Tuesday, April 17, 2012

ఉద్యమం నెలబాలుడు..KG .సత్యమూర్తి,



ఒకచేత గన్నూ, మరో చేత పెన్నూ పట్టి కవితలల్లి పాటలు పాడిన శివసాగర్ తెలుగు విప్లవ కవిత్వంలో ట్రెండ్‌సెట్టర్.ఆ కాలపు రొమాంటిక్ హీరో. ఓ చే గువేరా, ఓ హోచిమిన్ కలెగలిసిన అరుదైన మూర్తిమత్వం. గన్నునూ, పెన్నునూ అంతే పదునుగా వాడిన అరుదైన విప్లవకారుడు శివసాగర్. 70వ దశకంలో.. రాజ్యంతో నక్సలైట్ డ్రాగన్‌గా ముద్ర వేయించుకున్నాడం విప్లవకారుడు గా.. ఆయన ఆచరణను అంచనావేసుకోవాల్సిందే. రివిజనిజాన్ని తుత్తునియలు చేస్తూ.. ‘ఓరి ముదుసలీ నీ నడుం వంగి నెత్తినేలకు రాసినా మా కత్తుల కోలాటం ఆగ దు, నీ విప్లవ విద్రోహం సాగదు’ అంటూ ఆయన రాసిన కవిత ఆనాటి యువతకు ఓ మేలుకొలుపు. 

అది 190 దశకం.పాఠశాల చదువును దాటి కాలేజీ చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన వాళ్లకు అదో నూతనలోకం. అప్పటిదాకా ఉస్మానియా అంటే ఊహించుకున్న దానికంటే.. మిన్నగా, ఉన్నతంగా.. విశ్వమంత విశాలంగా ఉండేది. ఆనాడు.. ఏ విద్యార్థికైనా.. ఉస్మానియా ఆర్ట్స్‌కాలేజీలో చదివితే జీవితం ధన్యం అయినట్లు ప్రచారంలో ఉండేది. ఎన్నో కలలతో.. ఉస్మానియాలో అడుగుపెట్టిన వారికి ఉస్మానియా సరికొత్త నూతన ప్రపంచం. పచ్చని చెట్లతో ఆకుపచ్చని అందాలతో.., పసుపుపచ్చని పూలతో.. అలరారుతున్న క్యాంపస్ పరిసరాలు.. అంతకంటే అందమైన కొత్త ప్రపంచానికి దారులు చూపించాయి. నూతన సమాజం కోసం సన్నని వెలుతురు కిరణాలేవో.. మొత్తం విద్యార్థి లోకాన్ని ఉర్రూత లూగిస్తున్న కాలం అది. ఆ చైతన్యపు జ్వాల ఆ తరం విద్యార్థిలోకాన్ని తట్టి లేపింది. తన లోకి ఆహ్వానించింది. ఆవహించింది. 

ప్రపంచ వ్యాప్తంగా విప్లవకారుడుగా.. చే గువేరాకు ఎంతటి పేరు, రోమాంటిక్ హీరోయిజం ఉందో.. విప్లవకవిగా హోచిమిన్‌కు అంతటి ప్రఖ్యాతి ఉన్నది. ఈ ఇద్దరితోపాటు.. మన గడ్డమీది వీరుడుగా... కవిగా... ‘ప్రజలను సాయుధులను చేస్తున్న రెవెల్యూషనరీ నేటి కవి’ అని మార్గనిర్దేశం చేసిన శివసాగర్ అప్పుడొక ఐకాన్. ఎవరి చేతిలో చూసినా ఉద్యమ నెలబాలుడు ఉండాల్సిందే. ఆనాడు ఉద్యమం నెలబాలుడు ఒక హ్యాం డ్ బుక్. సమకాలీన ప్రపంచ, దేశీయ రాజకీయాల మీద ఓ మార్క్సిస్టు లెనినిస్టు అవగాహనను అందంగా, పవర్‌ఫుల్‌గా, పోయెటిక్‌గా చెప్పిన కవి మరొకరు లేరు. అందుకే.. ఆనాడు.. శివసాగర్ యూనివర్సిటీలలో రోల్ మోడల్. 

ఉద్యమం నెలబాలుడు ఉస్మానియా క్యాంపస్‌ను తన నడిపిస్తూ.. తీసుకెళ్లిన కాలం అది. రోజుల తరబడి తిండి లేకున్నా... , ఉద్యమం నెలబాలుడు చదివి నూతన శక్తితో వాల్‌రైటింగ్‌కో, వాయిస్‌లు వేయడానికో నడక సాగేది. ఒక రకంగా 0 దశకం విద్యార్ధి ఉద్యమాన్ని నడిపించింది ఉద్యమం నెలబాలుడే. 
1970 ప్రాంతంనుంచి తెలుగు సాహిత్యంలో విప్లవ కవితా యుగానికి శివసాగర్ మార్గదర్శి. ప్రజలను సాయుధం చేస్తున్న రెవెల్యూషనరీ నేడు కవి అంటూ.. సామాజిక బాధ్యతను గుర్తెరిగి ప్రజలను సాయుధం చేశాడు. నవ సమాజానికి బీజాలు వేశాడు. శివసాగర్ కవిత్వంలో ప్రధానంగా కనిపించే లక్షణం సింబాలిజం. కొన్ని సంకేతాల ద్వారా వస్తువును ధ్వనింపచేస్తూ.. హృదయానికి హత్తుకునేట్లు చెప్పడమే కాదు.. పరిగెత్తించిన శివసాగర్ ట్రిగ్గర్‌పై వేలుతో.. యువతను ఆహ్వానిస్తాడు. విప్లవానికి సమయం ఆసన్నమైందని చెబుతాడు. 

తూర్పు పవనం వీచెనోయ్!
తూర్పుదిక్కెరుపెక్కెనోయ్!
భరత భూమి కనులు తెరచి
వెలుగు రవ్వలు కురిసెనోయ్!

వీపుపైన చద్దిమూట
చేతిలోన గండ్రగొడ్డలి
మనసులోన మాసియాంగు
గుండెలోన ఎర్రజెండా
రైతు బిడ్డడు లేచెనోయ్!
రెతు బిడ్డడు గెరిల్లాగా
సింహగర్జన చేసెనోయ్‌ఔ అంటూ.. భారత పీడిత ప్రజలను, యువజన విద్యార్థులను మేల్కొలుపుతాడు.
తరతరాలుగా రక్తాన్ని చెమట చేసి పంటలు పండిస్తూ.. ఆకలితో అలమటిస్తూ.. సర్వసంపదలకు దూరం చేయబడ్డ అశేష ప్రజానీకానికి జేగంటలు మోగిస్తూ..
రండోయ్! రండోయ్!
ప్రజా విముక్తి సమరంలో
చేరగ వేగమె రండోయ్
రండోయ్! రండోయ్!
ఈ భూములు, ఈ గనులు
ఫ్యాక్టరీలు, ఈ బ్యాంకులు
ఈ సంపద మనదేనోయ్! అంటూ.. దేశం మనది, సర్వసంపదలూ మనవేనని పిలుపునిస్తాడు.
అలాగే.. ఈదేశ ప్రజల విముక్తి కోసం చివరి క్షణం వరకూ.. పోరాడుతూ..

ఉరికంబం 
మీద నిలిచి
ఊహాగానం 
చేసెద

నాఊహల 
ఉయ్యలలోన
మరోజగతి 
ఊసులాడు
ఉరికంబం
మీద నిలిచి
తియ్యని కలలే
గాంచెద
నాతియ్యని 
కలలే నిజమై
నిఖిల లోకమే
హసించు
రెక్క విప్పి
ఎర్రసేన
నలు దిక్కుల
ప్రసరించును.. 
అంటూ ఉరి పాట పాడుతూ.. నూతన సమాజం కోసం కలలు కంటాడు.
ప్రపంచ రాజకీయాల లో సోషలిస్టు శిబిరంగా ఉండి ప్రపంచ విప్లవానికి అండగా ఉంటుందనుకున్న రష్యా రివిజనిజంలో కూరుకు పోవడం, అదే సందర్భంలో చైనాలో సాంస్కృతిక విప్లవంతో ‘నూరుపూలు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్శించనీ’ అంటూ.. సోషలిస్టు సమాజాన్ని నిలిపేందుకు సాగుతున్న పోరాటాన్ని ఎత్తిపడుతూ..
ఓల్గా ఘనీభవించెను
యాంగ్సీనది పొంగెను
హోరుహోరు హోరుగా!
హొయలు హొయలు హొయలుగా..
అంటూ.. విశ్లేషించాడు. 
శ్రీకాకుళ ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం రాక్షస హత్యాకాండకు పాల్పడి , ఉద్యమ నాయకత్వాన్నంతా ఎదురుకాల్పుల పేరుతో హత్యచేసి ఉద్యమాన్ని ఆపాలని చూసినప్పుడు..
నీవు నరికిన నా శిరస్సును
ప్రజలు మళ్లీ నాకిస్తారు
నీవు పెరికిన నా కనుగుడ్లను
కాలం కన్నులుగా పొదుగుతారు
నీవు ముక్కలుగా నరికిన నా వేళ్లతో
ప్రజలు శ్రామిక జన మహాకావ్యాన్ని 
రాయిస్తారు.
అరె! బద్మాష్! 
నిన్న నీవు దెబ్బతీసిన నాదళం
నేడు జనం ఊపిరితో
ఎర్రసైన్యంగా ప్రాణం 
పోసుకుంటోంది.. 
అంటూ.. ఉద్యమ నాయకత్వాన్ని హత్యచేసినంత మాత్రాన విప్లవోద్యమం ఆగబోదని ప్రజల అండతో.. తిరిగి ఊపిరులు పోసుకుంటుందని హెచ్చరిస్తాడు.
దేశంలో ఊడలు దిగిన రివిజాన్ని తుత్తునియలు చేస్తూ..
జడత్వం జరీ అంచు చీరకట్టిన వారు
ఆయుధం చేపట్టలేరు
విప్లవాన్ని ముస్తాబు చేసి
ఎన్నికల దొమ్మరి సంతలో అమ్ముకో
నేర్చిన బేహారులు
బారికేడ్లు కట్టలేరు.. 
.... ... ... 
కసితో స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరకగల్గిన వాడే నేటి హీరో 
అంటూ.. రివిజనిస్టు పార్టీల ద్రోహా న్ని ఎండగడతాడు. 
కొండల్లో కోనల్లో , దండకారణ్యం లో నడకలు నేర్చుతున్న ఉద్యమ నెలబాలుడ్ని గురించి.. రాస్తూ...
ఎర్రని తూర్పు వాకిలిలో నిలుచొని
బందూక్‌లో మందు మరింతగా దట్టించిపక్కనే ఉంచుకొని
నా రక్తంతో రాస్తున్నాను 
ఈ బహిరంగ లేఖ
ఈ లేఖలో జనహృదయాన్ని స్పందిస్తున్నా..
... ... ... 
నేను నేను కాదు
నేను అధోలోకానికి పోతున్న
సమాజ విమనాన్ని హైజాక్ చేసినవాణ్ని
ఖడ్గాన్ని మీటి ప్రచండ జన సంగీతాన్ని సృష్టించిన వాణ్ని
దరివూదంలో సచేల స్నానం చేసి
చరిత్ర చెక్కిలి ముద్దిడిన వాణ్ని
నేను పొత్తిళ్లలోని ప్రజా సైన్యాన్ని
నేను నక్సల్‌బరీని! నేను ముషాహరీని!
నేను శ్రీకాకుళాన్ని
రెనగేడ్! నేను విప్లవాన్ని!
మృతవీరుల తనువు నుండి
ప్రవహించిన రక్తంలో 
ప్రభవించిన మానవుణ్ని
... ... ....
కాలం పురోగమిస్తోంది -ఆగదు
విప్లవం జ్వలిస్తోంది- చావదు
ఉద్యమం నెలబాలుడు
పెరిగి పెదవాడై
వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు-
తప్పదు 
అంటూ.. శివసాగర్ విప్లవాన్ని ఆవాహనం చేస్తాడు. ఆయన పెంచి పెద్దచేసి నడకనేర్పిన ఉద్యమ నెలబాలుడు నేడు దండకారణ్యంలో లేచి నిలబడి భారత పాలకవర్గాలను సవాల్ చేస్తున్నాడు. ప్రజలను సకల పీడనల నుంచి విముక్తులను చేసేందుకు విముక్తి ప్రాంతాలను నిర్మిస్తున్నాడు. దేశంలోని అశేష పీడిత తాడిత వర్గాలను తనతో జత కట్టమని ఆహ్వానిస్తున్నాడు. అంకుల్ శ్యాం వాడి అనుంగు తొత్తు అంబానీ దాకా దేశ ప్రజల సొంతమైన సహజవనరులను కొల్లగొడుతున్న తీరును ఎదిరిస్తున్నాడు. 
శివసాగర్ ఉద్యమ నెలబాలుడినుంచి మొదలై నడుస్తున్న చరిత్ర దాకా.. ప్రయాణంలో.. ఎన్నో రాజకీయ ఒడుదొడుకులు ఉన్నా.. మనకు, నూతన సమాజ స్వాప్నికులకు శివసాగర్ ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శం. శివసాగరే అన్నట్టు.. విప్లవం కుట్రకాదు, సూర్యోదయం కుట్రకాదు. విప్లవం సహజం. అన్నమంత ఆవసరం.

-ఎస్. మల్లా
Namasete Telangana News Paper Dated : 18/04/2012 

No comments:

Post a Comment