మా తమరెవరు?' అని అడిగారు. ' నేను పీపుల్స్‌వార్‌లో 1985 నుండి 91 వరకు పనిచేశాను. నేను పార్టీలో దళాల్లో ఉండగా మీ పాటలే పాడేదాన్ని' అని ఆయన రాసిన పాటలు వరుసగా ఐదుపాటలు పాడాను. అది విని ఆయన నన్ను అక్కున చేర్చుకుని నుదుట ముద్దుపెట్టారు. నా అడ్రస్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చారు. 

అంత ప్రేమగా ఆహ్వానించినా హైదరాబాద్‌లోనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నేను ఆయన్ని కలవలేకపోయాను. నెల తిరక్కుండానే దిల్‌షుఖ్‌నగర్‌లో ఉంటున్న నన్ను ఆయనే వచ్చి కలిశారు. ' చలపతి, విజయవర్ధనరావుల ఉరిశిక్ష రద్దు ఉద్యమం జరుగుతోంది. అందులో నీ గళం వినిపించాలి ' అని ఇంటికి వచ్చి మరీ చెప్పారు. నేను వెళ్ళటం, ఆ తర్వాత ఉద్యోగం మానేసి సత్యమూర్తిగారితోనే కలిసి పనిచేయడం జరిగింది. ఆ పార్టీ ఆఫీసులో ఉన్నపుడు 'శత్రు చేజిక్కితినని వెక్కిరించకు నన్ను -మిత్రద్రోహము చేత శత్రువు చేజిక్కితిని చందమామా' అనే పాట ఎక్కువగా పాడేదాన్ని. నిజంగా ఆ పాట పాడేటపుడు నా హృదయం ద్రవించేది. 

ఆయనకు మిత్రుడెవరో శత్రువెవరో నిజంగానే తెలిసేది కాదు. అందర్నీ మిత్రులుగానే భావించేవారు. ఆ మిత్రులే తర్వాత చాపకింద నీరులా చేరి కొంపముంచుతారన్న వాస్తవం తెలిసేది కాదు. ఆయనకు తెలిసింది ఒక్కటే " సత్యం, సత్యం, సత్యం''. నిజంగా సత్యమూర్తి సార్థకనామధేయుడు. అతనికి కుట్రలు తెలీవు. కుట్రలు గమనించేవారు కాదు. మిత్రుల కుట్రలను గమనించలేక పోవడం వలన అతను ఎన్నో అవమానాలు చవిచూశాడు. దానివల్ల కేడర్‌కు కూడా కన్నీళ్ళు, ఆకలి మిగిల్చారు. నన్ను ఏకలవ్య కళామండలి రాష్ట్ర కన్వీనర్‌గా ఆయన నియమించినందుకు కొందరు 'మిత్రులనుకు'నేవాళ్లే అసూయతో మామీద బురదజల్లిన సంగతి నాకు ఇప్పటికీ గుర్తే. స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరక గల్గినవాడే నేటి హీరో అన్నమాట ఆయన చనిపోయే వరకు నిలబెట్టుకున్నారు. 

వామపక్షాల్లోనూ కులతత్వం వుంది, ఇది కుల-వర్గ సమాజం అంటూ, అంబేద్కర్, మార్క్స్, మావో ఆలోచన- ఆచరణ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించినపుడు లెఫ్ట్ పార్టీల్లోని అణగారిన కులాలవారి కళ్ళు తెరుచుకున్నాయి. అణగారిన కులాలవారి మీద నాయకత్వం వహిస్తున్న అగ్రకుల నాయకులకు గుండెల్లో గుబులుపుట్టింది. అన్ని పార్టీల్లోనూ కుల నిర్మూలన సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు పెట్టారు, తమ కేడర్ జారిపోకుండా. 

అనంతసాగరం లాంటి ఆయన సాహిత్యం చదివాను. ఆయన పాటలు పాడాను, ముఖ్యంగా నల్లనల్ల సూరీడు. ఆయన 1996లో ఆ పాట రాస్తే నేనే దానికి ట్యూన్ కట్టి పాడాను. అంతటి అదృష్టం నాకు దక్కింది. ఆచరణశీలియైన ఆ మహాకవి నెలవంకతో నన్ను పోల్చడం నా జన్మ సుకృతం. "ఆయన కాలజ్ఞాని సూర్యుడు''- 'ప్రత్యేక తెలంగాణలో బహుజన రాజ్యం' అనే నినాదాన్ని ఆయన 1997లోనే తీసుకున్నారు. ఎంత ముందుచూపో చూడండి. 

శివసాగర్ పీపుల్స్‌వార్ పార్టీ నుండి బయటికి వచ్చాక ఆయనకు ఎవరో మహానుభావుడు హైదరాబాద్ చింతల్‌బస్తీలో మూడుసెంట్లస్థలం గిఫ్ట్‌గా ఇచ్చారు. అపుడు బహుజన రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఆయన సహచరి పార్వతి, ఆ స్థలంలో పార్టీ ఫండ్‌తో ఇల్లు కట్టింది. ఇప్పుడది పరాధీనంలో ఉంది. ఆ ఇం టిని శివసాగర్ లైబ్రరీగా మార్చాలని శివసాగర్ అనుచరులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఒక విగ్రహం కట్టాలని కూడా కోరుతున్నారు. ఆయనకు మూడు సెంట్లు ఇచ్చిన దాతకు నమస్కారాలు. 

సుఖం అంటే ఏమిటో, అలుపంటే ఏమిటో, స్వార్థం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. ఆయన ఆచరణ అంతా, జీవితమంతా ప్రజలకోసమే. 'సత్యమూర్తి'గా నెలవంకై మనవైపు ఎపుడూ దృష్టి ఉంచుతాడు. దళిత, విప్లవ ఉద్యమాల్లో తన అనుభవాల గురించి ఆయన స్వయంగా మాట్లాడింది, పాడింది నేను రికార్డు చేయడం నా అదృష్టం. అంతిమ యాత్రలో నన్ను గజ్టెకట్టి ఆడమని శివసాగర్ కోరారు. కాని పాడలేకపోయిన నా అశక్తతను, అనారోగ్యాన్నీ మన్నించు శివసాగర్... 

- చంద్రశ్రీ

Andhra Jyothi News Paper Dated : 29/04/2012 

No comments:

Post a Comment