Friday, April 13, 2012

సాంఘిక విప్లవ జ్యోతి----నారదాసు లక్ష్మణ్‌రావు


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. భారతదేశ సాంఘిక, సాం స్కృతిక, ఆర్థిక, రాజకీయ సమకాలీన పరిస్థితుల పట్ల లోతైన అవగాహన కలిగి, తనదైన తాత్విక దృక్పథాన్ని ప్రకటించినవారు అంబేద్కర్. అసమానతలు పెరిగిపోతున్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో, ఆయన తాత్విక చింతనకు ఆచరణ రూపమివ్వాల్సిన ఆవశ్యకతను సమాజంలోని అన్నివర్గాల వారు గుర్తిస్తున్న సందర్భమిది. ఆయన ఏ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారో, ఆ వివక్ష ఇంకా పెచ్చరిల్లుతూనే ఉన్నది. కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండల వంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.ఏ రాజ్యాంగమైతే ఆర్థిక, అసమానతలకు పరిష్కారమార్గం చూపిస్తుందని భావించారో, ఆ లక్ష్యం నెరవేరకపోగా, ఆ రాజ్యాంగాన్నే పునర్‌నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంబేద్కర్ అతి పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నట్టు ప్రజాస్వామ్య, లౌకిక,బహుళ, సమన్యాయ, పౌరవిముక్తి సమాజానికి కట్టుబడి ఉండే రాజ్యాంగాన్ని రూపొందించామని అనుకున్నారు ఆయన. కానీ ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగస్ఫూర్తికే విరుద్ధంగా పరిణమించాయి. ఒకవైపు కుల వ్యవస్థను నిర్మూలించాలని వేదికపూక్కి ఉపన్యసించే నాయకులే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కుల మూలాలపై రాజకీయ పునాదులను బలోపేతం చేసుకుంటున్నారు.

ఆర్థిక అంతరాల పట్ల కూడా అంబేద్కర్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. ఆర్థిక, సామాజిక విషయాలలో ఇద్దరు మహోన్నతులైన బుద్ధుడు-మార్క్స్‌ల సిద్ధాంతాల మధ్యగల సమన్యాయాలు-వైరుధ్యాలను తార్కిక దృష్టితో విశ్లేషించారు. తద్వారా సామాజిక అంతరాలకు మూలాలను ఆవిష్కరించగలిగారు. ఈ ఇద్దరి సిద్ధాంతాల కలబోతగా, ఉత్పత్తి-పంపిణీల మధ్య సమన్వయం ఉన్నప్పుడే ఆర్థిక, అసమానతలు దూరమవుతాయన్నది అంబేద్కర్ విశ్వాసం. స్త్రీ విముక్తి కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అమోఘమైనది. స్త్రీలు విద్యావంతులై, ఆస్తి హక్కును కలిగియుండి స్వేచ్ఛగా జీవించినప్పుడే సమాజంలో సగభాగం పొందుతారని ఆ యన భావించారు. స్త్రీల హక్కులకు సంపూర్ణ రక్షణ కలిగించే హిందూకోడ్ బిల్లును కాంగ్రెస్ పార్లమెంట్‌లో ఆమోదించనందుకు నిరసనగా, ప్రజల కు హక్కులు కల్పించలేని ఈ పదవి నాకెందుకని తన న్యాయశాఖామంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన ఆదర్శమూర్తి అంబేద్కర్.

సమాజంలో కుల నిర్మూలన జరిగినప్పుడే అన్ని రకాల అంతరాలు అంతరించిపోతాయని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి అంబేద్కర్. కులం మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయత, అనురాగాలను నాశనం చేస్తుందని, మానవ సమాజ పరిణామ క్రమంలో ఏర్పరుచుకున్న విలువలన్నింటినీ విలుప్తం చేస్తుందని తెలుపుతూ.. ‘కుల వ్యవస్థ మనుషులను జాతిరీత్యా విభజించడం లేదు. అది ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తున్నది’ అంటూ సూత్రీకరించారు. కులాల మధ్య అంతరాలను పెంచిపోషించి,మానవ ప్రగతిని విచ్ఛిన్నం చేయడంలో సంప్రదాయవాదుల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు.
ఇక తెలంగాణ చూపుతోనూ అంబేద్కర్‌ను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చాలా స్పష్టం గా తెలియజేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం, వనరులపై హక్కు కోసం, అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రాల అనివార్యతను ఆనాడే చెప్పారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో అవకాశాన్ని కల్పించారు. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో చేసే తీర్మానం ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అంబేద్కరిజానికి ఆమోదం పెరుగుతున్నది.

వామపక్ష ఉద్యమాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల్లో అణగారిన వర్గాల ప్రజలే, అంటరానివారే చురుకైన పాత్ర పోషించారు.ఎంతటి త్యాగాలకైనా వెనుకడుగు వేయక సామాజిక అంతరాలను పాతిపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ప్రతిపాదనతో సబ్బండ వర్ణాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలుగా చారివూతక పోరాటాన్ని సాగిస్తున్నది. అన్ని వర్గాల పోరాట శక్తిని సంలీనం చేసుకుని తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నది. తెలంగాణ కోసం ఏకమవుతున్న అన్ని భావజాలాల్లో అంతఃసూవూతంగా అంబేద్కరిజం దాగి ఉన్నది. కుల వివక్ష, మత దురహాంకారం, ఆర్థిక అసమానతలు, సామాజిక అంతరాలులేని తెలంగాణ కోసం ఉద్యమించడమంటే అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుగానే భావించాలి. సందర్భోచితం కాబట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఏప్రిల్ 12 నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 4 గంటల నిరాహారదీక్షను ప్రారంభించారు.

1992లో అంబేద్కర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్టించాలని తీర్మానించారు. ఒక్క కేరళలో తప్ప దేశంలో మరెక్కడా దీనిని అమలు చేయలేదు.మరిప్పుడు కవిత డిమాండ్‌ను పరిశీలిస్తే.. సహేతుకమైన కారణాలే కనిపిస్తాయి. తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణ చరిత్ర, సంస్కృతి పరిరక్షణతోపాటు, ఆరోగ్యం, ఉపాధి, మహిళల ఆర్థిక స్వావలంబన స్థూలంగా అణగారిన వర్గాల అభ్యున్నతికోసం ఏర్పడిన సంస్థ. కవితకూడా అంబేద్కర్ బోధనలతో ప్రభావితమై తెలంగాణ కోసం పలువరించి, ప్రాణత్యాగాలకు సిద్ధపడిన వారి స్ఫూర్తితో జాగృతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. గోలకొండ కవుల సంచికతో పాటు అనేక మంది తెలంగాణ కవుల పుస్తకాలను తెచ్చి సాహితీ సేవ చేశారు.అంబేద్కర్ బోధనలతో స్ఫూర్తిపొందిన ఆమె అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాడటంలో సహేతుకత ఎంతో ఉన్నది. దీనికోసం కవిత డిసెంబర్ 21న స్పీకర్‌కు ఓ వినతి పత్రం ఇచ్చారు.

రాజకీయ పార్టీలు, కులసంఘాల నేతలతో రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి విగ్రహ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి మొ దటి వారంలోనే స్పీకర్‌కు మరోమారు తెలియజేశారు.అంబేద్కర్ జయంతికి ముం దుగానే విగ్రహ ఏర్పాటు చేయకుంటే 4 గంటల నిరాహార దీక్ష కూర్చుంటానని హెచ్చరించారు. అయినా సీమాంధ్ర నాయకులకు చీమ కుట్టినట్లైనా లేదు. అంబేద్క ర్ జయంతి, వర్ధంతి సభల్లో దళితులపై ప్రేమను ఒలకబోస్తూ.. అంబేద్కర్‌పై పొగడ్తల వర్షం కురిపించే నేతలు.. అసెంబ్లీలో విగ్రహన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఎందుకంటే.. వీరంతా భూస్వామ్య, పెట్టుబడిదారీ, దోపిడీనీతి కలిగినవారే. అలాగే.. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కోరుతున్న కవిత తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావడం ఒకటైతే, అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటును మొదట చెప్పిన వారు కావడంతో ఆయన విగ్రహాన్ని పెట్టడానికి నిరాకరిస్తున్నారు. అంబేద్కర్ విగ్ర హం పెడితే దళిత, బహుజన వర్గాల ప్రజలు సంఘటితం అవుతారని కూడా సీమాం ధ్ర పాలకులు పెట్టడం లేదు.

నిజానికి ఇప్పుడు దళిత బహుజనులు కోరుతున్నది కేవలం అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు మాత్రమే కాదు, ఆయన కలలు గన్న రాజ్యాధికారం కూడా కావాలని పోరాడుతున్నారు. వివక్షలేని సమాజం ఏర్పాడాలని కోరుకుంటున్నారు. అంతిమం గా రాజ్యాంగంలో పొందుపరిచిన సామ్యవాద, లౌకిక, శ్రేయోరాజ్య ఆవిర్భావ దిశగా సబ్బండవర్ణాలు ఉద్యమిస్తున్నాయి. రాజ్యాధికారం చేజిక్కించుకోవడం కోసం కదులుతున్నారు. అంబేద్కర్ సాంఘిక విప్లవ జ్యోతి. దార్శణికుడు. సంస్కరణవాది. దేశం గర్వించదగ్గ విద్యావేత్త. బహుళ ప్రయోజనకరమైన గ్రంథకర్త. అసమానతలను రూపు మాపి అభివృద్ధి వైపు పయణించి నూతన వ్యవస్థను రూపొందించడానికి కావలసిన తాత్విక పునాదిని ఏనాడో అంబేద్కర్ వేశారు. ఆ మార్గాన పయనించడమే మన ముందున్న కర్తవ్యం. 

శాసనమండలి సభ్యులు
(నేడు అంబేద్కర్ జయంతి);

Namasete Telangana N ews Paper Dated : 14/04/2012 

No comments:

Post a Comment