Wednesday, April 25, 2012

బ్రాహ్మణిజంపై బహుజన పోరాటం - డా. గాలి వినోద్ కుమార్



ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఎన్.ఆర్.ఎస్ హాస్టల్ ముందు ఉస్మానియా విద్యార్ధులు ఇటీవల నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ ప్రజాస్వామ్య బద్ధంగా, హిందూమత 'అంటరానితనానికి' వ్యతిరేకంగా జరిగిన సాంఘిక విప్లవ సమావేశం. హిందూత్వ భావజాలం ఉన్న విద్యార్థులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? నిర్వాహకులు బహుజన విద్యార్థులే, వ్యతిరేకిస్తున్న వారూ ఈ వర్గాల వారే. బీఫ్ పెస్టివల్‌ను అడ్డుకున్నది, కత్తిపోట్ల కట్టు కథలు అల్లింది కూడా ప్రధానంగా బిసి, ఎస్టీ విద్యార్థులే. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆహార సంస్కృతిలో భాగంగా, దళిత, మైనార్టీలు ఎద్దు మాంసాన్ని తమ హాస్టల్ ముందు భుజిస్తే వారికి వచ్చే నష్టం ఏమిటి? ఎందుకంత వ్యతిరేకత? 

అన్ని జంతువుల్లాగే ఆవు ఒక జంతువని, అన్ని జంతువులకు ఔషధ గుణాలున్నట్లే ఆవుకు కూడా ఉన్నాయని, దానికంటూ ఏ మాత్రం పవిత్రత లేదని ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలందరూ చెబుతున్నారు. అయినా ఈ దేశంలో భారతీయ సంస్కృతి పేరుతో ఆవుకు లేని పవిత్రత, ప్రాధాన్యతను 'మతం' ముసుగులో ఇస్తున్నారు; తోటి భారతీయులైన దళితులను అంటరాని వారిగా, వారి ఆహార సాంప్రదాయాలను అంటరాని సాంప్రదాయాలుగా, వారి వృత్తులు అంటరాని వృత్తులుగా పరిగణించే సంస్కృతి వేదకాలం నుంచి ఉందా? మధ్యలో ప్రారంభమైందా అనే విషయాన్ని ఈ విద్యార్థులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. 

వేదకాలంలో చాలా మంది రుషులు ఎద్దు, ఆవు, గుర్రం మాంసాలను ఎంతో ఇష్టపడి తినేవారని ప్రముఖ చరిత్రకారుడు డి.డి.రోశాంబి పరిశోధనలు వెల్లడించాయి. రుగ్వేదం ప్రకారం ఇంద్రునికి ఆవు, దూడ, గుర్రం, ఎద్దు మాంసం అంటే ఎంతో ఇష్టమని రాసి ఉంది. మాంసాలను తమ దేవతలను సంతృప్తి చేయడానికి గోమేధ, అశ్వమేధ, యాగాల్లో వందల సంఖ్యల్లో జంతువులను బలి ఇచ్చేవారని బ్రాహ్మణుల సలహా మేరకు రాజులు ఈ యాగాలను నిర్వహించే వారని రుగ్వేదం చెబుతున్నది. రామాయణంలోనూ ఎద్దు మాంసం ప్రస్తావన ఉంది. 

భవభూతి ఉత్తర రామ చరితలో వాల్మీకి, వశిష్ట మునిని విందుకు ఆహ్వానించి ఆయనను ఆనందపరచడానికి వందల సంఖ్యల్లో ఆవు, దూడలను వధించి విందు ఇచ్చాడని వర్ణించాడు. హిందూ ధర్మ ప్రధాన సూత్రకర్త మనువు తన మను స్మృతిలో మాంసాహారం తినడం నేరం కాదని రాశాడు. ఒక పురుషుడు సాంప్రదాయాలను సరైన పద్ధతిలో ఆచరించడానికి మాంసాహారాన్ని తినాలని లేకపోతే వచ్చే ఇరవై ఒక్క పునర్జన్మల్లో పవిత్ర జంతువుగా పుడతాడని రాశాడు. అదే విధంగా మనువు రాజులకు విందు ఇచ్చే సమయంలో మధుపారక అనే మద్యంతో పాటు ఎద్దు మాంసాన్ని కూడా ఇవ్వాలని సూచించాడు. 

కౌటిల్య అర్ధశాస్త్రంలోనూ ఎద్దు మాంసం ప్రస్తావన ఉంది. ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు, పాలు ఇచ్చే ఆవులను, దూడలను బలి ఇవ్వొచ్చు కాని కటిక వానికి అమ్మకూడదు అని రాసి ఉంది. వేదకాల హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఒక మనిషి ఎద్దు మాంసం తినకపోతే మంచి హిందువు కాలేడు అని స్వామి వివేకానంద అన్నారు. వేదకాలం నుంచి హిందూ మత చరిత్ర ఎద్దు మాంసం తినడానికి అనుకూలంగా ఉంది. 

ముస్లింల పరిపాలన నుంచి ఆవు మాంసం తినడం ప్రారంభమైందని హిందువులు చేస్తున్న ప్రచారం అబద్ధమని వేదాలు రుజువు చేస్తున్నాయి. హిందూ మతానికి పునాది వేదాలు, పురాణాలు వాటిల్లోనే ఎద్దు, ఆవు, దూడ, గుర్రం మాంసాలను తినొచ్చు తప్పు కాదు అని బోధిస్తుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందూత్వ విద్యార్థులు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? ఎప్పటి నుంచి ఈ వ్యతిరేకత హిందూ మతంలో మొదలయింది అనేది కూడా ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం ఉంది. 

ఎద్దు మాంసం ఎప్పటి నుంచి నిషేధించబడినది? ఎందుకు నిషేధించబడింది? అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే బ్రాహ్మణులు బుద్ధిజాన్ని ఓడించి బ్రాహ్మణిజాన్ని పరిరక్షించడానికి చేసిన కుట్ర ఫలితమే అకస్మాత్తుగా బ్రాహ్మణులు శాఖాహారులుగా మారి ఎద్దు, ఆవు ఇతర మాంసాలపై నిషేధాన్ని విధించడం. ఆవు పవిత్రమైన గోవు, దాన్ని చంపడం మహాపాపమని బ్రాహ్మణులు ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎద్దు మాంసాహారులైన బౌద్ధులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, బుద్ధిజాన్ని కూకటి వేళ్ళతో పెకిలించడానికి, బ్రాహ్మణులు పన్నిన పన్నాగమే అంటరానితనం. ఎద్దు మాంసం తింటున్న బౌద్ధులను బ్రాహ్మణులు వెలివేశారు. 

అప్పటి నుంచి ప్రారంభమైందే ఈ అంటరానితనం అంటారు. బుద్దిస్ట్‌లైన మౌర్య సామ్రాజ్యాన్ని కుట్రతో బ్రాహ్మణులు అంతంచేసి హైందవులైన గుప్తుల కాలం నుంచే అంటే 400 ఎ.డి. నుంచి ఆవును చంపడాన్ని, తినడాన్ని నిషేధించారు. తిన్నవారిని అంటరాని వారిగా, వారి వృత్తులను అంటరాని వృత్తులుగా పరిగణిస్తూ బుద్ధిజంపై బ్రాహ్మణిజం ఆధిపత్యం కోసం బలవంతంగా రుద్దబడిందే ఈ వెలివేత. 

ఆనాటి నుంచి నేటి వరకు బ్రాహ్మణిజాన్ని ఎదుర్కొంటున్నది ఎద్దు మాంసాహారులైన దళిత, మైనార్టీలు. అందులో మాదిగలది ప్రథమ స్థానం. ఆ సాంప్రదాయాన్ని ఓ.యు. విద్యార్థులు ఏప్రిల్ 15న కొనసాగించారు. దళితుల్లో పది మంది కూడా ఎద్దు మాంసాన్ని తినరు అని హిందూత్వవాదులు చేస్తున్న ప్రచారం అబ ద్ధం. మాదిగల్లో 99 శాతం, మాలల్లో 50 శాతం ఆదివాసుల్లో 80 శాతం మైనార్టీల్లో 100 శాతం, బీసీల్లో 10 శా తం నేటికీ ఎద్దు మాంసాన్ని ఈ దేశంలో భుజిస్తున్నారు. 

ప్రతి అంశాన్ని చర్చకు పెట్టే విశ్వ విద్యాలయాల్లో బ్రాహ్మణిజం యొక్క కుట్రను బయటపెట్టే అంశాలను చర్చకు పెడితే తప్పేమిటి? అయినా వేల సంవత్సరాలుగా వస్తున్న ఎద్దు మాంసం భుజించే సాంప్రదాయాన్ని దళిత, ఆదివాసీలు, మైనార్టీ విద్యార్థులు, ఒక పండుగలాగా నిర్వహిస్తే ఇతర విద్యార్థులకు వచ్చే నష్టం ఏమిటి? 

ఈ దేశంలో కుల వ్యవస్థను ఏర్పాటు చేసింది బ్రిటీష్ వారు కాదు, ముస్లిములు అంతకన్నా కాదు. తోటి మానవున్ని, నీచునిగా అంటరానివానిగా, వారి ఆహారాన్ని సాంప్రదాయాలను వృత్తులను అంటరానివిగా పరిగణించే సంస్కృతి భారతీయ సంస్కృతి ఎలా అవుతుంది? బీఫ్ ఫెస్టివల్‌ను భారతీయ సంస్కృతి పరరిక్షణ పేరుతో అడ్డుకున్న బిసి, ఎస్సీ, ఎస్టీలు గమనించాల్సింది ఏమిటంటే శాఖాహార సంస్కృతి బ్రాహ్మణులది. మాంసాహార సంస్కృతి బహుజనులది. మీరు బ్రాహ్మణులవైపా? బహుజనులవైపా తేల్చుకోవలసింది మీరే. ఓ.యు.లో బ్రాహ్మణవాదంపై బహుజన వాదం పోరాటమే బీఫ్ ఫెస్టివల్ నిర్వహణ. దేశ వ్యాప్తంగా దాన్ని కొనసాగించాలి. 

- డా. గాలి వినోద్ కుమార్

Andhra Jyothi News Paper Dated : 26/04/2012 

No comments:

Post a Comment